వసుధకి గొప్ప పెళ్లి సంబంధం వచ్చింది. కానీ, వాళ్ల నిబంధన గురించే ఆలోచిస్తోంది! ఎటూ తేల్చుకోలేకపోతోంది! తల్లిని సలహా అడిగింది. అసలు ఆ నిబంధన ఏంటి?
‘‘వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. మరి ఆఫీసేంటి?’’ వసుధని అడిగింది ఇందిర.
‘‘ఎందుకో మా బాస్ రమ్మన్నారు’’
‘‘వెంటనే వచ్చేస్తావా?’’
‘‘ఏమోనమ్మా! మా బాస్ చెప్పినదాన్ని బట్టి ఉంటుంది’’
‘‘మరి భోజనం?’’
‘‘త్వరగా వచ్చేటట్టుంటే ఫోన్ చేస్తాను. లేకపోతే క్యాంటీన్లో తినేస్తా’’
‘‘సాయంత్రానికల్లా వచ్చేసెయ్యి. ఈరోజు నీకు పెళ్లిచూపులు కదా. వాళ్లొచ్చే సమయానికి నువ్వు లేకపోతే బాగోదు’’
‘‘వచ్చేస్తాలే. అయినా ఈ కరోనా టైంలో పెళ్లిచూపులేంటమ్మా?’’
‘‘ఏ కాలమైనా తప్పవివి. వాళ్లు ఎక్కువ మంది రావడం లేదులే’’
‘‘రావడం లేటైతే ఫోన్ చేస్తా’’
‘‘ఫోన్ చేయడం కాదు. మీ బాస్‌ని అడిగి పర్మిషన్ తీసుకో’’
‘‘నాకు పెళ్లిచూపులు. పర్మిషన్ ఇవ్వండి అని అడగాలా..?’’
‘‘తప్పేంటి?’’
‘‘పోమ్మా!’’
‘‘ఎలాగో వీలు చూసుకుని వచ్చెయ్యి. సాయంత్రం ఆరింటికల్లా వాళ్లొచ్చేస్తారు. మాస్క్ కట్టుకోలేదు’’
‘‘ఇదొకటుందికదా’’ అంటూ ఇంట్లోకి వెళ్లి మాస్క్ కట్టుకుని స్కూటర్ మీద వెళ్లిపోయింది వసుధ.
ఇందిర, మోహనరావుల ముద్దుల కూతురు వసుధ. ఇంజనీరింగ్ చేసింది. చివరి ఏడాదిలోనే ఓ మల్టీ నేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. ఏడాదికి పది లక్షల జీతం. హైదరాబాదులోనే ఉద్యోగం. నిండా పాతికేళ్లు రాకుండానే సొంత కాళ్లమీద నిలబడింది. వసుధకు ఎలా అబ్బిందోగానీ, చదువుకునే రోజుల నుంచే సాహిత్యం మీద అభిలాష పెరిగింది. చాలా రచనలు చదివేసింది. కొన్ని కథలు కూడా రాసింది. ఖాళీ సమయాల్లో ఫేస్బుక్కో, ట్విటరో, ఇతర సోషల్ సైట్లకో కళ్లప్పగించేయకుండా తనకిష్టమైన రచనలను చదవడంలో నిమగ్నమవుతుంది. వసుధ ఫోనులో వాట్సప్ తప్ప ఇతర సోషల్ యాప్స్ ఉండవు. అవన్నీ సమయాన్ని హరించేస్తాయని వసుధ అభిప్రాయం.
తనకిష్టమైన పని చేయడం తప్ప, ఎవరి కోసమో రాజీ పడటం వసుధకు నచ్చదు. పెళ్లి, పిల్లలు, భావి జీవితం విషయంలో ఆమెకి కొన్ని అభిప్రాయాలున్నాయి. ఇంట్లో కూడా స్వతంత్రంగానే ఉంటుంది. వసుధ అభిప్రాయాలకు తల్లిదండ్రులు విలువ ఇస్తుంటారు. అవసరమైనప్పుడు సూచనలు చేస్తుంటారు. పెళ్లి చూపుల కోసం ప్రత్యేకంగా రెడీ అవ్వడం లాంటివి వసుధకు నచ్చదు. అసలు పెళ్లిచూపుల గురించి పెద్దగా ఆలోచించలేదు కూడా.
ఆఫీసుకు వెళ్లాక మరో మూడు నెలలు వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పి, కొత్త ప్రాజెక్టు గురించి కాసేపు వివరించి మధ్యాహ్నం వెళ్లిపొమ్మన్నారు. సహోద్యోగులు అరుణ, జ్యోతితో మాట్లాడి ఇంటికి వచ్చేసింది. కూతురు త్వరగా ఇంటికొచ్చేయడం తల్లిదండ్రులకు ఆనందం కలిగించింది.
‘‘భోజనం చేసేస్తావా?’’ కూతుర్ని అడిగింది ఇందిర.
‘‘ఒంటిగంటే కదా. రెండవనీ’’ అంది.
‘‘సరే. నీఇష్టం. ఈ రోజు నీకిష్టమైన గోంగూర పచ్చడి చేశాను’’ చెప్పింది ఇందిర.
‘‘నిజమా! మరి చెప్పవేం. ఆకలి దంచేస్తోంది. పదపద’’
కూతురు మాటలకు నవ్వుకుంది ఇందిర.
‘‘కొద్దిసేపు పడుకో. ముఖం ఫ్రెష్‌గా ఉంటుంది’’ అని ఇందిర అనడంతో, ఆ మాటలతో కాకపోయినా ఓ ముద్ద ఎక్కువే తినడంతో నిద్రొస్తున్నట్టనిపించి బెడ్రూమ్లోకి వెళ్లబోతూ అప్పుడే గుమ్మంలోకి అడుగుపెడుతున్న శ్రీదేవిని చూసింది.
‘‘అమ్మా! పిన్నొచ్చింది’’ అంటూ కేకేసింది.
‘‘రా శ్రీదేవీ. మరిది రాలేదేం’’ ఇందిర అడిగింది.
‘‘ఏదో పనుందటక్కా’’ అంటున్న శ్రీదేవిని మోహనరావు కూడా పలకరించాడు.
సాయంత్రం అయిదున్నర అయ్యింది. ‘‘వాళ్లు బయలుదేరినట్టు ఫోన్ వచ్చింది. నువ్వెళ్లి తయారవ్వు. మంచి చీర కట్టుకో’’ కూతురిని తొందర పెట్టింది ఇందిర.
‘‘వడ్డాణం, వంకీలు, కాసులపేరు, ఇంకా ఏమైనా ఉంటే ఇవ్వు. అవన్నీ పెట్టుకుని అమ్మోరిలా తయారై వస్తా’’ వసుధ మాటలకు శ్రీదేవి కిసుక్కున నవ్వింది.
‘‘సరే, నీకు ఇష్టమైనట్టు తయారై రా తల్లీ’’ అంది ఇందిర.
బయట కారు శబ్దం వినిపించడంతో వాళ్లని లోనికి తీసుకురమ్మని భర్తని పంపించింది.
అబ్బాయి, అమ్మానాన్నా, మధ్యవర్తి, మరో ఇద్దరు కారులో దిగారు. కరోనా భయంతో అందరూ మాస్క్‌లు పెట్టుకుని ఉన్నారు. తమకి మాస్కులు లేవని గుర్తొచ్చి గబగబా తెచ్చి ఇచ్చింది ఇందిర.
అంతా హాల్లో కూర్చున్నారు. ‘‘వీడు మా అబ్బాయి. పెద్దవాడు. పేరు అభిరామ్. వీడు కాకుండా మరో ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఈవిడ నా భార్య మాధవి. ఈయన మా అన్నయ్య, ఇతను మా తమ్ముడు’’ అందరినీ పరిచయం చేశాడు పెళ్లికొడుకు తండ్రి సుధాకర్.
‘‘ఇంట్లో మా అమ్మా నాన్నా కూడా ఉన్నారు. అభిరామ్ స్టేట్‌బ్యాంక్‌లో పీఓ. మిగిలిన ఇద్దరు కొడుకుల్లో ఒకడు ఏడు, ఒకడు తొమ్మిది, కూతురు పదో తరగతి చదువుతున్నారు. ఇక మాకు మాదాపూర్‌లో ఒక అపార్ట్మెంట్లో నాలుగు ఫ్లాట్లున్నాయి. వరంగల్‌లో పాతికెకరాల మాగాణి, అమలాపురంలో పదెకరాల కొబ్బరితోట మా స్థిరాస్తులు. కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. అవి చూసుకుంటే చాలని అంటున్నా అభిరామ్ వినలేదు. ఉద్యోగం పురుష లక్షణం అంటూ బ్యాంకు మెట్లెక్కుతున్నాడు, దిగుతున్నాడు’’ ముగించాడు పెళ్లికొడుకు తండ్రి సుధాకర్.
ఆయన తన కుటుంబాన్ని పరిచయం చేసినట్టు లేదు. ఇదీ మా స్టేటస్ అని గర్వంగా చెప్పినట్టుంది ఇందిరకు. తలుపు చాటు నుంచి మొత్తం వింటోంది వసుధ. తమ కుటుంబ వివరాలు తెలియజేయడానికి మోహనరావు గొంతు సవరించుకున్నాడు.
‘‘మాకున్నది ఒక్కగానొక్క కూతురు. పేరు వసుధ. ఈవిడ నా భార్య ఇందిర. నాకు ఇద్దరు తమ్ముళ్లు. ఈమె మా తమ్ముడి భార్య శ్రీదేవి. ఏదో అత్యవసర పనుండి వాడు రాలేదు. ఇక మాకు ఆస్తిపాస్తులు పెద్దగా లేవు. ఈ ఇల్లు నా సొంతం. ఉద్యోగం చేస్తూ రెండెకరాల పల్లం కొన్నాను. అంతా నా కష్టార్జితం. ఒక్కగానొక్క కూతురు. తన ఇష్ట ప్రకారం చదివించాను. బాగా చదువుకుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేస్తోంది’’ ముగించాడు మోహనరావు.
పెళ్లికొడుకు తరఫు వాళ్లకి ఆ విషయాల పట్ల అంతగా ఆసక్తి ఉన్నట్లు కనబడలేదు. వారి ప్రవర్తన కొంత ఇబ్బందిగా అనిపించిందందరికీ.
శ్రీదేవి వెళ్లి వసుధని తీసుకొచ్చింది. అమ్మాయిని చూసి అందరూ కళ్లు తిప్పుకోలేక పోయారు. మెడలో సన్నని గొలుసు, చెవులకి లోలాకులు, ఒక చేతికి రెండు గాజులు, మరో చేతికి స్మార్ట్ వాచ్, పసుపుపచ్చ చీరలో కుందనపు బొమ్మలా ఉంది వసుధ. తను అందరికీ తెగ నచ్చేసింది. అభిరామ్ అయితే చూపు తిప్పుకోలేకుండా ఉన్నాడు.
‘‘మాకు కట్నకానుకలు ముఖ్యం కాదు. మాకే బోలెడంత ఉంది. అమ్మాయి ముఖ్యం. అయితే పెళ్లయ్యాక తను ఉద్యోగం చెయ్యకూడదు. భర్తని, కుటుంబాన్ని చూసుకుంటే చాలు. ఇంటికి పెద్ద కోడలు కాబట్టి చాలా బాధ్యతలుంటాయిగా. మీ అమ్మాయికి మీరేం పెట్టుకుంటారో మీయిష్టం. మేం దేనికీ బలవంతం పెట్టం’’ అన్నాడు పెళ్లికొడుకు తండ్రి.
ఏ రకంగా చూసుకున్నా ఆ సంబంధం బాగుందనిపించింది మోహనరావుకి. ‘‘సరే, అలాగే. పెళ్లయ్యాక అమ్మాయి ఉద్యోగానికి వెళ్లదు’’ అన్నాడు.
ఆ మాటతో ఇందిర కంగారుపడింది. తమని సంప్రదించకుండానే భర్త అంగీకారం చెప్పేస్తాడని ఊహించలేకపోయింది.
‘‘శుభం. ఇరు కుటుంబాల వాళ్లకీ ఇష్టమే కాబట్టి ముహూర్తం నిర్ణయించి తాంబూలాలు మార్చుకుంటే సరి. ఏమంటారు’’ మధ్యవర్తి అన్నాడు.
‘‘మాకేం అభ్యంతరం లేదు. పంతులు గారిని పిలిచి ఇప్పుడే పెట్టుకుందాం’’ అంటూ మోహనరావు వైపు చూశారు శంకర్రావు కుటుంబ సభ్యులు.
అంతలో ఇందిర జోక్యం చేసుకుని, ‘‘క్షమించాలి. హడావుడి ఏముంది. మెల్లగానే ముహూర్తాలు పెట్టుకుందాం’’ అంది.
భార్యవైపు మోహనరావు కోపంగా చూశాడు.
‘‘సరే అలాగే చేద్దాం’’ అని అభిరామ్ తరుఫువాళ్లు వెళ్లిపోయారు.
వాళ్లని సాగనంపాక, ‘‘ఎందుకా తొందర. నేను మాట్లాడుతున్నాను కదా. అన్ని విధాలా మంచి సంబంధం. మన కంటే ఎన్నో రెట్లు గొప్పోళ్లు. ఇంతకంటే మంచి సంబంధం తేగలమా?’’ భార్యతో కోపంగా అన్నాడు మోహనరావు.
‘‘అన్నీ మనం అనేసుకుంటే సరిపోతుందా? పిల్లను అడగక్కర్లేదా?’’ అంది ఇందిర. మోహనరావు మౌనం వహించాడు.
‘‘వసుధా! నీకిష్టమేనా’’ అక్కడే ఉన్న కూతుర్ని అడిగింది ఇందిర.
నాన్న ఆవేశం చూసి ఏం సమాధానం చెప్పాలో తెలియక అయోమయంలో పడింది వసుధ.
‘‘తొందరేం లేదు. బాగా ఆలోచించుకుని చెప్పు’’ కూతురి పరిస్థితి అర్థం చేసుకున్న ఇందిర అంది.
వసుధ ఏదీ తేల్చుకోలేక సతమతమవుతోంది. ఇలాంటి సన్నివేశాలున్న ఎన్నో కథలు చదివింది. కొన్ని కథలు రాసింది. కానీ, తనదాకా వచ్చేసరికి ఎటూ తేల్చుకోలేకపోతోంది. సంబంధం బాగానే ఉందనిపిస్తోంది. చదువులో, జీతంలో అభిరామ్ తన కన్నా తక్కువే అయినా, మిగతా అన్ని విషయాల్లో వాళ్లు ఎక్కువగానే కనిపిస్తున్నారు. ఒకసారి అభిరామ్‌ని కలిసి మాట్లాడి ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని అనుకుంది. ఆ విషయాన్ని అమ్మతో చెప్పింది.
‘‘వసు.. ఆ అబ్బాయి రేపు సాయంత్రం ఆరింటికి మనింటికి వస్తాడట. బయట ఎక్కడైనా కలవొచ్చుగానీ, కరోనా సమయం కదా. అందుకే మనింట్లోనే మీ భేటీ ఏర్పాటు చేశాం’’ అని చెప్పింది ఇందిర.
తర్వాతి రోజు వసుధ, అభిరామ్ డాబా మీద మాట్లాడుకున్నారు. ఇద్దరి హాబీలు, అలవాట్లు అన్నీ చెప్పుకున్నారు. ఉద్యోగం దగ్గరే ఏకాభిప్రాయం కుదరలేదు. ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగం మానెయ్యాలి. తప్పదు. కోడలు ఉద్యోగం చెయ్యడం మా నాన్నకు ఇష్టం ఉండదు. ఆయనకు ఇష్టం లేకపోతే నాకూ లేనట్టే’’ కుండబద్దలు కొట్టాడు అభిరామ్. వసుధ ఎన్ని రకాలుగా చెప్పిచూసినా అభిరామ్ ఒప్పుకోలేదు. అదే విషయాన్ని తల్లికి చెప్పింది వసుధ.
‘‘అయితే ఏం చేయాలనుకుంటున్నావు?’’ ఇందిర కూతురు అభిప్రాయం తెలుసుకోడానికి ప్రయత్నించింది.
‘‘ఏం చెయ్యాలో అర్థం కావట్లేదమ్మా’’ గందరగోళంలో ఉన్నట్టు తల పట్టుకుంటూ చెప్పింది వసుధ.
‘‘నీ కథల్లో సాహసోపేతమైన నిర్ణయాలు కనిపిస్తుంటాయి. కానీ, నీదాకా వచ్చేసరికి ఆ తెలివితేటలు ఏమైపోయాయి? నీ బుర్ర మొద్దు బారిపోయిందా’’ ఇందిర సూటిగా ప్రశ్నించేసరికి వసుధ తత్తరపడింది.
‘అమ్మ అన్నందుకు కాదుగానీ, నిజంగానే నా బుర్ర మొద్దుబారి పోయిందా?’ అనుకుంది.
‘‘అమ్మాయి ఏమంటోంది. తనకిష్టమేనా’’ మోహనరావు అడిగాడు భార్యని.
‘‘నేనడిగితే చెప్పడం లేదు. మీరొకసారి అడగండి’’ అంది.
‘‘మంచి సంబంధం. దీన్ని ఖాయం చేసుకుంటే సుఖపడుతుంది’’ అన్నాడు స్థిరంగా.
‘‘అవును. మిమ్మల్ని కట్టుకుని నేనెంత సుఖపడ్డానో అది కూడా అంతే సుఖపడుతుంది. సిగ్గుండాలి ఆ మాట అనడానికి’’ ఇందిర ముఖం కోపంతో ఎర్రబడింది.
‘‘నీకేం తక్కువయ్యిందనీ’’ మోహనరావు తెల్లబోతూ అడిగాడు.
‘‘అన్నీ ఎక్కువే...’’ అంటూ విసవిసా వంటింట్లోకి వెళ్లిపోయింది.
* * *
‘‘అమ్మా. ఎటూ తేల్చుకోలేక పోతున్నాను. ఏదైనా సలహా ఇవ్వొచ్చుగా’’ గోముగా అడిగింది వసుధ.
‘‘ఇస్తాను. అసలు నీకు ఎక్కడ పేచీ వస్తోందో చెప్పు ముందు’’ కూతురిని లాలనగా అడిగింది ఇందిర.
‘‘అన్నీ బాగానే ఉన్నాయిగానీ, ఉద్యోగం మానెయ్యాలనడం దగ్గరే వస్తోంది చిక్కంతా. నేను ఎంత చెప్పినా అభిరామ్ వినడం లేదు. వాళ్ల నాన్నకి ఇష్టం లేకపోతే తనకూ ఇష్టంలేదని అంటున్నాడు. ఉద్యోగం మానెయ్యడం కుదరదంటే సంబంధం క్యాన్సిల్ చేసుకుంటాం అన్నట్టు మాట్లాడుతున్నాడు’’
‘‘క్యాన్సిల్ చేసేసుకొమ్మను’’ కటువుగా అంది ఇందిర.
అమ్మని ఆశ్చర్యంగా చూస్తూ, ‘‘అదొక్కటి తప్పితే మిగతా విషయాలన్నీ బాగానే ఉన్నాయి కదమ్మా’’ అంది వసుధ.
‘‘ఆహా, అయితే ఉద్యోగం మానెయ్యి’’ అంది ఇందిర.
‘‘అమ్మా! సలహా ఇమ్మంటే ఇదా నువ్వు చెప్పేది’’ నీరసంగా అడిగింది వసుధ.
‘‘ఇది నీ జీవితం. సంసారం చెయ్యాల్సింది నువ్వు. ఇంత డోలాయమానంలో ఉంటే ఎలా? సరైన నిర్ణయం తీసుకో. అభిరామ్, వాళ్ల నాన్న కచ్చితమైన నిర్ణయంతోనే ఉన్నారు. వాళ్ల ఇంటికొచ్చే అమ్మాయి ఉద్యోగం చెయ్యకూడదన్నది వాళ్ల నిర్ణయం. నువ్వు కూడా అంతే స్పష్టతతో ఉండాలి. నీకు ఉద్యోగం మానెయ్యడం ఇష్టమైతే సంబంధానికి ఓకే అని చెప్పు. లేదంటే ఈ సంబంధం ఇంతటితో వదిలెయ్యి. అయితే, ఏ నిర్ణయం ఎటు దారితీస్తుందో ముందు బేరీజు వేసుకోవాలి. ఉద్యోగం అంటూ చేతిలో ఉంటే నీ జీవితానికో భరోసా ఉంటుంది. ముఖ్యంగా నీకు ఆర్థిక స్వాతంత్య్రం ఉంటుంది. అదే జాబ్ లేదనుకో నీ పరిస్థితి నాలాగే ఉంటుంది. ఏ విషయంలోనూ స్వేచ్ఛ ఉండదు. ఏం కావాలన్నా భర్తని దేబిరించాలి. జీవితాంతం రాజీ పడాలి’’ అని చెప్పి ఇందిర మళ్లీ కొనసాగించింది.
‘‘నా అనుభవంతో నేనొకటి చెబుతాను. నీకు ఇష్టం ఉంటే ఆచరించు. లేకపోతే వదిలెయ్యి. కానీ, అంతిమంగా నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితాన్ని నందనవనం చేయకపోయినా ఫర్వాలేదుగానీ, జీవితాన్ని ఒక మూస చట్రంలో బిగించెయ్యకూడదు.
‘‘నేను చెప్పేది ఒక నిండు జీవిత అనుభవం. ఇప్పటికి ముప్పై ఏళ్ల కిందటి మాట. రాజేశ్వరి అనే అమ్మాయికి అప్పుడు పద్దెనిమిదేళ్లు. చదువులో చురుకైంది. ఎప్పుడూ క్లాస్ ఫస్టే. చదువే కాదు, నాట్యం, గాత్రం అన్నా పంచప్రాణాలు. చిన్నప్పుడే కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగింది. పాట పాడిందంటే అందరూ మంత్రముగ్ధులయ్యేవారు. చదువుకు ఇబ్బంది కలగకూడదని పది తర్వాత నాట్య ప్రదర్శనలు మాన్పించారు. పాటలు పాడటం ఆపించారు. ఇంటర్ తర్వాత మంచి సంబంధం వచ్చిందని రాజేశ్వరి అభిప్రాయంతో సంబంధం లేకుండా పెళ్లి చేసేశారు. ఉమ్మడి కుటుంబంలో పెద్దకోడలిగా అత్తింట అడుగుపెట్టిన రాజేశ్వరికి ముప్పై ఏళ్ల తర్వాతగానీ తాను ఏం కోల్పోయింది తెలిసిరాలేదు. మెట్టినింట అడుగు పెట్టింది మొదలు అత్తామామల సేవలు, ఇంట్లో పనులు, మరుదుల చదువులు, వారి పెళ్లిళ్లు, తనకు పిల్ల పుట్టడం... క్షణం తీరిక లేకుండా పరుగే పరుగు. ఆ పరుగులో రాజేశ్వరి సాధించింది మంచి కోడలు అనే పేరు. కోల్పోయింది స్టేజీ మీద నాట్యం చెయ్యాలనే కోరిక, సినిమాల్లో పాడాలనే అభిలాష, చివరగా ఆరోగ్యం... అన్నింటికన్నా ముఖ్యంగా తనదైన అస్తిత్వం, ఆనందం’’ ఇందిర చెప్పడం ఆపింది.
వసుధ తల్లివైపు ఆసక్తిగా చూసింది. మళ్లీ ఇందిర కొనసాగించింది. ‘‘పెళ్లి విషయంలో ఇప్పుడు నీకున్నంత స్వేచ్ఛ అప్పుడు రాజేశ్వరికి ఉండుంటే ఆమె కథ మరోలా ఉండేది’’
‘‘ఇంతకీ ఎవరమ్మా ఆవిడ’’ అడిగింది వసుధ.
‘‘అవసరం రాలేదు కాబట్టి ఇప్పటిదాకా చెప్పలేదు. ఆ రాజేశ్వరి ఎవరో కాదు నేనే’’
తల్లి మాటలకు వసుధ కొయ్యబారిపోయింది. కాసేపు నోటంట మాట రాలేదు.
‘‘అమ్మా నిజమా! నమ్మలేకపోతున్నాను. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే నీలో ఇంతటి అవేదన ఉందా?’’ వసుధ కంట్లో నీళ్లు.
‘‘సానుభూతి కోసం ఇదంతా నీకు చెప్పలేదు వసూ. నీ జీవితం నాలా కాకూడదన్నదే నా కోరిక. కాలం మారుతున్నా ఇంకా మగాడి ఆలోచన మారలేదనడానికి ఇప్పుడు నీకొచ్చిన పెళ్లి సంబంధమే ఉదాహరణ. పెద్ద కోడలికి బోలెడు భాధ్యతలు ఉంటాయని అభిరామ్ నాన్న అన్నాడు కదా... అప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. ఇప్పటి వరకు నా పెదవి దాటని విషయాలన్నీ నీ ముందు పెట్టాను. ఇక నీ యిష్టం’’ అంది ఇందిర.
కాసేపు వారిద్దరి మధ్యా మౌనం రాజ్యమేలింది. వసుధ ఒక నిశ్చయానికి వచ్చేసింది. కానీ, తండ్రి ఆసక్తి గుర్తొచ్చి ‘‘మరి నాన్నకు ఈ సంబంధం ఇష్టంలా ఉంది’’ అంది.
‘‘ఆయనా ఆ తానులో ముక్కేగా’’ సూటిగా చెప్పింది ఇందిర.
‘‘అమ్మా నాకు ఒక స్పష్టత వచ్చింది. నా జీవితాన్ని నేను దిద్దుకుంటాను’’ తల్లిని హత్తుకుంటూ చెప్పింది. కూతురు నిర్ణయం అర్థమై సంతోషంతో వసుధ తల నిమురుతూ ఉండిపోయింది ఇందిర. ఆమె మోములో ఎంతో నిశ్చింత.