పొరపాట్ల ఆవరణలు

  • 786 Views
  • 157Likes
  • Like
  • Article Share

    శ్రీనివాస్‌ మంత్రిప్రగడ

  • బెంగళూరు
  • 9741774445
శ్రీనివాస్‌ మంత్రిప్రగడ

అతనిలో చాలా దారుణమైన ఆలోచనలు. వాటి పట్ల అతనికే అసహ్యం కలుగుతోంది. కానీ, అవి రావడం వెనుక చాలా పొరపాట్ల ఆవరణలున్నాయి! అవి ఎలా తెలిసొచ్చాయి?
తెల్లారింది.
ఆకాశం దట్టంగా మబ్బులు పట్టి ఉంది. డాక్టర్‌ వీర్రాజు తొమ్మిదో అంతస్తు గదిలో కిటికీ పక్కనే కూర్చుని వేడి వేడి టీ చప్పరిస్తూ దట్టంగా ఉన్న చెట్లనూ, వాటి మధ్యలోంచి పొడుచుకొచ్చిన ఒక పెద్ద భవనాన్నీ చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయాడు. తెరచి ఉన్న కిటికీలోంచి వస్తున్న చల్లగాలి అతడికి ఒక సాంత్వననిస్తూ భావాత్మక ప్రపంచంలోకి తీసుకెళుతోంది. 
      కొంచెం పక్కగా ఉన్న అతని ఫోన్‌లోంచి ‘చల్ల గాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళి.. ఉల్లము కొల్లగనే మధు గీతులు మెల్లమెల్ల చెవి సోకునవే’ అనే గీతం సాలూరి గొంతులో మోగుతూ ఏవో పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తోంది.
      అతని వాలు కుర్చీ పక్కనే చిన్న బల్ల మీద డాక్టర్‌ అలివర్‌ సాక్స్‌ రాసిన అవేకెనింగ్స్‌ సగం చదివి బోర్లా పెట్టినట్టు ఉంది. బల్ల పక్కన నేలమీద రెండు కాఫీ కప్పులు పడున్నాయి. డాక్టర్‌ వీర్రాజు ఒక సైకాలజిస్టు. యూనివర్సిటీలో పాఠాలు చెప్పే ఉద్యోగం మానేసి కౌన్సెలింగ్‌ ఇవ్వడం ప్రారంభించాక చాలా సమయం ఉంటోంది. వారానికి రెండు లేదా మూడు కేసుల కంటే రావట్లేదు. దాంతో రకరకాల పుస్తకాలు, కేసులు చదవడానికి సమయం దొరుకుతోంది. అప్పుడప్పుడూ కొందరు సైక్రియాట్రిస్టులను కలిసి ఇప్పటి మానవ సంబంధాలు, వాటి మీద విచక్షణారహిత అభివృద్ధి తాలూకా ప్రభావాల గురించి చర్చిస్తుంటాడు.
      అతని ఆలోచనలని ఛేదిస్తూ ఫోన్‌ మోగింది. ఉలిక్కిపడి ఫోన్‌ తీశాడు వీర్రాజు.
      ‘‘నేను ఈ సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నానేమో అని అనుమానంగా ఉంది’’ అందొక యువ కంఠం ఫోన్లో. మాటల్లో కొంచెం వణుకు స్పష్టంగా తెలుస్తోంది. ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా ఆ గొంతు అన్న మాటలతో షాక్‌ తిన్నాడు వీర్రాజు. కొద్దిసేపు ఏమీ అర్థం కాలేదు. కాస్త సర్దుకున్న తరువాత కూడా విడివిడిగా ఆ గొంతు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. కానీ అన్ని మాటలు కలిపి ఆలోచిస్తే ఏమీ అర్థం కావట్లేదు. ఒక క్లిష్ట పజిల్‌లా అనిపించింది. సుశిక్షితుడైన సైకాలజిస్ట్‌ కావడంతో తొందరగానే తేరుకున్నాడు.
      ‘‘అలాగా. అలా ఎందుకనిపిస్తోంది?’’ అనడిగాడు కొంచం మార్దవంగా.
      ‘‘నాకు మనుషుల గురించి ప్రమాదకర ఆలోచనలొస్తున్నాయి. ప్రత్యేకంగా ఆడవారి గురించి’’ అందా గొంతు భారంగా.
      ‘‘దాని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. మీరెవరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?’’ అడిగాడు వీర్రాజు, వీలైనంతవరకు గొంతులో భావాలేమీ పలికించకుండా.
      ‘అతనెవరో చాలా నిరుత్సాహపూరిత ప్రపంచాన్ని తన చుట్టూ సృష్టించుకున్నట్టున్నాడు. తన జీవితంలో ఎదో పెద్ద భంగపాటునే ఎదుర్కొన్నట్టున్నాడు. వీలైనంత తొందరగా అతణ్ని ఆ స్వీయ నిర్మిత అగాధం నుంచి బయటికి లాగాలి’ అనుకున్నాడు వీర్రాజు.
       ‘‘నాకు చిన్న పిల్లల గురించి ప్రమాదకరమైన ఆలోచనలొస్తున్నాయ్‌’’ అందా గొంతు, వీర్రాజు మాటలను పట్టించుకోకుండా.
      అతని మనసులో గూడుకట్టుకున్న బాధను పూర్తిగా వెళ్లబోసుకోనివ్వడం మంచిదనుకున్నాడు వీర్రాజు. ‘‘ప్రమాదకరమైన ఆలోచనలంటే ఏమిటి?’’ అనడిగాడు.
      ‘‘చిన్న ఆడపిల్లలు నా కళ్లకు ఆటవస్తువుల్లా కనిపిస్తున్నారు. అంత చిన్న పిల్లలని అలా చూడటం అసహజమని, నేరపూరితమని అర్థమౌతున్నా నేనేమీ చెయ్యలేకపోతున్నాను. ఆ ఆలోచనలు నన్ను బలవంతంగా లోబరచుకుంటున్నాయి’’ అందా గొంతు.
      ఏమనాలో అర్థం కాలేదు వీర్రాజుకి. చిన్న పిల్లల మీద లైంగిక దాడులు వినని విషయం కాదుగానీ, అలాంటి పశుత్వం చాలా మందిలోనే ఉందని, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్లు, భగవంతుని కోసం సేవా మార్గం పట్టిన వాళ్లు, అధ్యాపకులు, కుటుంబంలోని వ్యక్తులు... ఈ దౌర్బల్యం మానవ సమాజాన్ని కోసేస్తోందని అనుకున్నాడు వీర్రాజు. దేశ కాలమానాలకు అతీతంగా ఈ దౌర్బల్యం ఉందనీ, పెద్ద పెద్ద పదవులు అలంకరించిన వాళ్లు, గొప్ప ప్రతిభావంతులు కూడా జయించలేని ఈ పీడోఫెలియాను దాని శాస్త్రీయ నామం తెలియకపోయినా అతను స్పష్టంగా గుర్తించగలుగుతున్నాడని అనుకున్నాడు వీర్రాజు.
      ‘‘ఈ ఆలోచనలు ఎప్పటి నుంచి? ఇవి కలగడానికి ఏదైనా బాహ్య ప్రేరితం ఉందా?’’ అనడిగాడు.
      ‘‘ఎప్పుడు, ఎందుకు, ఎలా మొదలైందనే విషయం అంత స్పష్టంగా తెలియదు. బహుశా చాలా కాలంగా ఆ ఆలోచనలు నా మనసులో మెదులుతున్నట్టున్నాయి. ఒక రోజు పొద్దున్నే లేచి చూసుకుంటే కాఫ్కా గ్రెగోర్‌ సాంసాలాగా రూప విక్రయం చెంది ఇలా పురుగులా తయారయ్యాను. నాకంతవరకే గుర్తుంది’’ అందా గొంతు.
      అతని గొంతులోని భావాలను లోతుగా విశ్లేషిస్తే అతను తనని తాను చాలా అసహ్యించుకుంటున్నాడని అనిపించింది వీర్రాజుకి.
      ‘‘ఇప్పుడేం చేస్తే బావుంటుందని మీ ఉద్దేశం?’’ అడిగాడు వీర్రాజు.
      సాధారణంగా తన దగ్గరికి వచ్చిన పేషంట్లకు తానే దారి చూపిస్తాడు. కానీ ఇతని విషయంలో అతణ్ని కూడా చికిత్సలో భాగస్వామిని చేస్తే మంచిదనిపించింది. అందుకే అలా అడిగాడు
      ‘‘నేను ఈ పరిస్థితి నుంచి బయటపడాలి. నా మనసుని ప్రక్షాళన చేసుకోవాలి. నేను చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాను. నేనెంత ప్రయత్నిస్తున్నానో అంతకన్నా బలంగా ఆ ఆలోచనలు నాలో వేళ్లూనికుని పోతున్నాయి. ఒక పెద్ద సాలెగూట్లో పడిన ఈగలాగా కొట్టుకుంటున్నాను’’ అంది ఆ గొంతు. పెద్దగా నిట్టూర్చినట్టు వినిపించింది వీర్రాజుకి.
      ఒక పక్క మానసిక దౌర్బల్యం, మరో పక్క అనూహ్యమైన స్పష్టత, ఈ పరస్పర విరుద్ధ వ్యక్తిత్వాలు చూపిస్తున్న అతడెంతో నర్మగర్భంగా అనిపించాడు వీర్రాజుకి. అతని గొంతు వింటే దాదాపు ముప్పై ఏళ్లు ఉంటాయనిపిస్తోంది. ఏదో కారణాల వల్ల తాను ఈ మానసిక దౌర్బల్యానికి లోనయ్యాడు.       అతనెలాంటివాడై ఉంటాడో? అలాంటి పరిస్థితిలోకి ఎలా వెళ్లాడో... ఆలోచిస్తున్నాడు వీర్రాజు
      ‘‘ఇది నా ఆఖరి ప్రయత్నం. అయినా నేను బయట పడకపోతే ఇక నేను ఈ ప్రపంచంలోంచి నిష్క్రమించడమే దీనికి నివారణ. నా వల్ల ఒక నిర్దోషి అయిన అమాయకపు పిల్ల బలైపోవడం నేను భరించలేను’’ అందా గొంతు.
      అప్పటి వరకు జరుగుతున్న సంభాషణ వల్ల ఎంతో వ్యాకులత చెందిన వీర్రాజు ఆ మాటతో కొంచెం స్థిమితపడ్డాడు. అతను ప్రత్యక్షంగా ఎవరికీ హాని చెయ్యలేదు. అలా జరిగుంటే అతను ఇంకా అగాధంలోకి జారిపోతాడు. అతణ్ని బయటికి లాగడం చాలా కష్టమవుతుందని అనుకున్నాడు
      ‘‘మీరీ సమస్యని నివారించాలని చేసే ప్రయత్నాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. దీనికి విరుగుడు నిర్ణయించుకుని అమలు చేసే ముందు మనం ఒకసారి కలవగలమా?’’ అనడిగాడు వీర్రాజు.
      అతణ్ని ఆ మనోవైకల్యం నుంచి తాత్కాలికంగా అయినా బయటికి లాగి వీలైనంత తొందరగా తన కౌన్సిలింగ్‌ బల్ల మీదకి తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నాడు వీర్రాజు.
      ‘‘అలాగే డాక్టర్‌. నాక్కూడా మిమ్మల్ని వీలైనంత తొందరగా కలవాలని ఉంది. నా ఈ మనసులో ఉన్న భావాలు జుగుప్స కలిగిస్తున్నాయి. వేరొకళ్లకి ఎలా చెప్పాలో తెలియక ఇలా ఫోన్‌ చేసి నా గురించి విషయాలేమీ చెప్పకుండా ఇంతసేపూ మీతో మాట్లాడాను. క్షమించగలరు’’ అందా గొంతు.
      మనసులో మాట వేరొకరితో పంచుకోవడం వల్ల అతనిలో రగులుతున్న మంటలు కొంచె నెమ్మదించినట్టనిపించింది. ‘‘మీరు చాలా చక్కగా, స్పష్టతతో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చూడాలనే ఉత్సాహం నాలో ఎక్కువవుతోంది. మనిషి మనసో అంధకూపం. అందులో ఎలాంటి ఆలోచనలున్నాయో గుర్తించడం అంత సులభం కాదు. మీరు మీ ఆలోచనలని దాదాపు తెర మీద చూస్తున్నట్టు చెబుతున్నారు. మీరు ఇలాంటి ఆలోచనలుండటాన్ని చిన్నతనంగా భావించకండి’’ అన్నాడు వీర్రాజు ధైర్యం చెబుతూ.
ఆ మాటలతో ఆ అజ్ఞాత మనిషికి కొంచెం ఉత్సాహం వచ్చినట్టనిపించింది. ‘‘నాపేరు నాగరాజు అండి. నేను హలసూరు నుంచి మాట్లాడుతున్నాను’’ అన్నాడతడు. 
      ‘‘అద్భుతం. మీ హలసూరులో చోళుల కాలంనాటి సోమేశ్వరస్వామి దేవస్థానం ఉంటుంది. చూశారా ఎప్పుడైనా?’’ అనడిగాడు వీర్రాజు.
      ‘‘తరచుగా వెడుతూనే ఉంటానండీ. నా ఈ పరిస్థితి అంతా స్వామికి కూడా నివేదించుకున్నాను. నా మనసు కుదుటపడలేదు’’ అన్నాడతను కొంచెం దిగులుగా.
      ‘‘మనలోని దౌర్బల్యాల్ని సరిచేసుకునే అవకాశం శివుడు ఇస్తాడు. మనమే చేసుకోవాలి. ఆయనేమీ  చెయ్యడు’’ అన్నాడు వీర్రాజు.
      ఆ మాటతో నాగరాజుకి చాలా సంతోషం వేసింది. అతని గొంతులో ఆ విషయం తెలుస్తోంది. ‘‘మిమ్మల్ని ఎక్కడ కలవమంటారు?’’ అనడిగాడు. తొందరగా కలవాలనే ఆత్రుత అతని గొంతులో స్పష్టంగా తెలుస్తోంది.
      ‘‘నేను ఎక్కువగా ఇంట్లోంచి పనిచేస్తాను. కానీ మీదో ప్రత్యేక పరిస్థితి. మీరు అన్ని చోట్లా మనసు విప్పి మాట్లాడలేరనిపిస్తోంది. అందుకే మనకి కొంచెం ఏకాంత ప్రదేశం కావాలి. ఈ శని ఆది వారాల్లో మనం నందిహిల్స్‌కి వెళ్లి మాట్లాడుకుందాం’’ అన్నాడు వీర్రాజు.
      ‘‘మంచి ఆలోచన. నేను ఏర్పాట్లు చేస్తాను’’ అన్నాడతను.
      ‘‘ఏర్పాట్లేమీ అక్కరలేదు. నా కార్లో వెళ్దాం. నేను మీ దగ్గరికొచ్చి ఎక్కించుకుంటాను. అక్కడ మనం తీరిగ్గా కూర్చుని మాట్లాడుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు నేను చేస్తాను’’ అన్నాడు వీర్రాజు.
      లేచి అటూ ఇటూ పచారీలు చేశాడు వీర్రాజు. ‘బహుదూరపు బాటసారీ ఇటురావో ఒక్కసారి... అర్ధరాత్రి పయనమేలనోయి..’ ఘంటసాల అద్భుత గీతం గుర్తుకొచ్చింది అతనికెందుకో.
      ‘ఈ నాగరాజు కేసు ఎలాగైనా పరిష్కరించాలి. అతను ఈ ప్రపంచానికి ఎంతో ఉపయోగపడే వాడిలా కనిపిస్తున్నాడు. చాలామందికి తమ ఆలోచనల గురించి ప్రాథమికమైన స్పష్టత కూడా ఉండదు. నాగరాజుకి తన ఆలోచనల లోతులు అర్థమౌతున్నాయి. చాలా ఆసక్తికర వ్యక్తిత్వం’ అనుకున్నాడు.  
      అప్పటి వరకు అతనితో జరిగిన చర్చ, ఆ సమయంలో అతను ప్రస్తావించిన విషయాల  గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అతని గురించి ఏమీ తెలియకపోవడం వల్ల చాలా స్వతంత్రమైన ఆలోచనలే వస్తున్నాయి. తనకు అంతకు ముందు తెలిసిన ఏ రకమైన మూసల్లోకి అతణ్ని నెట్టకుండా ఆలోచిస్తున్నాడు.
      ‘అతనెవరో బాగా చదువుకున్న విజ్ఞత కలిగిన కుర్రాడు. సాహిత్యం కూడా చదువుకున్నవాడిలా ఉన్నాడు. తన మాటల్లో ఫ్రాంజ్‌ కాఫ్కా పాత్రతో తనని పోల్చుకున్నాడు. తన పరిస్థితి గురించి అతనికి కొంచెం అవగాహన ఉంది. లక్షణాల గురించే అయుండొచ్చు గాక, ఆ మాత్రం స్పష్టత చాలా మంచిది ఉండదు. ఏ కారణాలు అతణ్ని అటు నెట్టాయి. ఎందువల్ల అతను మనోబలం పెంపొందించుకుని ఆ పరిస్థితి మీద యుద్ధం చెయ్యలేక పోతున్నాడు?’
‘అతనిలో స్కిజోఫ్రెనియా లక్షణాలు కొట్టొచినట్టు కనిపిస్తున్నాయి. అంతటి స్పష్టత, విజ్ఞత కలిగిన వారెవరైనా తెలియక ఏదైనా తప్పు చేస్తే ఆ నేర భావన వల్ల అహం చాలా లోతుగా దెబ్బతింటుంది. తన మీద తనకే జుగుప్స కలగడం వల్ల అలాంటి లక్షణాలు రావొచ్చు’ వీర్రాజు పచారీలు చేస్తూ ఆలోచిస్తున్నాడు. తన వాలు కుర్చీలో కూలబడ్డాడు. అతడి పరిస్థితి గమనించిన పనమ్మాయి కాస్త టీ ఇచ్చింది.
      టీ చప్పరిస్తూ దూరంగా కనిపిస్తున్న భవన వరుసలని చూస్తున్నాడు వీర్రాజు. ‘అతని పరిస్థితికి కారణాలేమై ఉండొచ్చో బేరీజు వేసుకోవడం మొదలుపెట్టాడు. ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడం, స్వీయ అంచనాలు అందుకోలేక పోవడం, కొన్ని ప్రత్యేక విషయాల గురించి తోటివారి ఒత్తిడి, తన చుట్టుపక్కల వాతావరణంలో వచ్చే భీకర మార్పులు భరించలేకపోవడం... ఇలా ఆలోచనలు ముసురుకుంటుంటే వీర్రాజు వీలైనంత తొందరగా నాగరాజుని కలవాలని అనుకున్నాడు. ఆ ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరవుతూ ఎప్పటికో నిద్రపోయాడు.
శుక్రవారం సాయంత్రం నాగరాజు నుంచి ఫోన్‌ వచ్చింది. అతని పలకరింపు వినగానే ‘‘హలో నాగరాజుగారు. ఎలా ఉన్నారు?’’ అనడిగాడు. తన గొంతులో ఎంత కుదిరితే అంత ఉత్సాహం చొప్పించాడు, దాని ద్వారా నాగరాజుని కొంచెం కదిలించొచ్చు అని.
      ‘‘బావున్నాను. మీతో మాట్లాడిన తరవాత కొంచెం ఉపశమనం కలిగింది. నా స్వీయ ద్వేషాన్ని మీతో విస్తృతంగా చర్చించే వరకు వాయిదా వేసుకున్నాను. ఇప్పుడొక్కసారిగా బరువు దిగి పోయినట్టుగా చాలా ఖాళీగా ఉన్నట్టుగా అనిపిస్తోంది’’ అన్నాడు నాగరాజు.
      ‘‘అది చాలా మంచి విషయం. పొద్దున ఆరున్నరకి సోమేశ్వర ఆలయం దగ్గరికి వస్తాను. మీరక్కడ ఉండండి. మనం అక్కడి నుంచి నందిహిల్స్‌కి వెళ్లొచ్చు’’ అన్నాడు వీర్రాజు.
      ‘‘సరే. నేను మీకోసం అక్కడ ఎదురు చూస్తుంటాను’’ అన్నాడు నాగరాజు.
      నాగరాజు పరిస్థితి చాలా సంతృప్తినిచ్చింది వీర్రాజుకి. తర్వాతి రోజు మంచి చర్చ జరిగి, ఏదో ఒక దారి దొరుకుతుందనే భావన కలిగింది. ఆ ఉత్సాహంతో హాయిగా నిద్రపోయాడు. 
      పొద్దునే హలసూరు వెళ్లి కారు బైట పెట్టి సోమేశ్వర ఆలయంలోకి వెళ్లాడు వీర్రాజు. దర్శనం చేసుకున్న తరవాత బయటికొస్తుంటే మంటపంలో ఒక సన్నటి, పొడవైన కుర్రాడు కనిపించాడు. సగం గడ్డంతో కప్పేసిన అతని మొహంలో ఏదో ఆకర్షణ. ముఖ్యంగా సూదంటు రాళ్ల లాంటి అతని కళ్లు వీర్రాజుని కట్టిపడేశాయి. అతని నవ్వు ఎంతో సహజంగా ఉన్నా, దాని వెనుక ఏదో తెలియని దిగులు కనిపిస్తోంది.
      కళ్లు కలవగానే ‘‘నమస్కారం’’ అన్నాడు వీర్రాజుని గుర్తించినట్టుగా.
      ‘‘శివార్పణం!!! గుడిలో దేవుడికి తప్ప వేరొకరికి నమస్కారం చెయ్యకూడదు నాగరాజుగారూ’’ అన్నాడు వీర్రాజు నవ్వుతూ.
      ఇద్దరూ గుడి బైటికి నడిచి వీర్రాజు కారులో ఎక్కి నందిహిల్స్‌ వైపునకి సాగిపోయారు. కార్లో ఇద్దరూ పెద్దగా ఏమీ మాట్లాడుకోలేదు. నాగరాజు బయటికి చూస్తూ దీర్ఘాలోచనలో ఉన్నట్టు కనిపించాడు. వీర్రాజు రోడ్డు మీద దృష్టి కేంద్రీకరిస్తూ కారు నడుపుతున్నాడు.
      నందిహిల్స్‌ చేరాక తనకు తెలిసిన ఒక గెస్ట్‌హౌస్‌లోకి దారి తీశాడు వీర్రాజు. గెస్ట్‌ హౌస్‌ వాళ్లు వాళ్లకి ఇచ్చిన గదికి పెద్ద బాల్కనీ ఉంది. అది లోయ వైపునకి ఉంది. అక్కడ కుర్చీలో కూర్చుంటే దాదాపు ప్రకృతిలో ఉన్నట్టుగా ఉంది ఇద్దరికీ.
      కాసేపు ఏమీ మాట్లాడుకోకుండా టీ చప్పరిస్తూ, ఆ సుందర ప్రకృతిని చూస్తూ గడిపారు.
      నాగరాజు తన ఫోన్‌లో ‘గిళియు పంజరదొళిల్ల’ అనే కన్నడ పాట పెట్టి కళ్లు మూసుకుని వింటున్నాడు. ఆ పాట అయిన వెంటనే మళ్లీ అదే పాట పెట్టాడు. ఈ సారి వేరే గొంతు, వేరే ట్యూన్‌. అది కూడా అయ్యాక కళ్లుతెరిచాడు నాగరాజు. అతణ్నే శ్రద్ధగా గమనిస్తున్న వీర్రాజు ‘‘నాకు కన్నడం రాదుగానీ, ఆ పాట పురందరదాసుది కదా’’ అనడిగాడు.
      ‘‘అవును. మొదటిది మహా గాయకుడు పీబీ శ్రీనివాస్‌ పాడింది. రెండోది మనోమూర్తి ట్యూన్, అద్భుత గాయకుడు అశ్వత్థ పాడింది. ఈ పాట నాలో తెలియని భావాలు రేపుతుంది’’ అన్నాడు నాగరాజు.
      కాసేపు మళ్లీ నిశ్శబ్దం వాళ్లిద్దరి మధ్యా వినిపించని రాగంలా రాజ్యమేలింది. అప్పుడప్పుడు వీచే గాలి వల్ల కదిలే ఆకుల చప్పుడు, పక్షుల కిలకిలా రావాలు ఆ రాగానికి పక్క వాయిద్యాల్లా అమరాయి. 
      పావుగంట తరవాత వీర్రాజు వైపునకి తిరిగి ‘‘క్షమించండి. పొద్దున్నే మనసు కొంచెం చెదిరినట్టుగా ఉంటే మళ్లీ దార్లో పెట్టుకుంటున్నాను’’ అన్నాడు.
      ‘‘ఫర్వాలేదు. ఇవాళ మనం ఎలాగైనా ఉందాం. కానీ మనసు ప్రక్షాళన చెయ్యడం ఎలా అనే విషయం గురించి దృష్టి వదలొద్దు’’ అన్నాడు వీర్రాజు నవ్వుతూ. నాగరాజు కూడా నవ్వాడు.
      ‘‘మీ విషయం చెప్పండి నాగరాజుగారూ. మీ మనసుని కొంచెం సమాధాన పరచుకోడానికి కన్నడ పాటలు విన్నారు. కానీ, మీ తెలుగు చాలా బాగుంది’’ అడిగాడు వీర్రాజు.
      ‘‘నేనిక్కడి నుంచి దాదాపు నూట డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పట్టణం నుంచి వచ్చాను. అక్కడే పుట్టి పెరిగాను. కానీ మా మాతృభాష తెలుగే’’ అన్నాడు నాగరాజు. 
      ‘‘మీ తెలుగులో యాస లేదు. బాగా పరిశ్రమ చేశారు’’ మెచ్చుకోలుగా అన్నాడు వీర్రాజు.
      ‘‘తెలుగు సాహిత్యం బాగా చదివా. మా తండ్రిగారు మా ఊరి ప్రభుత్వ గ్రంథాలయానికి అధ్యక్షులుగా ఉండేవారు. తెలుగు, తమిళ, కన్నడ సాహిత్యాలు బాగా చదివారు. అప్పుడప్పుడు వ్యాసాలు కూడా రాసేవారు’’ అన్నాడు నాగరాజు.
      ‘‘అదీ విషయం. మీకు కూడా మంచి సాహిత్య పరిచయం ఉన్నట్టుంది’’ అన్నాడు వీర్రాజు.
      ‘‘కొద్ది కొద్దిగా రకరకాల సాహిత్యాలు చదివాను. మా నాన్నగారి ప్రేరణతో నేను కూడా మాస్టర్స్‌ చేశాను, లైబ్రరీ సైన్స్‌లో’’ అన్నాడు నాగరాజు.
      ‘‘అద్భుతం’’ అన్నాడు వీర్రాజు.
      ‘‘నేనిక్కడ ఒక కార్పొరేట్‌ స్కూల్లో లైబ్రేరియన్‌గా ఉంటున్నాను. నాకు మా యాజమాన్యం చాలా స్వతంత్రం ఇచ్చింది, మా లైబ్రరీలో మంచి మంచి పుస్తకాలు పెట్టడానికి’’ అన్నాడు నాగరాజు.
      ‘‘జీవితం బావుంది కదా’’ అన్నాడు వీర్రాజు.
      ‘‘లేదు. నేను మా ఊళ్లో చదువుకుంటున్నప్పుడు చాలా గౌరవం దొరికేది. ప్రపంచం ఎటు వెళ్తోందో చూడకుండా నాకు నచ్చిన దారిలో వెళ్లిపోయాను. నా ప్రపంచం అంతా పుస్తకాలు, రచయితలు, సాహిత్యం అవే’’ అన్నాడు నాగరాజు.
      ‘ఇతని జీవితంలో ఏ లోపమూ లేదు. బాల్యం నుంచి గూడుకట్టుకుపోయిన నకారాత్మక సహజాతాలేమీ లేవు. చాలా ఆసక్తికర విషయం’ అనుకున్నాడు వీర్రాజు.
      ‘‘అదెంతో అదృష్టం కదా. అలాంటి అవకాశాలు ఎందరికి వస్తాయి?’’ అన్నాడు వీర్రాజు.
      ‘‘నిజమే. నా చిన్న ప్రపంచంలో నాకు అర్థమైన దారిలో నడిచాను. అదే సమయంలో ప్రపంచం చాలా వేగంగా మారుతోందని, దాని ప్రభావం మన జీవితాల మీద పడుతుందని నేను అనుకోలేదు’’ అన్నాడు నాగరాజు.
      కొంచెం ముందుకు వంగి ఆసక్తిగా వింటున్నాడు వీర్రాజు.
      ‘‘మన దేశంలో మధ్య తరగతి ఈ కొత్త మార్పుల వల్ల చాలా ప్రభావితమైంది. ఉద్యోగాలొచ్చే చదువులు అంటూ వచ్చేశాయి. ఆ ఉద్యోగాలూ, వాటి నుంచి లభించే అవకాశాలు, డబ్బులు, విదేశీ ప్రయాణాలు ఇవన్నీ చాలా ఆకర్షణీయ విషయాలైపోయాయి’’ అన్నాడు నాగరాజు.
      ‘‘నిజమే. మధ్యతరగతి కుటుంబాల్లో ఇదొక ప్రముఖ ఘట్టం. పిల్లలు ఈ కొత్త వ్యవస్థల్లో సద్దుకోవడం, కొంతమంది దేశం వదిలి పోవడం, అక్కడి నుంచి అప్పుడప్పుడు రావడం.. ఇదంతా ఒక సహజ జీవన విధానం అయిపోయింది’’ అన్నాడు వీర్రాజు.
      ‘‘అదే నాకు సమస్యగా తయారైంది. నేను జీవితంలో ఎన్నో సాధిస్తానని కలలుగనే వాడిని. తీరా నేను ఉద్యోగంలోకి వచ్చేసరికి నా ఉద్యోగానికి చాలా తక్కువ విలువ ఉంది. అందరూ నన్ను పట్టించుకోవడం మానేశారు. మా నాన్నగారి స్నేహితులు కొందరు నాకు సరిగా చదువు రాకపోవడం వల్ల లైబ్రరీ సైన్స్‌ చదివానని, దాని గురించి ఆయన బాధపడకూడదని కల్పించుకుని ఓదార్చే వాళ్లు’’ అన్నాడు నాగరాజు.
      ‘‘మీ నాన్నగారు బాధపడేవారా?’’ అడిగాడు వీర్రాజు.
      ‘‘ఆయన నాక్కావాల్సిన దార్లో వెళ్లినందుకు సంతోషించాలో, కొత్త దారుల్లో వెళ్లనందుకు బాధపడాలో తేల్చుకోలేక ఇబ్బంది పడేవారు. నన్నుమాత్రం ఎప్పుడూ ఏమీ అనలేదు’’ అన్నాడు నాగరాజు.
      ‘‘అది చాలా మంచి పద్ధతి. పిల్లలు తల్లిదండ్రుల ద్వారా వస్తారుగానీ, వాళ్ల నుంచి కాదంటాడు ఖలీల్‌ జిబ్రాన్‌. వాళ్లద్వారా ఈ ప్రపంచంలోకి వచ్చింది ఒక సంపూర్ణమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి. దారి చూపించడమేగానీ వాళ్లని తమ ఆలోచనల స్థాయికి పరిమితం చెయ్యకూడదు’’ అన్నాడు వీర్రాజు.
      ‘‘మా నాన్నగారు తన భావాలు వ్యక్తపరచి ఉంటే బావుండేదేమో. నేను బలవంతంగానైనా ఆ కొత్త దారుల్లో వెళ్లేవాణ్ని. అటు వెళ్లకపోవడానికి కారణం నా చేతగానితనం కాదు. నేను కావాలనే ఈ దారిలోకి వచ్చాను’’ అన్నాడు నాగరాజు. అతనిలో కొంచెం బాధ, ఓడిపోయానేమో అన్న అనుమానం కనిపిస్తున్నాయి.
      ‘‘మీరు చేసింది తప్పని ఎందుకనిపిస్తోంది? మనసుకి నచ్చిన పని చెయ్యడానికి చాలా మందికి అవకాశం రాదు. వచ్చినా ధైర్యం ఉండదు. మీకు రెండూ ఉన్నాయి కదా’’ 
      ‘‘ఈ ప్రపంచం ఆ విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. అదో పెద్ద భారం అయి కూర్చుంది’’
      ‘‘మీరు ఎంచుకున్న ఈ దారి తప్పని ఎవరైనా అన్నారా?’’ వీలైనంత వరకు తన గొంతులో ఎలాంటి భావాలూ లేకుండా చూసుకుంటున్నాడు వీర్రాజు. ఏదోక భావం చూపిస్తే ఎదుటివాళ్లు సహజంగా చెప్పలేరనేది అతనికి అనుభవంతో తెలిసిన విషయం.
      ‘‘ఆ విషయం నాకు మాటి మాటికీ గుర్తు చేస్తూనే ఉన్నారు. మొదట్లో నేను నవ్వుకుని ముందుకు సాగిపోయేవాణ్ని. కానీ నెమ్మదిగా అది నా నరాలను పట్టేయడం ప్రారంభించింది’’
      ‘‘ఒకటి రెండు ఉదాహరణలు చెప్పండి’’ 
      ‘‘నేను బెంగళూరు వచ్చినప్పటి నుంచి ఎదుర్కొంటున్న సంఘటనలన్నీ అలాంటివే. ఒకటి రెండు వేరు చెయ్యడం చాలా కష్టం. అయినా ప్రయత్నిస్తాను’’ అన్నాడు నాగరాజు.
      తాను కూర్చున్న కుర్చీలో కొంచెం ముందుకు వంగి శ్రద్ధగా వింటున్నాడు వీర్రాజు.
      ‘‘నేను లైబ్రరీ సైన్స్‌ చదివాను కదా. పుస్తకాలు ఎలా కూర్చాలి? ఎలా సంరక్షించాలి? లాంటి విషయాలతో బాటు సాఫ్ట్‌వేర్‌ వాడటం కూడా వచ్చు. డిజిటల్‌ లైబ్రరీలు నిర్వహించడం కూడా వచ్చు. కానీ, ఆ సాఫ్ట్‌వేర్‌లో ఏవైనా సమస్యలొస్తే ఎలా పరిష్కరించాలో తెలియదు. మాకు సహాయం చెయ్యడానికి ఒక కుర్రాడు ఉండేవాడు. అతణ్ని పిలిస్తే ఎప్పటికోగానీ పలికేవాడు కాదు. ఏమైనా అడిగితే ‘మీలా కాదు మా పని, చాలా కష్టం. మీకేం తెలుస్తుంది’ అనేవాడు. అవసరం మాదని మా డైరెక్టర్‌ గారు కూడా వాణ్ని జాగ్రత్తగా చూసేవారు. అతని తీరు చాలా అవమానకరంగా ఉండేది’’ అన్నాడు నాగరాజు.
      ‘‘సాఫ్ట్‌వేర్‌ సిస్టంలు మనం చేసే పని మీద ఆధారపడి ఉంటాయి. మన పని లేకపోతె వాళ్లకి విలువే లేదు కదా’’ అన్నాడు వీర్రాజు.
      ‘‘నిజమే. కానీ మా డైరెక్టర్, ఇతర సీనియర్లు మా పనులు చెయ్యడంలో నిష్ణాతులు. అయితే, ఆ కంప్యూటర్‌ అంటే ఏదో తెలియని భయం. దాంతో ఆ డబ్బా మీద పనిచేసేవాళ్లు మాన్యులని, మిగిలిన వాళ్లు సామాన్యులని భావిస్తారు’’ అన్నాడు నాగరాజు.
      ‘‘ఈ కాలంలో అన్ని రంగాల్లో కొలమానంతో కూడిన నిర్వహణ ముఖ్యమైపోయింది. మనం ఏ విషయంలో ఎక్కువ లేదా కొంచెం తక్కువ నిష్ణాతులమో అది చాలా ముఖ్యమైన విషయం అవుతుంది. గోల్డ్‌రాట్‌ గురించి చదివారా?’’ అడిగాడు వీర్రాజు.
      ‘‘అలా అంటారా. అంటే అలా మమల్ని అవమానించినట్టు కాదా?’’ అనడిగాడు నాగరాజు.
      ‘‘ఎలా అవుతుంది? మీ సంస్థకు సంబంధించి ఏదీ ఆ సాఫ్ట్‌వేర్‌ కుర్రాడికి ఇవ్వలేదు కదా. అతని సలహా కూడా అడగరు. అతని పాత్ర చాలా చిన్నది. అయితే అది శంఖం. తమకు సమస్య వచ్చినప్పుడు అతను అందుబాటులో ఉండేలా చూసుకుంటారు’’ అన్నాడు వీర్రాజు.
నిశ్శబ్దంగా ఆలోచనలో పడ్డాడు నాగరాజు. 
      ‘‘ఇంకో ఉదాహరణ చెప్పండి’’ అనడిగాడు వీర్రాజు. నాగరాజులో వచ్చిన చిన్న మార్పు అతనికెంతో ఉత్సాహాన్నిచ్చింది.
      ‘‘మా మేనమామగారి అమ్మాయి ఎలా మారిపోయిందన్నది ఒక ముఖ్యమైన ఉదాహరణ. దీనికి మీ తర్కం పనిచెయ్యదు. చిన్నప్పటి నుంచి మాకు పెళ్లి చేద్దామనుకునేవారు. నాకు తనంటే చాలా ఇష్టం. తీరా మాకు పెళ్లి వయసు వచ్చేసరికి తను నన్ను వద్దని ఒక సాఫ్ట్‌వేర్‌ కుర్రాణ్ని చేసుకుని అమెరికా వెళ్లిపోయింది’’ అన్నాడు నాగరాజు.
      ‘‘దానికీ, మీరు ఎంచుకున్న దారికీ ఏంటి సంబంధం?’’ అనడిగాడు వీర్రాజు.
      ‘‘నేను కూడా ఇప్పటి కుర్రాళ్లలాగా సాఫ్ట్‌వేర్‌లోకి వెళ్లుంటే ఇలా జరిగేది కాదు కదా’’ 
      ‘‘ఆమాట తనందా?’’ 
      ‘‘లేదు. అంత స్పష్టంగా అనలేదు. ఏవో కథలు చెప్పింది. తాను నన్నెప్పుడూ అలాంటి దృష్టితో చూడలేదనీ, నా ఇష్టాఇష్టాలు, తన అభిరుచులు ఒకటి కాదనీ ఏవేవో చెప్పింది. కానీ అసలు విషయం సోషల్‌ స్టేటస్‌’’ 
      ‘‘ఇది విచిత్రంగా ఉంది. ఇంత స్పష్టంగా ఆలోచించగలిగే మీరు ఈ విషయంలో ఇలా ఆలోచించడం విచిత్రంగా ఉంది. వీటినే బ్లైండ్‌ స్పాట్స్‌ అంటారు’’
      ‘‘అంటే నా కళ్లముందు జరుగుతున్న విషయాలు కూడా నాకు కనిపించట్లేదని అంటారా?’’ అనడిగాడు నాగరాజు. అతని గొంతులో అసహనం తొంగిచూస్తోంది.
      ‘‘కాదు. నేననేదేంటంటే, ఆవిడ మీ జీవితాన్ని మీరు ఊహించని మలుపు తిప్పింది. కానీ అది ఆవిడ కావాలని చేసిన పని కాదుకదా. మీ ఆలోచనలు సరైనవని రుజువు చేసేందుకు ఆవిడకున్న హక్కులు హరించలేరు’’ అన్నాడు వీర్రాజు. అతని పంధాలో నాగరాజుని రెచ్చగొట్టే ప్రయత్నం కనిపిస్తోంది.
      ‘‘అంటే, మీరు కూడా తననే సమర్థిస్తున్నారా?’’ అనడిగాడు నాగరాజు కొంచెం కోపంగా.
      ‘‘మీ జీవితంలోని విషయాల మీద నాకెలాంటి ఆసక్తీ లేదు. మీ ఇద్దరిలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనే విషయం గురించి కాదు మన చర్చ. మీరు సమస్యని చాలా దగ్గరగా చూస్తున్నారు. దాంతో మీ దృష్టి సంకుచితమై విస్తారంగా చూడటం మానేశారు. మీ దృష్టి కాబట్టి ఆ కాస్తలో కూడా మీరే నిండిపోయి ఉన్నారు’’ అన్నాడు వీర్రాజు.
      ‘‘అంటే నేను సరిగా అర్థం చేసుకోలేదనీ, అందుకే తప్పంతా నాదేననీ నిర్ధారించేస్తారా?’’ అడిగాడు నాగరాజు ఆవేశంగా. 
      శాంతంగా నవ్వాడు వీర్రాజు. ఇప్పుడు సంభాషణ సరైన దారిలో సాగుతోందనిపించింది. నాగరాజు తన భావోద్వేగాలను ఎంతగా అనుభవిస్తే అంత తొందరగా వాటిని బయటికి నెట్టి అతడిని ప్రక్షాళన చెయ్యొచ్చు.
      ‘‘మళ్లీ మీరు తప్పొప్పుల వైపునకే వెళ్తున్నారు. మానవ జీవితంలో కొన్ని పొరపాట్ల ఆవరణలు ఉంటాయి. వాటిని గుర్తించకపోతే మన మనసుకు ఒక తాళం పడిపోతుంది’’ అన్నాడు వీర్రాజు. ఆ మాట ఎక్కడో లోతుగా తగిలినట్టు నిశ్శబ్దంగా అయిపోయాడు నాగరాజు. కాసేపు తలదించుకుని ఆలోచించాడు.
      ‘‘వాటి గురించి నేను కూడా కొంచెం చదివాను. ఎరోనియస్‌ జోన్ల గురించి వైన్‌ డైర్‌ రాశారు కదా. అది పూర్తిగా కాపీ అని ఆల్బర్ట్‌ ఎల్లిస్‌ ఆరోపించారు కూడా’’ అన్నాడు నాగరాజు నెమ్మదిగా.
      ‘‘అదంత ప్రముఖ విషయం కాదు. మన దృష్టి మన సమస్య మీదే కేంద్రీకరించాలి. ఈ ప్రపంచంలో ఆలోచనలు ఎవరి సొత్తూ కాదు. జ్ఞానం కూడా ఒక ఓపెన్‌ సోర్సే అని, అందుకనే దాని గురించి ఎవరికి గౌరవం దక్కాలో పట్టించుకోనక్కరలేదని మన ప్రాచీన మహర్షులు ప్రతిపాదించారు. ఈ ఆధునిక కాలంలో కూడా అలాంటి వాళ్లు ఉన్నారు. ఉదాహరణకు బ్రెజిల్‌కి చెందిన గొప్ప రచయిత పాలో కొయిలో’’ అన్నాడు వీర్రాజు.
      ‘‘అవుననుకోండి. అయితే ఆ ఎరోనియస్‌ జోన్ల గురించి విస్తృతంగా చదవలేదు. వాటిని మన జీవితంలోని సంఘటనలకు ముడిపెట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యలేదు’’ అన్నాడు నాగరాజు.
      ‘‘కొంత కాలంగా మీరు సమస్యకు చాలా దగ్గరగా వెళ్లి చూస్తున్నారు. దానివల్ల మీకు సమాంతరంగా ఆలోచించే అవకాశం పోయింది. ఈ పొరపాట్ల ఆవరణలు మనలో కలిగించే సమస్యలు అపార్థం చేసుకోవడం, హ్రస్వదృష్టితో ప్రవర్తించడం... ఇలాంటివన్నీ ఆ ఆవరణల్లోకి వస్తాయి. దాని వల్ల ఆందోళన చెందడం, అపరాధ భావన, నిస్సహాయత, తెలియని కోపం, భావదారిద్య్రం లాంటివి కలుగుతాయి’’ అన్నాడు వీర్రాజు.
      నాగరాజు మొహంలో ఒక వెలుగు కనిపించింది. తన సమస్యని మ్యాప్‌ చేసి విశ్లేషించడం, అది తన ప్రస్తుత పరిస్థితికి దగ్గరగా ఉండటం అతనికి ఒక విధమైన ఉద్వేగం కలిగించింది. ‘‘నా పరిస్థితి సరిగ్గా అదే’’ అన్నాడు.
      ‘‘అప్పుడే మనమేమీ నిర్ధారించవద్దు. ఇంకా ఉదాహరణలు చెప్పండి’’ అన్నాడు వీర్రాజు.
      ‘‘మా మామయ్యగారి అమ్మాయి విషయం వదిలి నా జీవితాన్ని మెల్లగా ముందుకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. అక్కడా అలాంటి అనుభవాలే. నా సహాధ్యాయి ఒకమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకున్నా. తను స్పష్టంగా తోసిపుచ్చింది. దానిక్కారణం నేను సాఫ్ట్‌వేర్‌లో లేకపోవడమని అంది’’ అన్నాడు.
      ‘‘ఆవిడ ప్రాధాన్యాలు ఆవిడవి కదా. మనం దాన్ని మీ పరిస్థితితో ముడిపెట్టకూడదు’’ అన్నాడు వీర్రాజు.
      ‘‘నేను కూడా సాఫ్ట్‌వేర్‌లో ఉంటే అలా జరిగేది కాదు కదా?’’ అన్నాడు నాగరాజు.
      ‘‘అదొక ఊహాత్మక విషయం. మీరు సాఫ్ట్‌వేర్‌లో ఉంటే ఒక టీచర్‌ని చేసుకుందామని ఎందుకనుకుంటారు? మీకు వేరే ప్రాధాన్యాలు ఉండేవి కదా’’ అన్నాడు వీర్రాజు.
      నివ్వెరపోయాడు నాగరాజు. ‘‘నిజమే కదా. నా వైపు నుంచి ఆలోచించడం కోసం మిగతా ప్రపంచాన్ని నేను స్థిరీకరించేశాను’’ అన్నాడు.
      ‘‘ఇంకా చెప్పండి’’ అన్నాడు వీర్రాజు.
      ఈ సంభాషణ వల్ల తన మనసులోని తాళాలు ఒక్కటొక్కటిగా తెరచుకుంటున్నట్టు అనిపించడంతో చాలా ఉత్సాహంగా ఉన్నాడు నాగరాజు. దారి దొరుకుతున్నట్టు అనిపించింది.
      ‘‘నా స్కూల్‌ స్నేహితులని కలిసినప్పుడు కూడా ఇలాంటి అనుభవాలే. ఆ మధ్య మేమందరం ఒక స్నేహితుడి ఇంట్లో కలిశాం. ఒక స్నేహితుడి భార్య నాకు తన చెల్లెల్ని ఇచ్చి చేస్తే బావుంటుందనుకుంది. కానీ నేను లైబ్రేరియన్‌ అని తెలిసి విరమించుకుంది’’ అన్నాడు. అయితే, ఇంతకు ముందులా అదేదో చాలా అన్యాయమైపోయిన భావన రావట్లేదు. చిత్రంగా, హాస్యాస్పదంగా అనిపిస్తున్నాయి
      ‘‘మీరు చూడటానికి అందంగా, ఉత్సాహంగా కనిపిస్తారు కదా’’ అన్నాడు వీర్రాజు.
      ‘‘కానీ ఏం లాభం? అక్కడ ఎంపిక వేరే విషయాల మీద ఆధారపడి ఉంది’’ అన్నాడు నాగరాజు.
      ‘‘మన దేశంలో ఎనభైల్లో పద్ధతులు మార్చుకున్న తరవాత మధ్య తరగతిలో ఒక్కసారిగా ఆశలు ఉవ్వెత్తున లేచాయి. అవి మెల్లిగా గట్టిపడి అలా కాకుండా ఇంకోలా ఉండటం చాలా తప్పు అనే భావన కలగడం ప్రారంభమయ్యింది’’ అన్నాడు వీర్రాజు.
      ‘‘ఇందాక మీరన్నట్టు అవి వాళ్ల ప్రాధాన్యాలు. తప్పేమీ లేదు కదా?’’ అనడిగాడు నాగరాజు
      ‘‘అందులో తప్పు ఒప్పు లేదు. అయితే ఒక సమస్య ఏర్పడింది. అదేమిటంటే, ఈ ఆశల ప్రజలు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలని గుర్తించలేకపోవడం. అది వాళ్లని తీవ్ర నిస్పృహకి గురి చేస్తోంది’’ అన్నాడు వీర్రాజు.
      ‘‘అంటే’’ అనడిగాడు నాగరాజు.
      ‘‘ఇందాక మీరు చేసినట్టే చాలామంది తన స్థానాన్ని మాత్రమే కదిలించి మిగతా ప్రపంచం అంతా స్థిరంగా ఉంటుందనుకుంటారు. అలా జరగదు. ఉదాహరణకు నాకో స్నేహితుడున్నాడు. తనకి చిన్నప్పటి నుంచి కళలంటే చాలా ఇష్టం. తను బాగా సాహిత్యం చదువుతాడు. అప్పుడప్పుడు రాస్తాడు కూడా. తను సాఫ్ట్‌వేర్‌లో చేరాడు. వాడి ఆలోచనలు మిగిలిన వాళ్లకంటే వేరుగా ఉండటంతో ఎవరిలోనూ చేరలేక పోయేవాడు. వాడు పదిమందితో కలిసి పనిచేయలేడనీ, చేయించలేడనీ పేరొచ్చేసింది. వాడికి మేనేజర్‌ ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అదేదో చాలా దుర్భరమైన విషయమనుకునే వాడు తను’’ అన్నాడు వీర్రాజు.
      ‘‘అందులో మీ స్నేహితుడి తప్పేముంది? ఆమాటకొస్తే నా పరిస్థితి కూడా కొంచెం అదే’’ అన్నాడు నాగరాజు.
      ‘‘మనం ఒక దారి ఎన్నుకున్నప్పుడు మనం ఆ దారిలో నాయకత్వం వహించేంతగా ఎదిగేలా ఉండాలి లేదా మన చుట్టుపక్కల పరిస్థితులని గుర్తించి మన నిస్పృహకు సమాధానం చెప్పాలి. అలా కాకుండా మనం మనకంటే ఆలోచనల్లో కొంచం తక్కువ వాళ్లని మనతో సమానం అనుకుని సరిపోల్చుకుంటే అది మనకీ హింస. మనవల్ల ఇతరులకీ హింస’’ అన్నాడు వీర్రాజు.
      ‘‘మా నాన్నగారనే వారు, మనం ఇప్పుడు స్కూల్‌ పిల్లలతో ఒక రోజంతా గడపాలంటే పిచ్చెక్కి పోతుంది. అదే టీచర్‌లాగ గడిపితే ఇబ్బంది ఉండదు అని. ఇది అలాంటి విషయమే’’ అన్నాడు నాగరాజు.
      ‘‘అవును. ఇంకా చెప్పండి’’ అన్నాడు వీర్రాజు. నాగరాజు సంభాషణలో పాల్గొంటున్న పద్ధతి అతనికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
      ‘‘ఇప్పుడు అర్థమవుతోంది. నా పొరపాట్ల ఆవరణలు గుర్తించాల్సింది పోయి ఇంకా వాటికి దగ్గరయ్యే ప్రయత్నం చేశాను. దానివల్ల నాలోని జీవ శక్తి వికటించింది’’ అన్నాడు నాగరాజు.
      ‘‘అవును. అప్పుడప్పుడు ఆలా జరుగుతుంటుంది. మనకి ఎంత జ్ఞానం ఎక్కువైతే సమస్య అంత లోతు అవుతుంది. రావణుడు మహా పండితుడు, జ్ఞాని. ఆయన దారి తప్పితే ఎంత ప్రమాదకరంగా తయారయ్యాడో మనకి రామాయణం చెబుతుంది’’ అన్నాడు వీర్రాజు 
      ‘‘నా నిరాశా నిస్పృహలకు కారణం ఇప్పుడర్థమైంది. మరి నాకొచ్చిన వికృతమైన ఆలోచనల సంగతేంటి?’’ అనడిగాడు నాగరాజు
      ‘‘సాధారణంగా పొరపాట్ల ఆవరణలు ప్రకోపిస్తే మనుషులు విపరీతమైన ఆందోళనకి గురవుతారు. ఆ పరిస్థితిలో వాళ్ల మీద వాళ్లకి నమ్మకం తగ్గిపోతుంది. తాను చెయ్యాల్సిన పనేదో చెయ్యలేదేమో అనే అపరాధ భావం ఎక్కువై తెలియని కోపం కలుగుతుంది. ఈ నకారాత్మక శక్తి తరచుగా లైంగిక వక్రతగా మారవచ్చు. దాని వ్యక్తీకరణ రెండు రకాలుగా జరగొచ్చు. ఒకటి తనకు తాను హాని చేసుకోవడం, దాన్నే లైంగిక వ్యథా ప్రకోపితానందం లేదా మాసుకిజం అంటారు. లేదా ఇతరులకి హాని చెయ్యడం.. దాన్ని లైంగిక క్రూరత్వం లేదా శాడిజం అంటారు. మీది చాలా బలమైన వ్యక్తిత్వం అవడం వల్ల మీ వ్యక్తీకరణ రెండో వైపునకు వెళ్లింది’’ అన్నాడు వీర్రాజు, అది చాలా సాధార విషయమే అని ధ్వనించేలా. అది చాలా ముఖ్యం లేకపోతే నాగరాజు అపరాధభావం పెంచుకుని ఇంకో సమస్యలో పడొచ్చు.
      ‘‘అది అర్థమవుతోంది. కానీ చిన్నపిల్లలెందుకని. నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఇప్పుడు వాళ్ల దగ్గరికి వెళ్లాలంటేనే భయం వేస్తోంది, నేనేమైనా హాని చేస్తానేమో అని’’ అన్నాడు నాగరాజు కొంచెం ఆందోళనగా.
      ‘‘మీరు మీ సమస్యను పెంచుకుంటూ పోవడంతో మీ నమ్మకానికి వ్యతిరేకంగా ఉండే ప్రతి విషయం మిమ్మల్ని సవాలు చేసి ఉంటుంది. ఆ సవాలుని ఎదుర్కోకుండా మీరు పారిపోయే ప్రయత్నం చేశారు. దానివల్ల మీకు ధైర్యం పూర్తిగా సన్నగిల్లింది. మీ కసి తీర్చుకునేందుకు పెద్దవాళ్లని లక్ష్యంగా చేసుకునే ధైర్యం లేక పిల్లల మీద దాడి చేస్తున్నట్టు ఊహించుకోవడం మొదలెట్టారు. కొన్నాళ్లయ్యేటప్పటికి అది చాలా మామూలు విషయమన్నట్లు మీ మనసుని ఆక్రమించి ఉంటుంది’’ అన్నాడు వీర్రాజు.
ఒక్కక్షణం నివ్వెరపోయాడు నాగరాజు. ‘‘నాలో ఇన్ని దరిద్రాలు ఉన్నాయా’’ అని గొణుక్కున్నాడు.
      ‘‘మహర్షి మహేష్‌ యోగి చెప్పినట్టు ఆలోచనల్లో మంచి చెడ్డ ఉండవు. వాటి నుంచి మనం ఉత్పన్నం చేసే చర్యలు మాత్రమే మంచివో చెడ్డవో అవుతాయి’’ అన్నాడు వీర్రాజు ఊరడింపుగా.
      దిగులుగా తలదించుకుని కూర్చున్నాడు నాగరాజు. ఈ సంభాషణ అతనిలో ఒక తుపాను రేపుతున్నట్టుంది.
      ‘‘మీలో ఒక గొప్ప లక్షణం ఉంది. ఈ విషయాలన్నీ ఇంత స్పష్టంగా అర్థం కాకపోయినా మీలోని నకారాత్మక భావనలను వాటి వల్ల జరగబోయే అనర్థాలను గుర్తించారు. దాని వల్ల మీ సమస్య అంత సంక్లిష్టం కాలేదు. ఇంకొన్నాళ్లు ఇలాగే వదిలేసి ఉంటే ఆ ప్రమాదంలో పడుండేవారు’’ అని ముగించాడు వీర్రాజు.
      లోయలోకి చూస్తూ చాలాసేపు మౌనంగా కూర్చున్నాడు నాగరాజు. అతని మనసులో ఎన్నో భావాలు రేగుతున్నాయి. ఆ విషయం అర్థమైన వీర్రాజు అతణ్ని కదిలించలేదు. ఒక నాలుగు గంటలు గడిచాయి. నాగరాజు లేచి లోపలికి వెళ్లాడు. గదిలో ఉన్న కాఫీ మేకర్‌లో కాఫీ కలిపి రెండు కప్పుల్లో పోసి తీసుకొచ్చాడు.
      ‘‘పూర్తిగా ప్రక్షాళన కావడానికి కొంచెం సమయం పట్టొచ్చు. మళ్లీ ఇలాంటి సమస్యల్లో పడకుండా ఏం చెయ్యొచ్చు’’ అనడిగాడు నాగరాజు కాఫీ కప్పు అందిస్తూ.
      ‘‘హెర్మన్‌ హెస్‌ సిద్ధార్థ చివర్లో నదీ ప్రవాహం పక్కనే కూర్చుని చూస్తుంటాడు. నది నుంచి వచ్చే మాటలు వింటాడు. వేయి గొంతుకలతో పాడే ఆ నది పాట శ్రద్ధగా విన్నప్పుడు సుఖ దుఃఖ ధ్వనులకు కట్టుబడకుండా అన్నింటిని తనలో లీనం చేసుకున్నప్పుడు ఆ వేయి గొంతుకల పాట సిద్ధార్థుని ఒక్క మాటలో మోగింది. ఆ మాట ఓంకారం. అంటే, పరిపూర్ణం. అలాంటి భావాన్ని అలవరచుకోండి’’ అన్నాడు వీర్రాజు.
      ‘‘చాలా బాగా ధ్వనిస్తోంది. కానీ, ఏమీ అర్థంకాలేదు. ఏదోక మార్గం చెప్పండి’’ అనడిగాడు నాగరాజు ప్రాధేయ పూర్వకంగా.
      ‘‘మహర్షి ఉపదేశించిన భావాతీత ధ్యానం నేర్చుకోండి. మనకి తెలిసిన ధ్యానాలన్నిటిలోను అదే శ్రేష్ఠం. మనలో రేగే ఆలోచనలను గౌరవిస్తూ సాపేక్షంగా చూస్తూ ఉండే శక్తి కలుగుతుంది. మనలో వక్రమైన ఆలోచనలు రావు’’ అన్నాడు వీర్రాజు.
      ఇద్దరూ సిటీ వైపునకి బయలుదేరారు. వీర్రాజు కారులోని రేడియోలో మధుర గీతం ‘ఎదుట నిలిచింది చూడు.. జలతారు వెన్నెలేమో... ఎదను తడిపింది నేడు.. చినుకంటి చిన్నదేమో.. మైమరచిపోయా మాయలో..’’ మోగుతోంది
      ఇద్దరూ మళ్లీ తమ ఆలోచనల్లో మునిగి ప్రయాణం చేస్తున్నారు.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


వాళ్లు ఏడ్చారు!

వాళ్లు ఏడ్చారు!

పి.చంద్రశేఖర అజాద్‌


స్వ‌యంవ‌ధూ...!?

స్వ‌యంవ‌ధూ...!?

దోరవేటి, (వి.చెన్నయ్య)


సువర్ణ గన్నేరు పూలు

సువర్ణ గన్నేరు పూలు

ప్రసాదమూర్తి


స‌మిధ‌

స‌మిధ‌

సయ్యద్‌ సలీం


అతడూ మనిషే!

అతడూ మనిషే!

పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


దాసరి పాట (క‌థాపారిజాతం)

దాసరి పాట (క‌థాపారిజాతం)

చింతా దీక్షితులుbal bharatam