బాధ్యత

  • 387 Views
  • 0Likes
  • Like
  • Article Share

    రాజేష్‌ యాళ్ల

  • క్యాషియర్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
  • విశాఖపట్నం
  • 9700467675
రాజేష్‌ యాళ్ల

‘‘అమ్మా! కాఫీ ఇవ్వవా?’’ ఆఫీసునుంచి ఇంట్లో అడుగు పెడుతూనే కేక పెడుతూ అలసటగా సోఫాలో కూర్చుంది రమ. ‘‘తెస్తున్నా’’ అని వంటింట్లోంచే జవాబిచ్చి రెండే నిమిషాల్లో కాఫీ కూతురికిచ్చి తనూ పక్కన కూర్చుంది గౌరి.
      ‘‘ఇవాళ పని ఎక్కువగా ఉన్నట్టుంది?’’ కూతురి వైపు జాలిగా చూస్తూ అంది గౌరి. ‘‘అవునమ్మా! ఎవరో ఆఫీసర్‌ ఇన్‌స్పెక్షన్‌కి వస్తున్నాడట! అందుకని పెండింగ్‌ పనంతా ఆలస్యమైనా పూర్తి చెయ్యాలని మేనేజర్‌ హుకుం!’’ కాఫీ తాగుతూ చెప్పింది రమ.
      ‘‘అదిసరే, ఆ అమలాపురం వాళ్లు ఫోన్‌ చేశారే రమా!’’ కూతురి చేతిలోంచి ఖాళీ కప్పును తీసుకుంటూ చెప్పింది గౌరి. ‘‘ఆహా.. ఏమిటట విషయం?’’ తన ఆసక్తిని దాచుకునేందుకు ప్రయత్నిస్తూ అంది రమ. వంటింట్లో ఖాళీ కప్పును పెట్టి వచ్చి చెప్పింది గౌరి ‘‘ఏముందీ మామూలేగా... ఏదో ఒక ఆటంకం! జాతకాలు సరిపోలేదట’’.
      ‘‘సరేలే... నచ్చలేదని చెప్పేందుకు మాత్రం జాతకాలు బాగా పనికొస్తాయి!’’ అదోలా నవ్వుతూ చెప్పింది రమ. ‘‘ఇప్పటికి పాతిక పైగా సంబంధాలు చూశాం! అందం, చదువు, ఉద్యోగం అన్నీ ఉన్నా కూడా ఏదో ఒక అడ్డు తగులుతూనే ఉంది నీ పెళ్లికి’’ గౌరి కంఠంలో విచారం తొంగి చూసింది.       ‘‘పోనీలే నాకిలా అలవా టైపోయిందిలే’’ నిర్లిప్తంగా చెప్పింది రమ.
కొన్ని క్షణాలపాటు సాగిన మౌనం తర్వాత గౌరి చెప్పింది ‘‘కానీ వాళ్లు ఇంకొక విషయం చెప్పారే’’. తల్లి ఆ తర్వాత ఏమీ మాట్లాడకపోయే సరికి చెప్పమన్నట్టుగా చూసింది రమ.
      ‘‘వాళ్లకు... అంటే... ఆ అబ్బాయికి ప్రతిమ బాగా నచ్చిందట!’’ మెల్లగా అసలు విషయం చెప్పింది గౌరి. ‘‘చెల్లి జాతకం చూడకుండానే సరిపోయిందా?’’ జేవురించిన ముఖంతో కోపం దాచుకునేందుకు విఫలయత్నం చేస్తూ అడిగింది రమ.
వాళ్లిద్దరి మధ్యా మళ్లీ మౌనం చోటు చేసుకుంది.
      రమ ఆ ఇంట్లో అందరికంటే పెద్ద అమ్మాయి. తన తర్వాత ఐదేళ్ల వ్యవధిలో ముగ్గురు చెల్లెళ్లు. రమ తండ్రి రామం, భాగస్థుల చేతిలో మోసపోయి వ్యాపారంలో పూర్తిగా దెబ్బతిని రెండేళ్లు కావస్తోంది. సొంత ఇల్లు కూడా అమ్మి చిన్న అద్దె ఇంట్లోకి మారారు. ఆ కుటుంబానికి ఇప్పుడు రమ ఉద్యోగమే ఆధారం. డిగ్రీ పూర్తి కాగానే కేంద్ర ప్రభుత్వ ఆఫీసులో వచ్చింది గుమస్తా ఉద్యోగమైనా ఆనందంగా చేరిపోయింది.
      చాలాసేపటి తర్వాత నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ రమ అడిగింది ‘‘నాన్న ఏమన్నారు?’’.
      ‘‘ఏమంటారు? ఇంట్లో పెద్ద కూతురికి పెళ్లి చెయ్యకుండా రెండోదానికి ఎలా చేస్తాం అంటున్నారు. కానీ సంబంధం మంచిది కదా, వదులుకుంటే ఎలా అంటే వినడం లేదు’’ గబుక్కున నోరు జారి నేరం చేసిన దానిలా చూసింది గౌరి.
      తనకిప్పుడు ఇరవై రెండేళ్లు. చెల్లి ప్రతిమకి ఇరవయ్యొకటి. తండ్రికి ఆదాయం లేదు. తన ఉద్యోగమే కుటుంబానికి ఆధారం. మరో నాలుగైదేళ్లలో తన కుటుంబం ఒక దారిలోకి వచ్చే వరకూ తను వీళ్లతో ఉంటేనే బావుంటుందేమో! పెళ్లి చేసుకున్నా కాబోయే భర్త తనలా వీళ్ల బాధ్యత తీసుకుంటాడా? అనుమానమే ! దాని బదులు చెల్లిని చూసి చేసుకుంటా నన్నవాడికిచ్చి పెళ్లి చేస్తేనే సబబేమో! తన ఆలోచనల నుంచి తేరుకుంటూ చెప్పింది రమ ‘‘ప్రతిమకు కూడా నచ్చితే పెళ్లి చేసేద్దామమ్మా!’’
      ‘‘మరి నువ్వో?’’ కూతురి నిర్ణయాన్ని ఊహించని గౌరి విస్మయంగా అడిగింది. ‘‘నా పెళ్లి సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు ప్రతిమ సంగతి చూద్దాం’’ స్థిరంగా చెప్పింది రమ. ‘‘ఎంత గొప్ప మనసే నీది...’’ చెమర్చిన కన్నులతో కూతుర్ని హత్తుకుంటూ అంది గౌరి. నెల తిరిగేకల్లా ఆ ఇంట్లో రెండో అమ్మాయి పెళ్లి వేడుక పూర్తైంది.

* * *

      ‘‘అవున్నాన్నా! ప్రేమించాను. అందుకే అతనితో కలిసి తిరుగుతున్నా!’’ రెండో చెల్లి సుమ ధైర్యానికి ఆశ్చర్యపోయింది రమ. ‘‘సిగ్గులేదే నీకు? ఊరూవాడా విచ్చలవిడిగా ఎవడితోనో తిరుగుతున్నది కాకుండా, ఎంత పొగరుగా సమాధానం చెబుతున్నావ్‌?’’ కోపంగా అరిచాడు రామం.
      ‘‘నాన్నా... ప్రేమించడం క్షమించరాని నేరంలా మాట్లాడకండి. అతను నన్ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగానే ఉన్నాడు. మీరు కాదంటే ఇంట్లోంచి వెళ్లిపోయైనా అతణ్ని చేసుకుంటాను. అతనికేం తక్కువ? బెంగళూర్లో బ్రహ్మాండమైన ఉద్యోగం. లక్షల్లో జీతం. నేనతనికి నచ్చాను. కట్నం కూడా ఆశించడు. మన కులం మాత్రం కాదు, కానీ నాకు మాత్రం ఏ అభ్యంతరమూ లేదు. మీరు మాత్రం చాదస్తంతో నా జీవితం నాశనం చెయ్యకండి. నేను సుఖంగా ఉండాలను కుంటే మా పెళ్లికి ఒప్పుకోవడం ఒక్కటే మీకున్న మార్గం!’’ తెగేసిచెప్పి లోపలి గదిలోకి వెళ్లిపోయింది సుమ. దీంతో కుటుంబ సభ్యులందరూ స్థాణువుల్లా హాల్లో నిల్చుండిపోయారు.
      రామాన్ని ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించి విజయం సాధించింది రమ. ఏడాది పూర్తికాకుండానే ఆ ఇంట్లో మరో అమ్మాయి పెళ్లి కూడా జరిగిపోయింది.

* * *

      రాత్రి పదవుతోంది. హాల్లో కూర్చుని అమ్మానాన్నలతో కలిసి టీవీ చూస్తోంది రమ. ‘‘అనుపమ ఇంకా రాలేదా రమా!’’ రామం అడిగాడు. ‘‘ట్యూషన్‌కి వెళ్లింది కదా! ఆలస్యంగా వదిలారేమో, వస్తుందిలే నాన్నా!’’ తనకూ ఆందోళనగానే ఉన్నా దానిని దాచిపెడుతూ చెప్పింది రమ.
      ‘‘దాని వాలకం చూస్తోంటే అలా అనిపించడం లేదు. సినిమాలూ, షికార్లూ.. అర్ధరాత్రీ, అపరాత్రీ ఇంటికి రావడం ఎక్కువైపోయింది’’ గౌరి మాటల్లో విచారం తొంగిచూసింది.
      ‘‘ఇలా అయితే దాని జీవితం ఏమవుతుందో అని నాకు భయంగా ఉంది రమా. తనూ సుమలా ఎక్కడ ప్రేమలో పడిపోయిందో, పడిపోతుందో’’ దిగులుగా అన్నాడు రామం.
      ‘‘ఇంకా చిన్నతనం పోలేదులే నాన్నా!’’ చెల్లిని సమర్థిస్తూ చెప్పింది రమ. ‘‘ఉదయం నువ్వు ఆఫీసుకు వెళ్లాక నా స్నేహితుడు ప్రసాద్‌ వచ్చాడమ్మా! వాళ్ల అబ్బాయి అమెరికాలో మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడట. అనుపమను వాళ్ల కోడలిగా చేసుకోవాలని అడగడానికి వచ్చాడు. నిజానికి ఆ అబ్బాయి వయసు నీకంటే తక్కువ. లేకపోతే నిన్నే వాళ్లు అడిగేవాళ్లేమో’’ సంజాయిషీ ఇస్తూ అసలు విషయం బయటపెట్టాడు రామం.
      ‘‘ఓహో అదా సంగతి! అయితే చెల్లి పెళ్లి కూడా చేసెయ్యండి నాన్నా! మీ బాధ్యతలన్నీ తీరిపోతాయి కదా! నేను ఉద్యోగంలో చేరి అయిదేళ్లు దాటుతోంది కాబట్టి ఏదో ఒక అప్పు మా ఆఫీసు వాళ్లివ్వకుండాపోరు. పెళ్లి ఖర్చుల విషయంలో బెంగ పడాల్సిన అవసరం ఉండదు’’ తన సమ్మతి తెలియచేసింది రమ.
      ‘‘కానీ నిన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాం’’ అన్నాడు రామం. ‘‘నాకు అలవాటై పోయిందిలే నాన్నా! నిద్రొస్తోంది పడుకుంటాను’’ నిర్లిప్తంగా చెప్పి లోపలికి వెళ్లిపోయింది రమ.

* * *

      అనుపమ పెళ్లయి మూడేళ్లవుతోంది.
      ఓ ఆదివారం మధ్యాహ్నం... సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. అంతకన్నా ఎక్కువగా నిప్పులు చెరుగుతూ ఇంట్లోకి వచ్చి ‘‘రమా!’’ అంటూ కేక పెట్టాడు రామం.
      ‘‘ఏమైందండీ?’’ భర్తను అంత కోపంలో ఎప్పుడూ చూడని గౌరి కంగారు పడుతూ అడిగింది. ‘‘ఇంకా ఏమవ్వాలే...? మన పరువంతా గంగలో కలిసిపోయిందే.. ఏమైందో దాన్నే అడుగు...’’ కట్టలు తెంచుకున్న ఆవేశంతో ఎదురుగా వచ్చిన రమ వైపు చూస్తూ అరిచాడు రామం.
      ‘‘ఏంటండీ మీరు అంటున్నది? ఏమయిందే రమా?’’ అయోమయంగా, ఆదుర్దాగా ప్రశ్నించింది గౌరి.
      ‘‘ఏమవ్వాలే ఈ ఇంటికి దేవత అనుకున్న కూతురు చెప్పుకోవడానికి కూడా వీల్లేని నీచానికి దిగజారిపోయిందే! ఎదురుగానే ఉందిగా, దాన్నే అడుగు... దాని నిర్వాకమంతా దానిపాపిష్ఠి నోటితోనే చెప్పమను’’ అరిచాడు రామం.
      ‘‘ఏమైంది రమా? ఏం చేశావే?’’ నీళ్లు నిండిన కళ్లతో అడిగింది గౌరి. ‘‘నేను చెప్తాలే అమ్మా! ఏమైంది నాన్నా? కిషోర్‌ గురించేనా మీరు మాట్లాడుతోంది?’’
      ‘‘ఇన్నాళ్లూ నువ్వు గొప్ప త్యాగం చేసి.. మమ్మల్ని కంటికి రెప్పలుగా కాపాడుతున్నావని మురిసిపోయామే. పెళ్లి కూడా చేసుకోకుండా ఇందుకే ఇలా ఉండిపోయావని ఇప్పుడు అర్థం అవుతోందే మాకు’’ రామం ఆవేశం చల్లారడం లేదు.
      ‘‘నాకేం అర్థం కావడంలేదు. అసలేమయిందో చెప్పండి’’ వాడిపోయిన ముఖంతో అడిగింది గౌరి. ‘‘నీ కూతురు వాడెవడితోనో కులుకుతోందే. ఇన్నాళ్లూ ఇది చెల్లెళ్ల పెళ్లిళ్లు చేసి తను అలానే ఉండిపోయిందని జాలి పడుతూ వచ్చాం. కానీ ఇది అంత అమాయకురాలు కాదే! మన పరువు మొత్తం బజారుకీడ్చిన బజారు బతుకే దీనిది!’’ కోపంలో రామం గొంతు బొంగురుపోతోంది.
      ‘‘అలా అనకండి. నా కూతురు అలాంటిది కాదు’’ నిర్విణ్నురాలైన గౌరి క్షణాల్లో తేరుకుని అంది. ‘‘ఒక్కసారి ఊళ్లోకి వెళ్లి అడగవే. లోకమంతా కోడై కూస్తోంది. నీ కూతురి నిర్వాకాన్ని’’ నిప్పులుకక్కాడు రామం. గౌరి తెల్లబోయింది. నమ్మలేనట్లు చూస్తూ కూతురి వైపు ప్రశ్నార్థకంగా తల తిప్పింది.
      ‘‘ఎందుకు నాన్నా అంత గొంతు చించుకుంటున్నారు? నేను చేసింది పెద్ద తప్పని నాకనిపించడంలేదు’’ రమ స్వరంలో ధైర్యం కనపడింది.
      ‘‘చూశావా? దీనికి ఇది చేసిన పనిలో ఏ మాత్రం తప్పు కనపడ్డంలేదట! సిగ్గుమాలిన పనులన్నీ చేస్తూ నిస్సిగ్గుగా ఎలా చెబుతోందో చూడు’’ రామం కోపం తారస్థాయికి చేరింది.
      ‘‘అసలేమయిందండీ?’’ గౌరి గొంతులో అసహనం వ్యక్తం అయింది. ‘‘చివరకు నా నోటితో నేను ఆ పాపాన్ని చెప్పాల్సి వస్తోంది. నా ఖర్మకాక మరేంటి చెప్పు? నీ నిప్పులాంటి కూతురు కొత్తపేటలో ఎవడితోనో కులుకుతోంది’’ ఒక్కొక్క మాటా కసిగా ఒత్తి చెప్పాడు రామం.
      ‘‘నిజమే నాన్నా. మీకలా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ అనుపమ పెళ్లయి ఎన్నాళ్లయింది నాన్నా?’’ సాధ్యమైనంత శాంతంగా అడిగింది రమ.
      ఇప్పుడా విషయం ఎందుకన్నట్టు చూస్తూ ‘‘మూడేళ్లు’’ అన్నాడు రామం.
      ‘‘మరి ఈ మూడేళ్లలో మీ పెద్దకూతురి పెళ్లి చెయ్యాలన్న బాధ్యత మీకు గుర్తుకు రాలేదేం నాన్నా?’’ సూటిగా ప్రశ్నించింది రమ. ‘‘నా అసహాయతను ఆసరాగా చేసుకుని అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నావా?’’ అక్కసుగా అడిగాడు రామం.
      ‘‘పక్కదోవ కాదు నాన్నా! ముగ్గురు చెల్లెళ్ల బాధ్యతనూ తీసుకుని వాళ్ల పెళ్లిళ్లు చెయ్యడానికి చెయ్యాల్సిందంతా చేశాను. కానీ ప్రతిగా మీరు నాకేం చేశారు నాన్నా? తండ్రిగా మీ బాధ్యత  నెరవేర్చారా?’’ ప్రశ్నల వర్షం కురిపించింది రమ.
      ఊహించని పరిణామానికి తెల్లబోయాడు రామం. అంతలోనే తన తత్తరపాటును కప్పిపుచ్చుకుంటూ అన్నాడు
      ‘‘అందుకని మంచీ చెడూ విచక్షణ లేకుండా నీ సుఖం నువ్వు చూసుకుంటావా? ఆడపిల్లకు అణకువ ఉండాలన్న దానికి కూడా నువ్వు విలువనివ్వవా? బాధ్యత గురించి నువ్వు నాకు గుర్తు చెయ్యాల్సిన పనిలేదు. నా తలరాత బాగుండి వ్యాపారం సజావుగా సాగి ఉంటే... ఈ రోజు నీతో మాటపడాల్సిన అవసరమే లేకుండేది’’
      ‘‘లేదు నాన్నా! మీ బాధ్యతను మీరు మరిచిపోయి చాలా కాలమే అయింది. ఎంతసేపూ చెల్లెళ్లకు పెళ్లి చేసి బయటికి  పంపేద్దామని చూశారే కానీ నా పెళ్లి చేసే ఉద్దేశం మీరు ఎప్పుడో వదిలేశారు’’ రమ కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి.
      ‘‘అవేం మాటలే? మాకు మాత్రం నీకు పెళ్లి చేసి పంపాలని ఉండదా?’’ గౌరి మాటల్లోనూ కూతురిపై ఆగ్రహం తొంగి చూస్తోంది. తల్లి మాటలకు తల అడ్డంగా ఊపుతూ చెప్పింది రమ ‘‘లేదమ్మా! నేనూ  చాలాకాలం అలాగే అనుకుంటూ వచ్చాను. ఆ రోజు రాత్రి అనుపమ పెళ్లి చేసేద్దాం అని నేను మీతో చెప్పి నిద్రపోవడానికి లోపలికొచ్చాక ఏమైందో నాకింకా గుర్తుంది’’

* * *

      ‘‘పోనీలెండి! చాకచక్యంగానే ఒప్పించారు రమను!’’ భర్తతో అంది గౌరి.
      ‘‘మరేం చేస్తానే? అనుపమ ఒక్కతే పెళ్లికి మిగిలింది. అనుకోకుండా వెతుక్కుంటూ వచ్చిన సంబంధం. పైగా బాల్యమిత్రుడి కొడుకు, అమెరికాలో ఉద్యోగం. ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? వెయ్యి అబద్ధాలు ఆడన్నా ఓ పెళ్లి చెయ్యమన్నారు. అందుకే రమతో అలా అబద్ధం చెప్పాను.       నిజానికి పెళ్లి కొడుకుది రమ వయసే. అందుకే ప్రసాద్‌ కూడా ముందు రమను కోడలిగా అడిగేందుకే మనింటికొచ్చాడు. కానీ రమకు కూడా పెళ్లి చేసేస్తే అనుపమ పెళ్లి ఎలా అవుతుంది? ఇప్పటిదాకా పెళ్లిళ్లయిన పిల్లల పురుళ్లూ, పెట్టుపోతలూ ఎవరు చూస్తారు? నాకా ఏ సంపాదనా లేదు. రమ ఉద్యోగమే మన జీవనాధారం. మరో నాలుగైదేళ్లు గడిస్తే రమకు ముప్ఫై ఏళ్లు దాటేస్తాయి. దానికి అప్పుడు ఎలానూ పెళ్లి కాదు. జీవితాంతం మనతోనే ఉండిపోతుంది’’ తాపీగా చెప్పాడు రామం.
      భర్త మాటలకు నివ్వెరపోయింది గౌరి. కానీ ఆయన చెప్పినవన్నీ కూడా ఆమెకు సబబుగానే తోచాయి. బహుశా స్వార్థం తల్లిదండ్రుల బాధ్యతను కూడా మరిపింపచేస్తుందేమో! ‘‘మీ ఇష్టం! మీకెలా మంచిదనిపిస్తే అలానే చేయండి’’ తప్పును భర్తవైపుకు తోసేస్తూ చెప్పింది గౌరి.
నిద్రపట్టక అటూ ఇటూ దొర్లుతున్న రమకు ఈ మాటలు నెత్తిమీద పిడుగులు పడ్డట్టే అనిపించాయి. దిండులో ముఖం దాచుకుని వెక్కివెక్కి ఏడుస్తోంది. ఆమెకు ఆ రాత్రి పీడకలగా మిగిలింది. 

* * *

      రమ గుర్తు చేసిన విషయాన్ని విని ఉలిక్కిపడ్డారు రామం, గౌరి. కూతురు ఎదురుగా దోషులై నిలబడాల్సి రావడం వాళ్లిద్దరికీ అవమానకరంగా, భరించరానిదిగా ఉంది.
      ‘‘నిజమే నాన్నా! మీరు అనుకుంటున్నట్టుగా నాకు తెలిసి ఉండవలసిన విషయం కాదు ఇది. కానీ నేను నిద్రపోయానన్న ధీమాతో మీరు అలా అన్నారు. అమ్మ కూడా దానికి అడ్డు చెప్పకుండా వత్తాసు పలికింది. నా పెళ్లి గురించి మీరు ఇన్ని వ్యతిరేక ఆలోచనలు చేసినా, మీ స్వార్థం మీరు చూసుకోవాలని అనుకుంటున్నట్టు తెలిసినా మీరు ఎక్కడికీ కదలలేరనీ, ఏ సంపాదనా లేదనీ, నేను కూడా మిమ్మల్ని వదిలేస్తే మీరు ఏమైపోతారో అన్న ఆలోచనతో మీ దగ్గరే ఉండిపోయా! మీ ఇద్దరికీ ఎంత గౌరవం ఇచ్చానో అదంతా పోయేటట్టుగా ఎందుకు అలా ప్రవర్తించారు?
      ‘‘నేనూ మనిషినే కదా? నాకూ ఎన్నో కలలూ, కోరికలూ ఉంటాయన్న విషయాన్ని మీరెలా మరిచిపోయారు నాన్నా? నిజానికి కిషోర్‌ నన్ను ప్రేమిస్తున్నానని నాలుగేళ్ల నుంచి అడుగుతున్నాడు. అతను నా సహోద్యోగే కాదు, ఎన్నో విషయాల్లో నాకు సాయం చేసిన మంచి స్నేహితుడు కూడా!
మీరు అనుకుంటున్నట్టుగా నేను అతనితో సరదాలు తీర్చుకోవడంలేదు నాన్నా! మా ఇద్దరికీ రిజిస్ట్టర్‌ మ్యారేజ్‌ అయి రెండేళ్లవుతోంది. మీరు నా పెళ్లి ప్రసక్తి తీసుకొస్తారని, అప్పుడు కిషోర్‌ విషయం మీతో చెప్పాలని ఎంతగానో ఎదురుచూశాను, ఆశపడ్డాను. అయినా ఇన్నాళ్లూ మీ బాధ్యత మీకు       గుర్తు రాలేదు. ఈ రెండేళ్లూ పెళ్లయి కూడా కిషోర్‌ దగ్గర గడపకుండా మీతోనే ఉండిపోయింది కేవలం మీ కోసమే. కానీ నాకు వెళ్లిపోయే సమయం వచ్చేసింది. నా భర్త దగ్గరకు వెళ్లిపోవాలి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను వెళ్లిపోతున్నా. మిమ్మల్నెవరు చూస్తారని మీరేమీ భయపడకండి నాన్నా! మీ జీవితాంతం మిమ్మల్ని పోషించే బాధ్యత నాతోపాటు కిషోర్‌ కూడా తీసుకుంటానని హామీ ఇచ్చాకే పెళ్లి చేసుకున్నాను. నిర్భయంగా మీ ఇద్దరూ ఇక్కడే ఉండండి. మీకేలోటూ రాకుండా చూసుకునే బాధ్యత మాది. మీరేం చేసినా ఎలా ఉన్నా అమ్మానాన్నలు కదా! కానీ, అమ్మా! కనీసం ఒక ఆడదానిగానైనా నా మీద జాలి కలగలేదా? ఇప్పుడెందుకమ్మా ఏడుస్తున్నావు? సరే అవసరమైతే ఫోన్‌ చెయ్యండి. చెయ్యకపోయినా మిమ్మల్ని చూసేందుకు తప్పకుండా వస్తూనే ఉంటాను. నా బాధ్యతను నేనెప్పుడూ మర్చిపోను’’
      ఆవేశంగా, ఆవేదనగా చెప్పదలు చుకున్న నాలుగూ చెప్పి ఆ ఇంటి గడపదాటింది రమ.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


వాళ్లు ఏడ్చారు!

వాళ్లు ఏడ్చారు!

పి.చంద్రశేఖర అజాద్‌


స్వ‌యంవ‌ధూ...!?

స్వ‌యంవ‌ధూ...!?

దోరవేటి, (వి.చెన్నయ్య)


సువర్ణ గన్నేరు పూలు

సువర్ణ గన్నేరు పూలు

ప్రసాదమూర్తి


స‌మిధ‌

స‌మిధ‌

సయ్యద్‌ సలీం


అతడూ మనిషే!

అతడూ మనిషే!

పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


దాసరి పాట (క‌థాపారిజాతం)

దాసరి పాట (క‌థాపారిజాతం)

చింతా దీక్షితులుbal bharatam