కాలాలు మారాయా?

  • 607 Views
  • 25Likes
  • Like
  • Article Share

    బృంద తంగిరాల

  • ఆస్ట్రేలియా brundamalika@gmail.com
బృంద తంగిరాల

ఈస్ట్‌మన్‌ కలరు సినిమాలు అప్పుడప్పుడే మొదలవుతున్నాయ్‌...
      ‘‘అయ్యో అయ్యో ఇంకో సంబంధమే దొరకనట్టు అమ్మాయిని టౌనుకి ఇస్తారా? ఏం మన ఊరు, పక్క ఊరు, చుట్టుపక్కల ఆరు ఊళ్లు కొల్లబోయాయా పెళ్లికొడుకులకి? అసలు మేనరికం వద్దనుకోవటమే. హవ్వ హవ్వ. ఇదేం కలికాలం రా?’’ పెద్ద గొంతు చేసుకుని తాయారమ్మ కొడుకు, కోడలు మీద అరుస్తోంది.
      ‘‘అమ్మా, ఇంక ఆపుతావా? నెల రోజులుగా ఇదే గొడవ. ఎంత నచ్చచెప్పినా వినవే? మేనరికాలు నాకు ఇష్టం లేదు, సగోత్రం కాకపోయినా సొంత రక్తమేనే. పుట్టబోయే పిల్లలకు మంచిది కాదు. ఇక మన ఊరు, పక్క ఊళ్లంటావా, పల్లెల్లో ఏం మిగిలిందనే? ఒక సంవత్సరం బాగుంటే, రెండుసార్లు కరవాయే. తండ్రి యాభై ఎకరాల భూస్వామని పిల్లను ఆ ఇంటికి ఇస్తే, రేప్పొద్దున్న నలుగురు కొడుకుల్లో మన వాళ్ల వాటా పన్నెండు ఎకరాలు. వాళ్ల పిల్లలు అంది చేతికి వచ్చేసరికి ఏం మిగులుతుందో ఏమో. ఈ గోలంతా ఎందుకు? ఆ పట్నం సంబంధం కుర్రాడు లక్షణంగా బీయ్యే పాసయ్యాడట, ఒక ఆఫీసులో గుమాస్తా ఉద్యోగం. నెల నెల టంచనుగా జీతాలు. ఒళ్లు అలవకుండా నీడపట్టున ఉద్యోగం. వానలు వచ్చాయా, వరదలు వచ్చాయా అన్న బెంగ లేదు. వారికీ ఊళ్లో కొద్దిగా పొలం ఉందిలే, కౌలుకి ఇచ్చేశారు. రేపు వచ్చి పిల్లను చూసుకుంటారు. ఇక గొడవ అనవసరం’’ తల్లికి చెప్పాల్సింది చెప్పి రామన్న బయటికి వెళ్లిపోయాడు.
      తాయారమ్మ కోడలు వైపు తిరిగి ‘‘కాదే, నీకైనా కూతురిని అంత దూరం ఎలా పంపబుద్ధైంది? ఒక అచ్చటా ముచ్చటా? అసలు పిల్లను వదిలి ఎప్పుడైనా ఉన్నావా? పద్దెనిమిదేళ్లు వచ్చినా అది ఇంకా చేతిలో ముద్దలు వేయించుకుని తింటుంది. అయినా నీక్కూడా పట్నం మీద గాలి మళ్లిందిలే. ఆ షోకులు, నైలాను చీరలు...’’ ఇలా సాగుతూ పోయింది. కోడలు జానకమ్మ ఏమి బదులు చెప్పలేదు.
      భర్త చెప్పిన మాటలు నిజమే అనిపిస్తాయి. కానీ పిల్లను అంత దూరం ఎలా పంపటం? ఒక్కతే కూతురు, ముగ్గురు కొడుకుల తర్వాత పుట్టింది. పని పాటలు బాగా చేస్తుంది. పదో తరగతి పాస్‌ కూడా అయ్యింది. ఆ ఊళ్లో హైస్కూల్‌ చదువే చాలా ఎక్కువ. మరి దాని మనసులో ఏముందో? అంతలో పంతులుగారు వచ్చారు. పెళ్లి చూపుల గురించి మాట్లాడటానికి. ఆయనకు మంచినీళ్లు, మజ్జిగ ఇచ్చి కూర్చోపెట్టింది. ‘‘రేపు పొద్దున పదకొండున్నర గంటలకు ముహూర్తం బాగుందమ్మా, వాళ్లు రాహుకాలం దాటగానే బయలుదేరి పదకొండుకంతా ఊళ్లోకి వస్తారు. మర్యాదలవీ అయ్యేసరికి సరిపోతుంది. భోజనం వేళకి వెళ్లిపోతారు. కతికితే అతకదు మరి. ఈ పెళ్లిచూపులు లాంఛనమే. మీ కుటుంబం వాళ్లకు అన్ని రకాలుగా నచ్చింది. ఇక ముహూర్తాలు పెట్టుకోవటమే తరువాయి’’ చెప్పుకొచ్చారు పంతులు.
      ఎలాగూ భర్త ఇంట్లో లేరు, ఇదే సమయమనుకుని జానకమ్మ మనసులో మాట అడిగేసింది. ‘‘ఏమోనండి పంతులుగారూ, పిల్లను అంత దూరం ఇవ్వాలంటే బెంగగా ఉంది. అబ్బాయికి జీతమదీ ఎంతమాత్రం వస్తాయో? వాళ్ల ఇల్లూ వాకిలీ ఎలా ఉన్నాయో? అబ్బాయికేమన్నా అలవాట్లు ఉన్నాయో లేదో తెలిసేదెలాగు? రేప్పొద్దున పిల్లను చూడాలనిపిస్తే దారా దాపా? ఎడ్ల బండెక్కి అరగంటా, మళ్లీ ఎర్ర బస్సెక్కి రెండు గంటల ప్రయాణం.’’
      జానకమ్మ బెంగ ఆయనకు అర్థమైంది.‘‘అదేమీ లేదమ్మా. అబ్బాయి మంచివాడు, ఏ దురలవాట్లూ లేవు. మన పక్కూరి పెద్ద రైతు సాంబయ్యగారి మేనల్లుడు అక్కడే పట్నంలో బట్టలకొట్టు పెట్టుకుని, మొన్నీ మధ్యే పెళ్లి చేసుకున్నాడు. ఆ కుర్రాడితో వాకబు చేయించండి కావాలంటే. మీ పెద్దబ్బాయిగారిని వచ్చేవారంలో వాళ్ల ఇంటికి పంపుదాం, స్వయంగా చూసి వస్తే సరి. ఇక దూరమంటారా? ఒక నెల అమ్మాయి వస్తే, ఇంకో నెలలో మీరే వెళ్లి చూడొచ్చు. ఇక పండగలూ పబ్బాలూ అన్నీ ఇక్కడే కాబట్టి శ్రావణం నుంచి మాఘమాసం వరకూ బెంగలేదు. మన ఊళ్లోనే నలుగురు అమ్మాయిలకు ఈ ఏడాది పట్నపు సంబంధాలు చేశారు. కాబట్టి సంతోషంగా ఒప్పుకోండి. అమ్మాయి సుఖపడుతుంది.’’ అనునయంగా చెప్పారాయన. కొంచెం కుదుటపడింది జానకమ్మ మనసు. ఆయన్ని పంపేసి పెళ్లిచూపుల పనిలో పడిందావిడ. చూస్తూండగానే చూపులయ్యాయి, ప్రధానం అయ్యింది, పెళ్లి ముహూర్తానికి పది రోజులుంది. ఇల్లంతా బంధువులే. నిజానికి వాళ్లకు ఊరంతా బంధువులే. జానకమ్మ అడిగినవాళ్లందరికీ గర్వంగా చెప్పుకుంటోంది. ‘‘అవును, మా పద్మ అత్తగారువాళ్లు అయిదారేళ్లుగా పట్నంలోనే ఉన్నారు. వాళ్లకు సొంతిల్లు కూడా ఉంది. అల్లుడు ఎండన పడి చేసే ఉద్యోగం కాదమ్మో. హాయిగా తొమ్మిదింటికి ఆఫీసుకెళ్తే, సాయంత్రం అయిదింటికి వచ్చేస్తారట. అత్తగారు ఎంతో నెమ్మదస్థురాలు. మామగారు చాలా మర్యాదస్థులు’’.
      ‘‘ఇంకేం, పద్మకు పట్నపు నాజూకులన్నీ అమరినట్టే. అమ్మాయికి నువ్వు కాస్త చూసి చీరలు అవీ పెట్టు వదినా, నేత చీరలు పెట్టకు. పల్లెటూరి బైతు అనుకునేరు. సినిమా టాకీసులు నాలుగున్నాయట కదా వాళ్ల ఊళ్లో.’’
      ‘‘అవును వదినా, కానీ అక్కడ ఏం దొరుకుతాయో దొరకవో అని బెంగనాకు. పద్మకి ఇష్టమని చింతకాయ, ఉసిరికాయ పచ్చళ్లు, వడియాలు అన్నీ పంపుతున్నా. కూరలు అవీ ఏం దొరుకుతాయో ఏమో అక్కడ’’ జానకమ్మ ఒకటే హైరానా పడుతోంది. ‘‘అక్కా, నువ్వేమీ దిగులు పడకు. పట్నానికి అన్నీ ఊళ్లనుంచే వెళ్తాయట. కిరాణా కొట్లలో అన్నీ దొరుకుతూ ఉంటాయిలే’’ ఇంకో చెల్లెలు ఉవాచ.
      పద్మ పెళ్లయిపోయి అత్తారింటికి వెళ్లిపోయింది. మొదటి నెల వ్రతాలు, పూజలంటూ వాళ్లు రావటమూ.. వెళ్లటమూ సరిపోయింది. తర్వాత రెండు నెలలకు కాని పద్మకు పుట్టింటికి రావటానికి తీరలేదు. బిడ్డమీద జానకమ్మ బాగా బెంగ పెట్టుకుంది. పద్మ కూడా ఇంటికి రాగానే అమ్మను చూసి చాలా సంతోషపడిపోయింది. కళకళలాడుతున్న కూతురి మొహం చూసి కుదుటపడింది జానకమ్మ. వారం రోజులుంది పద్మ. అమ్మకు, నాయనమ్మకు బోలెడు కబుర్లు చెప్పింది. అత్తవారి, అల్లుడి మంచితనం విని అందరూ సంతోషపడ్డారు.
      నాయనమ్మ ‘‘ఏమే పిల్లా, మరి పాడి ఏమన్నా ఉందటే అక్కడ’’ అని అడిగింది. పద్మ నవ్వింది. ‘‘అక్కడ మనుషులకే చోటు లేదు నానమ్మా, ఇక ఆవులు, గేదెలు కూడానా? పాలవాడు తెచ్చే నీళ్లపాలే గతి. కానీ ఏమైనా ఇక్కడ ఉన్నట్టు అక్కడ లేదే అమ్మా. చిన్న ఇల్లు, చిన్న చిన్న గదులూ, వడియాలు పెట్టుకోవడానికి కూడా చోటు లేదు. పెరట్లో కూరగాయలు పెంచుకునేందుకు చోటు కూడా ఉండదు. ఏవి దొరికితే అవే కొనుక్కుంటాం. అన్నీ ఎంత ప్రియమో. బుట్టలు బుట్టలు టమాట పళ్లు చూసి వెళ్లినా, అక్కడ కేజీ లెక్కన ఆచి తూచి కొనాలి. మంచి నెయ్యి దొరికి ఎన్నాళ్లయిందో. అప్పటికీ మీ అల్లుడుగారు ఎవరితోనో చెప్పి నాకోసం తెప్పించారు’’ అంది.
      పద్మ మాటలు విని అయ్యో అనిపించింది వాళ్లమ్మ, పెద్ద వదినలకు. పద్మ వెళ్లేప్పుడు అప్పుడే కాచిన నెయ్యి, ఏవేవో స్వీట్లు, వడియాలు, పచ్చళ్లు అన్నీ ఇచ్చింది. పద్మతో వాళ్ల పెద్దన్న వెళ్లి పట్నంలో దిగబెట్టాడు.
పద్మ వాళ్లాయన ఇవన్నీ చూసి నవ్వాడు. ‘‘బావా, ఇంత అవస్థ అవసరమా? అవన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి. మీ చెల్లాయి మరీ గారాబం కాకపోతే’’ అన్నాడు. ‘‘పోనీలే బావా, అక్కడి రుచి ఎలా వస్తుంది? ఇది మా సరదా’’ సర్దిచెప్పాడు పద్మ అన్నయ్య. మెల్లమెల్లగా అందరికి పద్మ పట్నవాసం అలవాటైపోయింది. పద్మ పిల్లల్ని తీసుకుని తానే ఊరికి వస్తుంది. జానకమ్మ కూడా బస్సు మారి పట్నం పోవటం నేర్చుకుంది. పోయినప్పుడు రెండు సినిమాలు చూసివస్తుంది. ఇరుకు ఇళ్లు, చీకటి గదులని మొదట్లో కాస్త గునిసేది, కానీ అదీ అలవాటైపోయింది ఆమెకు.

*  *  *

ముప్ఫై ఏళ్ల తర్వాత...

 

      ‘‘రమ్యా, రమ్యా, రెడీ అయ్యావా? పెళ్లికొడుకు వాళ్లు వచ్చేస్తున్నారట. మీ అమ్మ అమెరికా పిచ్చి కాదుకానీ, ఈ స్పీడు పెళ్లిచూపులతో చస్తున్నాం. ఆ అబ్బాయి రెండు రోజులే ఉంటాడట, ఇరవై మంది అమ్మాయిల్ని చూడాలట. మనకు సరిగ్గా అరగంట టైం ఇచ్చారు. ‘‘త్వరగా రా’’ హెచ్చరిస్తోంది రమ్య పిన్నమ్మ. ‘‘ఆఁ ఆఁ వచ్చేస్తున్నా’’ చక్కగా పట్టుచీర కట్టుకుని,  అలంకరించుకొని మేడమీద నుంచి దిగి వచ్చింది రమ్య.
      ‘‘అదేంటే,  వచ్చేది అమెరికా అబ్బాయి. ఈ అలంకారం చూసి నిన్ను పల్లెటూరి బైతు అనుకోడూ’’ అడిగింది రమ్య స్నేహితురాలు. ‘‘అది కాదే, పోయిన నెలలో ఇలానే అమెరికా పెళ్లిచూపులు జరిగాయిగా. అప్పుడు నేను చుడిదార్‌ వేసుకుంటే, ఆ అమెరికా అబ్బాయి ‘మాకు సంప్రదాయమైన పిల్ల కావాలి’ అని చెప్పి వెళ్లిపోయాడు. అందుకే ఈ రోజు ఇలా రెడీ అయ్యాను.’’ చెప్పింది రమ్య.
      పెళ్లిచూపుల్లో మళ్లీ మామూలే ‘‘అబ్బే, మా అబ్బాయిది పెద్ద ఉద్యోగం. పార్టీలు అవీ ఉంటాయి. అమ్మాయి కాస్త మోడ్రెన్‌గా జీన్సు అవీ వేసి స్టైలుగా ఉండాలండీ’’ అనేసింది పెళ్లికొడుకు తల్లి. ‘‘ఇంత ఎడ్డిగా ఉంటే కష్టం. ఆ జడ, మేకప్పు అన్నీ కాస్త మారిస్తే తప్ప మీ అమ్మాయి అమెరికాలో మనలేదండీ’’ అని ఓ ఉచిత సలహా కూడా పారేసి వెళ్లింది.
      ఇలా కాలికేస్తే మెడకూ, మెడకేస్తే కాలికీ చుట్టి పది సంబంధాల వరకూ తప్పిపోయాయి రమ్యకు. ‘మరి నా స్నేహితురాళ్ల కూతుళ్లందరూ అమెరికా, ఆస్ట్రేలియా సంబంధాలే చేసుకున్నారు. వాళ్లు అక్కడికి వెళ్లి నయాగారా జలపాతం, డిస్నీ లాండులు చూసి తెగ గొప్పలు చెప్తున్నారు. ఆ ఫొటోలు, వీడియోలు చూస్తూ నేనిక సహించలేను. నా పిల్లకు అమెరికా సంబంధం చెయ్యకపోతే నాకెంత నామోషీ’ అని రమ్య అమ్మ పట్టుదలకు పోయింది. చివరకు ఎలాగో ఓ అబ్బాయికి రమ్య చాలా నచ్చి పట్టుపట్టి చేసుకున్నాడు. హమ్మయ్య అనుకున్నారు రమ్య తల్లిదండ్రులు.
మొదటిసారి అమెరికా వెళ్లేప్పుడు ఓ చాంతాడంత లిస్టు చేసి పెట్టాడు రమ్య మొగుడు రవి. ‘‘ఇదేంటండీ పచారీ సరుకుల లిస్టు?’’ అమాయకంగా అడిగింది రమ్య. ‘‘అయ్యో ఇది పచారీ లిస్టు కాదే, మనం అమెరికా తీసుకెళ్లాల్సిన వస్తువులు. అక్కడ పచ్చళ్లు, పొళ్లు, ఆవకాయలు దొరకవు. దొరికినా ఆరు నెలల పాత సరుకు ఉంటుంది. ఇంకా గిన్నెలు తపేలాలు.. ఇవన్నీ దొరకవక్కడ. దొరికినా చాలా ఖరీదు.’’ చెప్పాడతను.
      ఇలా బండెడు సామాన్లతో రమ్య విమానమెక్కింది. వెళ్లినప్పటి నుంచి రమ్య అమ్మకు నాన్నకు ఫోన్లు. ‘‘అమ్మా బిసిబేళా బాత్‌ ఎలా చెయ్యాలి?’’, ‘‘బొబ్బట్లు ఎలా చేస్తారు’’ ఇలా. మరుసటి ఏడాది రమ్య వాళ్లత్తగారి వాళ్లతో ఒక పెట్టె నిండా మళ్లీ ఇవే, పొళ్లు, పచ్చళ్లు, ఆంధ్రదేశంలో నలుగురు మధ్య తరగతి, కాస్త ఆపైన ఉన్న ఆడవాళ్లు కలిస్తే వినపడే మాటలేవిటంటే... ఫలానా అమెరికా స్టేట్‌లో మా అబ్బాయి, లేక అమ్మాయి ఫలానా సాఫ్ట్‌వేర్‌ కంపెనీ... మీ వాడు వెళ్తే కాస్త చింతకాయ పచ్చడి మా అమ్మాయికి అందచేస్తారా? అబ్బో, మా అబ్బాయి ఉండే ఊళ్లో ఎంత మంచో, విపరీతమైన చలి బాబోయ్‌. ఇప్పుడు అక్కడా అన్నీ దొరుకుతున్నాయట. వీసా త్వరగా రావాలంటే ఇలా చెప్పాలి... ఇవే.
      మరి ఈ రోజు ఎలా ఉందో నేను కొత్తగా చెప్పాలా?
      కన్యాశుల్కంలో గిరీశం ‘‘పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్‌’’ అన్నాడు కానీ, ఇపుడు ఉండుంటే ‘కనీసం బిజినెస్‌ వీసా మీదైనా దేశం వదలని ఆంధ్ర యువతీ యువకులు వానరులై పుట్టున్‌’ అనో, మరింకేదో అనుండేవాడు. కాకపోతే కాలంలో తేడా ఏమిటంటే పెళ్లాడదామంటే అమ్మాయిలు దొరకటం లేదు. అమ్మలు, నాన్నలు, అత్తలూ, మామలూ చేతులెత్తేస్తున్నారు. ‘‘అబ్బా, ఆ ఇరవై గంటల ప్రయాణం చెయ్యలేకపోతున్నా, మేం రాలేం తల్లీ. మమ్మల్ని చూడాలని పిస్తే మీరే ఇండియా రండి’’ అంటున్నారు.

*  *  *

మరో ముప్ఫైయ్యేళ్లకు...

 

      అది ఓ తెలుగు వాడి ఇల్లు. దేశమేదని అడగవద్దండి. తెలుగు వాడు లేని దేశమే లేదు. ‘‘నాన్నా, అమ్మా’’ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చింది ఆదిశ్రీ. ఇదేం పేరు అనుకోకండి, తెలుగు వారికి ఉండే ఇంకో అలవాటు... పిల్లలకు కొత్త కొత్త పేర్లు పెట్టుకోవటం. ‘‘నాకు నా డ్రీం జాబ్‌ వచ్చేసింది. మొత్తం రీసెర్చ్‌ టీంలో నేనే చిన్నదాన్ని. రెండు నెలల్లో చేరిపోవాలి. ట్రైనింగ్‌ రేపే మొదలు’’ సంతోషంగా చెప్పింది.
      ‘‘మన దేశమేనా?’’ అమ్మ చాలా పొంగిపోతూ అడిగింది. తండ్రీ కూతుళ్లు మొహాలు చూసుకుని నవ్వుకున్నారు. ‘‘లేదమ్మా, కాస్త దూరం వెళ్లాలి. ఆరు నెల్లకోసారి సెలవిస్తారు. వెంటనే పరిగెత్తుకురానూ?’’ చెప్పింది ఆదిశ్రీ.
      ‘‘అదేంటే? నేనెప్పుడూ నిన్నొదిలి ఉండలేదు. ఇప్పుడెలా? ఎంత దూరమే? పోనీ రెండు నెల్లకోసారైనా రావచ్చా?’’ అమ్మ బెంగపడిపోతోంది. ‘‘ఇప్పుడే కాదు, ముందు నా ట్రైనింగ్‌ అయిపోనీ, నేనే మిమ్మల్ని పిలిపించుకుంటాగా’’ కూతురు చెప్తూ ఉంటే అమ్మ విసుక్కుంది
      ‘‘మరేం ఫరవాలేదు, మేమే వచ్చేస్తాము. నువ్వు పిలిచేదాకా ఆగుతామా ఏంటి? నీ ఉద్యోగం వేరే దేశంలో అని అర్థమైందిలే. అంతగా అయితే ఏదో ఒక వీసా కావాలి. అదేం పెద్ద కష్టం కాదు ఈ రోజుల్లో’’  అంది అమ్మ.
      ‘‘నువ్విలా బెంగపడితే నేను వెళ్లనే వెళ్లను. నా భవిష్యత్తంతా ఈ ఒక్క స్టెప్పు మీద మొదలవుతుంది. ఏంటమ్మా ఇది’’ ఆదిశ్రీ ఏడుపు మొహం పెట్టేసింది.
      అమ్మ కరిగిపోయింది. ‘‘సరేలే, అలాగే కానీ. అమ్మో నీకు ప్యాకింగ్‌ చెయ్యాలి, అక్కడ ఆవకాయ దొరుకుతుందో లేదో. ఇంకా ఏమన్నా కావలసినవి చెప్తే, రెడీ చేస్తా. లగేజీ ఎంత తీసుకెళ్లొచ్చు?’’
      ‘‘అమ్మా, నేను వెళ్లేచోటికి ఈ లగేజీ ఏమీ ఒప్పుకోరు. అన్నీ వాళ్లే ఇస్తారు. నువ్వేం బెంగపడకు. ఇంతకీ ఉద్యోగం ఎక్కడో చెప్పనేలేదు కదా. అంగారక గ్రహానికి పంపిస్తున్నారు నన్ను. రోజు సాయంత్రం అలా పెరట్లో నిలబడితే ఆకాశంలో ఎర్రగా కనబడే నక్షత్రమే అది. ఎంతో దూరం లేదు’’ కూతురి మాటలు ఇక వినటం లేదు. అమ్మ ఎప్పుడో మూర్ఛపోయింది.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


వాళ్లు ఏడ్చారు!

వాళ్లు ఏడ్చారు!

పి.చంద్రశేఖర అజాద్‌


స్వ‌యంవ‌ధూ...!?

స్వ‌యంవ‌ధూ...!?

దోరవేటి, (వి.చెన్నయ్య)


సువర్ణ గన్నేరు పూలు

సువర్ణ గన్నేరు పూలు

ప్రసాదమూర్తి


స‌మిధ‌

స‌మిధ‌

సయ్యద్‌ సలీం


అతడూ మనిషే!

అతడూ మనిషే!

పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


దాసరి పాట (క‌థాపారిజాతం)

దాసరి పాట (క‌థాపారిజాతం)

చింతా దీక్షితులుbal bharatam