ఇల్లు క‌ట్టి చూడు

  • 287 Views
  • 6Likes
  • Like
  • Article Share

    పొత్తూరి విజయలక్ష్మి

  • హైదరాబాదు
  • 9949059007
పొత్తూరి విజయలక్ష్మి

ప్రసాదరావు సెల్‌ఫోన్‌ మళ్లీ మోగింది. ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతోంది. అంతా సందడిగా ఉంది. అక్కడి నుంచి ఏం మాట్లాడినా వినిపించదు. కాబట్టి బయటికి పరుగెత్తాడు.
      ‘‘ఆ! ఎవరండీ!’’
      ‘‘నేనండీ కృష్ణారావుని. మీ ఇంటికే వస్తున్నాం. ఎలా రావాలి చెప్తే..!’’
      ‘‘మీరెక్కడున్నారూ?’’
      ‘‘మెయిన్‌రోడ్‌లో  వేంకటేశ్వర స్వామి గుడి దగ్గర!’’
      ‘‘ఇంకాస్త ముందుకు రండి. ఆంధ్రాబ్యాంక్‌ ఏటీఎం వస్తుంది. దాని ఎదురుగా ఉన్న సందులోకి రండి. కాస్త ముందుకి వస్తే వినోద్‌నగర్‌ కాలనీ అని బోర్డు కనిపిస్తుంది. అక్కడ కుడివైపు మళ్లి కాస్త ముందుకి వస్తే విశాల్‌నగర్‌ కాలనీ అని బోర్డు ఉంటుంది. అక్కడ మళ్లీ కుడివైపు తిరిగి రెండోవీధి దగ్గర ఎడమకి వచ్చి మళ్లీ కుడిపక్క మళ్లగానే నాలుగో ఇల్లు. అయిదంతస్తుల భవనం బ్లూమింగ్‌ హైట్స్‌. బోరింగ్‌హెడ్స్‌ కాదండీ. బ్లూమింగ్‌ హైట్స్‌. బ్లూమింగ్‌ అంటే వికసించడం.’’
      చాంతాడంత పొడవున్న ఈ గుర్తులు చెప్పీ చెప్పీ ఆయన దవడలు పడిపోతు న్నాయి. ఎంత వివరంగా చెప్పినా ఎక్కడో ఓ సందు తప్పుగా తిరిగేసి ఇంకెటో వెళ్లిపోతున్నారు అతిథులు. ఒక్కొక్కరికీ రెండు మూడుసార్లు చెప్పాల్సి వస్తోంది.
      మళ్లీ మోగింది సెల్‌. ‘‘హలో ప్రసాదరావు గారేనా. మేం ఆంధ్రాబ్యాంక్‌ ఏటీఎం పక్కసందులోకి తిరిగాం. ఇప్పుడెక్కడికి రావాలి!’’ అన్నాడు అవతల్నించి మరో పెద్దమనిషి.
      కడుపులోంచి దుఃఖం తన్నుకొచ్చిందాయనకి. తిన్నగా వెళ్లి ఏ గోడకో గుద్దేయండి అనేద్దామనేంత చిరాకొ చ్చేసింది. అలా అనడం మర్యాద కాదు కాబట్టి ఓర్చుకొని ‘‘ఆంధ్రాబ్యాంక్‌ ఏటీఎం పక్క సందు కాదు మాస్టారూ! ఎదురు సందులోకి రావాలి’’, అని పట్టు వదలని విక్రమార్కుడు మళ్లీ చెట్టెక్కాడు అన్నట్టు మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు.
      ప్రసాదరావు పెద్దకొడుకు మహేష్‌ పరుగున వచ్చాడక్కడికి. ‘‘నాన్నగారూ! కేటరింగ్‌ వాళ్లు లిస్టులో రాసిన సామాన్లేవో రాలేదట. నన్నడిగారు! నాకు తెలియదండీ మా నాన్నగారే చూసుకుంటున్నారు అని చెప్పేశాను. మీరోసారి వచ్చి చూస్తారా?’’ అన్నాడు వినయంగా.
      వస్తాను, రాక చస్తానా! ఆడా పాడా మద్దెల కొట్టా అన్నింటికీ అతడొక్కడే అని సామెత చెప్పినట్టూ అన్ని పనులు నావేగా’’ అని మనసులోనే అనుకుంటూ కాళ్లీడ్చుకుంటూ వెళ్లాడు కేటరింగ్‌ వాళ్ల దగ్గరికి. వాళ్లకేం కావాలో కనుక్కుని టెంట్‌హౌస్‌ వాళ్లకి ఫోన్‌ చేసి ఉసూరుమంటూ ఓ కుర్చీలో కూలబడ్డాడు. 
      ప్రసాదరావుకి ఆప్తుడూ, బాల్యమిత్రుడూ అయిన రామ్మూర్తి వచ్చి మరో కుర్చీ లాక్కుని మిత్రుడి దగ్గర కూర్చున్నాడు.
      ‘‘ఏవిట్రా ప్రసాదూ అలా ఉన్నావ్‌?’’ అన్నాడు.
      ‘‘ఇంకెలా ఉంటాన్రా? ఆ మధ్య ఎక్కడో చదివాను. ఓ పెద్దమనిషి సుఖశాంతులతో జీవనం సాగిస్తూ ఉంటే పక్కనెవరో పెద్దభవనం కట్టారట. ఆ ప్రభావం ఈయన మీద పడి వాస్తుదోషాలు ఏర్పడి జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోయిందట. అలా ఉంది నా పరిస్థితి. ఏదో నా మానాన నేనుంటే ఇదుగో ఈ బాధ్యతలన్నీ నా నెత్తి మీద పడిపోతున్నాయి’’, అన్నాడు దీనంగా.
      ‘‘అవున్రా పాపం. నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. జాలిపడటం తప్పించి నేనేం చెయ్యలేను కదా!’’ అన్నాడు.
      మళ్లీ మోగింది ప్రసాదరావు సెల్‌. ఎవరో చిరునామా అడుగుతున్నారు. శక్తి కూడదీసుకుని సమాధానం చెప్తున్న మిత్రుడి వంక జాలిగా చూశాడు రామ్మూర్తి.
      ‘‘ఏవిటో పాపం. గంగిగోవులాంటివాడు. వీడి మెతకదనం చూసి అందరూ పెత్తనం చెలాయిస్తున్నారు. వీడి కష్టాలు పోలీసు దెబ్బల్లాగా పైకి కనిపించవు. అందరూ ప్రసాదరావు చాలా అదృష్టవంతుడు అని ఈర్ష్య పడుతుంటారు, కానీ వాడి అదృష్టం ఏంటో నాకు తెలుసు’’, అనుకున్నాడు.
      నిజమే ప్రసాదరావుది విచిత్రమైన స్థితి. ఆయన ఇంజినీరు. మంచి ఉద్యోగం చేసి రిటైరయ్యాడు. ఇద్దరు కొడుకులు మహేష్, సురేష్‌.
      వాళ్లూ తండ్రిలాగా తెలివిగల వాళ్లు. తెలివిగల పిల్లలు ఇండియాలో ఉండరుగా మరి! అందర్లాగే వాళ్లూ చదువుకొని అమెరికా వెళ్లిపోయారు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. పెద్దకోడలు పూజ, రెండో కోడలు హరిణి. వాళ్లూ పెద్ద చదువులే చదివారు. వాళ్లకీ అమెరికాలో మంచి ఉద్యోగాలున్నాయి. పిల్లలూ పుట్టారు. ఇద్దరు కొడుకులకీ ముందు గ్రీన్‌కార్డు, ఆ తర్వాత సిటిజన్‌షిప్‌ వచ్చేశాయి.
      అమెరికా వెళ్లిన ఇండియా వాళ్లు గ్రీన్‌ కార్డు వచ్చాక అక్కడ ఇల్లు కొనుక్కుంటారు. అక్కడి పౌరసత్వం వచ్చి అమెరికా పౌరుల య్యాక ఇండియాలో ఇల్లు కొనుక్కుంటారు. ఎందుకూ? అక్కడే స్థిరపడి పోయారు. ఇక్కడికి వస్తారా పెడతారా? ఇంతటి భాగ్యానికి ఇల్లెందుకూ? అంటే ఈ ప్రశ్నలకి సమాధానం ఉండదు. కొంటారు అంతే!
      ఇటీవల ఇండియాలో ప్రత్యేకంగా ఎన్‌ఆర్‌ఐల కోసం అని వెంచర్లు కడుతున్నారు బిల్డర్లు. ప్రసాదరావు పెద్దకొడుకు మహేష్‌ అయిదేళ్లకిందట ఒక త్రీబెడ్‌రూం అపార్ట్‌మెంట్‌ కొన్నాడు. ఇల్లు ఎంచుకుని మిగిలిన బాధ్యతలన్నీ తండ్రికి అప్పగించి విమానం ఎక్కేశాడు.
      అప్పుడే రిటైరై ఏ పనీ లేకుండా ఖాళీగా ఉన్నాడేమో ప్రసాదరావుకి ఆ ఇంటి  వ్యవహారంతో బాగానే కాలక్షేపం అయింది. పర్యవేక్షణ, రాతకోతలు అన్నీ దగ్గరుండి శ్రద్ధగా చూసుకోవడం మొదలు, ఇల్లు పూర్తయ్యాక గృహప్రవేశానికి ముహూర్తం పెట్టించి వేడుక ఏర్పాట్ల దాకా అన్నీ తనే చూసుకున్నాడు.
      గృహ ప్రవేశానికి వారం రోజుల ముందు వచ్చారు అమెరికా నుంచి పిల్లలు. ఇల్లు చూసి మురిసిపోయారు. ‘‘నాన్నగారూ కొత్తింట్లో మీరుండి మన పాతిల్లు అద్దెకివ్వండి’’ అన్నాడు మహేష్‌.
      ‘‘వద్దులేరా! నేనక్కడ స్థిరపడిపోయాను. అక్కడ బావుంది నాకు. బ్యాంకు వగైరాలన్నీ దగ్గర. నేను మారలేను. కొత్తిల్లే అద్దెకివ్వు అన్నాడాయన. అంతేకాదు అప్పు చేసేగా ఇల్లు కొన్నావు. ఈ అద్దెతో ఆ అప్పు తీర్చు’’ అని కూడా అన్నాడు.
      ‘‘అయితే మంచివాళ్లని చూడండి మీరే!’’ అన్నాడు మహేష్‌. గృహప్రవేశం అయ్యాక ఇల్లు అద్దెకిచ్చి, ఆ అద్దె వసూలు చేసుకుని తన బ్యాంకు ఖాతాలో జమచేసే బాధ్యతను తండ్రికి అప్పజెప్పాడు. విమానం ఎక్కి అమెరికా వెళ్లిపోయారందరూ.
      ఈ రోజుల్లో అద్దెకివ్వడం అంతతేలిక కాదు. వ్యాపారస్థులకిస్తే అందులోనే స్థిరపడిపోతారు. అంతంతమాత్రం ఉద్యోగస్థులకిస్తే అద్దె తిన్నగా ఇవ్వరు. అందుకే జాగ్రత్తగా వెతికి ఓ బ్యాంకు ఉద్యోగికి అద్దెకిచ్చి, హమ్మయ్య ఇక నా బాధ్యతలు తీరిపోయాయి అనుకున్నాడు. ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఓ ఆర్నెల్లు గడిచాక...
      ‘‘నాన్నగారూ అన్నయ్యలాగా నేను కూడా అక్కడే ఓ ఇల్లు కొనుక్కుంటాను. డబ్బు పంపిస్తా మిగిలిన బాధ్యత అంతా మీదే మరి!’’, అన్నాడు సురేష్‌.
      పెద్దకొడుక్కి సాయం చేసిన వాడు చిన్నకొడుకుని కాదనలేడు కదా! సరే అని తలాడించాడు. 
      మళ్లీ శ్రీకారం చుట్టాడు. పెద్దకొడుకు ఇల్లు వెతుక్కోవడం వరకూ తనే చేసుకున్నాడు. చిన్న కొడుకు విషయంలో ఆ పని కూడా ఈయనే చేయాల్సి వచ్చింది. వెతికి వెతికి ఒక గేటెడ్‌ కమ్యూనిటీలో డ్యూప్లెక్స్‌ ఇల్లు ఎంపిక చేశాడు. మళ్లీ పర్యవేక్షణ, రాతకోతలు. మళ్లీ గృహప్రవేశం.
      షరా మామూలే. వారం రోజుల ముందు వచ్చారు పిల్లలంతా. ఇల్లు చూసి తెగ సరదా పడిపోయారు. పూజ మాత్రం ‘‘అయ్యో మనం కూడా ఇలా ఇండిపెండెంట్‌ ఇల్లు కొనుక్కోవాల్సింది. తొందర పడిపోయి ఫ్లాట్‌ కొనుక్కున్నాం’’, అంది కాస్త బాధగా.
      ‘‘ఇప్పుడు మాత్రం ఏం మించిపోయిందక్కా? నువ్వెలాగూ ఇల్లు కొందామనుకుంటున్నావుగా, ఇలాంటి ఇల్లు కొనుక్కో’’, అని సలహా ఇచ్చింది హరిణి. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. తోడికోడళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లలా అన్యోన్యంగా ఉంటారు.
      ఆ సలహా నచ్చింది పూజకి ‘‘మావయ్య గారూ! డబ్బు పంపిస్తాను, నాకూ ఇల్లు కొనిపెట్టరూ!’’ అంది గారంగా.
      ప్రసాదరావు గుండె దడదడలాడింది. ‘చచ్చీచెడీ ఏటికి అడ్డంపడి ఈది ఒడ్డుకి చేరి ఊపిరి పీల్చుకుంటూ ఉంటే మళ్లీ ఏట్లో దూకమన్నట్టే’ అయింది.
      అప్పటికీ తన వంతు ప్రయత్నంగా ‘‘ఎందుకమ్మా నీకు ఇల్లూ?’’ అని నచ్చజెప్పాలని చూశాడు.
      ‘‘మా ఫ్రెండ్స్‌ అందరూ కొనేసుకున్నారు మావయ్యగారూ! నువ్వెప్పుడు కొంటావే! అని ఒకటే గొడవ చేస్తున్నారు. నేనూ ఒకటి కొనేస్తే ఆ గొడవ వదిలిపోతుంది’’ అంది పూజ.
      ఇక తప్పదు కాబట్టి రంగంలోకి దిగిపోయాడు. అక్కడే ఇంకో ఇల్లు కొనేస్తే సరిపోతుంది. మళ్లీ వెతుకులాట తప్పుతుంది అని ఆశ పడ్డాడు. కానీ ఆ ఆశ అడియాస అయింది.
      ఇళ్లు ఖాళీ ఉన్నాయి. కానీ ధరలు పెరిగాయి. అప్పటికీ ఇప్పటికీ అయిదారు లక్షలు తేడా వస్తోంది. తగ్గించమంటే వీల్లేదు పొమ్మన్నారు. అంతేకాదు, ఎన్‌ఆర్‌ఐ లు మీకు డబ్బుకేం లోటు? ఇలా బీద అరు పులు అరుస్తారేం? అని కూడా అన్నారు.
      పూజకి పౌరుషం వచ్చింది. అంత ఎక్కువ పెట్టి కొనాల్సిన ఖర్మ మాకేం పట్టలేదు. మా మావగారు ఇంతకన్నా చవగ్గా, ఇంతకంటే మంచి ఇల్లే కొంటారు అని మంగమ్మలా శపథం చేసింది.
      కాస్త త్వరగా ఆ పని చూడండి మావయ్యగారూ! అని ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి చెప్పింది పూజ. పిల్లలంతా విమానం ఎక్కి వెళ్లిపోయారు.
      చిన్నకొడుకు ఇంట్లో అద్దెకుండే వాళ్లని వెతికి అద్దెకిచ్చి, పెద్దకోడలి కోసం ఇల్లు వెతకడం ప్రారంభించాడు ప్రసాదరావు.
      ఆ దేవుడి దయవల్ల మంచి ఇల్లు అనుకున్న ధరలోనే దొరికింది. తరువాత అంతా మామూలే.
      గృహప్రవేశానికి వారం రోజుల ముందుగానే పిల్లలంతా వచ్చారు.
      అప్పుడు మాత్రం ఆయన హమ్మయ్య బయటపడ్డాను అనుకోలేదు. ఆపద పొంచి ఉందని ముందే ఊహించాడు. పెద్ద కోడలు ఇల్లు కొనేసుకుంటే ఆవిడకంటే మరికాసిని డాలర్లు ఎక్కువ సంపాదిస్తున్న చిన్నకోడలూరుకుంటుందా?
      గృహప్రవేశం అయిన మర్నాడే ‘‘మావయ్యగారూ ఇక నేనొక్కతినే మిగిలిపోయాను’’ అంది హరిణి దీనంగా.
      ‘‘అవేం మాటలు హరిణీ! నువ్వు ఊఁ అంటే చాలు. మావయ్యగారు రంగంలోకి దిగుతారు. మా అందర్లోకి చిన్నదానివి కదా! నువ్వంటేనే ఇష్టం ఆయనకి’’, అంది పూజ.
      ‘‘అయితే నేను ఊఁ అనేశాను మావయ్యగారూ మీరు రంగంలోకి దిగొచ్చు’’ అంది హరిణి నవ్వుతూ.
      ఏడవలేక ఓ వెధవ నవ్వు నవ్వేశాడు ప్రసాదరావు. శక్తినంతా కూడదీసుకుని రంగంలోకి దిగాడు. అదివరకు మూడిళ్ల సమయంలో పడిన శ్రమ ఒక ఎత్తు. ఇదొక్కటీ ఒక ఎత్తు. 
      హరిణికి ఏదీ ఓ పట్టాన నచ్చదు. చీర కొనాలంటేనే పొద్దున పదింటికి అన్నం తిని వెళ్లిన మనిషి, వాళ్లు కొట్టు కట్టేశాక వస్తుంది. ఆవిడకి నచ్చిన ఇంటి కోసం వెతికివెతికి వేసారిపోయాడు. చివరికెలాగైతేనేం ఆవిడకి నచ్చిన ఇల్లు దొరికింది.
      అదే ఈ బ్లూమింగ్‌ హైట్స్‌లోని ఫ్లాట్‌. పర్యవేక్షణ, రాతకోతలు అయి గృహప్రవేశం దాకా వచ్చింది. ఇకపోతే ఇల్లు అద్దెకివ్వాలి. అదేం అల్లాటప్పా వ్యవహారం కాదు. ఇంటివాళ్లు అద్దెకున్నవాళ్ల మీద పెత్తనం చలాయించడం, ఇలా అయితే ఖాళీ చేసిపోండి అని బెదిరించడం పాత పద్ధతి.
      ఇప్పుడు అద్దెకున్న వాళ్లే ఇంటివాళ్ల మీద పెత్తనం చలాయిస్తున్నారు. ఇంటి యజమాని అమెరికాలో ఉంటాడు అంటే, ఆ! వద్దులేద్దురూ ఏదైనా రిపేర్లూ గట్రా వస్తే యజమాని అందుబాటులో ఉండడు అంటున్నారు అద్దెకొచ్చేవాళ్లు. యజమాని విదేశాల్లో ఉన్నా ఇంటి మంచీచెడూ చూసుకునేందుకు ఇక్కడ ఓ మనిషుంటేగానీ అద్దెకి రావడం లేదు. మేం ఎక్కడో ఉన్నా ఇక్కడ మా నాన్నగారుండి చూసుకుంటారు, అని హామీ ఇచ్చేశారు. అంతకుముందు కట్టిన మూడిళ్లకీ ప్రసాదరావే లోకల్‌ గార్డియన్‌. ఇప్పుడు ఈ కొత్తింటి బరువు బాధ్యతలు కూడా ఈయనవే. అద్దెకి ఉండేందుకు ఓ పార్టీ దొరికింది. వాళ్లు పూజకి ఫ్రెండ్స్‌. ఆవిడ పేరు సునీత, ఆయన పేరు ఈశ్వర్‌. కాస్త గడుసువాడే. 
      ఫోన్లో మాట్లాడి ‘‘ఈ వయసులో ఏమిట్రా నాకీ బాధ్యతలు. ఎన్నిళ్లని చూసుకోను?’’ అని వాపోతున్న మిత్రుడి దీనస్థితి చూసి బాధ కలిగింది రామ్మూర్తికి. ‘‘ఆ బాధ బయటపెట్టకుండా ఫర్వాలేదులేరా, మూడిళ్లు చూసుకుంటున్నవాడివి నాలుగో ఇల్లు చూసుకోలేవా! ఇక ఇదే ఆఖరుగా. ఇక ఇళ్లు కట్టరులే’’, అని ధైర్యం చెప్పాడు.
      ‘‘ఏమో మరి నా ఆదృష్టం ఎలా ఉందో?’’ అని నిట్టూర్చాడు ప్రసాదరావు. రెండ్రోజులుగా నిద్రలేదేమో కళ్లు మూతలు పడిపోతున్నాయి.
      అంతలోనే అక్కడికి వచ్చాడు మహేష్‌ ‘‘నాన్నగారూ ఇక్కడున్నారా? ఈశ్వర్‌గారూ, వాళ్లూ వచ్చారు రండి’’, అన్నాడు.
      ‘‘అలాగా వచ్చారా!’’ అని వీఐపీని రిసీవ్‌ చేసుకునేందుకు వెళ్లిన అతిథిలా పరుగెత్తాడు ప్రసాదరావు. ఇంట్లోకి వెళ్లారు. అదివరకు ఓసారి వచ్చి చూసుకున్నారు. ఇప్పుడు ఇల్లు పూర్తయ్యాక చూసుకుంటున్నారు. కొత్త ఇల్లు. ఉడ్‌వర్క్‌ కూడా చేయించారేమో, మెరిసిపోతోంది. ఇల్లు చూసి మురిసిపోతూ అద్దెకుండబోయే వాళ్లూ, వాళ్ల వెనుక వినయంగా ఇంటి ఓనర్లు, వెనకాల ఏబ్రాసిమొహం వేసుకుని ప్రసాదరావూ ఇల్లంతా తిరిగారు.
      ‘‘ఇక్కడ ఇంకో ప్లగ్‌పాయింట్‌ ఉంటే బావుంటుంది. ఇక్కడ ఉయ్యాల కోసం హుక్‌ కావాలి’’, అని ఈశ్వర్‌ పురమాయిస్తుంటే ‘‘ఓ అలాగే దానికేం, మా నాన్నగారున్నారుగా ఆయనతో చెప్తే చేయిం చేస్తారు’’, అని హామీ ఇస్తున్నాడు సురేష్‌.
      కింద భోజనాలు మొదలయ్యాయి.
      ఈశ్వర్‌ కుటుంబ సమేతంగా నిలబడి భోంచేస్తూ కబుర్లు చెప్తున్నాడు.
      ‘‘ఈ రోజుల్లో ఇల్లు కొనుక్కోవడం శుద్ధ దండగ. అన్ని లక్షలు పోసి కొనే బదులు ఆ డబ్బు బ్యాంక్‌లో వేసుకుంటే వచ్చే వడ్డీతో మనకు నచ్చిన ఇంట్లో అద్దెకుండొచ్చు. అయినా జీవితాంతం ఒకే ఇంట్లో ఉండాలంటే మొహం మొత్తదూ! నా మటుకు నేను ఏ ఇంట్లోనూ రెండు మూడేళ్లకి మించి ఉండను. ఎప్పుడూ కొత్త ఇల్లు తప్ప పాతింట్లో దిగను. రెండేళ్లకిందట ఓ కొత్తింట్లో అద్దెకి దిగాను. ఈ మధ్యన పక్కనే మరో బిల్డింగ్‌ కడుతున్నారు. గాలీ, వెలుతురూ తగ్గిపోతాయని ఇదుగో ఇక్కడికి మారుతున్నాను. అక్కడికంటే అద్దె తక్కువ, ఇల్లు పెద్దది’’, అంటున్నాడు.
      మరోపక్క మహేష్‌ పూజ, సురేష్‌ హరిణి నిలబడి భోజనాలు చేస్తున్నారు.
      ‘‘కంగ్రాట్స్‌ హరిణీ. మొత్తానికి బ్రహ్మాండమైన ఇల్లు కొనేశావు. మంచి లొకాల్టీ. ఇల్లు కూడా చాలా బావుంది’’, అని అభినందించాడు ఓ స్నేహితుడు.
      కాస్త దిగులుగా నవ్వింది హరిణి.
      ‘‘ఆ! కొన్నాంలే. కొనగానే అయిందా, నెలసరి వాయిదాలు కట్టొద్దూ. ఇప్పటికే మా జీతాల్లో సగందాకా అప్పులకే పోతోంది. ఇప్పుడిది కూడానూ. ఏదోలే ఓ ఇల్లుంటుంది అని కొనడమేగానీ దీనివల్ల మనకి కలిసొచ్చేదేం లేదు’’ అన్నాడు సురేష్‌.
      వీళ్లందరి మాటలూ వింటున్న రామ్మూర్తి లోలోపలే నవ్వుకున్నాడు.
      ‘చీమలు పెట్టిన పుట్టలు పాములకు నెలవైనట్టుల’ అని శతకం రాసిన శతకకారుడు ఇప్పటి ఈ పరిస్థితి చూస్తే... ఏమని రాసేవాడో అనుకున్నాడు.

* * *

 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


వాళ్లు ఏడ్చారు!

వాళ్లు ఏడ్చారు!

పి.చంద్రశేఖర అజాద్‌


స్వ‌యంవ‌ధూ...!?

స్వ‌యంవ‌ధూ...!?

దోరవేటి, (వి.చెన్నయ్య)


సువర్ణ గన్నేరు పూలు

సువర్ణ గన్నేరు పూలు

ప్రసాదమూర్తి


స‌మిధ‌

స‌మిధ‌

సయ్యద్‌ సలీం


అతడూ మనిషే!

అతడూ మనిషే!

పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


దాసరి పాట (క‌థాపారిజాతం)

దాసరి పాట (క‌థాపారిజాతం)

చింతా దీక్షితులుbal bharatam