ఎక్కడికి ఈ పయనం...

  • 866 Views
  • 10Likes
  • Like
  • Article Share

    సువ‌ర్ణ మారెళ్ళ

  • బెంగ‌ళూరు
  • 8310347974
సువ‌ర్ణ మారెళ్ళ

వాళ్లిద్దరివీ ఒకేలాంటి ఆలోచనలు. వాటిలో పెద్దలు కనిపించరు. కానీ వాళ్ల కుటుంబాల్లో సంస్కారం ఉట్టిపడుతుంది. ఆ ఇద్దరికీ పెళ్లిచూపులు జరిగాయి. అవి వారిలో పెద్ద మార్పునకి నాందీ పలికాయి! అదెలా!?
ఉదయం
తొమ్మిదిన్నర కావస్తోంది. రోజూలాగే రామారావు పూజ, టిఫిన్‌ పూర్తి చేసుకుని న్యూస్‌ పేపర్‌ పట్టుకుని వసారాలో ఉన్న పడక కుర్చీలో కూర్చున్నాడు. శ్యామలమ్మ ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి లలితా సహస్రం వింటూ, మధ్య మధ్యలో గొంతు కలుపుతూ హాల్‌కి మధ్యలో ఉన్న టేకు ఉయ్యాల మంచం మీద కూర్చుని మధ్యాహ్నం వంటలోకి గోరు చిక్కుడుకాయలు గిల్లుకుంటోంది. అంతలో హాల్లో ఒక మూల ఉన్న కార్డ్‌లెస్‌ ల్యాండ్‌లైన్‌ ఫోను గట్టిగా మోగడం మొదలుపెట్టింది.
      ‘‘ఏమోయ్‌! ఫోన్‌ మోగుతోంది. తీస్తున్నావా లేదా?’’ పిలిచాడు రామారావు.
      ‘‘ఆ తీస్తున్నా! ఈ మోకాళ్ల నొప్పితో పరుగులు పెట్టలేనుగా. వెళ్తున్నాను’’ సమాధానం చెప్పి ఫోన్‌ దగ్గరికి చేరేలోపల దాని మోత ఆగిపోయింది.
      ‘‘సెల్‌ఫోన్‌ కొనుక్కోమంటే అదేదో మహమ్మారి అయినట్టు భయపడిపోతావు. పోనీ నీ ముద్దుల తమ్ముడు కొనిచ్చిన ఆ కార్డ్‌లెస్‌ ఫోన్‌ అయినా పక్కన పెట్టుకోవచ్చు కదా!’’ విసుక్కున్నాడు రామారావు. ఆ లోపు మళ్లీ ఫోన్‌ మోగడంతో లిఫ్ట్‌ చేసి మాట్లాడుతూ వచ్చి ఉయ్యాల్లో కూర్చుంది శ్యామలమ్మ.
      ఒక పావుగంట ఫోన్లో మాట్లాడి పెట్టేసిన తర్వాత, ‘‘మీ తమ్ముడా ఫోన్‌లో. ఏమంటాడు?’’ అంటూ పేపరు పక్కన పెట్టి హాల్లోకొచ్చి ఉయ్యాలకి ఎదురుగా దివాన్‌ మీద కూర్చుని ఆమె వైపు చూశాడు. ఆమె ముఖంలో ఆనందం, ఆందోళన మిళితమైన హావభావాలను చూస్తూ మళ్లీ అదే ప్రశ్న వేశాడు రామారావు.
      ‘‘ఆ, పెద్ద విశేషమే. వాడి కూతురు శ్రావ్యకి వచ్చే ఆదివారం పెళ్లి చూపులట. పిల్లాడు అన్ని విధాలా శ్రావ్యకు తగ్గవాడట. ఆ కుటుంబం కూడా వీళ్లకు సమ స్థాయిలోనే ఉందట. అందరికీ నచ్చితే ఈ వారంలోనే తాంబూలాలు తీసేసుకోవాలని అనుకుంటున్నారట. మాకు పెద్దదిక్కు మీరే కదా! వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని అడుగుతున్నాడు. అప్పుడే తత్కాల్‌లో టికెట్‌ తీయడానికి సిద్ధం అయిపోయాడు’’ చెప్పి ఒక్క నిట్టూర్పు వదిలింది శ్యామలమ్మ.
      ‘‘మంచి విషయమే కదా! దానికలా బాధగా పెట్టావెందుకు ముఖం, ముద్దుల మేనకోడలు పెళ్లంటే ఎగిరి గంతెయ్యాలి గానీ’’ అన్నాడు రామారావు.
      ‘‘దానికి పెళ్లంటే నాకు కూడా ఆనందమే. పైగా నాకు విలువ ఇచ్చి వాడు రమ్మనడం ఇంకా మహదానందంగా ఉంది. కానీ నా బెంగంతా మీ గురించే! మీకు బైపాస్‌ సర్జరీ అయ్యి పట్టుమని మూడు నెలలు కూడా కాలేదు. ఇప్పుడంత దూరాభారం ప్రయాణం అంటే వెన్నులో వణుకు పుడుతోంది’’ అంది, ఒకింత బెంగ ధ్వనించేలా!!

*  *  *

      గంట ముందే రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు వాళ్లిద్దరూ. పోర్టర్‌ని మాట్లాడుకుని, వాళ్ల రైలు వచ్చే ప్లాట్‌ఫాంకి మెల్లిగా చేరుకునేటప్పటికి ఇంకో అరగంట పట్టింది. మరోసారి టికెట్‌ చూసుకుని తాము ఎక్కాల్సిన బోగీ ఎక్కడ వస్తుందో ఒకరిద్దరిని వాకబు చేసి అక్కడికి చేరి ఒక బెంచీ మీద హమ్మయ్య అనుకుని కూలబడ్డారు.
      పట్టుమని పావుగంట గడిచిందో లేదో, వాళ్లు ఎక్కాల్సిన రైలు గురించి ప్రకటన వినిపించింది. అక్కడున్న బోర్డుల్లో బోగీ నంబర్లు ఎర్ర రంగులో ప్రత్యక్షం అయ్యాయి. వాటిని చూడగానే పట్టాల మీద పరుగులు పెట్టాల్సిన రైలు వాళ్ల గుండెల్లో వచ్చినట్లయ్యింది!
      వాళ్లున్న స్థలానికి వ్యతిరేక దిశలో ఎక్కడో చూపిస్తోంది వాళ్లు ఎక్కాల్సిన బోగీ నంబరు. 
      బరువులు పెద్దగా లేకపోయినా, ఆ కాస్త లగేజీనీ కూడా మోయలేని వాళ్ల వయసుకి, ఆరోగ్య పరిస్థితికి తలొగ్గి ‘‘బండి వచ్చాక వస్తానమ్మా!’’ అని బ్యాగులు అక్కడ పెట్టి వెళ్లిపోయిన కూలీ రాక కోసం దీన వదనాలతో నిస్సహాయతగా ఎదురు చూశారు.
      ఎట్టకేలకు ఎన్నో ప్రయాసలు పడి రైలెక్కి వారి సీట్ల దగ్గరికి చేరుకున్నారు. లగేజీని బోగీలో వదిలేసి, అప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ముందుకు కదిలిన రైల్లోంచి ఒక్క ఉదుటన దిగిపోయాడు పోర్టర్‌. 
      అంత హైరానా పడి రైలెక్కడం వల్ల అసలే హార్ట్‌ పేషెంట్‌ అయిన రామారావుకి ఆయాసం బాగా వచ్చేసింది. ఒక మాత్ర నాలిక కింద పెట్టుకుని సీట్లో చతికలబడ్డారు. బోగీలో చుట్టుపక్కల వాళ్లని చూసి పంటి బిగువున ఆయాసం ఆపుకునే ప్రయత్నం చేయడంతో నోటి నుంచి వింతైన శబ్దం వస్తోంది.
      అదే సమయంలో ఏసీ బోగీ తలుపు కిర్రుమని తెరచుకుని ఒక్కసారిగా సిగరెట్‌ పొగ వాసన గుప్పుమని వచ్చింది. ఒక పాతికేళ్ల యువకుడు తొడలు కనిపించేలా లాగు వేసుకుని, స్లీవ్‌లెస్‌ టీషర్టు తొడుక్కుని చూయింగ్‌ గమ్‌ నములుతూ లోపలికొచ్చాడు. రావడంతోనే అతను సైడ్‌ బెెర్త్‌ సీటులో కూర్చున్న ఆ దంపతుల వైపు భ్రుకుటి ముడిపడేలా ఆ సీటు తనదన్నట్టు చూసి, లెమ్మన్నట్టు సైగ చేశాడు. 
      శ్యామలమ్మ ఏదో చెప్పేంతలో ‘‘ప్రతి వాడికీ ఈ సైడ్‌ బెెర్తే కావాలి. మూడు నెలల ముందు రిజర్వ్‌ చేయించుకున్నది ఎవరు పడితే వారికి దానం చెయ్యడానికా’’ అని గొణుక్కున్నాడు. అది విన్న శ్యామలమ్మకు మనసు చివుక్కుమంది. వెంటనే లేచి పక్క సీట్లో కూర్చుంది. ఇంకా ఆయాసం వస్తూండటంతో రామారావు అదే సీట్లో ఒక పక్కకి ఒద్దికగా కూర్చున్నాడు. ఇయర్‌ ఫోన్లు చెవిలో పెట్టుకుని, ఫోనుకి ఛార్జింగ్‌ పెట్టి ముప్పావు వంతు సీటులో కాళ్లు ఇంచుమించు రామారావుకి తగిలాయా అన్నట్టు కూర్చున్నాడా యువకుడు.
      అయిదు నిమిషాలయ్యాక ఆ యువకుడు, ఆయాసం ఆపుకోలేక నోటితో శబ్దం చేస్తున్న రామారావు వైపు కోపంగా చూసి, శ్యామలమ్మ వైపు తిరిగి ‘‘ఈయన ఇందాక నుంచి గ్యాస్‌  వదులుతున్నారు. ఇది ఏసీ అని తెలీదా? ఆయన్ని బయటికి వెళ్లి ఆ పని చెయ్యమనండి’’ అన్నాడు కాస్త కరుకైన గొంతుతో.
      అతడి మాటలకు శ్యామలమ్మ, రామారావులతో పాటు ఆ వృద్ధ దంపతులు రైలెక్కడానికి పడిన పాట్లును ప్రత్యక్షంగా చూసిన మిగతా వాళ్లు కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
      శ్యామలమ్మ తేరుకుని, ‘బాబూ! నువ్వనుకున్నట్టు ఏమీలేదు. ఆయనకు ఈ మధ్య బైౖపాస్‌ సర్జరీ జరిగింది. హడావుడిగా రైలెక్కడం వల్ల ఆయాసం వస్తోందంతే’’ అని చెప్పి తల కిందకి వంచుకుంది, అందరి ముందూ అతనలా అనడం అవమానంగా భావించి.
      తత్కాల్‌లో టికెట్‌ రిజర్వ్‌ చేయడం వల్ల వారిద్దరికీ మిడిల్‌ బెెర్తులు వచ్చాయి. అక్కడ లోయర్‌ బెర్తు వచ్చిన వాళ్లు వృద్ధులు, ఒక చంటి పిల్ల తల్లి. వాళ్లని అడగటానికి అవకాశం లేదు. ఇక మిగిలింది సైడ్‌ బెర్త్‌ మీద ఉన్న ఆ అబ్బాయి. అతణ్ని అడిగే అవకాశం ఇవ్వట్లేదు.
      వాళ్ల అసహాయత చూసి జాలనిపించిందేమో, ఆ చంటి పిల్ల తల్లి తన లోయర్‌ బెెర్తు వారికిచ్చింది. ఇద్దరూ మిడిల్‌ బెర్త్‌ ఎక్కలేరు కాబట్టి తెల్లార్లూ ఆ ఒక్క సీటు మీదే వంతుల వారీగా పడుకున్నారు. స్టేషన్‌కి ఆమె తమ్ముడు కొడుకు వచ్చి జాగ్రత్తగా ఇంటికి చేర్చడంతో పీడ కల లాంటి ఆ రైలు ప్రయాణం ముగిసింది.

*  *  *

      టిఫిన్‌ తిని, కాసేపు విశ్రాంతి తీసుకునేటప్పటికి శ్రావ్య బ్యూటీపార్లర్‌ నుంచి వచ్చింది. రావడంతోటే శ్యామలమ్మను చూసి ‘‘అత్తా!..’’ అంటూ కూర్చుని ఉన్న ఆమెని వెనుక నుంచి అభిమానంగా హత్తుకుంది. కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నాక పక్కింట్లో కాపురముంటున్న అమ్మాయి వచ్చింది. 
      వారి మాటల్లో తర్వాతి రోజు జరగబోయే పెళ్లిచూపులు గురించి చర్చ వచ్చింది. వయసులో శ్రావ్య కంటే నాలుగయిదేళ్లు పెద్దదేేమో ఆ అమ్మాయి. 
      ‘‘అన్నట్టూ శ్రావ్యా! పెళ్లికొడుకు ఎలా ఉంటాడు? ఫొటో చూశావు కదా, నీకు నచ్చాడా?’’ సరదాగా ఆటపట్టించడానికన్నట్టు అడిగింది. 
      ‘‘నచ్చాడక్కా! చాలా స్మార్ట్‌గా, స్టైలిష్‌గా ఉన్నాడు. మంచి ఉద్యోగం, సింగపూర్‌లో సెటిల్‌ అయిపోతాడట’’ అంది శ్రావ్య. 
      ‘‘అందం, ఆస్తి అన్నీ మనం ముందుగా చూడగలంగానీ, సిగరెట్లు లాంటి చెడు అలవాట్లుంటే ఎలా తెలుస్తుంది. ఏ అలవాట్లూ లేనివాడు రావాలని ఆ దేవుణ్ని కోరుకోవడమే’’ అంది.
      ‘‘వాటి గురించి పెద్దగా పట్టించుకోవాలా అక్కా! అబ్బాయి అందంగా ఉన్నాడు. సింగపూర్‌లో సెటిల్‌ అవుతానంటున్నాడు. పైగా అతడి అన్నయ్య ఇక్కడే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. కాబట్టి వాళ్ల అమ్మానాన్నల బాధ్యత మాకు ఉండే అవకాశం లేదు. పైగా వాళ్లూ మంచి ఉద్యోగాలు చేసి రిటైర్‌ అయినవాళ్లే కాబట్టి భవిష్యత్తులో వాళ్లకి ఏవైనా ఆరోగ్య సమస్యలొచ్చినా ఆ ఖర్చు మా వరకూ రాదు. అయినదానికీ కానిదానికీ అలగడానికి ఆడపడుచులు కూడా లేరు. ఇంతకన్నా ఇంకేం కావాలి?’’ అంటూ తిరిగి ప్రశ్న వేసింది.
      అప్పుడే అక్కడికొచ్చిన శ్రావ్య అమ్మ అదంతా విని ‘‘ఆ వాగుడు ఆపి, వెళ్లి రేపు వేసుకోబోయే డ్రెస్సు చూసుకో’’ అని గద్దించింది.
      ‘‘ఇంత అవగాహన ఉన్న నీకు ఇక చెప్పేదేముందిలే. సరే, మా ఆయనకు భోజనం పెట్టాలి.  వస్తాను’’ అని పక్కింటి అమ్మాయి వెళ్లిపోయింది. 
      ఆ మాటలు విన్న శ్యామలమ్మ ఆలోచనలో పడింది. ‘చిన్న ప్రాయంలో అవగాహన లేకుండా పెళ్లి చేసుకున్న మా తరం పడిన ఇబ్బందులు సామాన్యమైనవి కాదు నిజమే, కానీ మరీ ఇంత ఎక్కువ లెక్కలతో పెళ్లి చేసుకుంటే మాత్రం ఆ బంధం స్వచ్ఛంగా ఉంటుందా?’ అలా ఆమె ఆలోచనలు సాగుతుండగా తమ్ముడు పిలుపుతో ఈ లోకంలోకొచ్చింది.
      మర్నాడు సాయంత్రం పెళ్లిచూపుల తంతు మొదలైంది. అందరూ పెళ్లివారి కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్లివారి కారు గుమ్మంలో ఆగింది. శ్యామలమ్మ, ఆమె తమ్ముడు, అతని భార్య వాళ్లకి ఎదురెళ్లారు. 
      ఆ పెళ్లి కొడుకు అమ్మ వెంటనే శ్యామలమ్మను పోల్చుకుని విప్పారిన వదనంతో ఆమెను అమాంతంగా కౌగిలించుకుని ‘‘గుర్తుపట్టారా అమ్మా? నేను ఆరోజు రైల్లో అస్వస్థతకి గురైతే మీరే సొంత మనిషిలా అన్ని సపర్యలు చేసి నన్ను ఆదుకున్నారు. మీరు నన్ను మర్చిపోయినా, నేను మిమ్మల్ని మర్చిపోలేను. మర్చిపోతే నా అంత కృతఘ్నురాలు మరొకరు ఉండరు. నేనెవరో తెలియకపోయినా అంత చేశారంటే నిజంగా మీరు..’’ అంటూ చేతులెత్తి నమస్కరించి, ఆ సందర్భం తలచుకుని కన్నీటి పర్యంతం అయిపోయింది.
      లోపలికెళ్లి మాట్లాడుకుందాం అన్న మిగతావారి మాటలకు ఆమెను అలాగే పొదివి పట్టుకుని లోపలికి నడిచిందావిడ. లోపలికి వెళ్లాక కొడుక్కి శ్యామలమ్మని పరిచయం చేస్తూ ‘‘ఒరేయ్‌ చరణ్‌! నీకు గుర్తుందా. కొన్ని రోజుల కిందట రైల్లో షుగర్‌ డౌన్‌ అయ్యి నేను చావుదాకా వెళ్లినప్పుడు నన్ను ఒక దంపతులు ఆదుకున్నారని చెప్పాను కదా. వాళ్లే వీళ్లు’’ అంటూ చూపించింది. 
      ఆ పెళ్లికొడుక్కి శ్యామలమ్మని చూసి ఒక్కసారిగా గుండె ఆగినంత పనయ్యింది. ముందురోజు రైల్లో తనతో పాటు ప్రయాణించింది వాళ్లే అని పోల్చుకున్నాడు. పలకరింపుగా చిన్న నవ్వు నవ్వి, ఆమె కళ్లలో కళ్లు పెట్టి చూసే ధైర్యం లేక తల దించుకుని కూర్చున్నాడు. శ్యామలమ్మ కూడా ఒక నవ్వు నవ్వి, తనకేమీ తెలియనట్లే ఉండిపోయింది. 
      పెళ్లి చూపుల తంతు పూర్తయ్యాక ఆమె శ్రావ్యను దగ్గరికి తీసుకుని శ్యామలమ్మ వైపు చూస్తూ, ‘‘అందం, చదువు కలబోసిన పుత్తడి బొమ్మ. పైగా మీ మేనకోడలు. మీ కుటుంబం నుంచి అమ్మాయిని కోడలిగా తెచ్చుకోవడానికి ఎవరైనా పెట్టిపుట్టాలి. ఫొటో చూడగానే వాడికి అమ్మాయి నచ్చేసింది.       మీకు ఏ అభ్యంతరం లేకపోతే మాకు ఈ సంబంధం సమ్మతమే. మీరు ఆలోచించుకుని మాకు ఆ అదృష్టం ఉందో లేదో సాధ్యమైనంత త్వరగా తెలియజేయండి’’ అని చెప్పి వెళ్లియారు. 
      ఆ మాటలు కావ్య మనసులో ముల్లులా గుచ్చుకున్నాయి. కిందటి రోజు తన వికృత ఆలోచనకి సిగ్గుతో తల దించుకుంది.

*  *  *

      భోజనాలు అయిపోయాక శ్యామలమ్మ, రామారావు దంపతులు వారి రూంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. రామారావు శ్యామలమ్మ వైపు సాలోచనగా చూస్తూ ‘‘ఆ అబ్బాయి ప్రవర్తన నిన్న చూశాం కదా! నీ తమ్ముడు ఈ పెళ్లి నిర్ణయాన్ని నీకే వదిలేశాడు! మరేం చేస్తావు? ఆ అబ్బాయి సంగతి వారికి చెప్పి ఈ సంబంధం కుదుర్చుకోకపోవడమే మంచిదేమో అనిపిస్తోంది’’ అన్నాడు.
      అదే నేనూ ఆలోచిస్తున్నాను. ‘‘మంచి కుటుంబం. ఇంతకన్నా మంచి సంబంధం వస్తుందనుకోలేం. కానీ, మన కావ్య ఆలోచనలు నిన్న విన్నారు కదా! పెద్దల్ని వారి ఖర్మకి వాళ్లని వదిలేసిన తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన పిల్లలు అలా అలాచిస్తే వేరు. కానీ, మొన్న మొన్నటి దాకా తన అమ్మానాన్నల్ని కంటికి రెప్పలా చూసుకున్న, ఇప్పుడు కూడా ఆడపడుచుగా నా అభిప్రాయాలకు విలువ ఇస్తున్న మా తమ్ముడు, మరదలి పెంపకంలో పెరిగిన శ్రావ్యకి అత్తమామలు అడ్డుగా అనిపించడం కాస్త వింతే. ఇక అతని కుటుంబం విషయానికొస్తే, తొంభై ఏళ్లు పైబడిన అతడి బామ్మను పెళ్లి చూపులకు తీసుకొచ్చారు. దాన్నిబట్టే ఆ కుటుంబం పెద్దలకు ఎంత విలువిస్తుందో అర్థమవుతోంది. అయినా నిన్న రైల్లో అతడి ప్రవర్తన దురుసుగా ఉంది. మన శ్రావ్యా, అతనూ అలా తయారవడంలో లోపం ఎక్కడుందో అర్థంకావట్లేదు. దొందూ దొందే. ఒకవేళ ఆ కారణం చూపించి ఈ సంబంధం వదిలేద్దాం అన్నా అర్థం చేసుకునే పరిణతి ఆ ఇద్దరికీ లేదు’’ అంటూ నిట్టూర్చింది శ్యామలమ్మ.
      రామారావు కూడా అవునన్నట్టు తల పంకించి ‘‘నిజమే. పదిహేనేళ్ల ప్రాయంలో చదువుల నిమిత్తం తల్లిదండ్రుల నుంచి దూరమై పట్టుమని పాతికేళ్లు నిండకుండానే లక్షల జీతాలతో తిరిగొస్తున్నారు. వారికి అవసరమైన సమయంలో మనం సూచనలు అందించలేకపోతున్నాం. తర్వాత ఇద్దామనుకున్నా సంపాదనాపరులుగా వారు వారి చుట్టూ ఏర్పరచుకున్న కవచం మన సూచనలు వారి మనసుకు చేరనివ్వకుండా చేస్తోంది. అది పెంపకంలో చిన్న లోపమే కానీ దిద్దుకోలేనంత తప్పిదం కాకపోవచ్చు’’ అని ఆపాడు.
      గుమ్మం దగ్గర నిలబడి అంతా వింటున్న శ్రావ్య ఒక్కసారిగా లోపలికొచ్చి అత్తను పట్టుకుని బోరున ఏడ్చింది. కాసేపటికి తేరుకుని ‘‘అత్తా! నన్ను క్షమించు. నా ఉద్యోగం, అందం కంటే కూడా నీ కుటుంబంలో నేను భాగం అవ్వడం గొప్పవిషయం అని ఆమె అన్నప్పుడు నిన్నటి నా ఆలోచనకు నాకే అసహ్యం వేసింది. చరణ్‌ ఇందాక ఫోన్‌ చేసి రైల్లో నిన్న జరిగిన విషయం అంతా చెప్పి, నన్ను చేసుకునే అర్హత తనకి లేదని, కానీ ఒక అవకాశం ఇస్తే మారతానని చెప్పాడు. ఆ మాటకి నాకింకా బాధ కలిగింది. ఆ కుటుంబంలోకి కోడలిగా వెళ్లడానికి నాకు మాత్రం ఏం అర్హత ఉంది? అందుకే ఈ సంబంధం వద్దని చెప్పేద్దాం’’ అంది తల వంచుకుని.

*  *  *

      పచ్చటి పందిరితో, ముంగిట ముగ్గులతో, ఇల్లంతా బంధువులతో కళకళలాడుతోంది. పెద్దల ఆశీస్సులతో పద్ధతిగా శ్రావ్య, చరణ్‌ల నిశ్చితార్థం పూర్తయింది. చరణ్‌ శ్యామలమ్మ దగ్గరికొచ్చి, ‘‘ఆ రోజు నా ప్రవర్తనకి నన్ను క్షమించండి. ముక్కూ మొహం తెలియని మా అమ్మకు మీరు చేసిన సాయం అంతా ఇంతా కాదు. అలాంటిది రైల్లో నిస్సహాయంగా ఉన్న మీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరుకు నాకు సిగ్గుగా ఉంది. ఇలా మీరు తారసపడ్డం నా మంచికోసమే. ఎటు వెళ్తున్నానో తెలియని నా పయనాన్ని అదుపు చేసి నన్ను నేను సరైన గమ్యంలోకి తెచ్చుకోగలిగాను. మా అమ్మ ఈ సంబంధం కుదురుతుందో లేదో అని ఎంత సంఘర్షణ పడింతో చెప్పలేను. నాకు అర్హత లేకపోయినా, ఈ ఇంటి అల్లుడిగా మీరు స్వీకరించారంటే నాలో మార్పును అంగీకరించారనే అనుకుంటున్నాను. ఆ నమ్మకాన్ని వమ్ము చెయ్యను’’ అంటూ ఆమె కాళ్లకి నమస్కరించాడు. 
      అతడిని పైకి లేపి నవ్వుతూ, ‘‘బాబూ!! ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇంత త్వరగా నీలో మార్పొచ్చిందంటే అది నీ తల్లిదండ్రుల పెంపకమే. చూడూ, వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరూ అనుభవించే వరం లాంటి శాపం. అందమైన అనుభవాలని తలచుకుంటూ, భావితరాల ఆనందాన్ని చూస్తూ ఉండటం వరమైతే, శరీరంలో వచ్చే అసహాయత వల్ల ప్రతి పనికీ అందరి మీదా ఆధారపడటం శాపం. డబ్బులు, అధికారం లాంటివేవీ దాన్నుంచి బయటపడేయలేవు. కేవలం మంచి మనసుతో సాయపడేవారే కావాలి. ఎవరైనా వృద్ధులు కనిపిస్తే వాళ్లలో నీ భవిష్యత్తుని చూడు. వారి అసహాయత నీదిగా కనబడుతుంది. అప్పుడు నీకే తెలియకుండా వారిని గౌరవించడం, సాయపడటం మొదలవుతుంది’’ చెప్పి శ్రావ్యనీ, అతణ్నీ దగ్గరికి తీసుకుని వారి దాంపత్య జీవితం హాయిగా సాగాలని ఆశ్వీరదించింది శ్యామలమ్మ.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


వాళ్లు ఏడ్చారు!

వాళ్లు ఏడ్చారు!

పి.చంద్రశేఖర అజాద్‌


స్వ‌యంవ‌ధూ...!?

స్వ‌యంవ‌ధూ...!?

దోరవేటి, (వి.చెన్నయ్య)


సువర్ణ గన్నేరు పూలు

సువర్ణ గన్నేరు పూలు

ప్రసాదమూర్తి


స‌మిధ‌

స‌మిధ‌

సయ్యద్‌ సలీం


అతడూ మనిషే!

అతడూ మనిషే!

పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


దాసరి పాట (క‌థాపారిజాతం)

దాసరి పాట (క‌థాపారిజాతం)

చింతా దీక్షితులుbal bharatam