తిక్క సత్తెక్క

  • 636 Views
  • 4Likes
  • Like
  • Article Share

    సడ్లపల్లె చిదంబరరెడ్డి

  • హిందూపురం, అనంతపురం జిల్లా.
  • 9440073636
సడ్లపల్లె చిదంబరరెడ్డి

‘‘అవ్వోయ్‌...! మీ పిల్లోన్ని ఇసుకూలుకు పంపమని మా అయ్యవారు సెప్పించారు. పంపియ్యి’’
      ‘‘ఒరే ఎవుర్రా మా పిల్లోన్ని ఇసుకూలికి పిల్సుకుపొయ్యేదానికి వొచ్చింది? మీకు ఇంకేమీ కాపురాలు లేవారా?
      మీ అయ్య వారుకు ఇంట్లో ఏమీ పంగలేక ఇసుకూలు కొస్తాడు, సదువుకొండమ్మా! సదువుకొండప్పా అని బలంతం సేసి అందరికీ సదువులు సెప్పి ఈ ఊరినెత్తిన రాళ్లేశ!
      మా కాలంలో సదువులు శాస్త్రాలు ఏమీ ఉండ్లేదు. మేము ఏమీ సేటు లేక బతుకుతావుంటిమి. కులమంటే ఏమో, గోత్రమంటే ఏమో తెలీక ఊరంత ఒకే కుటుంబం మాదిరి బతుకుతావుంటిమి. రాత్రీపగలు నెత్తీబెత్తలు కొట్టుకోని సేద్యాల్జేస్తావుంటిమి. ఎండింది ఎండిపోతే పండిందాన్ని తలా ఇంత పంచుకోని ‘యక్కడ పుట్టేవుపొద్దా!’ అని బతుకుతావుంటిమి.
      ఇదిగో ఈ ఊర్లో ఇసుకోలు పెట్రి సూడప్పా పావగొండలో ఉండే శనిమహాత్ముడు మా ఊరికి దాపురించినట్లాయ.
      కుంటెంగటరెడ్డికి వొచ్చిందే తిప్పలు జూడ - ఆయప్పకి ఉండేది ఒగ కొడుకు. ఏడిదో సంపాదన సేసి నెత్తికెత్తుతాడని వాన్ని బాగా సదివిచ్చిరి.
      వాడేమో ‘దిమ్మిరంగ దీపాల పండగ’ అని అయద్రాబాద్‌లో కొలువుకు సేరిపాయ. వాని తండ్రి అవిటోడు, వాని తల్లికి రెండు కండ్లూ కనపడవు. ముసలి ముప్పులో ఈళ్ల మంచీ సెడ్డలు సూడల్ల అనిగాని, కడుపుకు ఇంత కూడేయల్ల అనిగాని అనుకోడు. అదెవుతో జతలో పనిజేసే దాన్ని పెండ్లిజేసుకోని, ముసలోళ్లని అనాదల్ని సేసిండాడు. ఇపుడు వాళ్లు పెద్దరెడ్డోళ్ల పంచలో జేరి, వాళ్లేసే కాసంత కూడుతిని ‘‘భూమీ నోరు తెరు’’ అని బతుకుతావుండారు.
      ఇంక పెద్దింటి సుబ్బరాయప్పకి ఒచ్చిందే ఇడుములు జూస్తే... రామ రామ... అవి పగోనిగ్గూడ వొద్దనిపిస్తాయి.
      ఆయప్ప ఇద్దరు కొడుకుల్నీ మన్నుమోసేకి పంపిచ్చినా నాలుగు కూలి కాసులు తెస్తావుండ్రి. కడుపులోని సల్ల కదలకుండ బతుకుతావుండ్రి.
      వాళ్లు శానా శానా సదవల్లని మనూరు ఇసుకోలు సాల్దని, అనంతపురము ఆట్టల్లో సెర్పించె. ఆడ పెద్ద సిన్న అనే భయంలేకుండ, ఉద్దర కూడు తిని ఇద్దరూ బాగా ఇగరబట్టిరి. ఉద్యోగాలు మెడకేసుకొస్తామని బెంగళూరు తింగళూరు తిరిగిందీ తిరిగిందే. ఈ తిరుగులాట్లో ఉద్యోగంకత ఆ భగమంతునికే తెలియల్లగాని - ఈళ్లు మాత్రం తాగేది, మిలిట్రీవోటల్లో తినేది, ఇస్పేటాకులాట ఆడేది నేర్పిండారు. నెలకొగసారి ఒచ్చి ‘మాకు దుడ్లు కావల్ల ఇస్తావోసస్తావో’ అని కుత్తిక మీద కూకొంటారు.
      ‘‘ఈ మేఘాలు సూస్తే ఇట్ల బిగిచ్చుకోనుండాయి. మూటడు గింజలు ఇత్తితే శాటడుగూడా పండకుండ అయిపాయ. ఈ దరిద్రం భూమి ఏమిటికి? దండగ! అమ్మి పారేసి మా భాగాలు మాకు పంచేయ్‌’’ అని ఆయప్పని కిందకి నూకి యదమీద తొక్కేదొగుడు, ఈదిలో కడిసి మానం తీసేది ఇంగొగుడు.
      ఎవ్వరి కతలో యాల??!!
      మా వోడు మద్దిలేటిగాడు సిన్నపుడుయంత మంచిగ జింకపిల్ల మాదిరివుండె. ఒగ పక్క సదువుకొంటూనే ఇంగొగుపక్క కూలీనాలీ సేస్తావుండె. ఎవరన్నా బాంకులోళ్లు, తాసిల్దారోళ్లు లోన్లు ఇచ్చేదానికి వొచ్చి నీళ్లు నమిలి అంతగావల్ల ఇంతగావల్ల అని లంచాలడిగితే ‘‘ఒరే నరికేస్తాను. మీ శవాల్ని పోలీస్‌ స్టేషన్‌కు పార్శిల్‌సేస్తాను. నెలనెలా ఒచ్చే జీతాలు సాలక మా పియ్యకావల్నా’’ అని సిపాయి మాదిరి ఎదురు తిరుగుతావుండే. వాని ఇగితికి మేము మూతుల మింద సేతులుంచుకోని అబ్బురుపోతా వుంటిమి.
      పిల్లోడు బంగారట్లా బిడ్డ. బీదాసాదల బతుకు తెలిసినోడు. ఈడు గనక సదివి కొలువుకు సేరితే మాయట్లా జనాలని పైకితెస్తాడని అనుకొంటిమి. కడుపుగట్టి, కాలుగట్టి సదివిస్తిమి.
      వాని ఆకుజినగ, వాన్నోట్లో దుమ్ము బడ... కలెట్రాఫీసులో పనొస్తూనేవాడు కన్నతల్లినిగూడ మర్సిపాయ. రాన్రాను రాజుగుర్రం గాడిదయిపాయ అన్నట్లు తయారయిపాయ. పల్లెటూరి జనాన్ని పీక్కుతినే మిండగాడయిపాయ. ఈని బతుకునెత్తిన రాళ్లెత్త. ఈని నోటి కబళం నేల బడ. ఈన్ని నల్లనాగుబాము పటుక్కున పీక!! కుక్కలుగూడ కుక్కల్ను పీక్కొని తినవు. బందు బళగం అనకుండ అందర్నీ నల్లి మాదిరి రగతం పీలుస్తా వుండాడు. మాడాలు, మిద్దెలు, కార్లు, బంగారు, భూములుయన్ని కొన్నా ఈని ఆశకి అంతేలేకుండా వుంది.
      ఇట్ల సెప్పుతూ పోతే ఈ ఊర్లో సదింవిండే జనాల్లోసాచాగా మిగిలే నాగడ్డెవడు? ఈళ్ల నోట్లో నా సాడు బొయ్య!! నాలుగచ్చరాలు నేరుస్తూనే, ఈ ఊర్లో ఉండల్లంటే ఈళ్లకు ఉచ్చులు నిలీవు. అయిద్రాబాదు, అమెరికా, బొంబాయి... ఇట్లా పెద్ద పెద్ద కొంపలమీదే ఈళ్ల కండ్లన్నీ!!
      ఆడ బొయ్యి గీళ్లు పేపర్లో, నోట్లో, సదివిన అచ్చరాలో తిని బతుకుతారా? అంటే -అదీలేదు!!
      ఈ పల్లిలో వుండే ఎర్రిజనాలు రేతిరి, పగలు, యంతవాన అనకుండ, పసరాల మాదిరి కష్టంసేసి పంటలు పండిస్తే అన్నీ కొల్లగొట్టుకుపోతారు. కన్నగసాట్లుపడి పండిచ్చిన బియ్యం కేజీ ఒగ రూపాయంట! పిడసంత ఉండే ఇడ్లీ అయిదు రూపాయలంట!! ఏమి గిలీటు కాలము? ఏమి మాయదారి రాజ్యమప్పా ఇది? ఇంగ వానలు కురీమంటే యాడ కురుస్తాయి??
      ఈ ఓట్లు అడిగే దానికొస్తారే ఆయప్పగారన్నా రైతులకు న్యాయం సేస్తారని అనుకొంటే - వాళ్లింకా దుర్మార్గము జాతినా కొడుకులు. మాదింతలావు ఇంతపొడవు అని అరసేతిలో వైకుంఠం సూపిచ్చే వోళ్ల మాదిరి నాటకాలాడతారు. ఓట్లుపడి గెల్సినంక నల్లజీవాల కంటె అద్వాన్నంగా తిప్పలమీదదిగూడ మిగల్నీరు. బకాసురుని జాతినా మనమలు, ఈళ్ల కడుపుల్దొక్క! ఈళ్లని గోరీలు కట్ట!!
      ఎవర్ననుకోని ఏమి లాభము? ఈ రాజ్యంలో చక్కందిప్పేదంతా సదివిన జాతోళ్లే! వాళ్లకి యట్ల గావల్లొ అట్ల సట్టాలు రాసుకొంటారు.
      అయినా ఈ పంటలు పండిచ్చే జనాలకి రవ్వంతన్నా ఇంగితమొద్దా? ‘సదివినోనికంటె సాకలోడుమేలు’ అని మన పెద్దోళ్లు యాపొద్దోసెంప్పిండారు. అంటే మురికి సేరి నల్లగ మాసిన బట్టల్ని సాకలోడు వొళ్లొంచి తెల్లగ ఉదికి జీవనం సాగిస్తాడు. సదివినోడైతే అందరికీ టోపీ మాటలు సెప్పి నడుములొంచకుండ, సేతికి మన్ను అంటకుండ నీడలో కూకోని దండగకూడు తింటాడని అర్తము.
      అందుకే ఈ సేద్యగాళ్లంతా ఒగ యాడాది కాలము పండించిన తిండిగింజలు ఎవ్వరికీ అమ్మకుండ బంద్‌ సేసేయల్ల. అపుడు ఈ సదివిండే ఆయప్పగార్లు, పరిపాలన సేసే ఆయప్పగారు యట్ల బతుకుతారో తెలుస్తుంది!
      నీడలో కూకోని నాలుగు మాటలు నెట్టగ సెప్పేవోడు కాదు, మన్నులో పులుగుల మాదిరి పర్లాడి, యముకులు అరిగించి, కంతలు కరిగించి భూమి తల్లి సేవసేసి పిడికిడు బువ్వ పెట్టేవోడే నిజమైన మనిషని తెలిసొస్తుంది.
      ఏమిరా? ఇంకా అట్ల నిలబడిండావు రెడ్డోళ్ల ఎనుంపోతు మాదిరి? ఇదిగో ఈ పొద్దుకు సరిపోయింది. ఇంకయా పొద్దన్నా మా ఇంటికొచ్చి సదువుకొనేక మా పిల్లోన్ని పిలిస్తివో... ఇదిగో ఈ పాత పరక్కట్ట ఇరిగేటట్ల కొట్టకుండా వుంటే నా పేరు సత్యక్కేకాదు...’’
      ’’పో! పో!! తిక్కల సత్యెక్క! పిల్లోన్ని ఇసుకూలికి పిలిసేకొచ్చి నీతో తిట్లు తినేదాని కంటె - మా అయ్యవారి తాన నాలుగు ఏట్లు తినేదే బాగుంటుంది.’’

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


ముళ్ల గులాబీ

ముళ్ల గులాబీ

పులిగడ్డ విశ్వనాథరావు


కురూపి భార్య (కథాపారిజాతం)

కురూపి భార్య (కథాపారిజాతం)

కొడవటిగంటి కుటుంబరావు


కథ రాసి చూడు...

కథ రాసి చూడు...

పార్థసారథి చిరువోలు


అత్తమ్మ

అత్తమ్మ

కాటబత్తిని రాజేశ్వర్‌


వింగవాజు మామ్మ

వింగవాజు మామ్మ

మ‌న్నం సింధుమాధురిbal bharatam