కాగితం ముక్కలు గాజు పెంకులు (కథాపారిజాతం)

  • 735 Views
  • 4Likes
  • Like
  • Article Share

వెనక తగిల్చిన పాత రైలు పెట్టెలను లాక్కొచ్చి వాళ్ల ముందు గిరవాటెట్టింది కొత్త రైలింజన్‌. బ్రతుకంతా భ్రమ అనుకొని మడి గట్టుకొని మూలకూర్చుని పెదవి చప్పరించే వారికి యీ రైలింజన్‌ ఒక సవాల్‌. భీకరమైన కూత - ఎప్పుడో భూమిని దొల్చుకొని, గోళం మధ్యలో కాలం బంధించిన ప్రళయాన్ని కదిపి, ఆ ధ్వనుల్ని తనలో జీర్ణించుకుని గతంలోంచి ప్రాణాన్ని తెచ్చుకున్న వొక చారిత్రక కళేబరం ఆ ఇంజన్‌. దాన్ని చూస్తే రైలు నడిపే వారికీ, ప్రయాణీకులకీ కూడా భయమే. కావాలనుకున్న రైలు ఆలస్యంగా రావడానికి వీలు చిక్కనీదు ఆ ఇంజన్‌. అసలు నాలుగైదు నిముషాలు ముందే వెళ్ళి కూర్చుంటుందిట. రైల్వేవారి కదొక సమస్య. ప్రయాణీకులు ఎల్లానో అల్లా దానిలో వెళ్ళి పడాలి. తీరుబడిగా, తాపీగా, నిశ్చింతగా, ప్రవర్తించగూడదు. అది రావడం, వెళ్ళడం కూడా ఒక స్వప్నంలాంటిదే. అది కదలడం, వేగంగా కదలడం రెండూ ఒకటే. మెల్లిమెల్లిగా వేగాన్ని పెంచుకోడం అంటూ లేదు.
      ‘‘ఈ కొత్తింజన్‌కి తలకాయ లేదు కాదూ - నాలా’’ అన్నాడు నరసింహం పెట్టెలో సామాను పడేసి. చంద్రానికి నవ్వొచ్చింది. అవును, నరసింహానిది పెద్దతల - పెద్దమెడ; మెడ, మొహం కలిసిపోయినట్లు వొక స్తంభంలాగుంటై, తల పెద్దదిగా వుంటే, మెడ సన్నదిగా కనపడుతుందని, చదువుకొనే రోజుల్లో జుట్టు పెంచేవాడు - పెద్ద ఉంగరాల జుట్టు. విచ్చలవిడిగా పెరిగి నుదుటి మీద, కళ్లల్లోనూ పడుతూ, వెనక్కి తోసినప్పుడల్లా చేతులకు పని చెబుతూ, మనిషి భీకరంగా ఉండేవాడు. అందరూ ‘సింహం’ అని పిలిచేవారు. మరిప్పుడో - ఆ జుట్టు లేదు. ఆర్మీలో ఉద్యోగం. అదంతా కత్తిరించేసి, పొట్టిక్రాప్‌. మెడ వెనుకపై భాగం చర్మం ఆకుపచ్చ పాచిలా కనిపిస్తూనే వుంటుంది.
      ‘‘తల పెద్దదైతే, భుజబలం వుండదంటారుగా పెద్దలు. ఇంజన్‌కి అదుంది. ఈ రోజుల్లో కావాల్సిందే అదిగా’’ అన్నాడు చంద్రం. కులాసా కబుర్లకు వ్యవధినివ్వకుండా, వొక పెద్ద కూత పెట్టింది. అది కూత కాదు. కంఠంలోంచి ధ్వనులు రావడం కాదు. మొత్తం శరీరం అంతా కంఠమై, అల్లాగయ్యే యత్నంలో ఆ కంఠం పగిలినప్పుడొచ్చిన ధ్వని. ప్లాటుఫారంపైన జనం అదిరిపడ్డారు. 
      ‘‘చూస్కో - నే వున్నానని తెలిసికాబోలు ఇంజన్‌గారు విర్రవీగిపోతున్నారు’’ అన్నాడు సింహం.
      ‘‘రైలు కదులుతోంది’’ అన్నాడు చంద్రం.
      ‘‘రైలు కదలడం లేదు - ధాటికి అదిరిపోయే భూమే వెనక్కి పారిపోతోంది. చాలా థ్యాంక్స్‌. ఈ నాలుగు రోజులు హాయిగా గడిచాయి. అరుణకి మరీమరీ థ్యాంక్స్‌ చెప్పు. ఇదిగో - ఈ హంటర్‌ అంటే మోజుపడ్డావు. దగ్గరుంచుకో - జ్ఞాపకార్థం’’ అంటూ చేతిలోని హంటర్‌ చంద్రానికిచ్చాడు. అతను తటపటాయిస్తున్నాడు. ఇంజన్‌ మరొక్కసారి కేకేసింది - మిగిలిపోయిన ఆ కాస్త శక్తినీ యిప్పుడు పూరించుకొని, జండా పట్టుకున్న గార్డు కూడా అదిరిపడ్డాడు. ఒక్క గంతేసి రైల్లో పడ్డాడు గార్డు.
      ‘‘చూశావా - వద్దంటానికి వీల్లేదు. ఇంజన్‌ కూడా నోరు కట్టేసుకోమంటోంది.’’
      అప్పుడే చాలా దూరం వెళ్లిపోయింది పెట్టె ‘సింహం’ పెద్ద తలకాయ చిన్నదవుతోంది. చుక్కలాగై అంతర్ధానమైంది. హంటర్‌ని చేతిలో తిప్పుకుంటూ చంద్రం ఇంటికి బయలుదేరాడు. ఆర్మీలో పెద్ద ఉద్యోగస్థుడు వాడే హంటర్‌ అది. మూడడుగుల పొడవు, రెండంగుళాల వెడల్పుగల దండం చుట్టూ చాక్‌లెట్‌ రంగుతోలు చాపలా అల్లి వుంటుంది. ముందు ఒక అడుగు పొడుగు రెండు తోలు పటకాలు లాగ వేళ్ళాడుతూ వుంటాయి. అది తనకేమీ ప్రయోజనం లేదు. స్నేహితుడు జ్ఞాపకార్థం ఇచ్చింది. కాదనలేకపోయాడు. చదువుకొనే రోజుల్లో మోటుగా కరుకుగా వుండేవాడు సింహం. పోకిరీ అని చెప్పుకోవడం కూడా తనకి జ్ఞాపకం. ఆర్మీలో యీ ఉద్యోగం అతనికి సరి అయినదే, ఆర్మీలో వున్నాడంటే కరకుగా మోటుగా వుండి వుండాలి అనుకున్నాడు. చాలా మందిలాగే తనూ. కాని సింహం అల్లాగలేడు. నవ్వించడం కోసం కొంత చౌకబారు సంభాషణ సాగించినా - అరుణ ముందు మరీనూ - మొత్తంమీద నమ్రతగా సంస్కారంతో వొచ్చిన ఒక నాజూకుతో వ్యవహరించాడు. ఆర్మీలోవున్న వారికి ఎక్కువ వినోదాన్ని కల్పించి మామూలు సమాజంలో సాధ్యం కాని స్వేచ్ఛతో ప్రవర్తించే అవకాశాలు కల్పిస్తారుట. కదిపితే ఆ విషయాలన్నీ అతను చెప్పునేమో, ఏకాంతంగా అవన్నీ చెప్పుకునే అవకాశం దొరకలేదు. వారిద్దరి మధ్య ఏదో ఒక తెరలాంటిది వుంది. డబ్బు వల్లనో, హోదా వల్లనో, సంస్కారం వల్లనో మసలే సమాజం వల్లనో దేనివల్లనైతేనేం, వారిద్దరూ అనుకున్నంత అన్యోన్యంగా దగ్గరగా వుండలేకపోయారు. బహుశా ‘అరుణ’ సమక్షంలో వారిద్దరూ ఎక్కువగా గడపడం వల్లనేమో. చంద్రానికి నవ్వొచ్చింది. ఉన్న నాలుగు రోజులు ఆమె ఎదురుగా వున్నా లేకపోయినా కూడా అరుణని అరుణగారూ అంటూనే వ్యవహరించాడు సింహం. రైలు కదిలేటప్పుడు మాత్రం ఆ ‘గారూ’ వదిలేసి ‘అరుణ’ అనే వ్యవహరించాడు. అంటే యీ నాలుగు రోజుల్లోనూ వారి మధ్య పెంపొందిన అనురాగానికీ, అన్యోన్యానికీ అదొక చిహ్నం. ఒకర్నొకరు ‘‘గారు’’ అని సంబోధించే అవసరం వున్నంత వరకూ వారికి నిజమయిన స్నేహితులుగా పరిగణించడం సాధ్యం కాదేమో!
      ఇంటికి చేరుకున్నాడు. మెట్లెక్కి తలుపు కొట్టాడు - నౌకరు తలుపు తీసి హాల్లో కుర్చీలు బల్లలూ సర్దుతున్నాడు. గోడ గడియారం అప్పుడే పది కొట్టింది. పోస్టుకు వెళ్లి టపా తెస్తానని నౌకరు బయటికి వెళ్ళాడు. హంటర్‌ హాల్లో మధ్య బల్ల మీద పడేసి, పత్రిక కోసం వెతుకుతూ పక్క గదిలోకి వెళ్ళబోయే ముందు భార్యని పిలిచాడు. సమాధానం లేదు. మళ్లా వెనక్కొచ్చి, ఏమీ తోచక బల్ల మీద హంటర్‌ చేతులో పట్టుకొని, గది దగ్గరకెళ్ళి తలుపు కొట్టాడు. ఒక్క క్షణం ఆగి, తలుపు తోశాడు. సరిగ్గా పడని గడియ కాబోలు, చప్పుడు చేస్తూ కిందికి జారింది. తలుపు తోసుకొని లోపలికెళ్లాడు. ఎదురుగా అద్దం బల్ల ముందు మడత మంచం మీద కూర్చుని ఏదో కాగితంకేసి చూస్తూ వుంది అరుణ. భర్త రాగానే కంగారు పడినట్లు వులిక్కిపడి తను చూస్తూవున్న కాగితాన్ని గుప్పెట్లో దాచేసి అతనికేసి చూడకుండా ‘‘అబ్బ, అబ్బ. కాసేపు అవతలుండండి’’ అంది. ఇదివరకెన్నడూ చూడని అరుణని చూశాడు చంద్రం. తలంటు పోసుకున్న జుట్టు తడిని తువ్వాలులో బిగించి ఆర్పుకొంటూ పచ్చటి తెల్లచీర పూర్తిగా కట్టుకోకుండా వొంటికి సగం సగం చుట్టబెట్టుకొని జాకెట్టు లేని భుజంపైన జారిన తడికొంగు మడతగా మంచం క్రిందికి జారిన కొంగు చటుక్కుని కనబడిక తువ్వాలును లాగి మెడ చుట్టూ కప్పుకొన్న అరుణ - అదొక వింత దృశ్యం. అరుణ పల్చటి మనిషి. బహు లేత శరీరం. స్ఫుటంగా ఆకృతి పొందని అవయవాలు. గుండ్రతనం, నిండుతనం లేవు. అన్నీ కోణాలు, బలహీనమైన ఎముకలూ, నరాలు. బ్యాటరీలైటు ఆమె శరీరంపైన ఫోకస్‌ చేస్తే యిటు నుంచి అటు ప్రసరిస్తుంది కాంతి. బలంగా, లావుగా కనబడేందుకు ఆమె చేసే యత్నాలు చంద్రానికి తెలుసు. మందంగా వుండే బట్టతో అనేక మడతలుగా తీర్చిన లంగా. దానిమీద ఎనిమిది గజాల చీరె. బయటికెళ్ళినప్పుడు వెల్వట్‌ జాకెట్టు, సన్నటి, పల్చటి నాజూకైన మొహం. ప్రశాంతమైన కళ్లు, శాశ్వతమైన మందహాసాన్ని సూచించే నోరు, జాలిగా మెరిసే క్రమమైన చిన్న పళ్ళ వరస, ఒంపునకు ఆస్కారం లేని చిన్న చెక్కిళ్ళు. ఆ మొహం మరీ అంత చిన్నదిగా కనబడ్డానికి కారణం ఆమె జుట్టు, దట్టంగా వొంపులు తిరిగిపోయిన మొహం, మెడ, భుజాలు ఆవరించే మందమయిన తలకట్టు. ఇప్పుడు ఆమె కళ్ళు ఎర్రగా వున్నాయి. నిప్పులు గ్రక్కడం అంటే యిదే కాబోలు! క్రౌర్యంతో పెదవులు చలించి, చిన్న రంధ్రంలోంచి సోకిన సూర్యకిరణంలా ఒక గీతగా పెదవులు చివరలో బిగుసుకున్నాయి. నొక్కిపెట్టిన గుప్పెటపైన నరాలు పదునుగా తీర్చి ఉన్నాయి. ఏదో మహావృక్షం ఎన్నాళ్లుగానో భూమికి పెనవేసుకున్న వ్రేళ్ళలాగా - ఆ చేష్టలో ఒక వికృతమైన ప్రాచీన శక్తి కనిపించిన వాడికిమల్లే అరుణని చూసి చంద్రం దిగ్భ్రమ చెందాడు. క్షణంలో తేరుకున్నాడు.
      ‘‘చేతిలో ఏమిటది?’’
      సమాధానం లేదు.
      ఒకడుగు ముందుకు వేశాడు.
      ఆమె భుజాల తడి ఆరింది - కాని చీర మడతలు తడికి చర్మాన్ని అంటిపెట్టుకొని శరీర కాంతిని బైట పెడుతున్నాయి. పరాయి స్త్రీగా కనబడుతోంది అరుణ.
      ‘‘నిన్నే’’
      ‘‘బైటకెళ్ళండి’’ అంది గుప్పిటిని చీరమడతలో దాచుకుంటూ. 
      ‘‘ఏమిటది?’’
      ‘‘ఏమీ లేదు.’’
      ‘‘చెప్పాలి’’
      ‘‘ఏం లేదన్నానుగా’’
      చంద్రం మరో అడుగు ముందుకి వేశాడు. ఆమె మంచం మీద కొంచెం వెనక్కి జరిగింది. ఎడమ చేతితో మంచంబద్దీని నొక్కిపెట్టినప్పుడు భుజంమీద వొంపు రొమ్ములని కదిపి, చీరమడతల్ని కదుపుతున్నాయి.
      ‘‘చెప్పి తీరాలి’’
      చంద్రంలో అస్పష్టమైన వాంఛ రేగినట్లు కళ్ళు పదేపదే చిట్లిస్తున్నాడు.
      ‘‘చెప్పకపోతే?’’
      అరుణ చూపులో, మాటలో పెంకితనం, కొంటెతనం కూడా ప్రకటించింది.
      ‘‘ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?’’
      ‘‘తెలుసు.’’
      ‘‘మరిల్లాగియ్యి, అదేమిటో!’’
      ‘‘ఇవ్వను. ఏం చేస్తారేమిటి?’’
      అరుణ సంసార బంధాన్ని విస్మరించింది. తను భార్య కాదు - వ్యక్తిత్వంతో ప్రజ్వరిల్లుతున్న వొక ప్రాణి. ఆ తిరుగుబాటుతో ఆమె మరీ దూరమైపోతోంది. లోయలో నిలబడి దూరంగా శిఖరంపై కలని వెదుక్కుంటూ తిరుగాడే దేవకన్యని పిలిచినట్లుగా వుంది. అతనొక బురదగుంట. అందులో తారక ప్రతిబింబంగా అరుణ కదులుతోంది. ఆ తిరుగుబాటు అతన్ని కవ్వించినట్లయింది. ఆమెను తన చేతుల మధ్య బిగించి, ఆ శక్తికి ఆమె శరీరం వీడి రక్తం కారుతూంటే, అతనిలో కామజ్వాల చెలరేగి అందులో ఆమె హతమవుతే, - ఏదో వెర్రి ఆవేశానికి లొంగిపొయ్యాడు చంద్రం. అతని ఆవేశం వెనుక పురుషుడు, ‘మాన’ ఉన్నాయి. చరిత్రలో కాయకష్టం చేసి, సౌందర్యాన్ని ఆరాధించి, విఫలులైన లక్షలాది మానవుల - పురుషత్వం వుంది. తనింక ఆమె భర్త కాడు, చంద్రం కాడు. బలహీనమై, తన చేతిలో లొంగిపోయి. తనిష్టమొచ్చినట్లు వాడి ధ్వంసం చేసుకునేందుకు అనువైన వొక స్త్రీ దొరికిన పురుష. పశుశక్తుల కుప్ప.
      ‘‘ఏం చేస్తానా?’’
      మీదికొస్తున్నాడు చంద్రం. నల్లమేఘాన్ని తరుముకొచ్చిన పెనుగాలిలో అల్లల్లాడిపోయిన గడ్డిపువ్వులా ఆమె వొణికిపోయింది. ఆ గడ్డి పువ్వుకి కూడా వేరుంది - విత్తనం వుంది. అవి భూమిలో పాతుకుని వున్నాయి. భూమండలంలో శక్తికి కదిలినట్లుంది ఆమె. ఇంకా వెనక్కి జరిగింది. మడతమంచం చివర - చీరకొంగు జారి రొమ్ముల మధ్య యిరుక్కుంది. శ్వాస వేడిగా, తెరలుగా వొదుల్తోంది.
      ‘‘నాకు తెలుసు’’ అన్నాడు.
      ‘‘తెలిస్తే ఇంకెందుకు? వెళ్ళండి’’
      ‘‘చూడకుండా వెళ్ళను’’
      ‘‘నేనే వెడతాను’’ అని లేవబోయింది అరుణ. చీరముడి సరిగ్గా లేక నడుం మీదికి జారిపోతోంది. మంచమ్మీది దుప్పటిని పైకి లాక్కుని కప్పుకుంటోంది. లేవలేదు. మళ్ళీ అక్కడే చతికిలబడింది.
      ‘‘అది ఉత్తరం అవునా?’’
      ‘‘అవును’’
      ‘‘ఎవరు వ్రాశారు?’’
      ‘‘అది తెలుసుకున్న వారు ఇదీ తెలుసుకోండి’’
      చంద్రం తల తిరుగుతోంది. అతనికంతా తేటతెల్లమైంది. మరిప్పుడు ఆ వేదన లేదు. నరాలు లాగడం లేదు. స్థిరపడి కార్యానికి సిద్ధపడుతున్నాయి. ‘సింహం’ స్టేషన్లో ‘అరుణగారు’ అనడం బదులు ‘అరుణ’ అని ఎందుకన్నాడో తెలిసింది. వారిద్దరూ వున్నప్పుడు ఆమె సంభాషణ అదొకలా నడిచింది. చెప్పుకొన్న కబుర్లన్నీ ఎవరికో ఉద్దేశించి చెప్పినట్లుగా వున్నాయి. అరుణ ‘సింహం’ కేసి అదొకలా చూసింది. ఆ చూపుల్లో అమాయకత్వం బదులు, కుటిలత్వం కనబడింది. గుడ్లు వొప్పజెప్పేసిన చూపులవి. ‘సింహం’ గురించి చదువుకొనే రోజుల్లో, నలుగురూ చెప్పినవి గుర్తుకొస్తున్నాయి. అతనిలో సంస్కారం లేదు. నాజూకు లేదు. ఆర్మీలో వాళ్ల మోటుదనం కరకుదనం వున్నాయి. ఆ పెద్ద తల, పాచిలా మెరిసే పెద్ద మెడ, భీకరమైన కనుబొమ్మలు - బొగ్గుగనిలోకి తొంగి చూసినట్లు, నల్లటికళ్ళు- అబ్బ! ఆ స్థానంలో అతను తప్ప, ఇంక ఎవరున్నా, ఆమెను క్షమించి వుండును చంద్రం. ఆమెలో నాజూకు, అమాయకత్వం, మృదుత్వం సహజంగా ఉన్నాయి. వాటికి వ్యతిరేకమైన లక్షణాలు ‘సింహం’లో ఉన్నాయి. అందుకనే వాటిని కోరింది కాబోలు. 
      ‘‘ప్రేమలేఖ?’’
      ‘‘అవును’’
      ‘‘చూడనీ’’
      ‘‘చూడనివ్వను. మీకొచ్చిన ఉత్తరాలన్నీ నాకు చూపుతున్నారా’’
      ‘‘వేళాకోళమా?’’
      ‘‘నిజంగానే’’
      ‘‘ఇస్తావా, ఇవ్వవా?’’
      ‘‘ఇవ్వనంటినిగా’’
      అర్థంలేని ధ్వని చేశాడు చంద్రం. ఆమె మీదికొచ్చాడు. అతని రెండు మోకాళ్ళు మంచం ముందు భాగంలో ఆనించి ఆమెను పట్టుకోబోయాడు. అరుణ వెనక్కి కదిలింది. ఆమె చెయ్యి మెడ వెనుక దాచింది. భుజం మీద పడింది అతని చెయ్యి, డేగపాదం కప్పపిల్ల మీద పడ్డట్టు. మంచం చివరికి జరిగింది - పట్టు లేదు. లుంగచుట్టుకొని కింద పడింది. బరువుకి చంద్రం వున్న భాగం పైకిలేచి పడింది. ఆ వూపుకి కింద వెల్లకిల పడ్డాడు. దెబ్బ తగిలింది. అతని చూపు తడబడుతోంది. వొస్తువులు కనిపించడం లేదు. బుర్రలో వాక్యం నిర్మాణం అవడం లేదు. ఏవో సగం సగం ధ్వనులు - చేస్తున్నాడు. లేచాడు. దూరంగా అరుణ వాడి వూడిన ఆకులా - ఒడ్డునపడి తెప్పరిల్లిన తెల్ల పిల్ల కెరటంలా చందమామను కప్పిన తెల్లమేఘంలా అరుణ - ఊహలో అరుణ, జ్వాల నాలుక; కత్తిబాణం; అగ్నిదేవుడు విప్పి పారేసిన వస్త్రం, చిలుకపొడిచిన ఎర్రపండు - ‘సింహం’ నోట్లో నలిగిన పావురం అరుణ. తను బోనులో లేచాడు; బోను కడ్డీలు వూడపీకుతున్నాడు. ‘‘ఇస్తావా? ఇవ్వవా?’’ ఆమె మీదికి వెళ్ళి, ఒక్క వూపుతో ఆమెను నిలబెట్టి మంచంపైన కూలదోశాడు. చేతులో ‘హంటర్‌’ని గిరగిర తిప్పి వ్రేళ్ళాడుతూన్న పటకాలతో ఆమె జబ్బ మీద కొట్టాడు. ఆమె పెనుగులాట విరమించి, మంచం మీద నుండి జారి, చేతి పట్టు విడిచివేసి, కింద పడింది. చంద్రం ఆ వుత్తరాన్ని చిక్కించుకున్నాడు. హంటర్‌ని భుజాన వ్రేళ్ళాడేసుకొని హాల్లోకి నడిచాడు. బల్లమీది గ్లాసులో మంచినీళ్ళు త్రాగాడు. ముందు గదిలోకెళ్ళి తలుపేసుకొని ఉత్తరం చదువుకున్నాడు. 
      ఆకుపచ్చ రంగు కాగితం, పైభాగం చిరిగిపోయింది. అక్షరాలు సరిగా కనపడటం లేదు.
      ‘... నేనింక సుఖపెట్టగలనేమో. ఇన్నాళ్ళు ఉద్యోగం లేక నాతోపాటు నిన్ను కూడా ఈ సమిష్టి కుటుంబానికి బానిసగా చేశాను... నిర్మలమైన సెలయేటి అడుగున కనిపించే బంగారపు ఇసుకలాంటి నీ శరీర కాంతి. నా చీకటి కలలను వెలిగించింది. అంతటి నిర్మలమైంది కూడా నీ హృదయం; సుకుమారమైంది నీ శరీరం. ఏటికి అటూఇటూ గట్లంట ముళ్ళ పొదలు - పెద్ద పెద్ద చెట్లు - ముసలివై వూగిసలాడి కొన ఊపిరితో భూమిని అంటిపెట్టుకున్న చెట్లలాంటి నా జీవితానికి ఆ యేరు మెల్లగా నృత్యం చేస్తూ, సున్నిత కంఠంతో గానం చేస్తూ ప్రవహిస్తూంటే చూసి ఆనందించటం తప్ప పరమావధి లేదు. అన్ని నదులూ ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట సముద్రంలో పడాల్సిందే అన్నాడు ఒక కవి. ఇప్పుడా సమయం వచ్చింది. ఉద్యోగం దొరికింది. నీకు ఉయ్యాలంటే ఇష్టం కదూ?... మనుషులు లేని ఏకాంత లోయలలో రెండు శిఖరాలకు మధ్య తగిలిద్దాం ఆనందం అనే ఉయ్యాలని... సిగ్గుతో దూరంగా వెళ్లని పిల్ల వాయువు ఆ ఉయ్యాలని వూపుతుంది. చెట్ల ఆకులు సంతోషానికి తట్టుకోలేక మనమీద ఊడిపడి మన ఆనందాన్ని పంచుకుంటాయి... అరుణా... కొండ వెనకనుంచి వొక్కసారిగా నీ మోము వెలిగించే ప్రభాత కిరణం. నీ స్నానం కోసం వేచివున్న అడివికొలను... మన కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి.’
      తరువాత అక్షరాలు బొత్తిగా కనబడటం లేదు. సంతకం కూడా లేదు. కాని చంద్రానికి తెలుసు. వివాహం అయిన మరుసటి సంవత్సరం, ఉద్యోగం దొరకగానే అతను, అరుణకి వ్రాసిన లేఖ అది. అవుతే, అంత దాపరికం దేనికి? అర్థం లేని మొండిపట్టా? మూర్ఖత్వమా? హాస్యధోరణిలో ప్రారంభించిన పెంకిపట్టు విషాదంగా అంతమొందిందా? అతనికి అర్థం కావడం లేదు. ఆ ఉత్తరం అరుణకి ఆనందం ఇచ్చి ఉండాలి. ఎన్నేళ్ళక్రితమో తాను పొందిన ఆనందాన్ని మళ్లీ యిప్పుడు చదువుకుని పొందుదామన్న సంకల్పానికి తన రాక అంతరాయంగా పరిణమించింది. ఆ ఉత్తరం వ్రాసిన చంద్రం వేరు. ఆ చంద్రం ప్రియుడు - యవ్వనంలో స్వప్నాలల్లే మాంత్రికుడు. ఇప్పటి చంద్రం భర్త. ఉద్యోగం, హోదా, డబ్బూ, నౌకర్లూ, స్నేహితులూ, మర్యాదలు - ఆమె భార్య - వంటొండి పెడుతుంది. ఆ ఉత్తరం చదవడంలో గతించిన కలలు, తిరిగి ఊహలో సృష్టించుకొని, రహస్యమైన ఆనందం పొందుదామని, తలంటు పోసుకొని, అలంకరించుకుంటూ, ఏకాంతంగా గతంలో యాత్రకి బైలుదేరుతూండగా, భర్త అనే ఇప్పటి చంద్రం, వర్తమానాన్ని హంటర్‌ స్వరూపంలో తనముందు ప్రత్యక్షమై ఆ ఊహాజగత్తుని ధ్వంసం చేశాడు. అందుకే అతన్ని పరాయివాడిగా, విరోధిగా తూలనాడి, ఎదురుతిరిగి, స్వప్నజగత్తులో తన నిజస్వరూపాన్ని వొక్కసారి చూపెట్టింది.
      వారికిప్పుడు ఏ లోటూ లేదని చంద్రానికి తెలుసు. డబ్బుంది, ఉద్యోగం వుంది - అన్నీ వున్నాయి. కానీ ఏదో లోపించింది. ఆ లోపించింది ఆ ఉత్తరంలో వుంది. అందుకే అంత రహస్యం. గతానికో అద్దం ఆ ఉత్తరం. అందులో తన నిజస్వరూపం చూసుకుంటుంది. ఉత్తరం నలిగింది; అద్దం మసగ్గా వుంది. అన్నీ మరకలు; తలంటుపోసి, శుభ్రం చేసినా బాగవదు... అంతే మరి.
      చంద్రం, హంటర్‌ తాళ్లని తన వెన్ను మీద పేల్చుకు చూశాడు. శరీరానికి నెప్పి తెలుసు; బాధ తెలుసు. కాని, హృదయానికి తెలిసేది గాయం. అద్దాన్ని పగలగొడుతుంది శరీరం. పగిలిన ముక్కల్ని ఏరి అతుకుపెడుతుంది హృదయం. హంటర్‌ బల్లమీద పడేసి, పైన పత్రిక కప్పి, అరుణ గదికేసి నడిచాడు చంద్రం. ఆ పత్రికని హంటర్‌ని పూర్తిగా కప్పేటందుకు సర్దుతున్నప్పుడు, వొక్క కన్నీటి బిందువు పడి, అక్కడ తడిసింది. ఒక్కటే బిందువు వుంది - పగిలిన వాటిని అతుకుపెట్టే జిగురులాంటిది. అది కాస్తా ఇప్పుడు పడిపోయింది.

(‘బుచ్చిబాబు’ సతీమణి శివరాజు సుబ్బలక్ష్మి గారి సౌజన్యంతో)


ఆలోచనా స్రవంతి: రాసిన ఒకే ఒక్క నవల ‘చివరకు మిగిలేది’తో ప్రసిద్ధుడైన బుచ్చిబాబు అసలు పేరు శివరాజు వేంకట సుబ్బారావు. 1916 జూన్, 14న ఏలూరులో జన్మించారు. కొంతకాలం ఆంగ్లోపన్యాస కుడిగానూ, ఆ తరువాత 1945నుంచి 1967లో మరణించేవరకు ఆలిండియా రేడియోలో పనిచేశారు. జువెనిలియా, బ్రోకెన్‌ వయొలిన్‌ అనే ఆంగ్ల కవితలు, పశ్చాత్తాపం లేదు అనే కథానిక ఈయన తొలిరచనలు. 82 కథలు, ఒక వచనకావ్యం, 40 వ్యాసాలు, 40 నాటికలు -నాటకాలు, షేక్‌స్పియర్‌ సాహిత్య పరామర్శ తదితరాలు ఈయన రచనలు. బుచ్చిబాబు ‘రాయల కరుణ కృత్యము’ నాటిక ‘మల్లీశ్వరి’ సినిమాకు ఆధారం.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


ముళ్ల గులాబీ

ముళ్ల గులాబీ

పులిగడ్డ విశ్వనాథరావు


కురూపి భార్య (కథాపారిజాతం)

కురూపి భార్య (కథాపారిజాతం)

కొడవటిగంటి కుటుంబరావు


కథ రాసి చూడు...

కథ రాసి చూడు...

పార్థసారథి చిరువోలు


అత్తమ్మ

అత్తమ్మ

కాటబత్తిని రాజేశ్వర్‌


వింగవాజు మామ్మ

వింగవాజు మామ్మ

మ‌న్నం సింధుమాధురిbal bharatam