ప్లాసెంటా

  • 848 Views
  • 806Likes
  • Like
  • Article Share

    పెద్దింటి అశోక్‌కుమార్‌

  • సిరిసిల్ల
  • 9441672428
పెద్దింటి అశోక్‌కుమార్‌

శ్రీధర్‌ను నేనెప్పుడూ అంత దిగులుగా చూడలేదు. కారణం అడిగితే చెప్పలేదు. 
      ‘‘విజయ వచ్చిందిగా... ఎందుకు దిగులు’’ అడిగాను. అదే మౌనం. సమాధానం లేదు.
      ‘‘సుజన అమెరికా వెళ్లిందిగా... ఇంకేం’’ అన్నా. చెప్పక తప్పదు అన్నట్టు నేను చూస్తుంటే ‘‘అందుకు కాదురా’’ అన్నాడు. ఆ మాత్రం నోరు విప్పినందుకు సంతోషంగా ‘‘మరి ఎందుకో...’’ అన్నాను.
      మనవడిని ఎత్తుకుని అప్పుడే వచ్చింది విజయ. వాడిని ఆడించమని మా చేతికిచ్చి కాఫీ తేవడానికి వెళ్లింది. పసివాడిని ఎత్తుకుంటూ ‘‘వీడి ముందు అమ్మా అని పిలవాలంటే సిగ్గుగా ఉందిరా’’ అన్నాడు.
      నాకు నవ్వొచ్చింది. ఏడాది కింద ఈ ఏరియాకు వచ్చిన కొత్తలో వాడొక మాట అన్నాడు ‘‘ఈ మురికివాడలో బట్టలు లేని జనం చాలామంది ఉన్నారు. వాళ్ల ముందు తెల్ల బట్టలేసుకుని తిరగడానికి సిగ్గుగా ఉందిరా’’ అని.
      నాకర్థం కాలేదు. ‘‘బట్టలు లేకుంటే వాళ్లు సిగ్గుపడాలి కదా’’ అన్నాను. ఇప్పుడూ అంతే. మూడు నెలల పసికందు. వాడి ముందు నీకు సిగ్గెందుకురా అన్నాను.
      సమాధానం చెప్పలేదు. మౌనంగా నావైపు చూశాడు. వాడివి కొన్ని మాటలు, చేష్టలు నాకు అర్థం కావు. నేను అర్థం చేసుకోలేను అన్నప్పుడు నా వైపు అలాగే చూస్తాడు. వాడిలో ఓ గొప్ప గుణముంది. ఏకీభవించే లక్షణాలున్నంత వరకు ప్రతి మనిషితో స్నేహం చేస్తాడు.
      మాట మారుస్తూ ‘‘అమ్మాయి ఉత్తరం పోస్ట్‌ చేసింది’’ అన్నాడు. విజయ కాఫీ ఇచ్చి పిల్లాడిని తీసుకెళ్లింది. కాఫీ తాగుతూ ‘‘ఏదైనా సమస్యా?’’ అన్నాను.
      పొడిపొడిగా ‘‘ఏమీ లేద’’న్నాడు.
      మరి బాధెందుకురా... ఏదీ ఉత్తరమివ్వు అన్నాను.
      మౌస్‌ చేతికిచ్చాడు.
      అప్పుడర్థమయింది. పోస్ట్‌కు అర్థం మారినందుకు నవ్వుకుంటూ ‘‘మెయిలా... ఫేస్‌బుక్కా...’’ అని అడిగాను.
      ‘‘ఫేస్‌బుక్‌లోనే... పర్సనల్‌ పేజీలో కూడా ఉంది’’ అన్నాడు.
      అయితే నాక్కూడా వస్తుందనుకుంటూ కాఫీ తాగి ఫేస్‌బుక్‌కు లాగిన్‌ అయ్యాను. హోమ్‌పేజీలో ఎక్కడుందో దొరకలేదు. ఒకసారి ఫోటోమీద ‘క్లిక్‌ చేసి’ టైమ్‌లైన్‌ ఓపెన్‌ చేశాను. టాగ్‌ చేసి ఉంది.
      శ్రీధర్‌ ఇంతగా బాధ పడుతున్నాడంటే ఏదో సీరియస్‌ విషయమే అనుకున్నాను. ఆతృతగా క్లిక్‌ చేశాను. ఉత్తరం పెద్దదిగానే ఉన్నట్టుంది. నెమ్మదిగా లోడ్‌ అవుతోంది.
      సెకన్ల ఆలస్యాన్ని కూడా భరించనట్టు బిఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌కో, త్రీజీకో మారరా బాబూ అంటే వినవు. నెట్‌ చూడు ఎంత నిదానంగా ఉందో అంటూనే స్క్రీన్‌ చూస్తున్నాను.
      పోస్ట్‌లోడయింది. చదవడం మొదలు పెట్టాను.

***

      ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతగా అంటే మాటల్లో చెప్పలేనంతగా.
      సాధన చేస్తే సాధ్యం కానిది లేదంటాడు మా నాన్న. సాధన చేశాను. సాధించాను. ఆ సూక్తిని అక్షరాలా నిజం చేశాను. మా కన్నయ్య ఇప్పుడు నన్ను పూర్తిగా మరిచిపోయాడు. ఎంతగా అంటే నేను వాడి ముందున్నా గుర్తుపట్టలేనంతగా.
      ఈ మార్పుకోసమే నెల రోజులు కష్టపడ్డాను. రాత్రింబగళ్లు ప్రయత్నించాను. తీరా సాధించాక నేను చేస్తున్నది తప్పన్నాడు నాన్న. నా సంఘర్షణను మీ ముందుంచుతున్నాను. నేను చేసింది తప్పో ఒప్పో మీరే చెప్పాలి.
      ముందు మా ఆయన గురించి చెప్పాలి. మంచివాడే. కానీ మంచితనం వెనక ఉండే హింస మామూలు కాదు. ఏ బరువూ ఎత్తుకోడు. పొద్దున లేవడమే ఎనిమిదింటికి లేస్తాడు. దువ్వుకునే దువ్వెన నుంచి వేసుకునే చెప్పుల దాక అన్నీ వెంట ఉండి అందించాల్సిందే. ఒక్క క్షణం కనిపించకపోయినా చిన్న పిల్లాడిలా వెదుక్కుంటూ వస్తాడు. ఎవరైనా చూస్తే ఎంత మంచి మొగుడమ్మా కొంగు పట్టుకునే తిరుగుతాడు అని ఈర్ష్యపడేలా ‘‘సుజీ... సుజా’’ అని గారాలు పోతాడు. ప్రేమపేరుతో ఎక్కడా దొరక్కుండా పనులన్నీ నానెత్తినెత్తి తామరాకు మీది నీటి బొట్టులా కాలం గడుపుతున్నాడు.
      ఆయనతో ఆ గంటసేపు పెనం మీది పేలాల్లా తైతక్కలాడి సాగనంపుతానుకదా! వెంటనే టిఫిన్‌ బాక్స్‌తో ఆఫీసుకు రెడీ అయిపోవాలి. ఏ మాత్రం ఆలస్యం జరిగినా బస్సు మిస్సు. ఆఫీసర్‌ కస్సుబుస్సు. నా చదువుకు తగిన ఉద్యోగం కాదు.
      చచ్చిబతికి మొహం వేలాడేసుకుని సాయంత్రం ఇంటికొస్తాను కదా. పొద్దున వదిలిన చెత్తను సర్దడానికే గంటలు పడుతుంది. ఆయన ఏ రాత్రో ఇంటికి వచ్చినా ‘అర్జెంట్‌’ అంటూ వెంట రెండు మూడు ఫైళ్లు.
      ఎలాగో సర్దుకుపోతున్న సమయంలో మా మధ్యకు మూడో మనిషిగా వచ్చాడు కన్నయ్య. నాకు బాధ్యతలు పెరిగాయి. ఇంటా బయటా కష్టమైపోయింది. పొద్దంతా కన్నయ్యను వదిలి ఉండటం ఇష్టంలేక ఉంటే ఉంటుంది లేదంటే ఊడుతుందని లాంగ్‌లీవ్‌ పెట్టేశా.
      అదిగో... అప్పుడే కంపెనీ నుంచి గొప్ప అవకాశం వచ్చింది. రావాలని నేను ఎప్పుడూ కలగన్నది, వస్తుందని నేనెప్పుడూ ఊహించనిది. మొదట అమెరికాలో ఏడాది శిక్షణ, ఇక్కడికి వచ్చాక జోనల్‌ ఇన్‌ఛార్జ్‌. కారు, ఇల్లు, లోను, బోనస్‌... జీవితంలో ఊహించని మలుపు.
      ఆలోచనలో పడ్డాను. వెళ్లాలా? వద్దా?
      చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా పెరిగాను. సొంతంగా నిర్ణయాలు తీసుకున్నాను. ఇప్పుడు మాత్రం ఎటూ తేల్చుకోలేక పోతున్నాను. నాలో సంఘర్షణ మొదలైంది. వెళ్లాలి అంటే కన్నయ్యను వదిలిపెట్టి వెళ్లాలి. వాడి ఆలనా పాలనా అమ్మకు వదిలి వెళ్లాలి. ఎలా...?
      మనసు రెండు రకాలుగా ఆలోచిస్తోంది. పుట్టిన నెలలోపే కేర్‌లోనో ఆయాల వద్దో అమ్మల వద్దో వదిలి ఉద్యోగాలకు వెళ్లడం లేదా అనుకున్నా, వెళ్లినా కనీసం సాయంత్రాలు, సెలవు దినాలు పాపాయితోనే ఉంటున్నారు కదా. ఇదలాకాదు. ఏడాది పాటు పూర్తిగా బంధాన్ని తెంచుకుని వెళ్లడమే కదా అనిపించింది.
      ఇక్కడ రెండు అంశాలను విశ్లేషించుకున్నాను. ఒకటి నేను కన్నయ్యను విడిచి ఉండటం. రెండు కన్నయ్య నన్ను విడిచి ఉండటం. సాధ్యాసాధ్యాలను ఆలోచించాను.
      అప్పటికి కన్నయ్యకు మూడోనెల. వయసుకు మించిన చేష్టలు. కాళ్లను చేతులతో అందుకుంటున్నాడు. నోట్లో పెట్టుకుంటున్నాడు. బోర్లా పడుతున్నాడు. ఈత కొడుతున్నాడు. మనుషుల్ని గుర్తుపట్టి బోసిగా నవ్వుతున్నాడు. నాతో అనుబంధం బాగా పెరిగింది. నన్ను విడిచి ఒక్కక్షణం కూడా ఉండలేకపోతున్నాడు.
      నేను ఎం.డి.ని కలిశాను. వారంలో వెళ్లాలన్నారు. ఎలా...? కన్నయ్య ఇప్పుడు నాకో సమస్యగా మారాడు. ఆయన్ను సలహా అడిగాను. సుజీ.. నాకంటే నువ్వే ఆచితూచి నిర్ణయం తీసుకోగలవు అని చేతులెత్తేశాడు.
      కన్నయ్య కోసం ఉద్యోగాన్ని వదులుకున్నాను. కానీ ఈ అవకాశాన్ని వదులుకోలేకపోతున్నాను. ఈ అవకాశం వస్తుందని తెలియదు కదా. అందుకే చనువు పెంచుకున్నాను. నిజానికి రెండు నెలల వరకే పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలి. కానీ నేను ఇప్పటికీ ఇస్తున్నాను. 
      వాడు చిన్న శబ్దాలకే ఉలిక్కి పడతాడు. డాక్టర్‌ను కలిస్తే తల్లి ఒడికంటే మందులేదన్నాడు. వాణ్నెప్పుడూ ఒళ్లో పొదివి పట్టుకునేదాన్ని. పాలిచ్చే భంగిమ కూడా మార్చాను. ఆడుకుంటూ పాలు తాగేవాడు. ఏ మాత్రం పొజిషన్‌ మార్చినా ఏడుపు అందుకునేవాడు.
      కన్నయ్య చాలా సున్నితం. నా ఆహారంలో ఏ మాత్రం మార్పు వచ్చినా వాడికి కోలిక్‌ పెయిన్‌ వచ్చేది. అందుకే నేను హద్దుల్లో ఉన్నాను. నాకు సీఫుడ్స్, బేకరీ పదార్థాలు ఇష్టం. వాడి కోసం నా ఆహారం మార్చుకున్నాను. ఏ మాత్రం వాతావరణం మారినా జ్వరం అందుకునేది. అందుకే ఇల్లు విడిచి ఎక్కడికీ వెళ్లలేదు.
      మామూలుగా అయితే తల్లి పాలతోపాటు సెరిలాక్‌లాంటివి ఇస్తారు. తల్లిపాలను తగ్గిస్తూ, తయారు చేసిన ఆహారాన్ని పెంచుతూ ఆరునెలల్లో పాలివ్వడం ఆపేస్తారు. కానీ నేను ఏడాది పాటు పాలుపట్టాలనుకున్నాను. డాక్టర్‌ను కలిస్తే తల్లిపాల పోషకాల జాబితా ఇస్తూ మంచి నిర్ణయమన్నాడు. సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని అలోపతి కాకుండా ఆయుర్వేద మందులు పాల సమృద్ధి కోసం తీసుకున్నాను. అవి చక్కగా పని చేశాయి.
      మిగతా పిల్లలకంటే కన్నయ్య ఆరోగ్యంగా ఎదుగుతున్నాడు. వాడి జీవగడియారం పూర్తిగా నాతోనే పెనవేసుకుంది. ఇప్పుడు అదే నా కొంప ముంచింది. వారంలో వెళ్లాలి కదా అని హడావుడిగా వాణ్ని దూరం పెట్టాలని చూశాను. వెంటనే జ్వరం అందుకుంది. ప్రత్యామ్నాయ ఆహారం జీర్ణం కాలేదు. ఫలితంగా రెండు రోజులు హాస్పిటల్ల్‌ో ఉండాల్సి వచ్చింది.
      ఎక్కువ చనువు చేశానని అమర్‌ నన్నే విసుక్కున్నాడు. రాకరాక వచ్చిన అవకాశం తప్పిపోతుందన్న భయం మొదలైంది. ఎందుకైనా మంచిదని మరోసారి ఎం.డి.ని కలిసి నా బాధను చెప్పుకున్నాను. వేరే బ్యాచ్‌కు మారుస్తూ నెలరోజుల గడువు ఇచ్చాడు. ఎందుకో వెళ్లడం కుదరదేమో అనుకున్నాను.
      సంతోషమైనా, దుఃఖమైనా నాన్నతోనే పంచుకుంటాను. ఈ విషయంలో నాన్న సలహా అడిగాను. నాన్న వద్దని చెప్పలేక మీ అమ్మ దగ్గర నువ్వు మూడేండ్లు పాలు తాగావు అన్నాడు. నాకు బాధగా అనిపించింది. ఏం చెప్పాలో తెలియక అప్పుడు పంజాబీ డ్రెస్‌లు లెవ్వు నాన్నా.. ఉంటే సాధ్యమయ్యేది కాదు అన్నాను.
      మరొక్కసారి ఫీడింగ్‌ ఫుడ్‌ మొదలు పెట్టాను. కన్నయ్య అసలు ముట్టలేదు. ఒడికి దూరంగా ఒక్క గంట కూడా ఉండలేదు. బాగా ఆలోచించి చేయాల్సిన పనులను రెండుగా విడదీసుకున్నాను. ఒకటి  వాడిని పాలకు దూరం చెయ్యడం. రెండు ఒడికి దూరం చెయ్యటం. ఈ విషయంలో అమ్మ సహకారం తీసుకున్నాను.
      ముందుగా కన్నయ్యకు పాలివ్వడం తగ్గించాను. నుగ్గుబియ్యం, పాలపొడి, కందిపప్పు, నెయ్యి, ఉడికించిన బంగాళాదుంపతో అమ్మ ప్రత్యామ్నాయ ఆహారం తయారు చేసింది. వాడు ముడితే కదా. పాలివ్వకుంటే ఆకలితో ఇది తింటాడనుకుంటే నా అంచనాలను తలకిందులు చేస్తూ ఏడుపు అందుకున్నాడు.
      పాలు మాన్పించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు ఎగబడి పాలు తాగాడే తప్ప మరేమీ పట్టించుకోలేదు. ఎప్పుడో ఒకసారి నాన్నదగ్గర పాలసీసా ప్రస్తావన వచ్చినప్పుడు ‘‘పాలసీసాను కనుక్కోవటమే ఓ కుట్ర. తల్లీ బిడ్డలను వేరు చేసి కార్మిక స్త్రీల శ్రమను దోచుకోవ డానికి పన్నిన కుట్రలో ఒకభాగం’’ అన్నాడు. కానీ ఆ పాలసీసానే నాపాలిట వరమయింది. సీసాను పక్కన పెట్టుకుని వాడిని ముద్దుగా మోసం చేశాను. అప్పుడ ప్పుడు గుర్తుపట్టి అలిగి, గుర్తుపట్టక తాగి మొత్తంమీద వారంలో అలవాటయ్యాడు.
      నా బంగారు కన్నడు ఎంత మంచివాడమ్మా! పదిరోజుల్లో వాడి ఆహారం మార్చగలిగాను. అంతేనా ఆహారపు వేళలను, జీవగడియారాన్నీ మార్చగలిగాను. ముందు కొద్దిగా అజీర్తి చేసినా సర్దుకు పోయాడు. ఇప్పుడు పాలసీసాను చూసి బెదరడం లేదు. నవ్వుతూ అందుకుంటున్నాడు. సీసాను తడమాలని చూస్తున్నాడు. కానీ ఒళ్లో పడుకోబెట్టుకుని పడితేనే పాలు తాగుతున్నాడు.
      అమ్మయ్య! సగంపని అయిపోయింది. కన్నయ్యను పాలకు దూరం చేశాను. ఇంతే ఒడుపుతో నా ఒడికి దూరం చెయ్యాలి. అదెంత అనుకున్నాను. ప్రయత్నం మొదలు పెట్టాను. మా అమ్మ ఒడికి అలవాటు చెయ్యాలని చూశాను. కుదరలేదు. కన్నయ్య ఒక్కటే ఏడుపు. నేను ఎంతగా దూరం చెయ్యాలనుకుంటున్నానో అంతగా వదలడం లేదు. క్షణం చంకదిగితే ఒట్టు. నా శరీర స్పర్శకు ఎంతగా అలవాటు పడ్డాడంటే నిద్రలో దూరం జరిగినా ఏడుపు అందుకునేవాడు. ఓ వైపు నేను వెళ్లే తేదీ దగ్గరపడుతోంది. వీడు నన్ను విడవడం లేదు. ఆందోళన పెరుగుతోంది. ఏం జరుగుతుందో చూద్దామని వాణ్ని నిద్రపుచ్చి బయటకు వెళ్లాను. వచ్చే వరకూ ఒక్కటే ఏడుపు. జ్వరం అందుకుంది. ఫిట్స్‌ వచ్చాయి. రెండ్రోజులు ఆసుపత్రిలోనే ఉన్నాను.
      ఇంకా పదిరోజులే మిగిలింది. కన్నయ్యలో మార్పులేదు. మరింత మారాం చేస్తున్నాడు. నేను కోపగించుకున్నాను. ఈసడించుకున్నాను. విసుక్కున్నాను. అరిచాను. నా భాష వాడికి అర్థమైతే కదా! బోసిగా నవ్వాడు. నా కోసం వెతికాడు. ఎత్తుకొమ్మని చేతులు అందించాడు.
      నేను అమెరికా వెళ్లడం అసాధ్యమని తేలిపోయింది. బుజ్జగించి, ప్రయత్నించి, ఎత్తుకొని విసుగొచ్చిన మా అమ్మ ‘‘ఏం పిల్లాడమ్మా.. నీ కొడుకు. ఎంతో మంది పిల్లల్ని చూశాను. ఎత్తుకొని లాలిస్తే తల్లిని మరిచిపోతారు. నీ కొడుకు నిన్ను విడిచి క్షణం ఉండటం లేదు’’ అంటూ చేతులెత్తేసింది.
      నా ఒడికి దూరం చేయడం ఎంతమాత్రమూ సాధ్యం కాదనుకున్నాను. వాడే సర్దుకుంటాడులే అనుకుని ఒక దశలో వెళ్లిపోవాలనుకున్నాను. జరగరానిది ఏదైనా జరగొచ్చునని భయమైంది. అయినా నా ప్రయత్నం మానలేదు. వాడూ అంతే! కొత్తగా ‘మామ్మ్‌మ్మా...’ అని పిలవడం నేర్చుకున్నాడు. వాణ్నీ నన్నూ ఇంతగా ముడేసింది స్పర్శనే కదా. అక్కడి నుంచేే మొదలుపెడదాం అనుకున్నాను. ఆ స్పర్శను దూరంచేసే ప్రయత్నం మొదలుపెట్టాను. తడిబట్టలు కట్టుకుని ఎత్తుకోవడం మొదలుపెట్టాను.
      వాడి సంగతి నాకు తెలుసు. పక్క తడిపాక మార్చకపోతే ఒక్కక్షణం ఉండేవాడు కాదు. అటూ ఇటూ దొర్లుతూ ఏడ్చేవాడు. ఇప్పుడు అదే ఉపాయం ఫలించింది. తడికి తట్టుకోలేక దిగాలని ప్రయత్నించేవాడు. దిగాక ఎత్తుకోమని ఏడ్చేవాడు. దిగలేక దిగి ఉండలేక సతమతమయ్యేవాడు. పరిసరాలను మార్చడమో కుదరకుంటే తనే మారడమో మనిషి అనువంశికతలోనే ఉంది కదా! ఒకసారి నాన్నతో జెండర్‌ చర్చ వచ్చింది. అప్పుడు నాన్న ఇలా చెప్పాడు. 
      ‘‘జెండర్‌ కంటే మన దేశంలో అతి ప్రమాదకరమైనది కులం సమస్య. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మెదడు నిర్మాణం జరుగుతుంది. అప్పుడే తల్లి ఆలోచనల్లోంచి శిశువు మెదడు పురుడు పోసుకుంటుంది. అప్పుడే ఈ జెండర్‌గాని, కులంగాని మెదడులో నిండిపోతుంది’’ అని. అది తప్పని అప్పుడు కొట్టిపారేసినా ఇప్పుడనిపిస్తుంది. వీడు నా తెలివితేటలన్నీ మెదడు నిండా నింపుకున్నాడా అని. కాకుంటే స్పర్శతోనో టెంపరేచర్‌తోనో వ్యక్తులను గుర్తుపట్టడమేమిటని.
      వాడు ఏడ్చి మొత్తుకున్నా నాకు జలుబు పట్టుకున్నా మడిబట్టను మార్చలేదు. ఒకరోజు ఏడ్చాడు. రెండో రోజు దూరం దూరం ఉన్నాడు. మూడోరోజు అమ్మ ఒడికి, నా ఒడికి భేదాన్ని గుర్తించాడు. నాలుగోరోజు మా అమ్మ ఒడినే బాగుందనుకున్నాడు. వీడి చిన్న మెదడులో ఇన్ని ఆలోచనలా అనిపించింది. వెర్రికన్నడు. మా అమ్మనే అమ్మనుకున్నాడు. అమ్మను విడవడం లేదు. సో హ్యాపీ.. అనుకున్న సమయానికి అనుకున్న పనులు అన్నీ జరిగిపోయాయి.
      నేను అమెరికా వచ్చాను. ఇక్కడ నేను.. ఇంట్లో అమర్, అమ్మ ఒడిలో కన్నయ్య.. అందరూ సేఫ్‌.
      నాన్నకు నాకూ ఎప్పుడూ పేచీనే కదా! నేను కష్టపడేది పిల్లల కోసమే కదా అంటే వినడు. అవకాశాలు అరుదుగా వస్తాయి. మన కెరీర్‌ను మలుపు తిప్పేవి మరీ అరుదు కదా!
      ఇప్పుడు చెప్పండి. నా నిర్ణయం తప్పా?

***

      చదవడం ముగించాను.
      శ్రీధర్‌ నావైపే చూస్తున్నాడు. పిల్లాడు ఏడుస్తున్నట్టున్నాడు. విజయ బుజ్జగిస్తోంది.
      ఇందులో నువ్వు బాధపడాల్సిన విషయం ఏముందిరా..? అడగబోతూ ఆగిపోయాను. కారణం వాడి… కళ్లల్లో నీళ్లు.
      ఒరేయ్‌.. నువ్వు ఏడుస్తున్నావా..? పసివాడికేమయిందిరా.. బాగానే ఉన్నాడు కదా! విజయ తల్లికంటే ఎక్కువ చూసుకుంటోంది కదా... అన్నాను.
      ‘‘ఒక్క నా మనవడి కోసమే కాదురా.. ఏడుపు. అయినా ఇంతకంటే ఎక్కువ ఏం చేయగలను’’ అన్నాడు బాధగా.
      వాడు ఏడుస్తున్నాడన్న జాలి తప్ప నాకెలాంటి బాధా కలగలేదు. ఎప్పుడో వాడన్న మాటలు నాకిప్పుడు గుర్తుకొచ్చాయి. మొన్న చదువుల పేరుతో హాస్టల్లో వేసి ఎదిగే పిల్లలను, నిన్న ఉద్యోగాల పేరుతో అమ్మమ్మలకు అప్పగించి పసికూనలను దూరంచేసుకున్నాం. నేడు సరోగసీ పేరుతో గర్భస్థ శిశువుల్ని కూడా దూరం చేసుకుంటున్నాం. తల్లీబిడ్డల ఎడబాటు ఏ స్థాయికి చేరిందో చూశావురా అని.
      ఇంకా ఏవో కుట్రలూ కుతంత్రాలు పెట్టుబడిదారులు అంటూ తల్లీబిడ్డల మధ్య ఎవరో దూరారని చెప్పాడు కానీ, అర్థం కాలేదు. ఫ్రాయిడ్‌ థియరీ అంటూ చెప్పిన మరో రెండు మాటలు మాత్రం గుర్తున్నాయి. అవి, తల్లిగర్భం నుంచి మొదలు రెండేళ్ల వరకు పసిమెదడు నిర్విరామంగా సమాచారాన్ని నింపుకుంటుందని, అదే పెద్దయ్యాక మన వ్యక్తిత్వం, సృజనాత్మకత, మూర్తిమత్వాల్ని నిర్మిస్తుందని.
      వాడి బాధ చూడలేక బాధపడ్డట్టు నటించి వెళ్లిపోదామని లేచాను.
      వాడూ నావెంట నడుస్తూ ‘‘మనం బాగానే ఉన్నాడనుకుంటాం కానీ పసివాడు కూడా తల్లికోసం ఆందోళన పడి ఉంటాడురా. పెద్దయ్యాక దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు. సుజన వాడి భవిష్యత్‌ కోసం డబ్బే అవసరమనుకుంటోంది. తల్లి ఒళ్లోని భద్రతను గుర్తించడం లేదు’’ అన్నాడు.
      నీలా అందరు దోమల్ని భూతద్దంలో చూసి దయ్యాలని భయపడరు కదా అనుకున్నాను. పైకి మాత్రం విచారంగా అందరూ మనమ్మాయిలా ఉండరు కదా! తప్పును గుర్తిస్తారు అన్నాను.
      అంతే! వాడు నన్ను లాక్కెళ్తున్నట్టుగా కంప్యూటర్‌ వద్దకు తీసుకెళ్లి ఫేస్‌బుక్‌ తెరుస్తూ... నా బాధ అదేరా... ఒక్కరు.. ఒక్కరైనా సుజనను వ్యతిరేకించినా తృప్తిపడేవాణ్ని. ఎన్ని లైక్‌లు, ఎన్ని అభినందనలున్నాయో చూడు అన్నాడు.
      లైక్‌ చేసిన వారి సంఖ్య చూస్తే తల తిరిగిపోయింది. విషయాన్ని పంచుకున్న వారు వందల్లో ఉన్నారు. కామెంట్లు చదువుతుంటే శ్రీధర్‌ చెప్పింది నిజమే అనిపించింది.
      ‘‘ఇదిరా.. ఈనాటితరం. తల్లి గర్భంలోని మాయ శిశువుకు బాహ్య రూపాన్నిస్తే బయటికి వచ్చాక తల్లి ఒడి అంతర నిర్మాణాన్నిస్తుంది. ఇది గుర్తించకుండా పెరిగేతరం రేపు ఏ విలువలను పాటిస్తుంది.. సుజన ఇప్పుడు అందరికీ రోల్‌ మోడల్‌.. వీళ్లు పునాదుల్లోనే సమాధులు కడుతున్నారు’’ అన్నాడు.
      శ్రీధర్‌ ఆవేదన అర్థమయ్యాక నాకూ బాధగా అనిపించింది. బయటకు వస్తుంటే బాబు ఏడుపు వినిపించింది. విజయ విసుక్కుంటోంది. పాపం.. ఏం చేస్తుంది.
       కన్నపేగు ఆమెదీ కాదు.
      కొత్తగా ‘మామ్మ్‌మ్మా...’ అని పిలవడం నేర్చుకున్నాడు. వాణ్నీ నన్నూ ఇంతగా ముడేసింది స్పర్శనే కదా. అక్కడి నుంచేే మొదలు పెడదాం అనుకున్నాను. ఆ స్పర్శను దూరం చేసే ప్రయత్నం మొదలు పెట్టాను.
      మొన్న చదువుల పేరుతో హాస్టల్లో వేసి ఎదిగే పిల్లలను, నిన్న ఉద్యోగాల పేరుతో అమ్మమ్మలకు అప్పగించి పసికూనలను దూరం చేసుకున్నాం. నేడు సరోగసీ పేరుతో గర్భస్థ శిశువుల్ని కూడా దూరం చేసుకుంటున్నాం.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


ముళ్ల గులాబీ

ముళ్ల గులాబీ

పులిగడ్డ విశ్వనాథరావు


కురూపి భార్య (కథాపారిజాతం)

కురూపి భార్య (కథాపారిజాతం)

కొడవటిగంటి కుటుంబరావు


కథ రాసి చూడు...

కథ రాసి చూడు...

పార్థసారథి చిరువోలు


అత్తమ్మ

అత్తమ్మ

కాటబత్తిని రాజేశ్వర్‌


వింగవాజు మామ్మ

వింగవాజు మామ్మ

మ‌న్నం సింధుమాధురిbal bharatam