మొక్కుబడి

  • 286 Views
  • 1Likes
  • Like
  • Article Share

    వి.వెంకట్రావు (దర్జీ)

  • విజయనగరం
  • 9247235401
వి.వెంకట్రావు (దర్జీ)

బాప్పా! సోంవారం తొలేలు, మంగళారం పండగ. అప్పుడవ్వదు. ఆ దొమ్మీలో ఘటం ఎత్తుకోడం అంటే అయ్యేపని కాదుగానీ, శనోరంగానీ, ఆదోరంగానీ మొక్కు తీర్చేసుకుందూ అంది గౌరి.
      అది కాదే గౌరి! పండగలోనే ఘటం ఎత్తుతానని మొక్కాను. ముందే ఎత్తేస్తే ఎలాగవుద్దీ అంది నర్సమ్మ.
      పర్లేదు బాప్పా! ఆ వారం అంతా పండగ రోజులే. దశిం దగ్గర నుంచి ఉయ్యాల కంబాల వరకూ, ఎప్పుడైనా పర్లేదు. శానా మంది ఉయ్యాల కంబాలక్కూడా మొక్కులు తీరుస్తారు సూడ్లేదా? అదికాదుగానీ, నీకాలు సంగతి సూసుకో. ఇప్పుడిప్పుడే పుండు మాన్పుకొస్తుంది. మళ్లీ అంత దూరం నడుస్తే, మోపుసేస్తాదేమో. సూసుకో నీ ఓపికే. పడ్డదానివి నువ్వు. ఎటు తిరిగి ఏటైనా అయితే మళ్లీ అదొక బాధ. మళ్లొకసారి ఆలోసించుకో. మొక్కుదేం ఉంది. మళ్లీ ఏడాదైనా తీర్చుకోవచ్చు.
      తప్పే గౌరి, అలగనకూడదు. అప్పుడేదో మన బాధకొద్దీ మొక్కీసి, గండం గడిచింది కదాని, మొక్కు వాయిదా ఏసావంటే ఆ తల్లికి కోపమొస్తాది. మళ్లీ ఏడాదికి ఉన్నోళ్లు ఎవరో పోయినోళ్లు ఎవరో. నానే ఘటం ఎత్తుతానని మొక్కాను కదా! మొక్కు ఉండిపోతాది. ఇంక మనసులో అదే ఉండిపోయి, లోపల అదే పీకుతాది. నెమ్మదిగా నడుస్తాను. ఎంత దూరం మనింటికీ, గుడికి. వీధిలోకెళ్లి సూస్తే కనిపిస్తాది.
      దూరం అని కాదు బాప్పా! మాలాటోల్లం నడిసీగలం. మాములుగా అయితే నువ్వూ నడిసీగలవు. కాలు నొప్పితో గదా! తక్కువ దూరం అయినా ఎక్కువే అనిపిస్తాది. పోన్లే సోంవారం తొలేలు నాడు ఎత్తుదూగానీ అని రాజీ కొచ్చింది గౌరి.
      నర్సమ్మ విషయం అయితే కాలు చాలా వరకు తగ్గినమాట నిజమేగానీ, కొంచెం నొప్పిగా ఉన్నమాట అంతకన్నా నిజం. ఆ కొంచెం నొప్పి ఉన్న విషయం నర్సమ్మ చెప్పలేదు. చెబితే గౌరి ఘటం ఎత్తుకోనివ్వదు.
      నెల రోజుల క్రితం నాటి సంగతి తలుచుకుంటే, నర్సమ్మకు గుండెల్లో గుబులు కలుగుతుంది. నర్సమ్మకు ఒక్కడే కొడుకు అప్పలకొండ. ఇళ్లకు పెయింటింగ్‌ వేస్తాడు. ఏ వ్యసనాలూ లేవు. జాగ్రత్తపరుడు. భయస్థుడు.
      కోడలు కన్నవారిది విజయనగరానికి దగ్గర్లోనే ఉన్న గుర్ల పక్కన గుజ్జంగివలస. కోడలు గౌరి అంటే మొదట నుంచీ అభిమానమే. అత్తగా నర్సమ్మ ఏనాడూ సాధించిందీ లేదు, అత్తని గౌరి చిన్న చూపు చూసిందీ లేదు. ఇద్దరూ తల్లీ కూతుళ్లలా ఉంటారు.
      ‘‘ఏటి నర్సమ్మొదినా! పండక్కి ఘటం ఎత్తుతావా?’’ అంది అప్పుడే అక్కడికి వచ్చిన నూకాలు. పక్కనే ఉన్న చిన్న స్టూలు మంచం దగ్గరకు లాక్కుని కూర్చుంటూ.
      ‘‘అవును నూకాలూ’’, ఆ మద్దిన నువ్వు ఊర్లోనేవుగానీ గొప్ప కవుకులు పడ్డాననుకో. ఏదో మామూలు కురుపు అనుకున్నానుగానీ ఇంత మోపు అవుద్దనుకోనేదు. కుడికాలు పాదం మీద శనగబద్దంత ఉండీది. సిన్నదే కదాని అనుకుంటే కోతిపుండు, బెమ్మరాచ్చసిలాగా అయింది. రెండు రోజులు అవ్వబోతప్పుడుకి అడుగుతీసి అడుగు ఎయ్యలేకపోనాను. పాదం మీద నుంచి పిక్కల దాకా వాపు, పిక్కంత సీం పట్ట్టేసి ఒకటే సలుపు. అదే పోద్దిలే అనుకుంటే ఆస్పటాలుకి ఎల్లక తప్పనేదు
      అప్పుడే మా అప్పలకొండా, గౌరీ, మీ వరాలు కూడా వచ్చింది. అందరూ దగ్గరుండి మరీ తీసుకెళ్లారమ్మా. ఆటో ఎక్కడం కూడా కష్టం అయిపోనాదంటే నమ్ము. మన కోట దగ్గరున్న రాంమూర్తి డాట్రుగారికే చూపించారు. గంటు పెట్టాలన్నారు. అనుకోని ఆపద వచ్చిపడీ సరికి మా అప్పలకొండకీ, గౌరికీ కాళ్లూ చేతులూ ఆడనేదు. డాట్రుగారి దగ్గరికి ఎల్లిన తరువాత ఆల్లిష్టం అవుద్దిగానీ మనిష్టం అవుద్దేటి?
      మీరెలా సెబుతే అలాగేనండి అన్నాడు మా అప్పలకొండ. ఎంతవుద్దో ఏటోగానీ, ముందు మాత్రం డబ్బులు కట్టించుకోనేదు.
      బల్లమీద పడుకోబెట్టి కాలుకి పట్టిన సీవంతా మామిడి పండు పిసికినట్టు పిసికేరు. ఆ నొప్పికి పైడితల్లమ్మ కనిపించింది. కాసేపటికే వదిలేరు.
      ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నాను. అంతా అయిపోయింది ఇక ఇంటికెల్లిపోడమే అనుకున్నాను. కానీ అంతటితో అయిపోనేదు. అసలు నరకం ఆ తరువాతే ఉంది నూకాలూ, సచ్చేననుకో.
      డాట్రుగారు బయటకొచ్చి ‘‘లాభం లేదయ్యా ఫస్‌ బయటకు రావడం లేదు. రేపు సాయంత్రం తీసుకురండి. దీనికి వేరే చెయ్యాల్సి ఉంది’’ అని అనగానే గుండెల్లో రాయిపడినట్లయ్యింది.
      ‘‘ఏంరా! కొండా, ఏటన్నారు డాట్రుబాబు’’ అన్నాను.
      ‘‘ఏం లేదులే! రేపు సాయంత్రం రమ్మన్నారు’’ అన్నాడు. అంతకన్నా సెప్పేందుకు ఆడికి మాత్తరం ఏం తెలుసు. అసలు బాధంతా ఆ మరుసటి రోజునుంచే మొదలయ్యింది నూకాలు. మొత్తం ఆరుసార్లు ఎలితేగానీ ఈ మాత్తరం తగ్గనేదు. మొదటిరోజేటి, తరువాతరోజేటి ఇంత బాధుంటాదని కల్లోగూడా అనుకోనేదు.
      కాలు డాట్రుగారికి అప్పజెప్పీసి బల్లమీద కళ్లుమూసుకొని అటువైపు తిరిగి పడుకోమన్నారు. ఇక అప్పుడు సూడాలి. కళ్లతో సూడలేదుగానీ, తరువాత గౌరి సెప్పింది. రెండు చేతులతో పిక్కల దగ్గర బిగించి పట్టుకున్నారు. బెత్తెడు వెడల్పూ, గజం పొడవూ ఉన్న బేండీజులాంటి గుడ్డ గంటుపెట్టిన చర్మాన్ని పట్టకారులాంటిదాన్తో పట్టుకుని కురుపు లోపలికి కూరీవోరు. లోపలికి ఆ గుడ్డ కూరుతుంటే నరకం అంటే ఎలా ఉంటాదోగానీ ఇక్కడే అనబగిస్తున్నానురో భగవంతుడా అని అనిపించింది. పళ్ల బిగువున బాధంతా దాసుకున్నాను.
      అమ్మా! అమ్మా! అని ఏనాడోపోయిన మా అమ్మ గుర్తుకొచ్చింది. సెప్పుకోలేని బాధ. ఆ బాధ అనబగించినోల్లకే తెలస్తాది. అలాగ ఒకసారా, రెండుసార్లా మొత్తం ఆరుసార్లు. ఎల్లినప్పుడల్లా కట్టిప్పి లోపలపెట్టిన గుడ్డ తీసీవోరు. ఆ పాతగుడ్డ కురుపు లోపల ఉండి ఆ రెండురోజులూ లోపల సీం అంతా పీల్చుకుండేదట. మళ్లీ కొంచెం గుడ్డ తగ్గించి కొత్త గుడ్డ కూరీవోరు. ఇలాగ ఆరుసార్లు. అగో అప్పుడే మొక్కాను పైడితల్లమ్మకు.
      ‘‘అమ్మా! పైడితల్లమ్మా! సత్తిమైన తల్లీ! కాలు బాగవుతే మళ్లీ అంతకు ముందునాగా ఇంట్లోనైనా తిరుగాడితే అంతేసాలు తల్లీ! ఈ వయసులో ఊర్లు తిరుగుదావని సరదానేదుగాని, ఏదో ఇంట్లోనైనా నా పనులు నేను సేసుకుంటే అంతే సాలమ్మ! వచ్చే పండక్కి నీగుడికి ఘటం ఎత్తుకుంటాను తల్లీ!’’ అని ఆ బాధలో ఆ మాటలు బయటికే అనేసి మొక్కీసుకున్నాను నూకాలూ.
      సరిగ్గా అప్పుడే వచ్చారు డాట్రుగారు. ‘‘ఏటి నర్సమ్మా! పైడితల్లమ్మకు మొక్కులు మొక్కేస్తున్నావు. అంతా ఆతల్లే చూసుకుంటే మేం ఎందుకు? హాస్పిటలెందుకు’’ అన్నారు.
      ‘‘అయ్యో! బాబూ! అంతమాట అనకండి. ఏదో బాధకొద్ది అన్నానుగానీ మీరేనేకపోతే నేనేటైపోతాను బాబూ! మీరుసేసే పని మీరు సెయ్యాల, ఆ యమ్మ సేసే పని ఆ యమ్మ సేస్తాది.’’
      ‘‘అయితే ఆ యమ్మ కొంతయినా చేస్తాది అంటావు. సరేలే నీమాటేకానీ’’ అని నవ్వుతూ తనపని కానిచ్చారు.
      ‘‘లోపలకి తీసికెళ్లి ఏటిసేస్తురే గౌరి పేనాలు పోతున్నాయి’’ అన్నాను
      ‘‘నాను దగ్గర లేను’’ అందిగానీ అది దగ్గరే ఉంది నాతో సెప్పనేదు. ఆ తరువాత, బాగా తగ్గేక సెప్పింది ఈ బాగోతమంతా. సచ్చిబతికేను. ఇప్పుడు కాస్త పరవానేేదు. ఆస్పిటాలుకి ఎల్లేపని తగ్గింది. మందులింకా వాడుతున్నాను. చాలా కరుసైపోనాది. ఆడేపడ్డాడు ఎక్కడ అప్పుతెచ్చాడో ఏటో’’ అంటూ మంచం పక్కనే ఉన్న మందుల కవరు చూపించి జరిగిన విషయం చెప్పింది నర్సమ్మ.
      ‘‘నేను ఊర్లోనేను గదా! రామభద్రపురం నుంచి నిన్నే వచ్చాను. మా వరాలు సెప్పింది. వరాలు కూడా దగ్గరే ఉందటగా! సాలా కవుకులు పడ్డావట కదా! అంతే నర్సమ్మొదినా! మనం అనుకుంటాంగానీ ఏ జల్మలో ఎవరికి ఏం అపకారం సేసేమోగానీ అవన్నీ ఈ జన్మలో అనబగించక తప్పదు
      ‘‘అలాంటి ఆపద గట్టెక్కిన తరువాత ఆ తల్లి మొక్కుతీర్సడం మాన్తానా? ఏదో ఒకనాగా కవుకులు పడి నడవాలి’’
      ‘‘అంతేలే! మన అవసరం తీరిపోయింది కదాని ఆ తల్లిని మరిసిపోతే, ఆయమ్మకి కోపమొస్తాది. మేం అంతా ఉన్నాంగా నెమ్మదిగా చెయ్యిపట్టుకుని నడిపిస్తాంలే’’ అని హామీ ఇచ్చింది నూకాలు

* * *

      కీ... కీ... కీ... మని సెల్‌ఫోన్‌ అలారం వినిపించగానే తెల్లవారు జామున మూడుగంటలకే నిద్రలేచింది గౌరి. అప్పలకొండని కూడా నిద్రలేపింది. తెల్లవారు జామునైతే కాస్త రద్దీ తక్కువగా ఉంటుందని ఆ సమయానికి పెట్టుకున్నారు.
      ‘‘బాప్పా! నెగె, నెగు టైమవుతోంది. తెల్లారిందంటే దొమ్మీ ఎక్కువవుద్ది!’’ అని నర్సమ్మని నిద్రలేపింది. ఇద్దరూ తలస్నానం చేశారు. ఏనాటివో మూలనున్న పట్టుచీరెలు కట్టుకున్నారు. ఘటం ఎత్తుకోవడానికి కావాల్సిన సామాన్లన్నీ సిద్ధం చేసింది గౌరి.
      నల్లని కుండని శుభ్రంగా కడిగింది. నిండా నీళ్లు పోసింది. కుండ చుట్టూ పసుపూ, కుంకుమ బొట్లు, ముందురోజునే తెచ్చిన బంతిపూలు దండగా కట్టి, కుండ చుట్టూ కట్టింది. కుండమీద దోసిలి అంత ప్రమిద, ప్రమిద నిండా నూనె. మధ్యలో కాస్త పెద్దదైన వత్తి, కుండలోపల ఉన్న వేపరెమ్మలు, కుండకీ, ప్రమిదకీ మధ్య నుంచి బయటకు పొడుచుకు వచ్చి వేలాడుతున్నాయి.
      నెమ్మదిగా గోడపట్టుకొని నిలబడింది నర్సమ్మ. గౌరి, ఘటాన్ని నర్సమ్మ నెత్తిన ఉంచింది. పెద్దగా బరువు లేదు. చిన్నకుండే. నర్సమ్మకు నెత్తిన బరువు సమస్యలేదు. కాలు సమస్యే. నెమ్మదిగా అడుగులు వేస్తూ ఇల్లు దాటి వీధిలోకి వచ్చింది. వీధి ఇంకా మేలుకోలేదు. కొద్ది, కొద్దిగా భక్తులు గుడికి వెళుతున్నారు. దూరంగా చిన్న గుంపులు, గుంపులుగా జనం ఘటాలు తీసుకువెళుతున్నారు. ఆ చీకటిలో ఎర్రటి దీపపు వెలుగులు మినుకు, మినుకుమంటూ నక్షత్రాల్లా మెరుస్తూ నడుచుకుంటూ వస్తున్నాయి. దూరంగా డప్పుల శబ్దం... ఆ నిశ్శబ్దపు చీకటిలో గాలితోపాటుగా ప్రవహిస్తూ చెవులను తాకుతోంది.
      అతినెమ్మదిగా అడుగులు వేస్తోంది. నర్సమ్మ. గౌరి, నర్సమ్మ భుజాన్ని ఒక చేత్తో పట్టుకుని అత్త పక్కనే నడుస్తోంది.
      వెనుక అప్పలకొండా మరి కొందరు అంతా కలిసి పదిమంది. నర్సమ్మ నెమ్మదిగా అడుగులు వేస్తుంటే వెనుక వాళ్లూ నెమ్మదిగానే నడుస్తున్నారు. ఘటం ఇస్తామని మొక్కుకున్న మరికొంత మంది గుంపులుగా వచ్చి వీళ్లను దాటిపోతున్నారు. ఆ డప్పుల శబ్దం వింటుంటే, ‘తను కూడా డప్పులు పెట్టిస్తే బాగుండును కదా’ అని మనసులో అనుకున్నాడు అప్పలకొండ. వాళ్లని అడిగాడు కూడా ‘‘ఇద్దరికీ అయిదు వందలు. ఆపైని మందుకి వంద మొత్తం ఆరువందలు’’ అన్నారు. అంత తెల్లవారు జామున కూడా మందా అని ఆశ్చర్యపోయి వద్దన్నాడు.
      అప్పటికే హాస్పిటల్‌కీ, మందులకీ చాలా డబ్బులు ఖర్చయిపోయాయి. మరి ఇంకా ఈ డబ్బంటే ఎక్కడ నుంచి తేవడం, పైగా పండగా. చుట్టాలూ, కోళ్లూ ఖర్చులు ఎలాగూ ఉండనే ఉన్నాయి. అందుకే మరి డప్పులు పెట్టించలేదు.
      వీధంతా ఇంకా చీకటిగానే ఉంది. గుడి తక్కువ దూరమే అయినా ఎక్కువలాగే ఉంది. ఆ రోజు తొలేలు. పండగ మొదటిరోజు ఈరోజే. మొక్కులు తీర్చేవారూ, ఇళ్లకు వచ్చిన బంధువులు. వీధి తిరగగానే జనం కాస్త ఎక్కువయి రోడ్డు కళకళలాడుతూ ఉంది. రోడ్డుకి ఇరువైపులా బారికేడ్లువేసి ఉన్నాయి. ఘటం తీసికెళ్లేవారిని మాత్రం రోడ్డు మధ్య నుంచే పంపిస్తున్నారు.
      గుడి దగ్గర పెద్ద వరసే ఉంది. పెద్ద పందిరి. గుడికి ఒక ఫర్లాంగు దూరం నుంచే బల్బులు తోరణాల్లా ఉన్నాయి. ఇంకా తెలవారలేదు. ఆ చీకట్లో లైట్ల వెలుతురు పట్టపగల్లాగా ఉంది. ఘటాలు తీసికెళ్లినవారిని ప్రత్యేకంగా గుడి మధ్య నుంచి పంపిస్తున్నారు. అందరికీ టిక్కెట్లు తీసుకున్నాడు అప్పలకొండ.
      మరీ అంతగా జనం లేకపోయినా నర్సమ్మను ఎక్కడ తోసేస్తారోనని గౌరి చెయ్యి పట్టుకుని తీసుకెళ్తోంది. మిగతా అందరూ చుట్టూ ఉన్నారు. నర్సమ్మ కుంటుతూ నడవటంతో మిగతా భక్తులంతా తోవ ఇచ్చేశారు.
      నెమ్మదిగా ఎలాగైతేనేం గుడిలోకి వెళ్లారు. అందరూ దణ్నాలు పెట్టి తెచ్చిన పసుపూ, కుంకుమలు అక్కడే ఇచ్చేశారు. మొక్కుకున్న చీరెకూడా వాళ్లకు ఇచ్చేసి ఒకటికి పదిసార్లు దణ్నాలు పెట్టి లెంపలు వాయించుకొని గుడి వెనుక వైపు నుంచి బయటకు వచ్చారు.
      బయట మెట్ల మీద అందరూ కూర్చున్నారు. అప్పలకొండ అందరికీ లడ్డూ, పులిహోర ప్రసాదం తీసుకువచ్చాడు. కొద్దికొద్దిగా పంచాడు. అందరూ కళ్లకి అద్దుకొని నోట్లో వేసుకున్నారు.
      నర్సమ్మను ఒక్కదాన్నే రిక్షామీద పంపించేద్దామని రిక్షా కోసం చూశాడు అప్పలకొండ. ఎక్కడా రిక్షాలు దొరకలేదు. చేసేదేమీలేక అందరూ నడుచుకునే ఇంటిదారి పట్టారు.
      అక్కడ నుంచి మూడు రోజులు పండగ. పండగ రోజులన్నీ వచ్చిన చుట్టాలతో బాగానే గడచిపోయాయి. మరుసటి రోజు సాయంత్రం సిరిమానోత్సవం. మరుసటిరోజు బుధవారం మధ్యాహ్న భోజనాలు అయిన తరువాత వచ్చిన బంధువులందరూ తిరుగుముఖం పట్టారు.
      ఆ ఏడాది పండగ గడచిపోయింది. పండగకన్నా నర్సమ్మ కాలు మాన్పుకి వచ్చినందుకు గౌరి, అప్పలకొండ చాలా సంతోషించారు.

* * *

      పండగ అయిన మూడో రోజు నాడు ఉదయాన్నే నర్సమ్మ మంచం దిగి వెళ్లబోయింది.
      ‘‘అమ్మో, నొప్పి’’ అంటూ ఒక్కసారిగా అరిచి, మంచంపై కూలబడిపోయింది.
      ఆ అరుపువిని గౌరి పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పలకొండ కూడా వెనకే వచ్చాడు.
      ‘‘కాలే, కాలు ఒకటేనొప్పి, కాలు నేలమీద పెట్టలేకపోతున్నాను’’ అంటూ చీరె మీదకి ఎత్తింది.
      ‘‘అమ్మ బాబోయ్, బాప్పా! కాలు మళ్లీ మొదటికొచ్చింది’’
      ‘‘ఆ.. బాబోయ్‌ ఎంతపని జరిగింది. ఆ తల్లికి ఎన్ని మొక్కులు మొక్కాను. తల్లీ నీవే దిక్కని నమ్మేనే! ఎంత కవుకులుపడి నీ మొక్కు తీర్చేను. దయగల తల్లివంటారు. వరాల తల్లివంటారు. మరిదేటి తల్లీ, ఇలాసేసేవు’’ అంటూ ఏడుపు మొదలుపెట్టింది నర్సమ్మ.

* * *

 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


వాళ్లు ఏడ్చారు!

వాళ్లు ఏడ్చారు!

పి.చంద్రశేఖర అజాద్‌


స్వ‌యంవ‌ధూ...!?

స్వ‌యంవ‌ధూ...!?

దోరవేటి, (వి.చెన్నయ్య)


సువర్ణ గన్నేరు పూలు

సువర్ణ గన్నేరు పూలు

ప్రసాదమూర్తి


స‌మిధ‌

స‌మిధ‌

సయ్యద్‌ సలీం


అతడూ మనిషే!

అతడూ మనిషే!

పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


దాసరి పాట (క‌థాపారిజాతం)

దాసరి పాట (క‌థాపారిజాతం)

చింతా దీక్షితులుbal bharatam