ఎనభయ్యో పడికి చేరువవుతున్నా కృపాకరానికి వైద్య వృత్తి మీద అదే ప్రేమ. కానీ, ఆసక్తి ఉన్నా, శారీరక శక్తి సహకరించట్లేదు! ఆస్పత్రిలో అదే చర్చ! ఇలాంటి పరిస్థితుల్లో ఆయన జీవితంలో ఏం జరిగింది?
సాయంత్రం నాలుగైంది. మెడికల్ కాలేజీ క్లాస్‌రూం నుంచి విద్యార్థులు ఆప్రాన్లు చేతబట్టుకుని బయటికొస్తున్నారు. సర్జరీ క్లాసు తీసుకున్న హెచ్ఓడీ డాక్టర్ సాంబమూర్తి, వాళ్లకన్నా వేగంగా బయటికొచ్చి, వడివడిగా స్టాఫ్ రూం వైపు వెళ్తున్నాడు.
స్టాఫ్ రూంలోకి వెళ్లగానే సర్జరీ పీజీ రాజేష్, సర్జరీ రిజిస్ట్రార్ సుదర్శన్ లేచి నిల్చున్నారు. సర్జరీ ప్రొఫెసర్ రవి కుమార్ ‘‘రండి సర్, మీకోసమే వెయిటింగ్’’ అన్నాడు టీ జుర్రుతూనే. నిలబడ్డ వాళ్లని కూర్చోమని సైగ చేసి తాను కూడా కూర్చున్నాడు సాంబమూర్తి. ‘‘చెప్పండి సర్ ఏంటి విషయం. ఇంత అర్జెంటుగా మీటింగ్ పెట్టారు?’’ రవికుమార్‌ని అడిగాడు మూర్తి.
‘‘ఏముందండీ, మళ్లీ కృపాకరంగారి గురించే, చెప్పవోయ్!’’ అని పీజీ రాజేష్ వైపు చూసి అన్నాడు రవి కుమార్.
‘‘నేనూ, కృపాకర్ సర్ ఓపీడీ చూస్తున్నాం సర్. ఆయన ఇన్ పేషంట్లను చూసి వెళ్తానన్నారు. ఎంతమంది పేషంట్లు ఉన్నారో, ఎక్కడ ఉన్నారో చెప్పాను. ఆరుగుర్ని చూసి, రెండో మేల్ వార్డులో ఇద్దర్ని చూడటం మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయారు సర్. ఆ ఇద్దరు పేషెంట్ల తరఫువాళ్లు మధ్యాహ్నం గొడవ చేశారు సర్’’ అని చెప్పాడు రాజేష్.
‘‘ఆ తర్వాత నేను వెళ్లి పేషంట్లను చూసి, అటెండర్లకు సమాధానం చెప్పాల్సొచ్చింది. ఇలాంటి మతిమరుపు ఎక్కువయ్యింది ఆయనకి’’ అన్నాడు ప్రొఫెసర్ రవి కుమార్.
‘‘తెలిసిందే కదండీ. అందుకే చెప్పాను, రౌండ్స్ వేసేటప్పుడు ఆయనతో ఉండమని’’ రాజేష్‌ని మందలించాడు సాంబమూర్తి.
సర్జికల్ రిజిస్ట్రార్‌గా డిపార్ట్మెంట్లో కొత్తగా చేరాడు సుదర్శన్. ‘‘ఇప్పటికే కృపాకరం గారికి ఇన్ పేషంట్లను వీలైనంత తగ్గించాం సర్. ఓపీడీలో పేషంట్లను ఆయన దగ్గరికి పంపకపోయినా, ప్రత్యేకంగా ఆయన కోసమే వచ్చేవాళ్లున్నారు. మొన్న అలాంటి ఒక పేషంటు చేతి మీదున్న సబేసియస్ సిస్ట్ తెలియక ఆయనతో తీయించుకున్నాడు. లోకల్ అనస్థీషియా సరిగా ఇవ్వకుండా చేశారట కృపాకరం గారు. అయ్యాక అతడు ఒకటే గోల’’ ఇంకో కంప్లైంటు చెప్పాడు సుదర్శన్.
రవి కుమార్ అందుకుని ‘‘మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. మీకెందుకండీ భయం. సున్నితంగా చెప్పండి ఆయనకి, ఇక విశ్రాంతి తీసుకొమ్మని’’ అన్నాడు సాంబమూర్తితో.
‘‘ఒక్కసారి కాదండీ, 12 ఏళ్ల క్రితం ఆయన దగ్గర్నుండి హెచ్ఓడీగా బాధ్యతలు తీసుకున్నప్పుడే చెప్పా, ఇక హాయిగా మనవళ్లతో ఆడుకోండి సార్ అని. ఇంట్లో ఖాళీగా ఉండలేక ఒక వారం తర్వాత మళ్లీ వచ్చేశారు. ‘ఒంట్లో శక్తి ఉన్నంత వరకు సర్జరీ చేస్తా, ప్రాణం ఉన్నంత వరకు పాఠాలు చెబుతా’ అంటారు. ఆయన ఉద్దేశం మంచిదేగా. నేను కూడా ఆయన స్టూడెంట్‌నే. ఆయన ఇంకొన్నాళ్లు వస్తే మన పీజీలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఏమీ అనలేదు నేను’’ వివరించాడు సాంబమూర్తి.
‘‘కానీ చూస్తున్నారుగదా సర్, రెండు నెలల్లో మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో. 65 ఏళ్లకే రిటైర్ అవ్వాల్సినాయన, ఇప్పుడు 78 ఏళ్లు వచ్చాయి. జరగకూడనిది జరిగితే మీ మీదనే పడుతుంది’’ అన్నాడు రవి కుమార్ ఖాళీ టీ గ్లాస్‌ని పక్కన పెడుతూ.
‘‘అదీ నిజమేలెండి. రేపొకసారి చెప్పి చూస్తా ఆయనకి’’ వెళ్లడానికి లేస్తూ అన్నాడు సాంబమూర్తి. మీటింగ్ అయ్యాక అందరూ ఇళ్లకి బయల్దేరారు. ఇంటికెళ్లే దార్లో ఒకటే ఆలోచన మూర్తికి.
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు గ్రామంలో ఓ నిరుపేద దళిత కుటుంబంలో పుట్టాడు కృపాకరం. వాళ్ల కుటుంబంలో మొదటి డాక్టర్. సర్జన్ అయ్యాక లండన్ వెళ్లి ఎఫ్ఆర్సీఎస్ పూర్తి చేశాడు. అప్పటికి జిల్లా మొత్తంలో అంత చదివింది ఆయనే.
తిరిగి ఇండియా వచ్చాక ఎంత పేరొచ్చినా, ప్రైవేటు ప్రాక్టీస్ పెట్టకుండా, బోధన మీద ఇష్టంతో మెడికల్ కాలేజీలోనే పనిచేశాడు. ఆయన చేతికింద ఎంతో మంది వైద్య విద్యార్థులు మంచి సర్జన్లయ్యారు. సర్జరీలో ఆయన కనుగొన్న ఎన్నో కొత్త పద్ధతులు మెడికల్ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ఊళ్లో ఎందరికో చదువుకు సాయం చేశాడు.
స్పెషలిస్ట్ సర్జన్లు లేని రోజుల్లో న్యూరోసర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ కూడా చేసేవాడు. మనిషి బక్కపలచగా ఆరడుగుల ఎత్తుంటాడు. టేకు ఆకంత వెడల్పు ఉన్న చేతుల్ని చూస్తే ఒక్క పట్టున జారిన కీళ్లని సరిచేయగలడని నమ్మేలా ఉంటాయి.
ఎంత పనిచేసినా అతనికి జీతం కన్నా ఒక్క రూపాయి అదనంగా రాదు. అయినా ఒక్కోసారి సూర్యోదయానికి ముందే రౌండ్స్ ముగించుకుని, అర్ధరాత్రి వరకు ఆపరేట్ చేస్తూ గడిపిన రోజులున్నాయి. ప్రతిఫలం ఆశించకుండా కేవలం సర్జరీ మీద మక్కువతోనే పనిచేసే కర్మయోగి. ఎమర్జెన్సీలో తెల్లవారు జామున ఫోన్ చేసినా, అర్ధరాత్రి చేసినా ఆయన గొంతు ఒకేలా ఉండేది. ‘ఈ మనిషికి చికాకు, అలసట, నిద్ర లాంటివేమీ ఉండవా!’ అనుకునేవాళ్లు ఫోన్ చేసిన పీజీలు. అలాగని మెతకోడేంకాదు. అతను రౌండ్స్‌కి వస్తున్నాడంటే హడలు. నర్సులు, పీజీలు, ప్రొఫెసర్లు అప్రమత్తంగా ఉండేవాళ్లు. రోగుల విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఊరుకునేవాడుకాదు. కచ్చితమైన మనిషి.
22 ఏళ్లు హెచ్ఓడీగా ఏలాడు. అతడి తర్వాత సాంబమూర్తి ఆ బాధ్యతలు తీసుకున్నా, కృపాకరాన్ని అడక్కుండా ఏ నిర్ణయమూ తీసుకునేవాడు కాదు. కానీ, ఒక ఏడాది నుంచి పరిస్థితులు మారిపోయాయి. కృపాకరం మునుపటిలా చకచకా నడవలేకపోతున్నాడు. నిర్ణయాలు తీసుకోవటం, ఆపరేట్ చేయడం నిదానం అయిపోయింది. చేసేటప్పుడు చేతులు కూడా వణుకుతున్నాయి. మనుషుల్ని మర్చిపోతున్నాడు. ఓసారి ఒక పేషంటుకి చేయాల్సిన సర్జరీ ఇంకొకరికి చేయబోయాడు. మూత్రం అదుపులో ఉండక పదేపదే బాత్రూంకి వెళ్లాల్సొస్తోంది. పరీక్షలు చేసి, వయసురీత్యా మెదడులో వచ్చిన మార్పు వల్ల మెదడువాపు అని నిర్ధారించారు. అదే హాస్పిటల్లో న్యూరోసర్జన్ షంటు వేశాడు. మరి రాడనుకున్నారంతా. అందరూ వద్దంటున్నా వినకుండా నెలరోజులయ్యాక మళ్లీ వచ్చాడు హాస్పిటల్‌కి.
కృపాకరం పరిస్థితి హాస్పిటల్లో అందరికీ తెలుసు. కానీ అతడి మీద అభిమానమో, భయమో... ఎవరూ ఏమీ అనేవారు కాదు. ఓపీడీలో నర్సులు కృపాకరం గారు లేరనో, ఆయనకి బాలేదనో చెప్పేసి ఇతర సర్జన్లకు కేసులు మళ్లిస్తున్నారు. ఇతర డిపార్టుమెంట్ల నుంచి ఎవరూ కేసులు రెఫర్ చేయడం లేదు. పీజీలు ఆయన పేషంట్లను చూసి, వైద్యానికి ఇతర ప్రొఫెసర్ల సలహాలు తీసుకుంటున్నారు. ఆయన ఆపరేట్ చేసేటప్పుడు ప్రొఫెసర్లే అసిస్టెంట్లుగా వెళ్లి, ‘సర్, ఇది అలా చేస్తే మంచిదేమో?’; ‘ఇలా చేయకూడదంటారా?’ అంటూ సున్నితంగా అతడి తప్పుల్ని సరిదిద్దుతున్నారు. పేషంట్లకు హాని జరక్కుండా ఎవరు చేయగలిగింది వాళ్లు చేస్తున్నారు.
ఓసారి పెద్దిరాజు అనే షుగరు పేషంటు కుడికాలుకి గాంగ్రీన్ అయితే, తొడ వరకు తీసేయాలని చెప్పాడు కృపాకరం. అతడి మాటంటే పెద్దిరాజుకి ఎంతో గురి. ఎన్నో ఏళ్లగా అతడి కుటుంబంలో ఎవరికి ఏ రోగమొచ్చినా కృపాకరమే దిక్కు. సాంబమూర్తికి విషయం తెలిసి కలగజేసుకున్నాడు. మోకాలు కింది వరకూ తీస్తే సరిపోతుందని నచ్చజెప్పి అలానే చేశాడు. మూడు నెలలదాకా పుండు మానలేదు. ఆరుసార్లు హాస్పిటల్లో చేరాడు. రెండుసార్లు ఐసీయూలో పెట్టారు. తగ్గేసరికి రెండున్నర లక్షల అప్పయ్యింది పెద్దిరాజుకి.
ఓపీడీకి వచ్చినప్పుడు సాంబమూర్తితో ‘‘బాబూ, మీరు నా కాలు తీసి మోకాలు కాపాడారు. ఇప్పుడు ఈ బొమ్మకాలెట్టుకుని నడుత్తున్నా. కానీ పనికి పోవట్లా. కృపాకరంగారు చెప్పినట్టు తొడవరకూ తీసేత్తే అప్పుడు కూడా పనికెళ్లేవాణ్నికాను. అయితే ఇంత బాధ, అప్పు ఉండేయి కాదుగా. మాకేటి కావాలో ఆయనకి తెలుసండీ’’ అన్నాడు పెద్దిరాజు.
ఆపరేషన్‌కి ముందు మోకాలు కాపాడితే ఇంత అప్పు అవుతుంది అని తెలిస్తే, నాకు అక్కర్లేదు, తీసేయండి అని చెప్పేవాడేమో పెద్దిరాజు. అది కృపాకరానికి ముందే తెలుసు. అదే తేడా. మిగతా డాక్టర్లు మెషీన్లను రిపేర్ చేసినట్టు చేస్తారు వైద్యం. కృపాకరం వాళ్ల జీవితాలకి ఏది అవసరమో అదే చేసేవాడు.
ఆరోజు సాయంత్రం కృపాకరం భార్య శాంతమ్మ సాంబమూర్తికి ఫోన్ చేసింది. ఆవిడ గైనకాలజిస్ట్. అదే హాస్పిటల్లో పనిచేసి పదేళ్ల క్రితం రిటైర్ అయ్యింది.
‘‘ఏం మూర్తీ, మళ్లీ ఏదో గొడవైందంటగా కాలేజీలో’’ అంది శాంతమ్మ.
‘‘ఏంలేదు మేడం. చిన్న విషయమే. ఊరికే పెద్దది చేస్తారు కాలేజీ వాళ్లు. మీకు తెలిసిందేగా’’ అన్నాడు మూర్తి.
‘‘చాల్లే మూర్తీ. ఎప్పుడూ ఆయన తప్పేం లేదనే చెబుతావు నువ్వు. ఆయన చాదస్తం నాకు తెలీదా. ఒకప్పటి పేషంట్లు ప్రాణాలు దక్కితే చాలనుకునేవాళ్లు. ఇప్పుడు గాటుపడకుండా ఆపరేషన్ చేయమంటున్నారు. వాళ్ల అంచనాలు పెరిగిపోయాయి. పద్ధతులు మారిపోతున్నాయి. ఆ స్పీడుని ఈయన అందుకోలేకపోతున్నారు’’ అంది శాంతమ్మ.
‘‘నేను చెప్పడానికి ట్రై చేస్తాను మేడం’’ అన్నాడు మూర్తి.
‘‘ట్రై చేయడం కాదు మూర్తీ, ఆయన్ని పంపేయడానికి నీకు అధికారముంది. మొహమాటం పక్కనపెట్టు. ఆయన ఆపరేట్ చేయడం పేషంట్లకూ, ఆయనక్కూడా మంచిది కాదని నీకు తెలుసు. ఇక నీ ఇష్టం’’ అని ఫోన్ పెట్టేసిందావిడ.
* * *
ఒక వారం గడిచింది. ఓరోజు సాంబమూర్తి ఏకాగ్రతతో విపుల్స్ ఆపరేషన్ చేస్తున్నాడు. దభాలున ఆపరేషన్ థియేటర్ తలుపు తోసుకుని లోపలికొచ్చింది ఓటీ నర్సు సుమతి. ఉలిక్కిపడ్డాడు సాంబమూర్తి.
‘‘సార్, కృపాకరం గారు అపెండిక్స్ ఆపరేషన్ చేస్తుండగా బవెల్ ఇంజురీ అయ్యింది. రాజేష్ గారు మిమ్మల్ని అర్జెంటుగా పిలుచుకురమ్మన్నారు సార్’’ ఒగురుస్తూ చెప్పింది సుమతి సిస్టర్.
చికాకుని, కోపాన్ని అణచుకుని ‘‘మీరు చేస్తూ ఉండండి, నేను చూసొస్తాను’’ అని అసిస్టెంట్ సర్జన్లకు చెప్పి పక్క థియేటర్‌కి వెళ్లాడు సాంబమూర్తి.
తెరచి ఉన్న పేషంటు కడుపులోకి తొంగి చూశాడు సాంబమూర్తి. అంతా మలం, రక్తం. ‘‘లార్జ్ బవెల్ ఇంజురీ విత్ సిగ్నిఫికెంట్ బ్లడ్ లాస్’’ వణుకుతున్న గొంతుకతో చెప్పాడు రాజేష్. ఏమీ జరగనట్టు ప్రశాంత వదనంతో, ఏకాగ్రతతో పని చేస్తున్నాడు కృపాకరం.
‘‘కెన్ ఐ జాయిన్ సర్?’’ అడిగాడు మూర్తి, వినయంగా.
‘‘షూర్, వైనాట్’’ అంటూ పక్కకు జరిగాడు కృపాకరం.
పరిస్థితి పరిశీలించి, గాయమైన పెద్దపేగునీ, చిన్న పేగులో కొంత భాగాన్నీ తొలగించి, తిరిగి అతికించాడు మూర్తి. అప్పుడే రక్తం కూడా ఎక్కించారు. రెండు గంటలు పట్టింది. బయటికి వచ్చి పేషంటు కుటుంబంతో జరిగింది అంతా చెప్పేశాడు సాంబమూర్తి. ఆ నిజాయతీ కృపాకరం దగ్గర్నుంచి నేర్చుకున్నదే.
‘‘ఇలా అవ్వచ్చునని ముందే చెప్పారండి కృపాకరంగారు’’ అన్నారు వాళ్లు. ప్రాణాపాయం లేదు కాబట్టి ఏ గొడవా చెయ్యలేదు. ఈ కేసు గురించి హాస్పిటల్లో ఏవేవో పుకార్లు. కృపాకరం చేతిలో చావబోతున్న పేషంటును సాంబమూర్తి కాపాడాడని, పేషంటు చనిపోయాడని, పేషంట్ బంధువులు ఐసీయూ అద్దాలు పగలగొట్టారని అలా రకరకాలుగా చెప్పుకుంటున్నారు.
* * *
హాస్పిటల్లో జరిగే చావులూ, పొరపాట్లు, వింత జబ్బులు, అరుదైన ఆపరేషన్ల గురించి నెలకోసారి డాక్టర్లు అందరూ చర్చించుకుంటారు. దాన్నే మోర్టాలిటీ అండ్ మోర్బిడిటీ మీటింగ్ (ఎం.ఎం) అంటారు. ఒక వారం తర్వాత అలాంటి ఎం.ఎం మీటింగ్ జరిగింది. పెద్దిరాజు కాలు కేసు, అపెండిక్స్ కేసులో తప్పిన ప్రమాదం, హాస్పిటల్లో కృపాకరం వల్ల జరిగిన అనర్థాల గురించే చర్చ అంతా. మీటింగులో ఓ మూల కూర్చుని అంతా వింటున్నాడు కృపాకరం.
‘‘ఇన్నాళ్లూ ఆయన వల్ల జరుగుతున్న పొరపాట్లన్నీ కవర్ చేస్తూ వచ్చాం. ఎల్ల కాలం ఇలా చేయలేం కదండీ’’ అనేశాడు రవి కుమార్.
సాంబమూర్తి లేచి ‘‘డాక్టర్లుగా మనం ఏదోక స్థాయిలో తప్పులు చేసే ఉంటాం. అప్పట్లో ఆయన మన తప్పుల్ని మీదేసుకుని సరిదిద్దారు. వృత్తి పరంగాను, వ్యక్తిగతంగానూ మన సమస్యలు తీర్చారు. అలాంటిది ఆయనకి కష్టం వస్తే అందరం కలిసి ఆయనేదో నేరం చేసినట్టు చూడటం సరికాదు’’
‘‘నిజమేనండీ, ఎవరం కావాలని పేషంటుకి హాని తలపెట్టం. కానీ దురదృష్టవశాత్తూ మన తప్పులకి మూల్యం భరించేది పేషంటే కదా’’ అన్నాడు రవి కుమార్.
‘‘రవి కుమార్ గారూ, ఏదో తప్పు జరిగింది అంటున్నారుగానీ... గమనించారా, ఇంతవరకూ ఎవరికీ ఏ హానీ జరగలేదు. ఏ పేషంటూ ఆయన గురించి చెడుగా మాట్లాడలేదు’’ అంటూ వెనక్కి తిరిగి చూశాడు సాంబమూర్తి. ఎప్పుడు వెళ్లిపోయాడో తెలీదుగానీ అప్పటిదాకా వెనుక కూర్చున్న కృపాకరం లేడు.
‘‘ఇక తప్పదంటారా, ఆయనతో మాట్లాడి పదవీ విరమణ కార్యక్రమానికి ఒక తేదీ నిర్ణయిస్తాను’’ అని చెప్పి కూర్చున్నాడు మూర్తి. అంతటితో కృపాకరం గురించి ఆపి, మిగతా పేషెంట్ల గురించి చర్చించుకున్నారు.
* * *
తర్వాతి రోజు ఓపీడీలోకి అడుగుపెట్టగానే బల్ల మీద, నేల మీద పేర్చి ఉన్న పుస్తకాలు కనపడ్డాయి సాంబమూర్తికి. ఐదొందల వరకు ఉంటాయి పుస్తకాలు. ఏంటి అని అడిగితే ఓపీడీ నర్సు కుమారి చెప్పింది, ‘‘కృపాకరంగారు ఈ సర్జరీ పుస్తకాలన్నీ ఇచ్చి వెళ్లారండి. ఆయన జీవితం అంతా సేకరించిన పుస్తకాలట. ఇక నాకవసరం లేదు. మన మెడికల్ లైబ్రరీకి ఇచ్చేయమని చెప్పి వెళ్లిపోయారు’’
చెప్పకుండానే అర్థం చేసుకున్నాడు కృపాకరం. తనతో ఒక్క మాట కూడా అనకుండా వెళ్లినందుకు మనసులో చివుక్కుమంది మూర్తికి.
సాయంత్రం కృపాకరం ఇంటికెళ్లాడు సాంబమూర్తి. వరండాలో ఒక్కడే కూర్చుని పుస్తకం చదువుతున్నాడు కృపాకరం. మూర్తిని చూసి పలకరించి కూర్చోమన్నాడు.
‘‘ఇంత హఠాత్తుగా మానేయడం ఏంటి సర్?’’ అడిగాడు మూర్తి.
‘‘12 ఏళ్లు అయ్యింది ఇంకా హఠాత్తు ఏంటీ’’ అన్నాడు కృపాకరం. నవ్వేస్తూ ‘‘కాలం గడిచేకొద్దీ కొత్త తరం పాత తరాన్ని భర్తీ చేయాలి. అది ప్రకృతి ధర్మం. నాకు ఆ విషయం తెలిసేసరికి కొంచెం ఆలస్యం అయ్యింది’’ అంటుండగా లోపలి నుంచి వచ్చింది శాంతమ్మ.
‘‘ఏమో సర్, ఇప్పటిదాకా మీరున్నారన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు ఒంటరిని అయిపోయినట్టు భయమేస్తోంది’’ అన్నాడు సాంబమూర్తి. ‘‘మీ రిటైర్మెంటుకి ఒక చిన్న సన్మాన సభ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం సర్. మీరు ఇంకొన్నాళ్లు మాతో ఉంటే బావుణ్ను అని అనిపిస్తున్నా, అది అడగలేను. ఇది మాత్రం కాదనకండి’’ అని బతిమాలాడు.
‘‘ఇప్పటిదాకా మీరంతా నాకోసం చాలా చేశారు మూర్తీ. ఇంకా ఇబ్బంది పడకండి. ప్రాక్టీస్ ఆపడం గొప్ప విషయం కాదు, ఘనంగా జరుపుకోడానికి. హాస్పిటల్‌కి రాలేని రోజు నేను ఉన్నా లేనట్టే. ఇక అక్కడికొస్తే నా బాధ ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు’’ అన్నాడు కృపాకరం.
‘‘అంతగా అడుగుతున్నాడుగా, ఒకసారి వెళ్లిరండి’’ అని శాంతమ్మ చెప్పినా వినలేదు.
మళ్లీ వచ్చి మాట్లాడదాంలే అనుకుని వెళ్లిపోయాడు సాంబమూర్తి. పదిరోజులు పోయాక మళ్లీ వెళ్లాడు. పదిరోజుల్లో పదేళ్ల వయసు పెరిగినట్లున్నాడు కృపాకరం. మూర్తిని గుర్తుపట్టలేదు. ఉన్నంతసేపూ అతనితో ఏమీ మాట్లాడలేదు. శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడంతే. ఇప్పుడు సన్మానం చేసినా, అది అతనికి జరుగుతుందని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన కాస్త మెరుగుపడ్డాక చేద్దామని రెండుసార్లు వాయిదా వేశారు. నిదానంగా ఆ విషయాన్ని అందరూ మర్చిపోయి ఎవరి పనుల్లో వాళ్లు పడ్డారు. కానీ, గురువుగారికి సరైన వీడ్కోలు ఇవ్వలేకపోయానన్న బాధ ఎప్పటికీ ఉండిపోయింది సాంబమూర్తికి.