ఆనందార్ణవం

  • 302 Views
  • 10Likes
  • Like
  • Article Share

    సింహప్రసాద్‌

  • హైదరాబాదు
  • 9849061668
సింహప్రసాద్‌

మొన్నటిదాకా ప్రవచనాలు చెప్పిన జగన్నాథశర్మ అకస్మాత్తుగా వాటిని ఆపేశారు! తర్వాత ఆయనలో ఏదో సంఘర్షణ, ఆవేదన. ఆయన ఇంటికి ఓ బాలుడొచ్చి అంతా మార్చేశాడు! ఆ పిల్లాడు ఎవరు?
‘‘వసుదేవ
సుతం దేవం, కంసచాణూర మర్దనమ్, దేవకీ పరమానందం, కృష్ణం వందే జ...గ...ద్గు...రు....మ్‌....’’ దగ్గు తెర ముంచెత్తింది. సుళ్లు తిరిగిపోయి, అతికష్టం మీద ప్రార్థన కొనసాగించారు జగన్నాథశర్మ. ఆయాసంతో రొప్పుతున్నారు. స్వరం గాద్గదికమైంది. జీర తొంగి చూస్తోంది. కళ్లు జలమయమయ్యాయి. ఉక్కిరి బిక్కిరై పోయారు.
      మరి చూస్తూండలేక పోయిందాయన భార్య కాత్యాయని. తులసి తీర్థం అందుకుంది. ఉద్ధరిణితో పోయబోయింది. ఆయన చేయి పట్టలేదు.
      ‘‘తీసుకోండి...’’ అర్థింపుగా చూస్తూ అంది. ‘‘ఇప్పుడొద్దు. పూజ అయ్యాకే. కృష్ణ పరమాత్మకి ఆరగింపు చేశాకే...’’
      ‘‘తప్పనప్పుడేం చేస్తాం. కంచులా మోగే మీ కంఠం ఎలా కంపిస్తోందో చూడండి. ఒక రోజు కాస్త ముందుగా తీర్థం పుచ్చుకుంటే ఏమీ కాదులెండి. వూఁ చేయి పట్టండి...’’ తల అడ్డంగా ఊపారు. ‘‘నా ప్రార్థన పూర్తి కానియ్‌...’’
      మరో శ్లోకం ఎత్తుకున్నారు. ఆయన స్వరంలో మునుపటి గంభీరత లేదు. తీయదనం లేదు. ఏదో దిగులు, మరేదో బాధ. ఎలాగైనా సరే పూర్తిపాఠం చదవాలన్న ఆకాంక్షతో సర్వేంద్రియాల్నీ కేంద్రీకరిస్తున్నారు. కాత్యాయని నిస్సహాయంగా చూసింది.
      ‘‘ఆయన దేని గురించో మథనపడుతున్నారు. సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. నిన్నే నమ్ముకున్నాం కృష్ణా, మమ్మల్ని నువ్వే దరి జేర్చాలి!’’ కళ్లు మూసుకుని అర్థించింది. ఆమె కనుకొలకల్నుంచి రెండు కన్నీటి బొట్లు మౌనంగా రాలిపడ్డాయి.
      శర్మగారు తెలుగు పండితుడిగా ముప్పై ఏళ్లు పనిచేశారు. మూడేళ్ల కిందటే పదవీ విరమణ చేశారు. సంతానమంతా చక్కగా స్థిరపడ్డారు. ఎలాంటి ఆర్థిక బాధలూ లేవు.
      భాగవతం ఆయనకెంతో ఇష్టం. వీలు కుదిరినప్పుడల్లా వివిధ వేదికల మీద, దేవాలయాల్లో భాగవత ఘట్టాలని సుమధురంగా వివరించేవారు. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యం భాగవతం అంటూ ఆ రసాస్వాదన చేయించేవారు. సరళ ప్రవాహంలా సాగేది ఆయన వాగ్ధార. లోక విషయాల్ని చిన్న చిన్న కథలుగా రంగరించేవారు. వారి ఉపన్యాసాలు జనాన్ని బాగా ఆకర్షించాయి. మెల్లగా ప్రవచన కర్తగా రూపొందారు. భాగవత సప్తాహం, భాగవత మహాయజ్ఞం, భాగవత పక్షోత్సవం- అంటూ రోజుల తరబడి ప్రవచించేవారు.
      ఎక్కడెక్కణ్నుంచో ఆహ్వానాలు వచ్చేవి. అదో మహద్భాగ్యంగా భావించేవారు. దూరాభారాలు లెక్క చేయకుండా వెళ్లేవారు. ఎవరి నుంచీ ఒక్క రూపాయి ఆశించే వారు కాదు. దారి ఖర్చులు సైతం తీసుకునే వారు కాదు. ‘‘కృష్ణ పరమాత్మ నాకు లోటు అన్పించనంత ఇచ్చాడు. అది చాలు’’ అనేవారు. ‘‘పెంకుటిల్లు విప్పి మేడ కట్టుకోవచ్చు కదా’’ అనేవారు సన్నిహితులు.
      ‘‘తల దాచుకోడానికి ఒక కప్పు ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. అది చాలు’’ అనేవారు.
      ఉద్యోగపు రంధిలోంచి బయటపడ్డాక, పూర్తి సమయం ప్రవచనాలకే వినియోగించారు. ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కాళ్లకు బలపం కట్టుకున్నారు. కానీ, సభికుల్లో తానాశించిన మార్పు కన్పించలేదు. అలౌకికానందాన్ని జుర్రుకోవాల్సినవాళ్లు లౌకిక శ్లేష్మంలో పడి కొట్టుకుంటున్నారని బాధపడ్డారు. ఈ ప్రవచనాలు ఉత్త దండగ అనిపించింది. కంఠశోష తప్ప ప్రయోజనం లేదనుకున్నారు. ‘‘ఇక చాలు ఈ కంచి గరుడ సేవ’’ అని, వాటికి ఓ నమస్కారం పెట్టేశారు. ఏడాదిగా ఇంటి పట్టునే ఉంటున్నారు.
      ఇంట్లో నిత్య పూజలు, భాగవత పారాయణ, గ్రామస్థులతో ముచ్చట్లు, ఎప్పుడైనా కొడుకు కూతుళ్ల ఇళ్లకెళ్లడం, మనవలకూ మనవరాళ్లకూ శ్లోకాలు నేర్పడం - చేస్తున్నారు. కాలం వేసవి కాలంలోని నదిలా మెల్లగా కదుల్తోంది.
      ఏదో తెలీని వేదన శర్మగార్ని అశాంతి పాలు చేస్తోంది. ఏదో తపన గుండెల్ని మండిస్తోంది. దానికి తోడు ఈ మధ్య గొంతు వణుకుతోంది. ఉచ్చారణలో స్పష్టత తగ్గుతోంది. స్వరం పెంచితే చాలు దగ్గు వస్తోంది.
      ‘‘ఇదేదో ప్రారబ్ధంలానే ఉంది కాత్యాయనీ’’ పూజ ముగించి, తీర్థ ప్రసాదాలు తీసుకున్నాక సాలోచనగా అన్నారు.
      ‘‘అదంతా మీ అపోహ. అయినా నది నడకా, మనిషి నడకా ఎప్పుడూ ఒకే తీరుగా ఉంటాయేవిటీ. ఆటు పోటులుండవూ!’’
      ‘‘అవునవును. వయసు మీద పడుతోంది. ఆయుష్షు తరిగిపోతోంది...!’’ శుష్కహాసం కదిలిందాయన పెదాల మీద.
      ‘‘శుక్రవారం పూట అవేం అశుభం మాటలు?’’ సన్నగా కసిరి, మంగళసూత్రాలు బయటికి తీసి కళ్లకద్దుకుంది.
      ‘‘సత్యం అంగీకరించడానికి చాలా ధైర్యం కావాలి కదూ!’’ 
      ‘‘చాల్లెద్దురూ. ఆ గొడవేం గాని, రేపు కృష్ణాష్టమి. ఉట్టికి ఏర్పాట్లు చెయ్యాలి...’’ 
      ‘‘మనదేముంది కాత్యాయనీ. చేసేవాడూ చేయించుకునేవాడూ అన్నీ ఆ పైవాడే’’ 
      ‘‘హవ్వ! అలాగని గాలిలో దీపం పెట్టి ‘దేవుడా!’ అంటారా?’’ బుగ్గలు నొక్కుకుంది. 
      నవ్వారు. ‘‘ఉహూ. ‘కృష్ణా’ అంటాను. అన్నింటికీ ఆ జగద్రక్షకుడే ఉన్నాడు...’’ 
      మళ్లీ దగ్గు, దాని వెంట ఆయాసం తోసుకొచ్చాయి. 
      ‘‘ఇదేదో ఉబ్బస వ్యాధిలా ఉందండీ. పదండి డాక్టరు దగ్గరకి వెళ్దాం...’’ ఆయన గుండెలు రుద్దుతూ భయంగా అంది.
      ‘‘వెళ్దాంలే. జన్మాష్టమి వేడుకలు అవ్వనీ...’’ 
      ‘‘ఇప్పుడెళ్లొస్తే ఏం పోతుంది?’’
      ‘‘పోతుందని కాదు, చూద్దాం. ఆ గోవర్ధన గిరిధారి నా క్లేశాన్ని ఎత్తి అవతల పారేస్తాడేమో! కృపారసంబు పై చల్లెడు వాడు నా మనసుకి నవనీతం పూస్తాడేమో!’’ పూజ మందిరంలోని మూడడుగుల ఎత్తున్న నీలమేఘశ్యాముడి వంక ఆర్తిగా, ఆరాధనగా చూస్తూ అన్నారు.
      వెర్రిగా చూసింది. ‘‘అలాగని మానవ ప్రయత్నం చేయొద్దూ, మీరే చెబుతూంటారుగా, గీతలో...’’
      ‘‘ఇంకా మరచిపోలేదు కాత్యాయనీ. నా వాక్కు తడబడుతోంది గానీ జ్ఞాపకశక్తి స్థిరంగానే ఉంది. ఎంచేతో మనసే మసకబారింది. మెల్లగా కూడదీసుకుని తుడిచేస్తాన్లే. మళ్లీ అద్దంలా మెరుస్తుంది...’’
      ‘‘మీ ధోరణి మీదే తప్ప నా గోల విన్పించుకోరు కదా!’’ పమిటతో కళ్లొత్తుకుంది. 
      చిన్నగా నవ్వారు. ‘‘వింటున్నావా కృష్ణా!’’ కృష్ణుడితో అన్నారు. 
      ‘‘మీరు విన్నారు! ఇక ఆయన వింటారు!’’ చేతులు తిప్పింది కాత్యాయని. 
      కృష్ణాష్టమికి కాత్యాయని పది రకాల నైవేద్యాలు సిద్ధం చేసింది. శర్మగారు అయిదు రకాల పండ్లు పెట్టారు.
      పూజ, వ్రతం అయ్యాయి. గ్రామజనం చాలా మందే వచ్చి శ్రద్ధగా కూర్చుని చూశారు. విన్నారు. ప్రసాదాలు తీసుకుని సంతోషంగా వెళ్లారు. వీధిలోంచి పూజా మందిరం వరకూ పిండితో వేసిన పాద ముద్రల్ని తొక్కొద్దని పదే పదే జాగ్రత్తలు చెప్పింది కాత్యాయని.
      ఆ మాటలు వినని ఒక బాలుడు సరిగ్గా ఆ ముద్రల మీదే అడుగులేస్తూ వచ్చాడు. ఎంతో ఆనందానుభూతిని అనుభవిస్తున్నాడు. కాత్యాయని ‘కయ్‌’మని అరవబోతుంటే వారించారు శర్మగారు.
      ‘‘ఆగాగు. వాడి పరమానందాన్ని చూడవే. వాడి నవ్వు సమ్మోహనకరంగా లేదూ!’’
      ‘‘అవునండీ. ముచ్చటగా ఉన్నాడు. ముద్దొస్తున్నాడు. ఎవరి బిడ్డో ఏమో! ఇదిగో అబ్బాయ్‌. నిన్నిదివరకెప్పుడూ చూడలేదు. ఎక్కణ్నుంచొచ్చావ్, ఎక్కడుంటావ్‌?’’ ఆవిడ మాటలు విన్పించుకోలేదు. నవ్వుకుంటూ పాదముద్రల మీదే ఒక ఆటలా మళ్లీమళ్లీ నడుస్తున్నాడు.
      ‘‘అవి బాలకృష్ణుడి కోసం వేసిన చిట్టి పాదముద్రలు. వాటితో ఆడకూడదు, తప్పు. ఇలారా తీర్థ ప్రసాదాలు పెడతాను’’ అన్నారు శర్మగారు. బుద్ధిగా వచ్చి దోసిలి పట్టాడు.
      ‘‘తీర్థం ఇలా తీసుకోకూడదు. చూపుడు వేలు, బొటన వేలు ఇలా వంచి, అరచేతిని దొప్పలా మడవాలి. దానికింద రెండో చేతిని పెట్టి భక్తితో స్వీకరించాలి’’
      ‘‘అలాగే తాతగారూ’’
      తీర్థం ఇచ్చి అన్ని రకాల ప్రసాదాలూ ఆకులో పెట్టి ఇచ్చారు. వాడు దేనికోసమో కళ్లతోనే వెదికి వెదికి అన్నాడు ‘‘అటుకుల్లేవా తాతగారూ’’
      ఉలిక్కి పడింది కాత్యాయని. ‘‘నా మతి మండా. నానబోసి కూడా మరచిపోయాను చూడండి...’’ గబగబా లోపలికెళ్లింది.
      ‘‘పంచభక్ష్య పరమాన్నాలు పెట్టాం. కృష్ణ పరమాత్మకి ప్రీతికరమైంది మరచిపోయాం. రారా అబ్బాయ్‌. నువ్వు నిజంగా ఘటికుడివేరా. అటుకులు కూడా పెడతానుగాని కూర్చో....’’
      నానిన అటుకుల్లో బెల్లంపొడి కలిపి, దేవుడికి నివేదించింది. పిమ్మట ఇన్ని అటుకులు శర్మగారికీ, బాలుడికీ పెట్టింది.
      ‘‘చాలా బావుంది అమ్మమ్మగారూ. మా అమ్మ చేసిన పాయసం కన్నా బాగుంది’’ 
      ఆ పిలుపునకీ ఆ మాటలకీ పొంగిపోయారు. 
      ‘‘మీరేం పనిచేస్తారు తాతగారూ’’ ప్రసాదం తింటూ కుతూహలంగా అడిగాడు. 
      ‘‘ఇది వరకు బడి పంతులుగా చేసేవాణ్ని. ఇప్పుడు పింఛను తీసుకుంటున్నాను’’
      ‘‘మీరు భాగవతం కథలు కమ్మగా చెబుతారని మా అమ్మ చెప్పిందే!’’
      తుళ్లిపడ్డారు. విడ్డూరంగా చూశారు శర్మగారు, ‘‘వేలెడంత లేవు. అంతా పోగుజేస్తే ఒంటిమీద ఏడేళ్లు కూడా ఉండవు. నీకు భాగవతం తెలుసా?!’’
      ‘‘ఓ. భాగవతం, భారతం, రామాయణం - అన్నీ తెలుసు. అందరి కథలూ తెలుసు. మా అమ్మ రోజూ చెబుతుందిగా!’’
      ముచ్చటపడి, వాడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ‘‘నీ పేరేంటిరా?’’ అని అడిగారు.
      ‘‘బాల గోపాలుడు’’ గొప్పగా చెప్పాడు. 
      ‘‘అచ్చం వెన్నతిన్న గోపాల బాలుడిలా ఉన్నాడు కదండీ’’ మురిసిపోయింది కాత్యాయని. 
      తలాడించారు. ‘‘నువ్వేసిన పాదముద్రల మీద అడుగులేసినప్పుడే బాలకృష్ణుడైపోయాడులే’’ 
      ‘‘ఆ కథలు ఇప్పుడెందుకు చెప్పట్లేదు తాతగారూ’’ 
      వాడి బుగ్గలు పుణికి, ‘‘నీకదంతా అర్థంకాదులే’’ అన్నారు. 
      ‘‘చెప్పండి తాతగారూ’’ బుంగమూతి పెట్టాడు.
      ‘‘భక్తి మార్గాలు నవవిధాలు. అందులో మొదటిది శ్రవణం. చెవులకు రెప్పలు ఉండవు గనుక మాటల ప్రవాహం సూటిగా మనసులోకి వెళ్లి, ఇంకాలి’’
      అలాగా అన్నట్టు చూశాడు బాలుడు.
      ‘‘కానీ, నా పాటికి నేను చెప్పుకుపోవడమే తప్ప ఎవరికీ ఆసక్తి అనురక్తి ఉండట్లేదు. మనసు కెక్కించుకోవట్లేదెవరూ. ఏదో కాలక్షేపానికొస్తున్నారంతే. కాసేపు కూర్చుని, బట్టల కంటిన దుమ్ముతో బాటు నేను చెప్పిన నాలుగు మాటలూ దులుపుకుని చక్కా పోతున్నారు. ఎవరిలోనూ పిసరంత శ్రద్ధ, భక్తి పెరగట్లేదంటే నమ్ము. ఈ జనాన్ని భక్తివైపు నడిపించడం, బాగుచేయడం నావల్ల కాదని ఓ దణ్నం పెట్టేశాను’’ నిట్టూర్చారు శర్మగారు.
      ‘‘అహా, అలాగా! మరి మీకు ఖరీదైన పట్టుశాలువా కప్పి, పెద్ద పూలదండ వేసినప్పుడు ఎంత పొంగిపోయేవారో మీకు గుర్తులేదూ!’’ దెప్పిపొడిచింది కాత్యాయని.
      ఉలిక్కిపడ్డారు. అయోమయంగా చూశారు. తర్వాత తనని సమర్థించుకుంటూ అన్నారు ‘‘నీకు తెలుసుకదా. నేను విజ్ఞాన భాండాన్ని, స్రష్టని. జగన్నాథ వాక్కుని. నాలాంటి పండితోత్తముల్ని గౌరవించడం, ఆదరించడం సమాజ బాధ్యత. ఇక శాలువాలూ దండలూ ఓ లాంఛనం. వాటి కోసం నేనేం అర్రులు చాచలేదు. రూపాయి నోట్లదండ వేస్తానన్నా తిరస్కరించిన సంగతి నీకు తెలీదా కాత్యాయనీ!’’
      ఆమె జవాబిచ్చేలోగా బాలగోపాలుడు అన్నాడు ‘‘పాపం భాగవతం మొహం మొత్తిందేమో. భారతం చెప్పక పోయారా తాతగారూ’’
      ‘‘ఊహూ. చెప్పను. చాలా మంది అడిగారు. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా - అన్న పోతనామాత్యుడి మాటల్నే సమాధానంగా ఇచ్చాను’’
      ‘‘భాగవతం అంత గొప్పదా తాతగారూ!’’ ఆశ్చర్యపోతూ అడిగాడు.
      ‘‘వ్యాసమహర్షి మహాభారతాన్ని రచించాడు. అయినా మనసు అశాంతిగా అసంతృప్తిగా ఉంది. అవి తొలగాలంటే శాశ్వత సత్యాన్ని తెలిపే భాగవతం రాయాలనుకున్నాడు. అది రాశాకే సేదదీరాడు. భాగవతం మోక్ష సాధనం!’’ కనులు మూసి తెరచి గుంభనంగా నవ్వారు.
      ‘‘మరేమో, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలని మా బళ్లో మాస్టారు చెప్పారు తాతగారూ’’
      ‘‘అది వింటే చాలు. కానీ ఇది ఒంటబట్టించుకోవాలి. జీర్ణించుకోవాలి. ఆచరించాలి. ప్రపంచంలో ఉన్నదంతా భారతంలో ఉంది. కాని ప్రపంచంలో లేనిది, కావాల్సింది భాగవతంలో ఉంది’’
      ‘‘మరి అదీ ఇదీ కృష్ణుడి కథే అని మా అమ్మ చెప్పిందే!’’
      ‘‘కాదు కాదు. భాగవత కృష్ణుడు అన్నీ చేసి చూపించాడు. శిష్టుల్ని అక్కున చేర్చుకున్నాడు. ఒంటి చేత్తో దుష్టుల్ని దునుమాడాడు. కానీ, భారత కృష్ణుడు ఒక రాజకీయవేత్త, పాత్రధారుల చేత కథ నడిపించిన సూత్రధారి!’’
      ‘‘కృష్ణలీలలన్నీ మాయలూ మంత్రాలే కదా అమ్మమ్మగారూ’’ కాత్యాయనితో అన్నాడు.
      ఆవిడే కాదు శర్మగారూ నిర్ఘాంతబోయారు. ఎవరో పెద్దవాళ్లు వెనుక నుంచి అడిగిస్తున్నట్టుగా ఉన్నాయి ఆ మాటలు!
      ‘‘జవాబు చెప్పండి తాతగారూ’’ ఆయన చెయ్యి పట్టుకుని కుదుపుతూ అడిగాడు.
      ‘‘నువ్వు వినాలేగానీ భాగవతమంతా నీకు నూరిపోస్తారు. ప్రవచనాలు మానేసినప్పట్నుంచీ ఏదో అమూల్యమైంది పోగొట్టుకున్నట్టు ఉంటున్నారు’’ అంది కాత్యాయని.
      గబుక్కున పద్మాసనం వేసుకుని, చేతులు కట్టుకుని ‘‘ఇప్పుడు చెప్పండి తాతగారూ. మా అమ్మ కన్నా బాగా చెబుతారేమో చూస్తాను’’ అన్నాడు.
      వాడి వంక ఆప్యాయంగా చూశారు. ‘‘కృష్ణుడి ఒక్కో చేష్టకీ, ఒక్కో లీలకీ ఒక్కో అర్థం, ఒక్కో పరమార్థం ఉన్నాయి. భాగవతంలోని ప్రతి ఘట్టం సుబోధకమే. వేదసారమే....’’
      ‘‘పాపం గజరాజు ‘రక్షించండి బాబోయ్‌’ అని ఏడ్చి మొత్తుకునేదాకా కృష్ణుడు రాలేదు. నాకది బొత్తిగా నచ్చలేదు తాతగారూ’’
      ‘‘మీ బోధల సారాన్నెవరూ గ్రహించడం లేదని ఫిర్యాదు చేశారుగా, ముందు ఈ బుడతడి సందేహం తీర్చండి’’ బాలుడి పక్కనే చతికిలబడుతూ నవ్వుతూ అంది కాత్యాయని.
      ‘‘భగవంతుడు ఎక్కడో అలవైకుంఠపురంలో ఉండడు, మన పక్కనే ఉంటాడు. మనతోనే ఉంటాడు. మనలోనే ఉంటాడు’’
      ‘‘మరైతే ఠక్కున మొసలిని ఎందుకు చంపలేదు తాతగారూ?’’
      శర్మగారు నవ్వారు. ‘‘అదే మనం తెలుసుకోవాల్సిన సత్యం. గజేంద్రుడికి తను మహాబలసంపన్నుడనని గర్వం. తనకెవరి సాయమూ అవసరం లేదనుకుంటాడు. అందుకనే మొసలి తన కాలు పట్టుకోగానే దేవుడు గుర్తురాలేదు. శక్తి అంతా హరించుకుపోయాక, మొసలి పట్టు నుంచి విడిపించుకోవడం అసాధ్యం అని తేలాక అప్పుడు గుర్తొచ్చి శరణు వేడాడు. ‘లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె, ప్రాణంబులున్‌ ఠావుల్‌ దప్పెను, మూర్ఛవచ్చె, తనువున్‌ డస్సెను..... రావే ఈశ్వర, కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా’- అని గొంతెత్తి వేడుకున్నాడు. ఆ ఉత్తరక్షణాన, భగవంతుడు ఆగమేఘాల మీద వచ్చి, మొసలిని సంహరించి, గజేంద్రుణ్ని రక్షించాడు. అర్థమైందా?’’
      అవునంటూ తలాడిస్తూనే సందేహంగా చూశాడు. ‘‘దణ్ణాలు పెడితేగానీ దేవుడు సాయం రాడా తాతగారూ’’
      నిలువునా ఆశ్చర్యపోయారు. గుటకలు మింగారు. ‘‘ఎందుకు రాడూ? తప్పకుండా వస్తాడు. అసలు ఎక్కణ్నుంచో రావడం ఏవిటి. తను సర్వాంతర్యామి. అన్ని చోట్లా ఉన్నాడు. అందరిలో ఉన్నాడు. నీలో, నాలో, గజేంద్రుడిలో అందర్లోనూ ఉన్నాడు’’
      ‘‘మొసలిలో కూడా ఉన్నాడా?’’ 
      ‘‘ఉన్నాడున్నాడు. కానా భావన, స్పృహ దానికి లేదు. ఉంటే అలా హింసించేది కాదుగా!’’ 
      ‘‘ఏమో తాతగారూ. దేవుడి పద్ధతి నాకు నచ్చలేదు. భారతంలోనూ అంతే. ద్రౌపది ఏడ్చి గోల చేస్తేగాని కృష్ణుడు రాలేదు. అసలు ముందే జూదం ఆడనివ్వకుండా ఉంటే, ద్రౌపదిని అవమానించేవారు కాదు. కురుక్షేత్ర యుద్ధం జరిగేది కాదు. బోలెడు మంది చనిపోయే వారు కాదు’’ దిగులుగా అన్నాడు.
      నిబిడాశ్చర్యంతో చూసింది కాత్యాయని. 
      ‘‘ఇది కృష్ణుడి స్నేహితుడు ఉద్ధవుడు కృష్ణుణ్ని అడిగిన ప్రశ్నండీ!’’ 
      తలాడిస్తూ అన్నారు ‘‘దానికి జవాబు భారతంలోనే, కృష్ణుడే ఇచ్చాడు. మీ అమ్మ చెప్పలేదా?’’ 
      తల అడ్డంగా ఊపాడు బాలగోపాలుడు.
      ‘‘జూదానికి రమ్మని ఆహ్వానం పంపాడు దుర్యోధనుడు. వెంటనే అంగీకరించేశాడు ధర్మరాజు. అంతే తప్ప, తన సచివుడు, బాంధవుడు, శ్రేయోభిలాషి అయిన కృష్ణుణ్ని సలహా అడుగుదామనుకోలేదు. ఎందుకంటే అతడికప్పుడు కృష్ణుడు గుర్తు రానేలేదు. ఆ తర్వాతేమో, కృష్ణుడు రాకూడదని కోరుకున్నాడు. ఎంచేత? జూద వ్యసనం ధర్మరాజు బుద్ధిని పూర్తిగా లోబరుచుకుంది గనుక! ప్రతిదీ కర్మానుసారమే జరుగుతుంది. దాన్నెవరూ మార్చలేరు నాయనా’’
      అలాగా అన్నట్టు చూశాడు. ‘‘అయితే దేవుడు మంచోడేనా?’’ 
      ‘‘సందేహం వద్దు, కరుణా వాత్సల్యుడు’’
      తప్పట్లు కొట్టాడు. ‘‘మీకన్నీ తెలుసు తాతగారూ. మరెందుకు చెప్పటం మానేశారు? మళ్లీ చెప్పండి తాతగారూ. నాలాంటి వాళ్ల కోసం చెప్పండి’’
      దిగ్భ్రమగా చూశారు శర్మగారు.
      ‘‘నేను చెవినిల్లు కట్టుకుని పోరినా మీరు వినలేదు. కనీసం ఈ బుల్లి గోపాలుడి మాటైనా వినండి. మళ్లీ ప్రవచనాలు మొదలెట్టండి. మీకెంతో ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. మీ తపన, ఆర్తి చల్లారతాయి’’
      విరక్తిగా నవ్వారు. ‘‘చెవిటి వారి ముందు మురళి వాయించనా?’’ 
      ‘‘ఎవరి పని వాళ్లు చేయాలని కృష్ణుడు చెప్పాడంటగా. మా అమ్మ చెప్పింది’’
      చటుక్కున ‘కర్మణ్యే వాధికారస్తే’ గీతా వాక్యం గుర్తొచ్చింది. కలవరపడ్డారు. కలత చెందారు. అయినా ఆ బాలుడికి ‘దొరికెయ్యటం’ ఇష్టం లేకపోయింది. ‘‘పిట్ట కొంచెం కూత ఘనం అని  బాగానే మాట్లాడుతున్నావు గానీ, చక్కని కథలు చెప్పి నిన్నింతటివాణ్ని చేసిన మీ అమ్మగార్ని చూడాలనిపిస్తోంది. ఆవిడ పేరేంటి? ఎక్కడుంటారు?’’
      ‘‘అన్నపూర్ణమ్మ. చెరువు గట్టుకి అవతలి పక్కన ఉంటాం’’ అంటూ ఏదో గుర్తొచ్చి గబుక్కున లేచాడు 
      ‘‘అమ్మో- ఎండెక్కి పోయింది. అమ్మ కోప్పడుతుంది...’’ అంటూ వెళ్లబోయి ఆగాడు.
      ‘‘తాతగారూ, దేవుడు మంచోడైతే బలిచక్రవర్తికి ఎందుకు అన్యాయం చేశాడు చెప్పండి?’’
      ‘‘అతడు రాక్షసుడు. అందుకనే తొక్కేశాడు’’ 
      ‘‘మరెందుకు ప్రహ్లాదుణ్ని రక్షించాడు? అతడి మనవడే కదా బలిచక్రవర్తి?’’ 
      ‘‘నిజమే సుమండీ’’ అంది బుగ్గలు నొక్కుకుంటూ కాత్యాయని.
      ‘‘అహంకారం! దేవతల కన్నా అధికుణ్నన్న అహంకారం. ఏదైనా ఎంతైనా ఎవరికైనా దానమివ్వగలనన్న మదం! అందుకనే అతడి శిరస్సు మీద తన పాదం పెట్టి పాతాళానికి అణగదొక్కేశాడు త్రివిక్రముడు!’’
      ‘‘అంతేనా? అంతేనా?’’ శర్మగారి కళ్లల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు. తర్వాత తుర్రున పారిపోయాడు.
      ‘‘ఒరేయ్, సాయంత్రం ఉట్టి కొడతాం. తప్పకుండా రా. కృష్ణుడి వేషం వేసుకుని రా’’ వెనుక నుంచి అరిచారు.
      ఆగి, వెనుదిరిగి చూసి, నవ్వి ‘‘ఓ’’ అని బదులిచ్చి పరుగు పెట్టాడు.
      శర్మగారి గుండెల్లో ఆనందం పొంగింది. కొత్త ఉత్సాహం తోసుకొచ్చింది. ‘‘ఎవరి బిడ్డడోగాని గట్టి పిండమే’’ అన్నారు.
      ‘‘వాడితో ఆ ముక్క చెప్పి ఉంటే సంతోషిద్దుడుగా. అప్పుడు నోరు కుట్టేసుకున్నారు’’ నిష్ఠూరంగా అంది.
      సాయంత్రమవుతుంటే ఊరి పెద్దలొచ్చారు. ఉట్టి ఏర్పాటు చేశారు. మామిడాకుల తోరణాలు కట్టారు. ఆడపిల్లలు బంతిపూల మాలలతో అలంకరించారు.
      చీకటి పడేసరికి గ్రామస్థులంతా తరలి వచ్చారు. పిల్లలంతా పసుపు రంగు వస్త్రాలు కట్టుకుని, నామాలు పెట్టుకుని, పిల్లనగ్రోవి ధరించి, అట్ట కిరీటాలు పెట్టుకుని చిన్ని కృష్ణుల్లా తయారై వచ్చారు. సందడి చేశారు.
      ఉట్టి కొట్టడానికి యువకులు, వారిపై నీళ్లుపోసి అడ్డగించడానికి యువతులూ సిద్ధమయ్యారు.
      అక్కడ ఒక సంఘీభావం, ఒక సమైక్యత, ఒక ఉత్సాహం చిందులేసింది.
      ‘‘బాలగోపాలుడెక్కడా కన్పించట్లేదండీ’’ పిల్లల్ని తేరిపారి చూస్తూ అడిగింది కాత్యాయని.
      ‘‘వీళ్లలో ఉండే ఉంటాడు. కృష్ణ వేషం వేసుకున్నందున గుర్తు పట్టలేకపోతున్నాం. సమయానికి బయటికొస్తాడు చూడు. వాడు అందర్లాంటి బాలుడు కాదు. చిచ్చర పిడుగు!’’ అన్నారు శర్మగారు.
      ఉట్టోత్సవం ఆనందకోలాహలం మధ్య ముగిసింది. హల్వా, శనగల ప్రసాదం తీసుకుని వెళ్లిపోయారంతా. ఎక్కడా బాలగోపాలుడి జాడలేదు. ‘‘వస్తానని చెప్పి రాలేదు చూడు’’ నిస్పృహగా అన్నారు.
      వాడి గురించీ, వాడి ప్రశ్నలు రేపిన తేనె తుట్టె గురించీ ఆలోచిస్తూ ఆ రాత్రంతా కలత నిద్ర పోయారు శర్మగారు.
      మర్నాడు పూజాదికాలయ్యాక, ‘‘బాలగోపాలుడి తల్లిగారిని కలిసొస్తాను’’ అని చెప్పి వెళ్లారు. 
      చెరువుకి అవతలి వైపున ఇళ్లేమీ లేవు గాని దూడకి ఒక ఆవు పాలిస్తూ కన్పించింది.
      ‘‘ఈ చుట్టు పక్కనే అన్నపూర్ణమ్మగారనే ఆవిడా, వారి చిన్నబ్బాయీ ఉన్నారు. వారి ఇల్లెక్కడో చెబుతారా?’’ ఆరా తీశారు.
      అంతా ముఖాముఖాలు చూసుకున్నారు. అలాంటి వాళ్లని ఎన్నడూ ఆ ప్రాంతంలో చూడలేదన్నారు.
      ‘‘ఇదేవిటే? ఇదేం మాయ? నిన్న మనింటికి వచ్చి, అటుకులు తిని, ఎన్నో కబుర్లు చెప్పిన వాడు ఎక్కడా లేకపోవడం ఏవిటి? ఇదేం చోద్యం కాత్యాయనీ!’’ అయోమయంగా చూస్తూ తనలో తను అనుకున్నట్టుగా భార్యతో అన్నారు శర్మగారు.
      ‘‘ఇదేదో చిత్రంగానే ఉంది. ఒకవేళ ఎవరూ రాలేదేమో! అదంతా మన చిత్తభ్రమేమో?!’’
      ‘‘అలా ఎలా అవుతుందే. నన్ను మళ్లీ ప్రవచనాలు చెప్పమంటూ కర్తవ్యోన్ముఖుణ్ని చేశాడు. బలిని ఎందుకు అణిచేశాడని నొక్కి మరీ అడిగాడు...’’ ఛెళ్లున ఎవరో కొరడాతో కొట్టినట్టు తుళ్లిపడ్డారు.
      లీలగా ఏదో అర్థమవుతోంటే, టప టపా చెంపలు వాయించుకుని శ్రీకృష్ణ విగ్రహం ముందు మోకరిల్లారు.
      మెరుస్తున్న ఆయన కళ్లలోంచి ఆనందాశ్రువులు ధారలుగా కారిపోతున్నాయి. అయోమయంగా చూసింది. ఆపైన ఆదుర్దా పడిందామె. ‘‘ఏవండీ. ఏవైంది. అలా అయిపోయారేంటి? మీ కళ్లల్లో ఒక్కసారే ఆనందమూ, కన్నీరూ...!’’
      ‘‘అహం పొరలు కమ్మిన నాకు కనువిప్పు కలిగింది కాత్యాయనీ. అందరికన్నా అధికుణ్నని, జనోద్ధారకుణ్నని, నేనే జగన్నాథుణ్నని అహంకారంతో విర్రవీగాను. శ్రోతల్ని అల్పులుగా, అవివేకులుగా చూశాను. వాళ్లు కాదు కాత్యాయనీ, అసలు సిసలు అల్పుణ్ని, అజ్ఞానిని నేనే. నేనే పిపీలికాన్ని. నా కర్మ నేను చేయాలన్నది మరచి, సత్వర ఫలితం కోసం వెర్రిగా వెతికాను. కొందరైనా వింటున్నారని, కొంతైనా ఒంటబట్టించుకుంటారని, అతి కొద్ది మందే అయినా ఆచరిస్తూంటారని గ్రహించలేక పోయాను. 
      ‘‘అమ్మ చెప్పిన కథలు బాలగోపాలుణ్ని జ్ఞానిని చేసినప్పుడు నా ఆధ్యాత్మికోపన్యాసాలు ఎందుకు వృథా అవుతాయి చెప్పు? ఎక్కడో అక్కడ సారవంతమైన మనఃభూమి ఉండే ఉంటుంది. నా వచనాల విత్తనాలు నాటుకునే ఉంటాయి. ఇవాళ గాకపోయినా రేపవి మొలకెత్తుతాయి. ఈలోగానే ఎంత తొందర పడ్డానో చూడు. అహంకరించి భగవత్కథను ప్రచారం చేయడం మానేశాను. నేను మూర్ఖుణ్ని! అహంకారిని! కళ్లున్న గుడ్డివాడిని!’’ టప టపా చెంపలు వాయించుకున్నారు.
పొగిలి పొగిలి ఏడ్చారు. కాత్యాయని ఓదార్పులూ పని చేయలేదు.
      ‘‘ఇప్పటికే వార్ధక్యం పైబడింది. రోజు రోజుకీ ఆరోగ్యం క్షీణిస్తోంది. కంఠస్వరం బొంగురు పోతోంది. కంపిస్తోంది. ఇక ముందు ముందు ఏం చెప్పగలను, ఎంత చేయగలను? బంగారంలాంటి అవకాశాన్ని చేజార్చుకున్నాను. దీనిక్కారణం ఏమిటో తెలుసా? అహం, అహంకారం, గర్వం మొసలిలా నన్ను బంధించేశాయి! ఆర్తితో అశాంతితో వేదనాగ్రస్థుణ్నై బతుకీడుస్తోంటే, ఇప్పుడు జ్ఞానోదయమైంది. ఆ బాలగోపాలుడు - కాదు ఈ గోపాలుడే ఆ రూపంలో వచ్చి నా కళ్లు తెరిపించాడు. నా అహంకారాన్ని అణచేశాడు. ఇక ఆగను కాత్యాయనీ, నా కంఠంలో ఊపిరున్నంత వరకూ ప్రవచనాలు చెబుతూనే ఉంటాను. భాగవత కృష్ణుడి లీలల్ని వీధి వీధినా ప్రచారం చేస్తూనే ఉంటాను...!’’ శర్మగారు వలవల విలపిస్తూ ఊగిపోయారు.
      ఆయనేమైపోతారోనని భయమేసి, ‘‘కృష్ణా! మా అపరాధాలు మన్నించు. నీవు వినా మాకు దిక్కెవరు?’’ కన్నీటితో ప్రార్థించింది కాత్యాయని.
      మర్నాడు పూజ ముగించి, శ్రీమద్మహాభాగవత గ్రంథాన్ని కళ్లకద్దుకుంటుంటే ఇంటి ముందు కారాగింది. నలుగురు లోపలికొచ్చారు. ప్రశ్నార్థకంగా చూశారు శర్మ దంపతులు. 
      ‘‘మేం ‘కృష్ణ భక్తి’ టీవీ ఛానల్‌ నుంచి వచ్చాం. మీ భాగవత ప్రవచనాలని రికార్డు చేయాలనుకుంటున్నామండీ. మీరు స్టూడియోలకి రారని తెలుసు. అందుకే ఇక్కడే, మీ ఇంట్లోనే చిత్రీకరించమని మా ఛైర్మన్‌గారు ఆదేశించారు. వారెప్పుడో మీ ప్రసంగం విన్నారట. ఎంతో సుందరంగా, సుమధురంగా ఉందని మెచ్చుకున్నారు. మీ అపూర్వ జ్ఞానాన్ని ముందు తరాలకు అందించాలన్నది వారి సంకల్పం’’
      ‘‘అంతా ఈశ్వరాజ్ఞ! వారి పేరు?’’ 
      ‘‘గోపాలకృష్ణమూర్తిగారు’’ 
      గబుక్కున కృష్ణ విగ్రహం ముందు సాష్టాంగపడి పోయారు శర్మగారు.
      ‘‘నన్నీరీతిన దయతల్చావా కృష్ణ పరమాత్మా! ఆ బాలరూపంలో వచ్చావా ఈశ్వరా! ఈ విధంగా కాచావా వరదా! ఇలా సంరక్షించావా భద్రాత్మకా!’’ ఆనందబాష్పాలు జలజలా రాలిపోతుంటే ‘మమ’ అనుకుంది చేతులు జోడించి కాత్యాయని.
      అలౌకికానందంతో ఊగిపోతున్నారు శర్మగారు. ఆయన చెవులకు మోహన మధురగానం మంద్రంగా విన్పించింది. కాలి గజ్జెల సవ్వళ్లు గుండెల్లో ప్రతిధ్వనించాయి. అపూర్వ మహదానందానుభూతి ఆయన మనఃశరీరాన్ని ఆవరించి, ఆవహించి ఊపేసింది. భక్తితో భగవంతుడి ముందు శిరస్సు వంచారు. ‘దాసోహం’ అన్నారు. 
      ఆయనిప్పుడు జగన్నాథశర్మ కాదు, జగన్నాథుడి భక్త పరమాణువు!

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


వాళ్లు ఏడ్చారు!

వాళ్లు ఏడ్చారు!

పి.చంద్రశేఖర అజాద్‌


స్వ‌యంవ‌ధూ...!?

స్వ‌యంవ‌ధూ...!?

దోరవేటి, (వి.చెన్నయ్య)


సువర్ణ గన్నేరు పూలు

సువర్ణ గన్నేరు పూలు

ప్రసాదమూర్తి


స‌మిధ‌

స‌మిధ‌

సయ్యద్‌ సలీం


అతడూ మనిషే!

అతడూ మనిషే!

పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


దాసరి పాట (క‌థాపారిజాతం)

దాసరి పాట (క‌థాపారిజాతం)

చింతా దీక్షితులుbal bharatam