సాహిత్యాభిమానులకు ధన్యవాదాలు

  • 3601 Views
  • 37Likes
  • Like
  • Article Share

రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నాలుగు మాసపత్రికలు వెలువడుతున్న విషయం తెలిసిందే. భారతీయ భాషల్లోంచే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లోంచి కథలను తెలుగులోకి అనువదించి అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన మాసపత్రిక విపుల! ప్రతి నెలా ఒక నవలను అతి తక్కువ ధరకు అందించే లక్ష్యంతో మొదలుపెట్టిన పత్రిక చతుర. 1978 ఫిబ్రవరిలో ఆవిర్భవించిన ఈ జంట పత్రికలు తెలుగువారికి, అంతర్జాతీయ సాహిత్య వారధులుగా నిలిచాయి. ఈ నలభై మూడేళ్లలో విపులలో 8000 వేలవరకూ కథలు ప్రచురితం అయ్యాయి. ఇప్పటి వరకూ 518కి పైగా నవలలను అందించింది చతుర. వీటిలో కొన్ని సినిమాలుగానూ వచ్చి భేష్‌ అనిపించుకున్నాయి. ఈ పత్రికల మీద పరిశోధనలు చేసి ఎం.ఫిల్, పి.హెచ్‌.డి. పట్టాలందుకున్న వారూ ఉన్నారు.
       భాషకు, సాహిత్యానికి సేవ చేసేందుకు ప్రత్యేక వేదిక ఉండాలన్న ఉద్దేశంతో 2012 సెప్టెంబరులో తెలుగువెలుగు పత్రిక ప్రారంభమైంది. ఈ తొమ్మిదేళ్లలో తెలుగువెలుగు సంచికలు 103 వెలువడ్డాయి. మన భాష, సాహిత్యం, కళలు, మాండలిక సౌరభాలను ఇప్పటి తరాలకు పరిచయం చేస్తూ, భాషోద్యమానికి దన్నుగా నిలుస్తూ వేలాది వ్యాసాలు, కథనాలను ప్రచురించింది. తెలుగు పిల్లలకు మాతృభాషలో విజ్ఞానం, వినోదం, విలువలను అందించడమే లక్ష్యంగా 2013 జూన్‌లో మొదలైన బాలభారతం పత్రిక సంచికలు 94 వచ్చాయి. జాతీయ, అంతర్జాతీయ విశేషాలు, వైజ్ఞానికాంశాలు, కథలు, వింతలూ విశేషాలు... ఒకటేమిటి పిల్లల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన సమస్త సమాచారాన్నీ అందించింది బాలభారతం. 
      ఈ నాలుగు పత్రికలూ అన్ని వర్గాల వారికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో నష్టాలను ఖాతరు చేయకుండా నామమాత్రపు ధరకే అందిస్తూ వచ్చాము. అంతర్జాల విస్తృతితో పాఠకుల అభిరుచులు ఊహించనంత వేగంగా మారిపోతున్నాయి. దానికి తోడు కరోనా సృష్టించిన కల్లోలం అన్ని రంగాలతోపాటు పత్రికా రంగాన్నీ తీవ్రంగా దెబ్బతీసింది. 2020 జూన్‌ నుంచి చతుర, విపులలను, ఆగస్టు నుంచి తెలుగువెలుగు, బాలభారతంలను ఈమ్యాగజైన్స్‌ రూపంలో ఈనాడు.నెట్‌లో అందుబాటులో ఉంచాము. ఇన్నాళ్లుగా సేవాదృక్పథంతో సాగిస్తూ వచ్చిన ఈ నాలుగు పత్రికల నిర్వహణ కష్టతరంగా మారినందువల్ల వచ్చే నెల (ఏప్రిల్‌) నుంచి నిలిపివేస్తున్నాము. ఇంతకాలం ఈ పత్రికలను గుండెల్లో పెట్టుకున్న భాష, సాహిత్యాభిమానులకు శిరసానమామి. 
      మన అమ్మభాష పరిపుష్టత కోసం ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్‌లు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాయని సవినయంగా మనవి చేస్తున్నాము.

 

- మేనేజింగ్‌ ట్రస్టీ, రామోజీ ఫౌండేషన్‌

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


ముళ్ల గులాబీ

ముళ్ల గులాబీ

పులిగడ్డ విశ్వనాథరావు


కురూపి భార్య (కథాపారిజాతం)

కురూపి భార్య (కథాపారిజాతం)

కొడవటిగంటి కుటుంబరావు


కథ రాసి చూడు...

కథ రాసి చూడు...

పార్థసారథి చిరువోలు


అత్తమ్మ

అత్తమ్మ

కాటబత్తిని రాజేశ్వర్‌


వింగవాజు మామ్మ

వింగవాజు మామ్మ

మ‌న్నం సింధుమాధురిbal bharatam