మంత్ర‌దండం

  • 313 Views
  • 3Likes
  • Like
  • Article Share

    పెండ్యాల గాయ‌త్రి

  • తెలుగు ఉపాధ్యాయురాలు
  • కనిగిరి, ప్రకాశం జిల్లా.
  • 8985314974
పెండ్యాల గాయ‌త్రి

బళ్లో చదివే ఇద్దరు పిల్లలు మాయమయ్యారు! బదిలీ అయ్యి వెళ్లిపోయిన మరో మాస్టారు మీద ఏవో అనుమానాలు! మూడు లేఖలు బయటపడ్డాయి. వాటిలో ఏముంది? అసలు వాళ్లు ఎందుకెళ్లిపోయారు?
‘‘హలో, లెక్కల మాస్టారూ!
మీ అదురు బాబు గుర్తున్నాడా? అదేనండీ, మీ ప్రియ శిష్యుడు సుధీర్‌బాబు! మనందరం అదిరి పడే సాహసకార్యం చేశాడండీ వాడు!’’
      ‘నేను ఆ ఊరి నుంచి బదిలీ అయిన ఆర్నెల్లకి ఫోన్‌చేసి, క్షేమ సమాచారం అడగకుండా సాహసకార్యాలంటాడేంటి రాజశేఖర్‌?’ అనుకుంటూ.. ‘‘ఏంటి మాస్టారూ, ఎలా ఉన్నారు? ఇన్నాళ్లకి గుర్తొచ్చానన్నమాట’’ నవ్వూతూ అన్నాను. ‘‘అవును మాస్టారూ! మిమ్మల్నెక్కడ మర్చిపోతామో అని మీ శిష్యవీరుడే గుర్తుచేశాడు’’ అతడి మాటల్లో వ్యంగ్యం. 
      వాదన అనవసరమనిపించి ‘‘పోన్లెండి, పిల్లాడికన్నా గుర్తున్నాను’’ అన్నాను. ‘‘అదే. మీ కొంప ముంచింది’’ అన్నాడు కరుకుగా.
      ‘‘అర్థమయ్యేట్లు చెప్పండి!’’
      ‘‘పిల్లలూ, తెలివితేటలూ అని పిట్టకథలన్నీ చెప్పారుగా! అందుకే కాబోలు! మిమ్మల్ని పోలీసులకి పట్టిస్తున్నారు’’
      ఆ మాటకి ఓ క్షణం కంగారుపడ్డాను. కానీ, అతని స్వభావం తెలుసు కాబట్టి, ‘‘పిల్లల కోసం పోలీసులేంటి, ప్రధాని దగ్గరకెళ్లడానికైనా వెనకాడను’’ నిశ్చలంగా చెప్పాను.
      ‘‘అవునా.. అయితే బస్సెక్కండి! పావుగంటలో ఇక్కడుండాలని ఎస్‌ఐ గారు చెప్పారు’’ అని ఫోన్‌ పెట్టేశాడు. 
      మిగిలిన ఉపాధ్యాయులకి ఫోన్‌ చేసి విషయం కనుక్కుందామనకున్నాను. కానీ, అక్కడికి వెళ్తేనే అంతా స్పష్టంగా తెలుస్తుందనుకుని, ప్రధానోపాధ్యాయుడి అనుమతి తీసుకుని బస్సెక్కాను.
      మనసు మజ్జిగ కవ్వంలా ఆలోచనల్ని చిలుకుతోంది. 
      రాజశేఖర్, నేనూ నాలుగేళ్లు కలిసి పనిచేశాం. ఇద్దరం ఒకే సబ్జెక్ట్‌ టీచర్లమే. కానీ, వ్యక్తిత్వాలే ఉత్తర దక్షిణాలు. ఉత్తమ విద్యార్థులను తయారుచేయడం నా ధ్యేయమైతే, నిబద్ధతగా పనిచేసుకు పోయే వాళ్ల కాళ్లముందు తుమ్మముళ్లు పరచడం అతని నైజం. బదిలీ చేయించుకుని సొంతూరు దగ్గరకొచ్చి అతని పీడ వదలించుకున్నానని అనుకున్నాను. కానీ, పిల్లల పేరుతో ఇంకా వేధించాలని చూస్తున్నాడు.
      ‘‘టికెట్స్‌’’ కండక్టర్‌ మాటకు పర్సు తీస్తుంటే ‘‘బావున్నారా సార్‌!’’ పలకరింపునకు తలెత్తి చూశాను. 
      ‘‘నేను మీ స్టూడెంట్‌ని! ఈమధ్యే ఉద్యోగమొచ్చింది. లెక్కలంటే లాడెన్‌ని చూసినట్లు వణికిపోయే నేను మీరు చెప్పే కథల కోసమే కష్టపడి లెక్కలు చేసేవాణ్ని. అవే ఇప్పుడు నాకన్నం పెడుతున్నాయి’’ అంటున్న కండక్టర్‌ని చూస్తూ, ‘‘చాలా సంతోషం’’ అని టిక్కెట్‌ తీసుకున్నాను. ఆ అబ్బాయి మాటలు మండు వేసవిలో వాన జల్లులా తాకాయి. 
      అవును, చాలామందికి కష్టమనిపించే గణితాన్ని ఇష్టంగా మార్చడం కోసం నేను ఎంచుకున్న కిటుకు కథలు చెప్పడం. లెక్కలు చెప్పే ముందు కథ మొదలు పెట్టి ఊత్కంఠ రేగేటప్పుడు ఆపేస్తా. ‘‘లెక్కలు చేసిన వారికే మిగతా కథ!’’ అని ఊరిస్తా. అది చాలామంది మీద పనిచేసింది.       పన్నెండేళ్ల నా వృత్తి జీవితంలో కథలు చెప్పేటప్పుడు నన్ను గందరగోళ పెట్టింది సుధీర్‌బాబు ఒక్కడే. వాడు ఆరో తరగతిలో చేరిన రోజు భేతాళుడి కథొకటి మొదలుపెట్టా. ‘‘రాకుమారిని మాంత్రికుడు ఎత్తుకెళ్లి పోయాడు’’ అనేటప్పుడే వణుకుతున్నాడు. విషపు పాములు, సింహాల దగ్గరి కొచ్చేసరికి బావురుమన్నాడు. 
      దగ్గరికి పిలిచి ‘‘నీ పేరేంటి బాబూ!’’ అన్నాను. ఏడుస్తూనే ‘‘సు.దీ..రు బా..బూ..’’ అని చెప్పాడు. కష్టంమీద వాడి పేరునర్థం చేసుకుని ‘‘ఇలా ఏడ్చావంటే అదురుబాబు అని పిలుస్తా’’ అని కూర్చోబెట్టాను. 
       ఒకమ్మాయి లేచి ‘‘వాడు చిన్నప్పట్నుంచీ అంతే సార్‌! వొట్టి పిరికోడు’’ అంది చేతులు తిప్పుతూ. క్లాసంతా నవ్వులు. ‘‘నీ పేరేంటీ! ఏ కథ చెప్పినా నువ్వు ధైర్యంగా వింటావా?’’ ఆ అమ్మాయిని అడిగాను. 
      ‘‘మృదుల సార్‌! నాకు దయ్యాల కథలన్నా బయ్యంలేదు’’ 
      ‘‘అమ్మో దెయ్యాలు’’ అంటూ సుధీర్‌ మళ్లీ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. వాణ్ని సమాధానపర్చి కథ కొనసాగిస్తుంటే, మరోసారి ఏడుపు. ‘‘ఒరేయ్‌ నువ్విలా ఏడ్చావంటే భేతాళుడు నీ తలని వెయ్యి ముక్కలు చేస్తాడు’’ అన్నాక ఏడుపాపేశాడు. హమ్మయ్య, ఈ మంత్రం పారిందిలే అనుకున్నా.
      తర్వాతి రోజు కథ చెబుతుంటే కట్టేసినట్లు కదలకుండా కూర్చున్నాడు.  ‘‘చూశావా మృదులా! మన సుధీర్‌ ధీరుడైపోయాడు’’ అన్నాను. ‘‘సార్‌.. మరీ.. వాడూ..!’’ దీర్ఘాలు తీస్తోందామె. అంతలో మనోజ్‌ లేచి ‘‘వాడు లాగు తడిపేసుకున్నాడు సార్‌!’’ అన్నాడు. 
      ‘‘మరిందాకట్నుంచి చెప్పలేదేంట్రా?’’ అన్నాను. ‘‘మీరు కథ ఆపేస్తారనీ..’’ నలుగురు పిల్లలు గొణిగారు. 
      ‘‘ఇలాగైతే ఎలారా! ధైర్యం లేకపోతే జీవితంలో ఎలా పైకొస్తావు’’ అని, అప్పటి నుంచి వీలున్నప్పుడల్లా వాడిలో ధైర్యం నింపే ప్రయత్నం మొదలెట్టా.
      పిల్లలంతా వాడి అసలు పేరు మరచిపోయి ‘అదురుబాబు’ అని పిలవటానికి అలవాటు పడ్డారు. లెక్కలు చాలా బాగా చేసేవాడుగానీ వాడి ఏడో తరగతి అయిపోయినా భయం మాత్రం కొంత మిగిలే ఉంది. నేను బదిలీ అయ్యి వచ్చేరోజు ‘‘మీరు వెళ్లొద్దు సార్‌!’’ అంటూ ఏడ్చాడు. నాలుగు ధైర్య వచనాలు చెప్పి వచ్చేశాను.
      ‘సుధీర్‌బాబు సాహసం చేశాడా? ఏం చేసుంటాడు? ఈ రాజశేఖర్‌ వాడిమీద ఏదైనా కల్పించాడా?’ 
      ‘‘సార్‌! స్కూల్‌ వచ్చేసింది’’ కండక్టర్‌ పిలుపుతో, అతనికి వీడ్కోలు చెప్పి బడిలోకి అడుగుపెట్టా.     
      నన్ను చూడగానే నలుగురు పిల్లలు పరుగున వచ్చి ‘‘సార్‌! అదురుబాబు, మృదులా కనిపించట్లేదు. ఎక్కడికో వెళ్లిపోయారు’’ అంటుంటే నా గుండె వేగం పెరిగింది.  ఆఫీసు గది ముందు ఇద్దరు పోలీసులు, టీచర్లు, కొందరు పెద్దవాళ్లు నిలబడి ఉన్నారు. ‘‘రండి సార్‌. బావున్నారా! మీకోసమే చూస్తున్నాం’’ ప్రధానోపాధ్యాయుడి మాటల్లో వెటకారం. బోనులో దోషిలా అందరి కళ్లూ నన్నే చూస్తున్నాయి.  
      ప్రధానోపాధ్యాయుడు ఏవో కాగితపు కవర్లు నా చేతికిస్తూ ‘‘ఇవి చూడండి!’’ అన్నారు. ‘‘పిల్లలు ఎక్కడికెళ్లినట్లు. వాళ్లకి ఈ బుద్ధి ఎందుకు పుట్టింది?’’ ఒక ఉపాధ్యాయుడు అన్నాడు. 
      ‘‘కొంతమంది కాని కబుర్లు చెప్పి పిల్లల్ని చెడగొడతారండీ!’’ రాజశేఖర్‌ గొంతులో కోపం, ద్వేషం. 
      ఆ తర్వాత అంతా తోచినట్లు మాట్లాడుతున్నారు. అవన్నీ వింటూనే ఒక కవరు మీద రాసిన అక్షరాలు చదివాను.
      ‘‘అదురుబాబుననీ, బెదిరిపోతానని అందరూ నన్నెగతాళి చేశారు కదూ! నాకూ ధైర్యం ఉందని నిరూపించడం కోసం ఓ సాహస కార్యం చేస్తున్నా. అదేంటో చెప్పనా.. నేనూ, మృదులా కలిసి ఈ బడీ, మా ఇళ్లు, ఊరు వదిలిపెట్టి వెళ్లిపోతున్నాం. మమ్మల్ని వెతికే ప్రయత్నం చెయ్యవద్దు. ఈ కవరు లోపల ఇంకొన్ని వివరాలున్నాయి. వాటిని భరత్‌సార్‌ మాత్రమే చదవాలి. మీరెవరైనా చదివితే మీ తలలు వెయ్యి వక్కలవుతాయి జాగ్రత్త! ఇది భేతాళుడి మాట. దీనికి తిరుగులేదు’’ అని కవరు మీద రాసి ఉంది. మరో రెండు కవర్ల మీదా అదే రాసి ఉంది. నాకేమీ అర్థంకాక హెడ్‌మాస్టారు వైపు చూశాను. 
      ‘‘ఉదయాన్నే బడికొచ్చి చూస్తే నా టేబుల్‌ మీద ఈ కవరు కనిపించింది మాస్టారూ! వాటిని మిగతా టీచర్లకు చూపించి పిల్లల గురించి వాకబు చేస్తుంటే, తమ ఇంట్లో కవరుందంటూ  సుధీర్, మృదులల తల్లిదండ్రులొచ్చారు. ఎందుకైనా మంచిదని పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చానండీ! డీఈవో గారికీ సమాచారమం దించాం. ఆ తరవాతే మిమ్మల్ని పిలిపించాను’’ అన్నారు హెచ్‌ఎం. 
      ‘‘కవర్లు తెరవలేదా సార్‌’’ అని హెచ్‌ఎంని అడిగితే, ‘‘కేస్‌ బుక్‌ అయ్యింది కదండీ! అందులో ఏముందో మీరే చదవండి’’ అన్నాడు ఒక పోలీసు. ‘‘ఇదెక్కడి గోలండీ! నేనేమైనా ఈ బడిలో పనిచేస్తున్నానా?’’ అన్నాను.
      ‘‘ఏమీ కాదులెండి మాస్టారూ. మేమంతా ఉన్నాంగా. ముందు వాటిలో ఏముందో చూడండి’’ ఇంగ్లీష్‌ మాస్టారు నా భుజాలను చుట్టేశారు. తప్పక, వణు కుతున్న చేతులతో ఒక కవర్‌ చించాను.
      ‘‘గట్టిగా చదవండి. అందరికీ వినపడాలి’’ గుంపులోంచి ఎవరో అరిచారు. కాగితం మడత విప్పి గొంతు సవరించు కుని మొదలుపెట్టాను. ‘‘నాకు ధైర్యం ఉందని తెలియజేసే కథలు జెప్పిన భరత్‌ సార్‌! మీకొక కథ జెప్పాలనుకుం టున్నా. కానీ పేరేం పెట్టాలో తెలియలా. నాకు తెలిసిన ఈ కథ మీకు జెప్పకపోతే నా తల వెయ్యి ముక్కలైపోద్ది! మీరు జెప్పే కథల్లో మాంత్రికుడు దొంగోడు కదా! ఈ కథలో దొంగోడి కోసం నేను పదివేలు దొంగతనం చేశా. ఇదే నా మొదటి సాహసం’’ 
      ఎవరో ఏదో మాట్లాడబోతే పోలీస్‌ వారించాడు. 
      ‘‘మీ కథలో మాంత్రికుడు రాకుమారిని ఎత్తుకుపోతాడు. ఈ కథలో రాజే దొంగోడై పేదకుమారిని ఏడిపిస్తుంటాడు. మాంత్రికుడు దొంగోడంటే ఎవురన్నా నమ్ముతారుగానీ, రక్షించాల్సిన రాజే మాంత్రికుడయ్యాడంటే ఎవురూ నమ్మరుగా. అందుకే పాపం ఆ పేద కుమారి ఎవురికీ జెప్పకుండా ఏడుస్తుంటే ఏంచెయ్యాలి? రాజునెదిరిస్తే తల తెగిపోద్ది. అందుకని మంచి మాంత్రికుడొచ్చి ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి ఆ రాజు రాకాసి నుంచి దూరంగా తీసుకు పోవాలి. అందుకే నేను మంచి మాంత్రికుడిగా మారి రెండో సాహసం చేశా. రాజుకి తెలియకుండా ఆయన్ని నా మంత్రదండంలో బంధించేశా. నేనిప్పుడు అదురుబాబును కాదు సార్‌! వీరాధివీరుడైన సుధీరుణ్ని
      ‘‘ఈ కథ మీరు జెప్పే కథలా గొప్పగా తయారుజెయ్యడానికి నేనూ మృదులా మూడు రోజులు కష్టపడ్డాం. తప్పులేమైనా ఉంటే సరిదిద్దండి సార్‌! ఇప్పటిదాకా ఓపిగ్గా నా కథ చదివినం దుకు మీకొక పరీక్ష పెడుతున్నా. నా మంత్రదండంలో బంధించిన ఆ రాజును విడిపిస్తే ఆ దండాన్ని మీకు బహుమతిగా ఇచ్చేస్తా. ఈ కథ పక్కనే మీ బహుమతి ఉంది చూడండి. ఉంటాను సార్‌. టాటా!’’
      చదవడం పూర్తయ్యేసరికి నా గొంతు గద్గదమైంది. ‘‘మీకెవరికన్నా ఏమన్నా అర్థమయ్యిందా?’’ పోలీస్‌ అడగడంతో అందరూ పెదాలు విరిచి, ఆలోచనలో పడ్డారు. 
      ‘‘బహుమతి అంటున్నాడు, ఏదేదో రాశాడు’’ అంటూ ఇంగ్లిష్‌ టీచర్‌ ఆ ఉత్తరం ఉన్న కవరును తీసుకుని విదిలించాడు. అందులోనించి ఒక చిన్న మెమరీ కార్డు కిందపడింది. వంగి అది తీసుకుంటుంటే కారు హారన్‌ మోగింది. 
      ‘‘హా! డీఈఓ గారొస్తున్నార’’ంటూ స్టాఫ్‌ అంతా ఆయనకెదురెళ్లి లోపలికి తీసుకొచ్చారు. హెచ్‌ఎం  జరిగిందంతా వివరించి నా చేతిలోని కాగితాన్ని ఇచ్చారు. ఆయన అంతా చదివాక, ‘‘మిగతా రెండు కవర్లలో ఏముందో చూశారా!?’’ అనడంతో చించాను.
      అచ్చుతేడా లేకుండా అవే అక్షరాలు. ఒకదానిలో అదనంగా, ‘‘మరి ఆ మెమరీ మంత్రదండంలో ఏ మోడ్రన్‌ మాంత్రికుడున్నాడో చూడండీ!’’ అని రాసుంది.
       ‘‘మాంత్రికుడు కాదు సార్‌! మోడ్రన్‌ మహారాజున్నాడు’’ అంటూ ఇంగ్లిష్‌ టీచర్‌ ఆ మెమరీ కార్డుని తన సెల్‌ఫోనులో పెడుతుంటే, ‘‘బళ్లో కంప్యూటర్‌ ఉందిగా. అందులో పెట్టండి. అందరూ చూస్తారు’’ అన్నారు డీఈవో. క్షణాల్లో మెమరీ కార్డు కంప్యూటర్‌లోకి చేరింది.  
      అందరిలో ఉత్కంఠ. శ్వాస అయినా తీసుకుంటున్నారో లేదో అన్నంత నిశ్శబ్దం. అప్పుడే నా మొబైల్‌ ఫోను మోగింది. దాన్ని విసిరికొట్టాలన్నంత కోపం వచ్చింది. చూస్తే, నా శ్రీమతి నుంచి ఫోన్‌. అప్పుడు గుర్తొచ్చింది, ఉదయాన్నే నా కూతురికి కొద్దిగా జ్వరం వచ్చిందని. సెలవు పెట్టాలని శ్రీమతి అడిగినా, బళ్లో పరీక్ష ఉందని, ఇంట్లో ఉన్న మందు వెయ్యాలని, తగ్గకపోతే మధ్యాహ్నం వచ్చి ఆస్పత్రికి తీసుకెళతానని చెప్పాను. బయటికొచ్చి ఫోను మాట్లాడాను. పాపకు జ్వరం తగ్గిందని శ్రీమతి చెప్పాక కాస్త నెమ్మదించి లోపలికెళ్లబోతుంటే ‘‘నువ్వసలు మనిషివేనా! ఆ బిడ్డలు నీ కూతుళ్లకన్నా చిన్నవాళ్లే! గురువంటే తండ్రి సమానుడంటారే! ఛీఛీ, నీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది’’ కంప్యూటర్‌ రూమ్‌లోంచి డీఈఓ మాటలు పాఠశాల ప్రాంగణమంతా ప్రతిధ్వనిస్తున్నాయి.
      ‘‘సస్పెన్షన్‌ ఆర్డర్‌ సిద్ధం చెయ్యండి. ఇంకా ఆలోచిస్తున్నారేంటండీ, ఈ నీచుణ్ని అరెస్టు చేసి తీసుకెళ్లండి’’ అని బయటికొచ్చారు డీఈవో. గ్రీష్మకాల సూర్యుడిలా మండుతున్న ఆయన్ని పలకరించడానికి ధైర్యం చాల్లేదు. నన్ను చూసి కొంచెం శాంతించి, ‘‘భరత్‌గారూ! మిమ్మల్ని అపార్థం చేసుకున్నానండీ! క్షమించండి’’ అంటూ చేయందించారు. 
      ‘‘అయ్యో.. ఎంతమాట సార్‌!’’ అన్నాను. 
      ‘‘పిల్లలెంత సమయస్ఫూర్తి ప్రదర్శించారండీ! వాళ్ల సాహసం అమోఘం. వాళ్లని అభినందించాలండీ’’ డీఈఓ అంటుంటే, హెచ్‌ఎం కల్పించుకుని, ‘‘ఈ ఘనతంతా మన భరత్‌ మాస్టారికి దక్కుతుందండీ! ఎన్నెన్నో నీతి, సాహస కథలు చెప్పి పిల్లల్లో ఇంతటి విచక్షణ కలిగించారు’’ అన్నారు.
      ‘‘అవును సార్‌! భరత్‌సార్‌ కథల వల్లే నాకింత ధైర్యం వచ్చింది’’ అంటూ వచ్చిన సుధీర్‌ని చూసి, ‘‘అరేయ్‌! మీరొచ్చేశారట్రా! ఎక్కడికెళ్లారో అని కంగారు పడుతున్నాం’’ ఇంగ్లిష్‌ మాస్టారు సంతోషంగా హత్తుకున్నారు.
      ‘‘మేమెక్కడికీ వేళ్లలేదు సార్‌! బడి వెనక దాక్కున్నాం’’ అంటూ ఓ సెల్‌ఫోన్‌ హెచ్‌ఎమ్‌ గారికిచ్చాడు సుధీర్‌. 
      ‘‘వామ్మో! అదురుబాబూ, మమ్మల్నందరినీ హడలెత్తించేశావు కదరా! ఈ ఫోనెవరిదీ?’’ అన్నారు హెచ్‌ఎం.
      ‘‘వాడింకా అదురు బాబేంటండీ! భరత్‌ గారి కథలు వినీవినీ సుధీరుడైపోతేనూ’’ అంటూ వాడి భుజం తట్టారు సోషల్‌ టీచర్‌. ‘‘ఒక ఆదివారం రాజశేఖర్‌ సార్‌ మా చేత మందు తెప్పించుకుని తాగుతుంటే ఆయన పర్సులో ఉన్న పదివేలు కొట్టేసి ఈఫోన్‌ కొన్నాను సార్‌! మృదులనే కాకుండా మిగిలిన అమ్మాయిలను ఆయన ఏడిపించడం చూసి, ఆయనతో మంచిగా ఉంటూనే ఆ వీడియోలు తీశాను. ఆ సార్‌ చేసే తప్పులు మీకందరికీ తెలియజెయ్యాలని మృదుల సాయంతో ఈ సాహసం చేశాను. తప్పైతే క్షమించండి సార్‌!’’ అంటున్న సుధీర్‌ని కౌగిలించుకున్న డీఈవోగారు ‘‘మంచి పని చేశావు నాన్నా! నీలాంటి ధైర్యవంతులు, భరత్‌ సార్‌ లాంటి బాధ్యతాయుత వ్యక్తులూ అవసరం నేటి సమాజానికి. ప్రభుత్వ పురస్కారానికి నీ పేరు సిఫారసు చేస్తాను!’’ అని డీఈవో అనగానే కరతాళ ధ్వనులతో పాఠశాల ప్రాంగణం మార్మోగింది.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


వాళ్లు ఏడ్చారు!

వాళ్లు ఏడ్చారు!

పి.చంద్రశేఖర అజాద్‌


స్వ‌యంవ‌ధూ...!?

స్వ‌యంవ‌ధూ...!?

దోరవేటి, (వి.చెన్నయ్య)


సువర్ణ గన్నేరు పూలు

సువర్ణ గన్నేరు పూలు

ప్రసాదమూర్తి


స‌మిధ‌

స‌మిధ‌

సయ్యద్‌ సలీం


అతడూ మనిషే!

అతడూ మనిషే!

పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


దాసరి పాట (క‌థాపారిజాతం)

దాసరి పాట (క‌థాపారిజాతం)

చింతా దీక్షితులుbal bharatam