50 అంగుళాల జీవితం

  • 326 Views
  • 1Likes
  • Like
  • Article Share

    కె.ఎల్‌.సూర్య

  • హైదరాబాద్‌
  • 9393472410
కె.ఎల్‌.సూర్య

ఓ మాయ.. మార్కెట్‌ మాయ.. మనుషులను వినియోగదారులుగా మాత్రమే చూసే.. చూపించే పెనుమాయ! అందులో ఇరుక్కున్న కోట్లాది మధ్యతరగతి జీవుల్లో భరణి ఒకడు. ఇంతకూ అతని కథేంటో చూద్దామా!
1989 మార్చి 19.
ఉదయం 8.45 నిమిషాలు
      భరణి అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లో ఒక్కో గడపనీ దాటాడు. ఓ గదిలోంచి నాన్నారి గురక సన్నగా వినిపిస్తోంది. కాబట్టి ఆయన కంట పడతాడనే బెంగ లేదు. ఇక గిన్నెల శబ్దం వస్తోంది కాబట్టి, అమ్మ వంటింట్లోనే ఉండి ఉంటుంది. మిగిలిన ఒకే ఒక్క గండం- చెల్లి సుజాత. అది భరణిని చూడనే చూసింది. భరణి భంగిమని బట్టి వాడు ఇంట్లోంచి తప్పుకునే ప్రయత్నంలో ఉన్నాడని గ్రహించేసింది. ఆపై బెదిరించబోతున్నట్లుగా ‘అమ్మా’ అంటూ వంటింట్లోకి వినిపించీ వినిపించకుండా అరిచింది. గట్టిగా అరిస్తే తనకే నష్టం అని సుజాతకి తెలుసు. చెల్లి గట్టిగా అరవకుండా ఉండేందుకు ఏదో ఒక నైవేద్యం అందించాలని భరణికీ తెలుసు. అందుకే కంగారుగా ‘ఉష్షూ ఉష్షెహె’ అంటూ కసురుకున్నాడు. ఆపై ముందు గదిలో పటం వెనక దాచిన పదిపైసలు బిళ్ల తీసి సుజాత చేతిలో పెట్టాడు. ఆ చర్యతో ఇరువర్గాల మధ్యా శాంతి నెలకొంది. సుజాత మొహం పదిపైసలు బిళ్లలా విప్పారింది.
      అలా తన ఇంటి గేటు తీసుకున్న భరణి అవతలి వీధికి లంఘించాడు. ఆ వీధిలో చివరింటికి చేరుకునేసరికి మరోసారి అతని నడక నిదానించింది. ఆ ఇంటి ముందు చిత్తుకాగితాల వాడిలా తచ్చాడి, నిదానంగా గేటు తీసి లోపలికి అడుగుపెట్టాడు. అడుగుపెట్టాడన్న మాటే కానీ సిగ్గుతో మొహం ఎర్రగా కందిపోయింది. కిందటి వారం విన్న మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. ‘ఇంకోసారి మా ఇంట్లో అడుగుపెట్టావంటే ఊరుకోను జాగ్రత్త!’ అన్న జిత్తుగాడి మాటలే స్ఫురిస్తున్నాయి. అయినా అభిమానాన్ని తోసుకుంటూ జిత్తుగాడి పోర్టికోలోకి అడుగుపెట్టాడు.
      అప్పటికి జిత్తు వాళ్లమ్మ ముందుగదిలో ఊడుస్తోంది. ఆవిడ చేతిలో చీపురుని చూడగానే భరణి తటపటాయిస్తూ బయటే నిలబడిపోయాడు. ఆవిడా ఓసారి చీపురు వంకా, భరణి వంకా మార్చి మార్చి చూసుకుంది. ఆ పరీక్షలో ఆమెలోని మానవత్వానిదే పైచేయి అయ్యింది. ‘లోపలికి తగలడు’ అన్నట్లు ఓసారి సైగ చేసి వెళ్లిపోయింది. భరణి బెరుగ్గా లోపలికి అడుగుపెట్టి సోఫా పక్కనే బాసింపీట వేసుకుని కూర్చున్నాడు.
      గడియారం ముల్లు తొమ్మిది దగ్గరకి వెళ్లే కొద్దీ భరణిలో ఉత్కంఠత పెరిగిపోయింది. ఆ ముల్లు తొమ్మిది దాటేస్తే, తన జీవితం వృథా అయిపోతుందనే దుగ్ధ అతణ్ని నిలవనీయడం లేదు. ఇంతలో లోపల్నుంచి జిత్తుగాడు రానేవచ్చాడు. సోఫా పక్కన కూర్చున్న భరణిని చూసీచూడనట్లు చూసి, తన తడి చేతుల్ని లాగుకేసి రుద్దుకుంటూ స్విచ్‌బోర్డు దగ్గరకి వెళ్లాడు. జిత్తుగాడు టప్‌ మని స్విచ్‌ వేయగానే ముందు సుయ్‌మంటూ ఓ శబ్దం వచ్చింది. ఆ తర్వాత వచ్చిందండీ భరణి ఒళ్లు పులకించిపోయే శబ్దం- ‘మా..హా..భా...రత్‌’ అంటూ. ఇహ అప్పటి నుంచి ఓ గంట పాటు భరణి ఆత్మ టీవీలో ఐక్యమైపోయింది. జిత్తుగాడి వార్నింగునీ, అసలు జిత్తుగాడి ఉనికినే మర్చిపోయి ద్వాపర యుగానికి తరలిపోయాడు. పదిగంటలకి కానీ అతను ఇహలోకంలోకి దిగిరాలేదు.
      మహాభారత్‌ సీరియల్‌ పూర్తికావడంతో ఈసురోమని ఈడ్చుకుంటూ ఇంటికి తిరుగుముఖం పట్టాడు భరణి. అతని జీవితంలో ప్రతి ఆదివారం 9 నుంచి 10 వరకు అమృతఘడియలు. తనకంటే చిన్నాడైన జిత్తుగాడి చేతిలో తిట్లు తిన్నా, ఇంటికి వెళ్లేసరికి నాన్న చావగొడతాడన్న గ్యారెంటీ ఉన్నా... ఆ గంటా టీవీ చూడకుండా ఉండలేడు.
భరణి ఊహించినట్లుగానే ఇంటికి వెళ్లేసరికి నాన్నారు లుంగీ కట్టుకున్న పిల్లిలాగా అటూఇటూ తిరుగుతున్నారు. జరగబోయే చితకబాదుణ్ని వీక్షించేందుకు ఓ అనువైన చోటు చూసుకుని, గొంతుక్కూర్చుంది సుజాత. ‘‘రేపు హిందీ పరీక్ష పెట్టుకొని టీవీ చూడ్డానికి వెళ్లావు. మనిషివా? పశువ్వా?’’’ అరిచారు నాన్నారు. ఆయన చూపులు దగ్గరలో ఏదన్నా కర్రలాంటి వస్తువు ఉందేమో అని వెతుకుతున్నాయి.
      ‘‘పశువులు టీవీ చూడవుగా నాన్నారూ! అయినా నేను టీవీ చూసింది పరీక్షల కోసమే. రేపు హిందీ పరీక్ష కదా. హిందీ సీరియల్‌ చూస్తే ఉపయోగం ఉంటుందేమో అనీ...’’ అంటూ నసిగాడు భరణి. అతని కళ్లు కూడా నాన్నారు ఏ వస్తువుని అందుకుంటారా అని వెంపర్లాడుతున్నాయి. చివరికి నాన్నారి చేతికి ఓ చెక్క స్కేలు దొరకనే దొరికింది. దాంతో భరణి వీపుని కొలిచిపారేశారు.
      ఇలాంటి నగుబాట్లు భరణికి కొత్త కాదు. అయినా తను టీవీ నుంచి వెనకడుగు వేయలేదు. విందు భోజనం తర్వాత కారాకిళ్లీ నమిలినట్లు, టీవీ చూసిన తర్వాత నాన్నారి దెబ్బలు మామూలైపోయాయి. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు కదా! ఒకప్పుడు జిత్తుగాడింటి వరకూ ఏ ఇంట్లోనూ టీవీ మోగేది కాదు. అలాంటిది నిదానంగా ఒక్కో ఇంటి మీదా ధ్వజస్తంభాల్లాగా యాంటెనాలు వెలిశాయి. చుట్టుపక్కల ఇళ్ల నుంచి చిత్రలహరి పాటలు వినిపించసాగాయి. దాంతో తన ఇంట్లోకి కూడా ఓ టీవీ తీసుకోక తప్పింది కాదు నాన్నారికి. ఒకరకంగా అది పరువుప్రతిష్ఠల సమస్య. పైగా దూరదర్శన్‌ ప్రాయోజిత కార్యక్రమాలన్నీ చూసేందుకు, భరణి ఇరుగుపొరుగు గేట్లు పట్టుకుని వేళ్లాడటం చూసీ చూసీ ఆయనకి చిరాకేసిపోయింది.
1991 ఆగస్టు 14 సాయంత్రం
      ఓ ప్లాట్‌ఫారం బండి భరణి ఇంటి ముందు ఆగింది. దాని మీద ‘డయనోరా’ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన ఓ అట్టపెట్టె కట్టేసి ఉంది. ఆ బండి వెనకాలే రిక్షాలో భరణి కుటుంబం దిగింది. ఓ వారం రోజుల వాదోపవాదాల తర్వాత వాళ్లు ఆ పూటే డయనోరా టీవీ కొనుక్కొచ్చారు. చుట్టుపక్కల వాళ్ల కళ్లు పేలిపోయేలా భోషాణం అంత టీవీ, దానికి ఆరడుగుల యాంటెనా తీసుకొచ్చారు.
      టీవీ వచ్చిన నెల రోజుల వరకు భరణి కొత్తపెళ్లికొడుకులా, అదో తన్మయత్వంలో మునిగిపోయాడు. అసలు మంచం మీద పడుకుని, గొట్టాలు నములుతూ టీవీ చూడటం అనే భోగం ఈ జీవితంలో దక్కుతుందనుకోలేదు. ఎవరన్నా తన టీవీ చూడ్డానికి వస్తే, పాండురంగడిలా నడుము మీద చేతులు పెట్టుకుని నిలబడేవాడు. కొన్నాళ్లపాటు భరణి దివారాత్రులు టీవీతోనే ముడిపడిపోయాయి. బెంగాలీ సినిమాల దగ్గరనుంచీ బధిర వార్తల దాకా టీవీలో ఏమొచ్చినా భరణి దృష్టిని తప్పించుకోలేకపోయాయి. ‘అంతరాయానికి చింతిస్తున్నాం’ అన్న ప్రకటనకి కూడా భరణి కళ్లు అతుక్కునే ఉండేవి.
      నాన్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా భరణి టీవీ మోజు తీరలేదు. టీవీ రిపేరైనా, భరణికి కళ్లజోడు దిగబడిపోయినా, పదో తరగతిలో అత్తెసరు మార్కులు వచ్చినా, ప్రపంచం తలకిందులైనా... అతని పిచ్చి తగ్గలేదు. ఆఖరికి దర్గా సాయిబు దగ్గర తావీజు కూడా కట్టించారు. ప్చ్‌ లాభం లేకపోయే! టీవీ దెయ్యం భరణిని వదలకపోయే!
      ఏం జరిగిందో ఏమో కానీ, భరణికి నూనుగు మీసాలు రావడంతోనే అతని ప్రాధాన్యాలు మారిపోయాయి. బొడ్లో చాక్లెట్లు బదులు గుట్కా ప్యాకెట్లు దోపుకోసాగాడు. యాంటెనా తిప్పుతూ కూర్చునేవాడు కాస్తా, ఆడపిల్లల వంక మెడకాయ తిప్పసాగాడు. ఇక కాలేజి గొడవలూ, లెక్చరర్లని ఏడిపించడాలూ సరేసరి. సినిమాల్లో ఒక్క పాటలోనే హీరో పెద్దాడైపోయినట్లు, ఒకే ఒక్క ఏడాదిలో భరణి ఆరిందాలా తయారయ్యాడు.
      భరణి జీవితంతో పాటు టీవీల్లోనూ చాలా మార్పులే వచ్చాయి. యాంటెనాలు కాస్తా డిష్‌టీవీలుగా మారాయి, డబ్బాల స్థానంలో ఎల్‌ఈడీలు వచ్చేశాయి. ఇక టీవీ కార్యక్రమాలు సరేసరి! గొడవల గురించి వార్తలు కాకుండా వార్తలే గొడవగా మారాయి, కంటి మిటకరింపులతో నడిచే ధారావాహికలు మొదలయ్యాయి, వీధిన పడ్డ సంసారాలకి తీర్పునిచ్చే కార్యక్రమాలు సాగాయి, న్యాయనిర్ణేతలు కొట్టుకుచచ్చే పోటీలు వచ్చాయి... అబ్బో ఒకటా రెండా టీవీనే మారిపోయింది. టీవీనే ప్రపంచంగా మారిపోయింది.
      భరణి మాత్రం క్రమంగా మధ్యతరగతి మనిషిగా స్థిరపడిపోయాడు. ఉద్యోగం, పెళ్లి, పిల్లలు... అంటూ జీవితంలో కూరుకుపోయాడు. ఏదో అన్నం మెతుకులు కతికేటప్పుడో, ఆదివారం అతిథులెవ్వరూ రానప్పుడో టీవీ చూసేవాడంతే! భరణి కొడుకు గౌతం అలియాస్‌ గౌతిగాడు మాత్రం తండ్రి బాల్యాన్ని పుణికిపుచ్చేసుకున్నాడు. వాడి తొలి తప్పటడుగులు టీవీ వైపే పడ్డాయి. ఒక్కోఏడు గడిచేకొద్దీ ఒక్కో ఛానల్‌ దాటుకుంటూ ప్రస్తుతం తన ఎనిమిదో ఏట ‘ఛోటా భీం’తో కలిసి ఎదుగుతున్నాడు.
      జీవితం ఎలాగోలా గడిచి పోతోందనుకునే సమయంలో ఓ రోజు గౌతిగాడు, భరణిని ఓ ప్రశ్నతో తలంటాడు ‘నాన్నా మన టీవీ ఎందుకంత చిన్నగా ఉంది?’ అంటూ. దానికి జవాబు చెప్పేందుకు భరణి మెదడు తటపటాయిస్తుండగానే ‘అసలు మన టీవీలో యూట్యూబ్‌ ఎందుకు రాదు?’ అంటూ మరో ప్రశ్నేసి గుచ్చాడు.
      భరణి ఊరికి వచ్చిన కొత్తలో ఓ ఎల్‌సీడీ టీవీ తీసుకున్నాడు. అప్పట్లో అదో అబ్బురం. ‘వాళ్లింట్లో డబ్బా లేని టీవీ ఉందని’ వీధంతా చెప్పుకొనేవారు. ఇంటికొచ్చిన అతిథులకి ఎల్‌సీడీ సాంకేతికతను వివరించడానికి, వాళ్లావిడ ఓ అరగంటన్నా కేటాయించేది.
      క్రమంగా పరిస్థితులు మారాయి. ఎవరో మంత్రం వేసినట్లు ఒక్కో ఇంట్లో డబ్బా టీవీలు మాయమై... ఇంతలేసీ అంతలేసీ టీవీలు ప్రత్యక్షమయ్యాయి. 32, 40, 42, 50... అంటూ వామనుడిలా విశ్వరూపం చూపించాయి. కానీ మంచి కంపెనీ స్మార్ట్‌ టీవీ కొనాలంటే కనీసం యాభైవేలు తక్కువ లేదని తేలింది. ఆ లెక్కకీ తన జీతానికీ పొంతన కుదరలేదు. అప్పటినుంచి తన స్తోమతకి చిన్న టీవీనే చాలని నిశ్చయించుకున్నాడు.
      భరణి తన ఓటమిని అంగీకరించినా పోలికల ప్రపంచం అతణ్ని నిలువనీయలేదు. ఏ ఇంటికి వెళ్లినా ఏదో ఒక టీవీ అతణ్ని వెక్కిరించడానికి సిద్ధంగా ఉండేది. పెద్ద టీవీ నొసటితో నవ్వితే, స్మార్ట్‌ టీవీ వెబ్‌సైట్లతో వెక్కిరించింది. ఇక ఇంటికి వచ్చేపోయే వారు తన టీవీ ‘చిన్నతనాన్ని’ గురించి చూపించే సానుభూతులకీ లెక్కలేకుండా పోయింది. వెరసి, ఒకప్పుడు తనకి గర్వకారణంగా నిలిచిన టీవీ ఇప్పుడు సిగ్గుచేటుగా మారిపోయింది.
2019, సెప్టెంబరు 1
      ఆ రోజు భరణి మాంఛి మూడ్‌లో ఉన్నాడు. చాలారోజుల తర్వాత టీవీలో క్రికెట్‌ చూడబుద్ధయ్యింది. కాసిని పప్పు చెగోడీలు, ఓ థమ్స్‌ అప్‌ బాటిలూ తీసుకుని మ్యాచ్‌ చూసేందుకు సన్నాహాలు చేసుకున్నాడు. భరణిలో అనుకూలమైన హావభావాలు చూసి అతని భార్యాపిల్లలు చెరోపక్కకి చేరారు. ‘‘మ్యాచ్‌ చూడ్డానికి పెద్ద టీవీ అయితే ఇంకా బాగుంటుంది కదండీ!’’ అంటూ కామెంట్రీ మొదలుపెట్టింది భార్య. ‘‘అవును డాడీలూ! పెద్ద టీవీలో అయితే రైమ్స్‌ కూడా చూడొచ్చు’’ అంటూ బౌన్సర్‌ విసిరాడు గౌతిగాడు.
      సాధారణంగా ఇలాంటి సంభాషణలకి భరణి చిరాకెత్తిపోతాడు. ‘ఆపండెహే సొద!’ అంటూ వాళ్లని తోలేస్తాడు. కానీ ఇవాళ ఎందుకో అతనిలో గుమ్మడి తరహా పెద్దరికం బయల్దేరింది. గౌతిగాణ్ని పక్కన కూర్చోపెట్టుకొని తానెందుకు టీవీ కొనలేకపోతున్నాడో చెప్పుకొచ్చాడు. శ్రమదోపిడీ దగ్గర్నుంచీ ప్రపంచీకరణ దాకా రకరకాల ఆర్థికసూత్రాలను వివరించాడు. అవన్నీ ఓపిగ్గా విన్న గౌతిగాడు చివరికి- ‘‘వావ్‌! అయితే మనం రేపే పెద్ద టీవీ తీసుకుంటున్నాం అన్నమాట!’’ అని ఎగిరి గంతేశాడు. ఆ దెబ్బతో భరణిలోని కార్ల్‌మార్క్స్‌ కాస్తా కొశ్చెన్‌ మార్కులా మారిపోయాడు.
      ఇక లాభం లేదనుకుని కనీసం తన భార్యనన్నా సముదాయించాలని- ‘‘మన కోరికలే దుఃఖానికి మూలమని బుద్ధుడు ఆర్యసత్యాలలో చెప్పాడు తెలుసా!’’ అంటూ బోధ చేసే ప్రయత్నం చేశాడు. దానికి వాళ్లావిడ ‘‘పెళ్లాన్ని పోషించలేనివాడికి పెళ్లి దండగని ఏ పెద్దమనిషీ చెప్పలేదా’’ అంటూ విసురుగా వెళ్లిపోయింది. ఆ మాటలతో భరణి మనసు విలవిల్లాడిపోయింది. అతని అభిమానం కాస్తా క్లీన్‌ బౌల్డ్‌ అయిపోయింది.
      నిజమే ఇప్పుడు పోషణకి అర్థం మారిపోయింది! పోషించడం అంటే ఆకలి తీర్చడమే కాదు, ఆడంబరాలు సమకూర్చడం కూడా! దానికోసం పుట్టినరోజులూ, పెళ్లిరోజులూ ఘనంగా జరగాలి. బైక్‌లూ, స్మార్ట్‌ ఫోన్లు ఉండితీరాలి. తిన్నా తినకపోయినా ఏసీలో పడుకోవాలి. పరువు పోటీల్లో ఆగకుండా పరుగులెత్తాలి. చిత్రమేమిటంటే.. ఈ పోటీలో ఎవరికి వారు ఎప్పటికప్పుడు నష్టపోతూనే ఉంటారు. పోటీ చూసేవాళ్లే లాభపడుతుంటారు. కొత్త వస్తువు తయారుచేసేవాడు, దాన్ని కొనమని ఊరించేవాడు, ఆ వస్తువు కొనేందుకు అప్పిచ్చేవాడు.. అంతా బాగుపడేవారే.
      ఆలోచించీ ఆలోచించీ భరణి ఒక నిర్ణయం తీసుకోక తప్పలేదు. మర్నాడు అకౌంట్స్‌ డిపార్ట్‌మెంటుకి వెళ్లి పీఎఫ్‌ లోన్‌ తీసుకునేందుకు అప్లికేషన్‌ ఇచ్చాడు. విషయం విన్న అకౌంట్స్‌ మిత్రుడు ఏమంత ఆశ్చర్యపోలేదు. ‘‘ఒకప్పుడు డబ్బులున్నా వస్తువు తీసుకోవడానికి ఆలోచించేవాళ్లం. ఇప్పుడో! అప్పు చేసైనా, తప్పు చేసైనా... ప్రతి వస్తువూ కొనాల్సిందే. మనం చేతకానివాళ్లం కాదని నిరూపించుకోవాల్సిందే’’ అంటూ ఊరడించాడు. అతని మాటలు ఉపశమనం కలిగించలేదు కానీ, అతని బతుకు కూడా తనలాంటిదే అన్న ఎరుక కాస్త తృప్తి కలిగించింది.
      మరో రెండువారాలకి పీఎఫ్‌ డబ్బులు చేతికొచ్చాయి. వాటిని తీసుకుని భరణి కుటుంబం టీవీ కొనేందుకు బయల్దేరింది. ఒకప్పుడు డయనోరా టీవీ కొనేందుకు తామెంత సంబరంగా బయల్దేరామో గుర్తుకువచ్చింది భరణికి. అప్పటికీ ఇప్పటికీ ఎందుకో పొంతన కుదరలేదు. అక్కడ మనిషి కోసం వస్తువు ఎదురుచూస్తోంది. ఇక్కడ వస్తువు కోసం మనిషే ఎదురేగుతున్నాడు. షోరూంలో సేల్స్‌మెన్‌ ఒక్కో టీవీని భరణి కుటుంబానికి పరిచయం చేయసాగాడు. భరణి లక్ష్యం యాభైవేలలో స్మార్ట్‌ టీవీ. కాబట్టి దానికే స్థిరపడిపోయారు. ఇంతలో...
      ‘‘ఓసారి ఇది కూడా చూడండి. ఇది 4కే రిజల్యూషన్‌ ఉన్న టీవీ. ఇప్పుడు మార్కెట్లో ఇదే లేటెస్ట్‌ ట్రెండ్‌. ఇది కొంటే, ఇంకో పదేళ్లపాటు మీరు కొత్త టీవీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆఫర్లో కూడా ఉంది. జస్ట్‌ ఎయిటీ థౌజండే!’’ అంటూ ఊదరగొట్టే ప్రయత్నం చేశాడు సేల్స్‌మెన్‌. భరణి కుటుంబం అతని మాటల్ని యాథాలాపంగా తీసుకుంది. కానీ ఎందుకో ఒక్క క్షణం భరణి వెనక్కి తిరిగిచూశాడు.
      ‘ఇంకో పదేళ్లపాటు...’ అన్న మాటలు అతనిలో ఏదో లోతుల్లోకి దిగాయి. తీరా ఇంటికి వెళ్లాక అంతా 4కే గురించి మాట్లాడితే, తన శ్రమ వృథా అయిపోతుంది. అదే తన ధ్యాసగా మారిపోతుంది. అందుకనే మధ్యతరగతి భేషజంలోంచి మరో సూత్రాన్ని బయటికి తీశాడు. అదే- ‘వస్తువుని కొనేటప్పుడు నీ స్తోమతని మించి ఒక అడుగు ముందుకే వేయాలి!’ దాంతో ఎనభైవేలు అప్పగించేసి 4కే టీవీని సొంతం చేసేసుకున్నాడు. బిల్లు చేతిలోకి తీసుకుంటుండగా ఓ కన్నీటి పొర అతని చూపుని కమ్మేసింది. ఆ మసకలో చుట్టూ ఉన్న టీవీలతో పాటు ప్రపంచమే అస్పష్టంగా తోచింది.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


వాళ్లు ఏడ్చారు!

వాళ్లు ఏడ్చారు!

పి.చంద్రశేఖర అజాద్‌


స్వ‌యంవ‌ధూ...!?

స్వ‌యంవ‌ధూ...!?

దోరవేటి, (వి.చెన్నయ్య)


సువర్ణ గన్నేరు పూలు

సువర్ణ గన్నేరు పూలు

ప్రసాదమూర్తి


స‌మిధ‌

స‌మిధ‌

సయ్యద్‌ సలీం


అతడూ మనిషే!

అతడూ మనిషే!

పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


దాసరి పాట (క‌థాపారిజాతం)

దాసరి పాట (క‌థాపారిజాతం)

చింతా దీక్షితులుbal bharatam