బాపమ్మ సందుగ

  • 291 Views
  • 1Likes
  • Like
  • Article Share

    రమాదేవి బాలబోయిన

  • ఉపాధ్యాయిని,
  • వరంగల్లు,
  • 6281216735
రమాదేవి బాలబోయిన

 దేవుని అర్రల సందుగల బాపమ్మ ఏదో దాచింది! ఆ అర్రలకు ఎవ్వలని రానియ్యది! సందుగ తాకనియ్యది! అందుల బాపమ్మ ఏం దాచింది?
‘‘నువ్వీ
గల్మ కాడనే కూసో బిడ్డా. నేను ఇంట్లకు పోయి సందుగల నుంచి పైసల్‌ తెస్త’’ బాపమ్మ హడావుడిగా నన్ను ఇంటి ముందటి గల్మ కాడనే కూసుండబెట్టి దేవుని అర్రలకు పోయింది.
      బాపమ్మ దగ్గర మస్తు పైసలున్నట్టున్నయ్‌. ఎవ్వలని ఆ అర్రలకే రానీయది. ఆ చెక్క సందుగనైతే ముట్టనియ్యనే ముట్టనియ్యది. 
      ప్రతి సోమవారం, శుక్రవారం దేవుని అర్ర ఎర్రగ అలికి తెల్ల సుద్దతోటి ముగ్గులేస్తది. తలకు పోసుకుని సోమవారం నాడు వేములాడ రాజన్నకూ, శుక్రవారం నాడు లక్ష్మీదేవికి దీపం పెడుతది. తానంజేసి దీపం ముట్టిచ్చేదాక నోట్లె మంచిళ్లు సుత పొయ్యది.
      పెద్దమ్మలిద్దరూ ఆమెకు మేనకోడండ్లే. మా అమ్మేమో నాతిది. బిడ్డలు లేరని కోడండ్లను బిడ్డల్లెక్కనే చూసుకునేది బాపమ్మ. కానీ కొంచెం భయముండాలె అని దర్పం చూపేది. మా అమ్మన్నా, మేమన్నా బాపమ్మకు చాలా ఇష్టం.
      పెద్దమ్మలు బాపమ్మలెక్క యాళ్లపొద్దుగాల లేచి అలుకుపూసుడు చేయరని, ఆడోళ్ల ఇగురం లేదని ఊకే ముగ్గురికి పంచాయితులయ్యేటిది. మళ్ల బాపమ్మనే కోడళ్లను మందలిచ్చి మాట్లాడేటిది.
      బాపమ్మకు ముగ్గురు కొడుకులు. మా బాపును మా చిన్నతాతకు పిల్లలు లేకుంటే సాదుకం ఇచ్చిండ్లంట. అదేమి ఖర్మనోగాని సాదుకం ఇచ్చినంక పదేండ్లల్లనే చిన్నతాత, చిన్నబాపమ్మ దేవునికాడికి పోయిండ్లంట. ఇగ మళ్ల బాపమ్మనే మా బాపు ఆలనాపాలనా చూసిందంట.
      కన్నతల్లేగాని పెంపుడుతల్లై సవరించుకుని పాణం పెంచుకున్నది మా బాపు మీద. కానీ అప్పటికే  పెండ్లిళ్లయిన పెద్దబాపులు పెద్దమ్మలూ మా బాపును సహించకపోయేదంట. మరుగున పెట్టి నానా తిట్లు తిట్టేవారంట. సాదుకం పోయిన ఇంట్ల బాపు, బాపమ్మ ఇంట్ల వాళ్లందరూ ఉండేవాళ్లంట.
      చిన్నతాత ఆస్తికి మా బాపే వారసుడని చిన్న బాపమ్మ తమ్ముడు తన బిడ్డనే పెండ్లి చేసుకోవాల్నని పట్టుబట్టిండంట. అట్ల మా అమ్మాబాపుల పెండ్లయ్యి ముందుగాల మా అన్న, తరువాత నేను పుట్టినమట.
      మా పెద్దతాత చచ్చిపోయి సంవత్సరం ఎల్లకతలెనే మా అన్న పుట్టిండట. అందరూ మళ్లా మీ ఆయనే పుట్టిండు అంటే, బాపమ్మ ఆనాటి నుంచి దుఃఖం మరిచిందంట. నేను పుట్టినయేడు బాపమ్మకు పెద్ద ప్రమాదం తప్పిందంట. అందుకే బాపమ్మ మమ్మల్ని ఇడువకుండ పాయిరం పెంచుకున్నది. అయితే మాకన్నా ఎక్కువ దేవుని అర్రల సందుగ మీద పాయిరం! అండ్ల ఏమున్నదో ఎవ్వలకూ తెల్వది.
      పెద్దబాపులకు చెరో ఇద్దరు మగపిల్లలు. మాకన్నా మస్తు పెద్దోళ్లు. వాళ్లు కాలేజీల చదువుకోడానికి హాస్టలుకు పోయిండ్లు. మా అన్న సుత ఆరో తరగతి పట్టంగనే బాగా చదువుకోవాల్నని హాస్టల్లేసిండు మా బాపు.
      ఇగ మొత్తం రాజవాసానికి యువరాణిని నేనే. సందడి నేనే. పెద్దమ్మలకు నేనంటే కుళ్లు. అస్సలు ఓర్వరు. కానీ పెద్దబాపులిద్దరికీ నేనంటే ప్రాణం.
      రోజూ మేస్త్రీ పనికి పోయి సాయంత్రం వచ్చేటప్పుడు కారా పాకిటు ఒకరు తెస్తే, తియ్య బొబ్బడాలు ఒకరు తెస్తరు. ఇంటికొచ్చి స్నానంజేసి ఆకిట్లేసిన మంచంల కూసుంటరు. నన్ను ఒళ్లో కూసుండబెట్టుకొని ముచ్చట్లు చెప్పుకుంట తినిపిస్తరు. అప్పుడే అమ్మలందరు కంచాలు పట్టుకొని ఆకిట్లకస్తరు. అందరు ఒక్కకాడనే కూసుని ముచ్చట్లు చెప్పుకుంట అన్నం తింటరు.
      మా అమ్మ ఏదైనా తునకలషాకం వండితే అందరికీ మనిషింత ఏస్తది. సోమవారం నాడో శుక్రవారం నాడో వండితే బాపమ్మకు ఓరకు పెట్టి తెల్లారి తప్పకుండ ఇస్తది. పెద్దమ్మలు ఏం వండినా దాసుకు మూసుకు తినుడే గాని ఒక్కనాడు పిలిచింత పెట్టరని బాపమ్మకు మస్తు కోపం.
      ముసలితనానికి వచ్చినంక బాలతనం మల్ల ఒస్తదట. ఏదన్నా వండేటప్పుడు వాసనొచ్చి ‘‘ఏం వండుతాండ్లే’’ అని బాపమ్మ అడిగితే, ‘‘ఆ ఏమున్నదత్తా కూరగాయల షాకమేనాయె’’ అని మూతి ముడుసుకుని చెప్పేటోళ్లు. బుద్ధితీర ఇంత పెట్టకపోయేటోళ్లు. అప్పడప్పుడు సూడలేక పెద్దబాపులే పెళ్లాలు చూడకుండ బాపమ్మకు ఇంత తెచ్చి ఇచ్చేటోళ్లు.
      ఓనాడు పెద్ద పెద్దమ్మ మంచిళ్ల బాయికాడ కండ్లుతిరిగి పడిపోయిందంట. ఆడ ఉన్న మంది పెద్దమ్మను దవాఖాన్ల జేర్పించిండ్రంట.
      అందుకే బాపమ్మ మస్తు హైరానా పడుతాంది. కాలు చెయ్యి ఆడనట్టు ఆగమాగమైతాంది. సందుగ సర్దుతునే ఉన్నది, ఏమి దాసిందో అండ్ల.
      పెద్ద బాపులు, మా బాపు మేస్త్రీ పనికి పోయిండ్రు. మా అమ్మ, చిన్నపెద్దమ్మ బీడీలు చుట్టడానికి బీడీల కార్ఖానాకు పోయిండ్లు.
      మా ఎదురుంగ ఇంట్ల ఉండే అయిలయ్య తాత రిక్షా తోలుతడు. పగటాలకు అన్నానికని ఇంటికి వచ్చిండు. బాపమ్మ బొడ్ల సంచి సవరించుకుంట, చేతిమీద ఓ తెల్లని అంగీ వేసుకుని బయటికొచ్చి, ‘‘ఓ అయిలన్నా! జర్ర మమ్ములను గా దవాఖానకు తీసుకపోరాదయ్య’’ అని బాపమ్మ మరిది వరసయ్యే ఆ అయిలయ్య తాతను అడిగింది.
      ‘‘సరే వదినే, ఇంత బువ్వ తిన్నంక తీస్కపోత తియ్‌. పెద్దపొల్లకు పాణం బేజారైందట కదా. ఇందాక వస్తాంటే బజాట్ల అనుకుంటాండ్లు అందరూ. తీస్కపోత బేజారుకాకు’’ అని మాట ఇచ్చిండు అయిలయ్య తాత.
      గాయనె అన్నం తినేదాక కూసుని తరువాత దవాఖానకు పోయినం బాపమ్మ, నేను. బాపమ్మ చేతిమీద తెల్లఅంగీ, తెల్లతువ్వాలలు ఉన్నయ్‌.
      బాపమ్మ గుండె టక్కటక్క కొట్టుకుంటాంది. ‘‘బిడ్డో... బిడ్డా... నీకిట్లాయనే బిడ్డా...’’ అని శోకం అందుకుంది బాపమ్మ.
      ‘‘ఓ ముసలమ్మా, దవాఖాన్ల ఏడ్వద్దు. పెద్ద డాక్టర్లొస్తే బయటికి తోల్తరు జాగ్రత్త’’ అన్నది నర్సు.
      కొంగు చివరను సగానికెక్కువ నోట్లో కుక్కుకుంది, ఆవాజ్‌ బయటకు రాకుండా. కండ్లల్ల నీళ్లు వానపొంగులై పారుతానై.
      సాయంత్రం కాబోతాందనంగ మా బాపులూ, అమ్మలూ గుండెలు కొట్టుకుంట మందకు మంద ఒచ్చిండ్లు. అందరూ దుఃఖం తెరల్ని మొఖాల మీదనే కప్పుకొని ఉన్నరు.
      బిస్కెటు పాకెటు కొనిస్తే తినుకుంట అందరినీ చూస్తున్నాగనీ, నాకు అక్కడేమైతాందో అస్సలు అర్థమైతలేదు.
      పెద్ద బాపును ఓదారుస్తున్నరు అందరూ. ముగ్గురిట్లల్న మా బాపు కొంచెం చదువుకున్నడు గాని చిన్నప్పటి సంది గావురంగ పెరిగేసరికి ఇగురం తెలవది.
      మా అమ్మ మా బాపుకన్నా కొంచెం ఎక్కువే చదివింది. అందులోనూ పట్నంల పెరిగింది కదా, కాస్త చలాకీగానే ఉంటది. ఇంగ్లీషు కూడా మాట్లాడటం వచ్చు. అందుకే మాఅమ్మే డాక్టర్లతో మాట్లాడింది.
      ‘‘పెద్దమ్మకు రెండు కిడ్నీలు ఫెయిలయ్యినయంట. వెంటనే ఆపరేషన్‌ చేసి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయకపోతే ప్రాణానికే ప్రమాదమట’’ అమ్మ చెప్తాంటే అందరి గుండెలవిసి పోయినయ్‌.
      ఇప్పటికిప్పుడు కిడ్నీలు ఏడనుంచి తేవాలే. డాక్టరు చెప్పిన ఉపాయంతోని బాపులు, అమ్మలు అందరు పరీక్షలు చేయించుకున్నరు, వాళ్లతోబాటే బాపమ్మ కూడా.
      బాపమ్మది తప్ప ఎవల రక్తం గ్రూపు కలువలేదు. బాపమ్మ తన చేతిలో ఉన్న తెల్ల అంగీని గుండెలకు హత్తుకుంది. ఆపరేషన్‌ ధియేటర్లకు పెద్దమ్మ, బాపమ్మలను తీస్కబోయిన్రు. ఒక ఐదుగంటల సేపు ఆపరేషన్‌ థియేటర్‌ బయట ఎదురుచూసిన మాకు డాక్టరు బయటికొచ్చి ‘‘ఆపరేషన్‌ సక్సెస్‌. ఇద్దరూ మంచిగున్నరు’’ అని చెప్పిండు.
      అమాస ముసురుకున్న అందరి ముఖాలల్ల వెన్నెల కనబడ్డట్టయింది.
      నెలరోజులు గడిచినయి. బాపమ్మ, పెద్దమ్మ ఎప్పటిలెక్కనే పనులు చేసుకుంటాన్రు. నవ్వుకుంట ఒకరితో ఒకరు చాలా ప్రేమగా ఉంటాన్రు. ఏది వండుకున్నా బాపమ్మకు పెట్టకుండా ఎవ్వరూ తింటలేరు. బాపమ్మ మాటే బంగారు బాట అన్నట్లుందిప్పుడు. ఇదివరకటి కన్నా బాపమ్మ మరింత హుషారుగా ఉన్నది. కానీ, బాపమ్మలో ఏదో మార్పు నాకు కొట్టొచ్చినట్లు కనబడుతాంది.
      ఇప్పుడు బాపమ్మ ఆ సందుగ తీస్తలేదు. ఆ దేవుని అర్రలకు అందరినీ రానిస్తాంది. ఓ పూట మనసాగలేక నేను బాపమ్మ సందుగ తెరచి చూసిన. అందులో పైసలో, ధనమో, బంగారమో లేదు! అందులో ఉన్నవి తాత బట్టలు, తాత ఫొటో. ఎన్ని కష్టాలొచ్చినా ఆమెకు ధైర్యం మా తాతనే, ఆ సందుగలో ఉన్న ఆయన వస్తువులే. చిన్నపిల్లను అప్పుడర్థం కాలేదు గనీ... ప్రేమలు లేని కాడ, చేతిలో పైస లేకున్నా ఉన్నట్టు కనబడకపోతే గంజి సుత చేతిలబొయ్యరు.. విలువజెయ్యరు.. అన్న నిజం నాకు తెలిసిపోయిందిప్పుడు.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


వాళ్లు ఏడ్చారు!

వాళ్లు ఏడ్చారు!

పి.చంద్రశేఖర అజాద్‌


స్వ‌యంవ‌ధూ...!?

స్వ‌యంవ‌ధూ...!?

దోరవేటి, (వి.చెన్నయ్య)


సువర్ణ గన్నేరు పూలు

సువర్ణ గన్నేరు పూలు

ప్రసాదమూర్తి


స‌మిధ‌

స‌మిధ‌

సయ్యద్‌ సలీం


అతడూ మనిషే!

అతడూ మనిషే!

పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


దాసరి పాట (క‌థాపారిజాతం)

దాసరి పాట (క‌థాపారిజాతం)

చింతా దీక్షితులుbal bharatam