కొత్త పెళ్లాం ముక్కు పుడక

  • 205 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు

  • డెవలప్‌మెంట్‌ ఆఫీసర్, ఎల్‌ఐసీ,
  • తిరుపతి.
  • 9393662821
ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు

కార్త‌వ‌రాయుడిది చిర‌కాల కోరిక‌. మ‌న‌సులో గిలిగింత‌లు పెట్టే కోరిక‌. ఆరు నూరైనా రాజీకి తావులేని కోరిక‌. మ‌రి ఆ కోరిక తీరిందా? అత‌ని క‌థేంటి? 
నగరి
కొండ చుట్టు రోజున కటవ (పొద) వెనకాల బీడీ కాలుస్తూ గుప్పుగుప్పుమని పొగ వదులుతున్నాడు కార్తవరాయుడు. రింగులు రింగులుగా పొగ వదిలేది ఎదురింటి ఎల్లోరా చూసేసింది. 
      ‘‘ఎల్లోరా! ఎల్లోరా!! నేను బీడీలు తాగతాననే విషయం ఊర్లో ఎవరికీ చెప్పొద్దు. అసలే ఆడ పిలకాయలు దొరకడం లేదు. అందులోనూ ముక్కుపుడక పెట్టుకునే ఆడోళ్లు అసలు దొరకడం లేదు. మూడు పదులు దాటిన నాకు నచ్చిన పిల్ల దొరికి పెళ్లి జరిగే ముహూర్తం ఎప్పుడు వస్తుందో ఏమో? ఇట్టాంటి బీడీ పొగ వార్తలు ఊర్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా? ముక్కిడికి తోడు పడిసెంలా తయారవుతుంది నా పరిస్థితి. నా పెండ్లి పెటాకులై పోదా!’’ అంటూ ఎల్లోరాని భంగపడినాడు. ఎల్లోరా వాడి బీడీ కంపు భరించలేక పైటకొంగు ముక్కుకి అడ్డం పెట్టుకుని ఎవరికీ చెప్పనంటూ తలూపింది.
      అమ్మా కొడుకు తిన్నెమీద కూర్చుని తాటి గేగులు తింటున్నారు. అమ్మ మస్తానమ్మ ముక్కుపుడకని ముదిగారంగా లాగుతూ ‘‘అమ్మా! నీకు ముక్కు ఎప్పుడు కుట్టినారే’’ అని ఊగతా ఊగతా అడిగినాడు కార్తవరాయుడు. 
      ‘‘ఒరేయ్‌ పాపిస్టోడా, చచ్చిన మీ నాయనే నన్నెప్పుడూ ముక్కుపుడక గురించి అడగలేదు కదరా’’ అంటూ మస్తానమ్మ సిగ్గుమొగ్గలయ్యింది. చీర కొంగుతో గాలి విసురుకుంటూ ‘‘నాకు మూడేండ్లప్పుడు తిరుత్తణిలో పుట్టు వెంట్రుకలు తీసినారంట. మేనమావ వెండి పట్టీలు, బంగారు గాజులు, బంగారు గొలుసు, బంగారు సిగ్గుబిళ్ల చేయించినాడంట. మేళతాళాలు పెట్టి నన్ను తన ఒళ్లో కూర్చోబెట్టుకుని పాలల్లో మల్లెపూవు కాడ అద్ది నా ముక్కు చెవులకాడ ముద్రలు వేస్తే రంగంపేట రంగనాథాచారి ముక్కు చెవులు కుట్టినాడంట. నొప్పికి ఏడస్తా ఉంటే తిరుత్తణి కొండ లడ్డు నోట్లో పెట్టినారంట. గుడికాడి కోతులు గుంపుగా నిలబడి నా ఏడుపు ఆపే వరకు సినిమా చూసినట్లు చూసినాయంట’’ నవ్వుతూ చెప్పింది. 
      అంతలో ఇళ్లత్తూరు ఇందిరక్క తన కూతురు కృష్ణవేణికి పట్టు పావడా పట్టు జాకెట్టు వేసి, బంగారు పాపిటబిళ్ల నుదుటనబెట్టి ఏదో పని ఉన్నామె మాదిరి కార్తవరాయుడి ఇంటికి కూతురుతో సహా వచ్చింది. ‘‘వరసైన పిల్ల, సొగసైన పిల్ల, అంతో ఇంతో పెట్టి చేస్తారు, ముక్కుపుడక పెట్టుకోలేదని ఎందుకు వదిలేస్తావురా, బంగారం లాంటి సంబంధం’’ అని అమ్మ కార్తవరాయుడిని పక్కకి పిలిచి బతిమిలాడింది. ‘‘ఎంత అందగత్తె ముక్కయినా పడిసెం పడితే చీమిడి కారుస్తుంది తప్పితే బంగారం కారుస్తుందా’’ అని కూడా నచ్చజెప్పింది. అయినా కార్తవరాయుడి మనసు కరగలేదు.                ‘‘ముక్కుపుడక లేని పెళ్లాన్ని చెడ్డ కలలో కూడా ఊహించలేనమ్మా, చచ్చి మళ్లీ నీ కడుపున పుడతానే, ముక్కుపుడక ఉన్న పెళ్లాన్నే చేసుకుంటానే’’ అని దీనంగా బదులిచ్చినాడు. 
      ‘బిడ్డ ఏమైనా మణులు మాణిక్యాలు అడగతా ఉండాడా? పెళ్లానికి ముక్కుపుడక ఉంటే అదే పదివేలు అంటున్నాడు కదా. వాడి ఆశ ఎందుకు కాదని చెప్పాల’ అనుకుని మస్తానమ్మ అతని ఇష్టానికే వదిలేసింది. విషయం తెలుసుకున్న ఇళ్లత్తూరు ఇందిరక్క ముఖం మాడ్చుకుని కూతుర్ని తోడుకుని సరసరా వెళ్లిపోయింది.
      పడమటి వీధి సంపూర్ణక్క తన మనవరాల్ని తోడుకుని తిరపతి పోతా ఉంది. ‘‘ఏమి పూర్ణక్కా, మనవరాలితో ఎక్కడికి పోతా ఉండావు?’’ అని అడిగింది మస్తానమ్మ. 
      ‘‘ఏమి చెప్పేది మస్తానూ! ముక్కు ఉండేంత వరకు పడిసెం ఉంటుంది కదా, కట్టె కాలేంత వరకు కష్టాలు ఉంటాయి కదా. మూడు నెలల ముందు మా మనవరాలికి ముక్కు కుట్టించినాము. ఏమయ్యిందో ఏమో ముక్కు అంతా పుండు అయిపోయింది. ముక్కు కుట్టేదానికి వెయ్యి రూపాయలైతే, పుండు మానేదానికి పదివేలు ఖర్చవతా ఉంది’’ బాధగా చెబుతూ వెళ్లింది. అమ్మా కొడుకులిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
      అంతలో తిరుపతిలో జాతరని ఊర్లోని పొట్టిమీసాల ప్రసాదు తన చింతామణి నాటక బృందంతో సుబ్బిశెట్టి వేషం వేసుకొచ్చినాడు. ‘‘మీరు తిరపతిలో కదా వేషాలు వెయ్యాల్సింది’’ కార్తవరాయుడు అడిగినాడు. 
      ‘‘తిరపతిలో భలే కాంపిటీషన్‌ రబ్బా, మన ఊర్లల్లో అయితే కలెక్షన్లు బాగుంటాయి’’ అని సుబ్బిశెట్టి కోటు సర్దుకుంటూ నిలబడినాడు. చుట్టూరా చేరిన పిలకాయలు గోల చేస్తా ఉండారు. వారి రచ్చ భరించలేక డైలాగ్స్‌ చెప్పకుండా సినిమా పాటలు అందుకున్నారు. తొర్రముక్కుల తుకారాముడు, చీమిడి ముక్కుల చెంచులక్ష్మి ‘చింతచెట్టు చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు....’ అని పాడుతూంటే చింతామణి, సుబ్బిశెట్టి పాత్రధారులు వయ్యారంగా డ్యాన్సులేసినారు. ఒన్స్‌మోర్‌ అరచినారని తొర్రముక్కుల తుకారాముడు, చీమిడిముక్కుల చెంచులక్ష్మి ‘మావ మావ మావా.... ఏమె ఏమె భామా’ పాట అందుకున్నారు. పిలకాయలు ఈలలేసి గోలగోల చేసినారు. మస్తానమ్మ, కార్తవరాయుడు పడీపడీ నవ్వినారు. 
      ‘‘ఆడి పాడింది చాల్లేరా నాయనా’’ అని మస్తానమ్మ పడి సెనిక్కాయలు పేపర్లో పొట్లం కట్టకచ్చి రోల్డ్‌గోల్డ్‌ నగలు వేసుకొచ్చిన చింతామణి చేతిలో పెట్టింది. సెనిక్కాయలు తీసుకున్న చింతామణి ఘల్‌ ఘల్‌ గజ్జెల శబ్దంతో కులకతా నడిచి వెళ్లింది. అంతలో సుబ్బిశెట్టి పంచె కొంచెం ఊడింది.       పంచె సరిచేసుకుంటూ పిలకాయలతో తమాషాగా ‘‘తుమ్మితే ఊడిపోయే ముక్కు చీదితే ఎన్ని రోజులుంటుంది రబ్బా?’’ అంటూ చింతామణి వెనకనే చలువ కళ్లజోడు సర్దుకుంటూ ఎగురుకుంటూ వెళ్లినాడు. ఊర్లో పిల్లకాయలు వారి వెనకనే హైహై అని అరుస్తూ డ్యాన్సులేస్తా వెళ్లినారు.
      గణేశ్వరపురం గుణవతి గంపలో వంకాయలు బెండకాయలు మునక్కాయలు పెట్టుకుని ‘కూరగాయలో’ అని అరుస్తూ వీధిలో పోతా ఉంది. మస్తానమ్మ వాకిట్లో నిలబడుకుని గంప దించమంది. అన్ని కాయగూరల్నీ అదిమి అదిమి చూసి ‘‘అన్నీ ముదురు కాయలే కదమ్మీ’’ అంది. కూరగాయలు వచ్చినాయని తెలుసుకున్న ఎదురింటి ఎల్లోరా చకచకా స్నానం ముగించింది. వస్తూ వస్తూ స్నానానికి ముందు తీసిపెట్టిన బంగారు ముక్కుపుడక బిరడా కనిపించక చిన్న పొరకపుల్ల ముక్కుకు పెట్టకచ్చింది. గబగబా వీధిలోకి వచ్చి ముదురు బెండకాయలను చూసి ‘‘మగాడు ముదిరినా బెండకాయ ముదిరినా దేనికీ పనికిరావు కదా గుణవతీ’’ అని చెప్పేసి ఏమీ తీసుకోకనే సర్రున వెళ్లిపోయింది. 
      పెల్లో (పెరట్లో) టెంకాయ చెట్టు చుట్టూ మట్టి తీస్తున్న కార్తవరాయుడికి ఎల్లోరా మాటలు ఎక్కడో గుచ్చుకున్నాయి. గభాల్న చేతిలోని పార పడేసి గుణవతి వెనకనే గంగమ్మ గుడివరకు నడిచినాడు. గుణవతిని పక్కకి పిలిచి ‘‘గుణవతీ గుణవతీ! నీకు పదో ఇరవయ్యో ఇస్తాను. నాకు పిల్ల దొరికి పెండ్లి అయ్యేంత వరకు ముదిరిపోయిన కూరగాయలేవీ మా ఇంటికాడికి తేవద్దు’’ అని చెప్పి బతిమిలాడినాడు. అలాగేనని తలూపిన గుణవతి కొంగు ముఖానికడ్డం పెట్టుకుని ముసిముసిగా నవ్వుకుంటూ పోయింది. 
      ‘‘మదనంబేడులో మంచి సంబంధం ఉండాది. అయితే పెండ్లికూతురుకి చిన్నప్పుడెప్పుడో ముక్కు కుట్టినారంట. ఏండ్ల కొద్దీ ముక్కుపుడక పెట్టుకోక అది పూడిపోయిందంట. ఇప్పుడు పెండ్లికొడుకు కచ్చితంగా ముక్కుపుడక ఉండాలంటే మళ్లీ ముక్కుకి రంధ్రం సరి చేయిస్తారంట’’ అని చెప్పింది మొక్కజొన్న కంకులమ్మే మంజులక్క. కార్తవరాయుడు అలాంటి సంబంధం వద్దంటే వద్దని కూర్చున్నాడు. పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు పెట్టిన ముక్కు రంధ్రమే ముద్దు, మిగతావి నాకు వద్దు అని గట్టిగా చెప్పినాడు. విషయం తెలిసి ఊర్లో వాళ్లు ముక్కుమీద వేలేసుకున్నారు.  
ఎర్రావారిపాలెంలో ముక్కుపుడక పెట్టుకున్న అమ్మాయి ఉందని తెలిసి కార్తవరాయుడు ఖుషీ ఖుషీ అయిపోయినాడు. తెల్లపంచె తెల్లచొక్కా వేసినాడు. బాటా చెప్పులు తొడిగినాడు. సెంటు కొట్టినాడు. అమ్మ మస్తానమ్మను తోడుకుని ఎర్రావారిపాలెం బస్సు ఎక్కినాడు. అత్తామావలు అల్లుడిని అభిమానంగా పలకరించినారు. అప్పటికప్పుడు తమ తోటలోని మిసమిసలాడే పనసకాయ ఒకటి కోసుకొచ్చి పది పనస తొనలు అరటి ఆకుల్లో పెట్టి తినమన్నారు. అమ్మాకొడుకులిద్దరూ పది కాదు ఇరవై పనస తొనలు తృప్తిగా తిన్నారు. పెండ్లికూతురు గ్లాసుల్లో మజ్జిగ పోసుకుని వచ్చింది. కార్తవరాయుడు ఆ అమ్మి ముక్కుపుడకని చూసి ఆనందపడిపోయినాడు. తమిళ హీరో ఎంజీఆర్‌ ‘ఉలగం సుట్రం వాలివన్‌’ (తెలుగులో లోకం చుట్టిన వీరుడు) సినిమాలో వేసిన స్టెప్పులు వేయాలనుకున్నాడు. అందరి ముందర వేయడం ఎందుకు? రేపెప్పుడైనా గూళూరు చెరువు కాడ ఎవ్వరూ లేనప్పుడు వేసుకుంటే పోతుందిలెమ్మని గమ్మున ఉండిపోయినాడు. పెండ్లికూతురు దగ్గరికి వస్తుంటే ఒళ్లంతా కరెంటు ప్రవహించినట్టు అయ్యింది కార్తవరాయుడికి. ఆ యమ్మి కార్తవరాయుడి చేతికి మజ్జిగ గ్లాసు అందించి వెనక్కి తిరుగుతూ ఉంటే అప్పుడు చూసినాడు - ఆ అమ్మి ముక్కుకి రెండువైపులా ముక్కు పుడకలు ఉండేది. గబుక్కున లేచి అమ్మని తోడుకుని యనమలపాలెం వెళ్లే బస్సు ఎక్కినాడు. ‘‘ఏమైందిరా కార్తవరాయా?’’ అని అమ్మ ఎన్నిసార్లు భంగపడినా బదులు చెప్పలేదు. వడమాలపేట కాడికి వచ్చినాక ఎడమ చేతి వేలికి పంచె కొన చుడుతూ ‘‘ఆ అమ్మికి రెండు ముక్కులూ కుట్టినారే! నాకు అట్ట ఉంటే సగించదమ్మా’’ అనినాడు. మస్తానమ్మ బస్సు సీటులోనే పడీ పడీ నవ్వినాది.  
      అక్కడా ఇక్కడా కార్తవరాయుడి పోగిడి పట్టుకుని పిలగోడు మట్టిలో మాణిక్యం లాంటోడని తెలుసుకుని చెంగన్నగుంట కానిస్టేబుల్‌ కోదండం తన కూతుర్ని ఇస్తానని ముందుకొచ్చినాడు. కోదండం కూతురు కనకలక్ష్మిని చూసిన కార్తవరాయుడు ఓకే చెప్పినాడు. కనకలక్ష్మి ముక్కు పుడకను చూసి డబుల్‌ ఓకే చెప్పినాడు. కొడుకు పెండ్లికి ఒప్పుకున్నాడని మస్తానమ్మ తన బంధువులైన హంపి కమలక్క, ఊటుకూరు అమరావతక్క, బంగారుపాలెం నాగమ్మ, పచ్చికాపల్లం శేషాద్రన్న నోళ్లల్లో చక్కెర పోసింది. అప్పలాయగుంట అయ్యోరి దగ్గరికెళ్లి పేరు ఫలాలు చూపించుకున్నారు. పొంతనాలు సరిపోయాయని అయ్యోరు పచ్చజెండా ఊపినాడు. ఆ పక్క నలుగురూ ఈ పక్క నలుగురూ నారాయణవనం సొరకాయల స్వామి గుడికాడికి పోయి డుం డుం కొట్టి పెండ్లి జరిపించేసినారు. పెండ్లికి వంటలేమీ పెట్టుకోలేదు మావగారు. వేల రూపాయలు ఖర్చుపెట్టి భోజనాలు పెట్టినా... ఉర్లగడ్డ ఉడకలేదు, వడియాలు వేగలేదు, కూరలో ఉప్పులేదు, ఊరగాయ బాలేదు, పులుపు ఎక్కువ, కారం తక్కువ, రసం చప్పగా ఉంది, మజ్జిగ పలచగా ఉంది, అరటిపండు మాగలేదు, ఐసు క్రీము కరిగిపోయింది అని చెబుతారు. కాబట్టి వంటా వార్పులు వద్దు, కుప్పన్న హోటల్‌ ముద్దు అని అక్కడే ఇడ్లీ వడ సాంబార్‌ పెట్టి చేతులు కడిగించేసినాడు పోలీస్‌ మావ. ‘ఒక్కగానొక్క కూతురు కదా, అంతా మిగలబెట్టి మనకే కదా ఇవ్వబోతాడు. పాసి పండ్లోడు దాసిపెడితే బంగారు పండ్లోడు తినేసి పోయేది మామూలేకదా’ అనుకుని అన్నిటికీ ఒప్పుకున్నాడు పెండ్లికొడుకు. 
      అందరూ మామిడి ఆకులు అరటి ఆకులు కట్టిన ట్రాక్టరులో చెంగన్నగుంట చేరినారు. దారిలో వెళుతున్న మేకలు ఊర్లోకి వచ్చిన ట్రాక్టర్‌ను చూసి ఆగి నిలబడి పెండ్లికొడుకు దగ్గరకెళ్లి వాసన చూసి వెళ్లిపోయినాయి. కార్తవరాయుడు అత్తగారి ఇరుకు ఇల్లు చూసి ఇక్కడ సంసారం ఎట్లా చేసేదబ్బా అనుకున్నాడు. ఇంట్లో కూర్చోడానికి అందరికీ స్థలం లేక ఇంటి ముందర బాదం చెట్లకింద నులక మంచాల మీద దుప్పట్లేసి కూర్చున్నారు. పెసల పప్పు పాయసం అందరికీ పంచినారు. మీసాలాయన తాటి తోపులోంచి తాటికాయలు కొట్టకొచ్చి తాటి ముంజలు తిన్నారు. అవీ ఇవీ తింటూ అదీ ఇదీ మాట్లాడుతూ ఉంటే సాయంత్రం అయిదయ్యింది.
      మొదటి రాత్రి గుర్తుకొచ్చి కార్తవరాయుడు అప్పలాయగుంటకెళ్లి పూలు తెమ్మని వెంకటమావకి పైసలిచ్చి పక్కింట్లో సైకిల్‌ తీసిచ్చి పంపినాడు. వెంకట మావ లెఫ్ట్‌ రైట్‌ కొట్టుకుంటూ సైకిల్‌ కాడికెళ్లి సైకిల్‌ సీటు మీద కర్చీఫ్‌ వేసి, సైకిల్‌కున్న చిన్న అద్దంలో తన పాచిపండ్ల అందాన్ని చూసుకుని మురిసిపోయి సరసరా సైకిల్‌ తొక్కుకుంటూ తుర్రుమన్నాడు.
      రాత్రి ఎనిమిదిన్నర అయ్యింది. ‘కొక్కొరొకో అంటే తెల్లారినట్టా? తాళి కడితే పెండ్లి అయినట్టా? జరగాల్సినవి చాలా ఉన్నాయి కదా’ అనుకుని పంచె ఎగ్గట్టుకుని అటూఇటూ తిరుగుతున్నాడు  కార్తవరాయుడు. పెళ్లాం కనకలక్ష్మికి చిన్నచిన్న సైగలు, గాలి ముద్దులు విసిరినాడు. కొత్త పెండ్లికూతురు మొగుడి వయ్యారాలకు ముసిముసిగా నవ్వుకుంది. అంతలో అప్పలాయగుంట నుంచి సైకిల్‌ మీద సర్రున దిగినాడు వెంకటమావ. తామరాకుల్లో చుట్టిన మూడు మూరల ముద్దబంతి పూలు కార్తవరాయుడు చేతికిచ్చినాడు. మొదటిరాత్రికి మల్లెపూలో, సన్నజాజులో తెస్తారుగానీ ముద్దబంతులు తెచ్చే మొగాళ్లు కూడా ఉంటారా అని వెంకటమావ వైపు కసికసిగా చూసినాడు. ‘‘పైడిపల్లి పూలంట, ఫ్రెష్షుగా ఉంటే తెచ్చినా’’ అని మెలికలు తిరగతా చెప్పినాడు.
      వెంకట మావ కార్తవరాయుడి కన్నా వయసులో పెద్దవాడు కాబట్టి సరిపోయిందిగానీ, లేకుంటే ఎగిరెగిరి తన్నుండేవాడు. అంతలో అత్త అరుంధతీదేవి ‘‘వెంకటా, మొదటిరాత్రికి ఏ పూలు తేవాల్నో తెలియకనే ముగ్గురు బిడ్డలకు తండ్రి అయినావు కదరా’’ అని నిష్ఠూరమాడింది. పక్కనున్న అమ్మలక్కలు పకపకా నవ్వినారు.  
      అమ్మలక్కలు పెండ్లికూతురుని భద్రంగా పాలగ్లాసుతో పడగ్గదిలోకి పంపినారు. పెద్ద దీపం ఉంటే సిగ్గని పెద్దదీపం ఆర్పి చిన్న దీపం వెలిగించింది పెండ్లికూతురు. ముక్కుపుడక మిలమిలా మెరుస్తూ ఉంటే దాన్నే చూస్తూ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. 
      భళ్లున తెల్లారింది. కొట్టంలోని మేకలు మే మే అని అరుస్తున్నాయి. కొత్త పెండ్లికొడుకు గబగబా లేచి పంచె సర్దుకుని పెండ్లికూతురి వైపు చూసినాడు. కనకలక్ష్మి ముక్కుకు ముక్కుపుడక లేదు. బోసిగా ఉంది ఆమె ముక్కు. కడుపు రగిలిపోయింది. లక్షలాది చీమలు ఒళ్లంతా తిరుగుతూ కుట్టినచోట కుట్టకుండా కుడితే ఎలా ఉంటుందో అలా ఉంది అతడి పరిస్థితి. ఆవేశంగా లేచి అత్తామావలతో తాడో పేడో తేల్చుకుందామని కోపంగా పడగ్గది తలుపు తెరిచినాడు. 
      పడగ్గది ఎదురుగా అత్త అరుంధతీదేవి రాతి బండ మీద రాయలచెరువు నుంచి తెచ్చిన మీసాల చేపలను రుద్ది రుద్ది కడిగి, కత్తితో కండలు కండలుగా నరికి ముక్కలు చేసి సట్టిలో వేస్తోంది. భయంతో చిన్నగా వణుకు మొదలయ్యింది కార్తవరాయుడిలో.  
      హాల్లో మావ కోదండం ఖాకీ యూనిఫాం వేసుకుని అద్దంలో చూసుకుంటూ నల్ల తెల్ల మీసాలకు కొబ్బరి నూనె రాస్తున్నాడు. అద్దంపైన దండకారణ్యం అడవుల్లో నక్సలైట్‌ ఎన్‌కౌంటర్లో పాల్గొన్నందుకు హోమ్‌ మినిస్టర్‌ మావకి ఇస్తున్న ప్రశంసా పత్రం ఫొటో ఉంది. ఎన్నో సినిమాల్లో పోలీసులు ఖైదీలను కొట్టేది గుర్తుకొచ్చి కార్తవరాయుడి ఒళ్లంతా చెమటలు పట్టసాగింది.
      పెద్దమావ మిలిటరీ మనిషి కదా, మూలగా కూర్చుని తుపాకీ లాంటిదేదో బ్యాగులో సర్దుకుంటూ కనిపించాడు. కార్తవరాయుడి పంచె కొంచెం కొంచెం తడి అవ్వడం ప్రారంభించింది.
      కరెంటు షాకు కొట్టినోడిలా ఉన్న కార్తవరాయుడి భుజానికి మెత్తగా మానవ శరీరమేదో తగులుతున్నట్టుగా ఉంటే వెనక్కి తిరిగి చూసినాడు. కొత్త పెండ్లికూతురు కనకలక్ష్మి నంగిగా మంగళ సూత్రాల వైపు ఒకసారి, మొగుడి మొఖం వైపు ఒకసారి చూస్తూ ‘‘ఏమండీ, మీరు ముక్కుపుడక ఉన్న పెళ్లాన్ని చేసుకోవాలనుకున్నారట కదా. రెండు వారాలయ్యాక నేను మా ఊరి ఉలగనాదం ఆచారి దగ్గర ముక్కు కుట్టించుకుంటానండీ. మీకు నచ్చిన ముక్కుపుడక పెట్టించుకుంటానండీ’’ అని చెప్పింది. తలూపక చస్తానా అన్నట్టుగా తలూపినాడు, కత్తివేటుకు చుక్క నెత్తురులేని కార్తవరాయుడు. 
      కనకలక్ష్మి తన ముక్కుకి పెట్టుకున్న పెట్టుడు ముక్కుపుడక మిలమిలా మెరుస్తోంది. వంట గదిలో కట్టెల పొయ్యి మీద ఉన్న సట్టిలో కొరమీను కుతకుతా ఉడుకుతోంది. ఎక్కడో రేడియోలో ‘‘కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్‌... ఓడి పోలేదోయ్‌’’ పాట తెరలు తెరలుగా వినిపిస్తోంది. కొట్టంలోని మేకలు మే, మే అని అరవడం ఆపలేదు.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


వాళ్లు ఏడ్చారు!

వాళ్లు ఏడ్చారు!

పి.చంద్రశేఖర అజాద్‌


స్వ‌యంవ‌ధూ...!?

స్వ‌యంవ‌ధూ...!?

దోరవేటి, (వి.చెన్నయ్య)


సువర్ణ గన్నేరు పూలు

సువర్ణ గన్నేరు పూలు

ప్రసాదమూర్తి


స‌మిధ‌

స‌మిధ‌

సయ్యద్‌ సలీం


అతడూ మనిషే!

అతడూ మనిషే!

పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


దాసరి పాట (క‌థాపారిజాతం)

దాసరి పాట (క‌థాపారిజాతం)

చింతా దీక్షితులుbal bharatam