ఇన్నాళ్లు తెలియలేదు

  • 826 Views
  • 9Likes
  • Like
  • Article Share

    ఆర్‌.ఎల్‌.సునీత

  • ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌)
  • 9441352707
ఆర్‌.ఎల్‌.సునీత

సరిత.. నా గారాలపట్టి. లేకలేక కలిగిన మా చిన్నారి పాప. ఊపిరి సలుపని ఆఫీస్‌ పనులతో సతమతమయ్యి, సముద్రంలాంటి ట్రాఫిక్‌ని ఈదుకుంటూ అలసి సొలసి రాత్రి ఎనిమిది గంటలకి ఇంటికి చేరినా, గుమ్మం దగ్గరకి రాగానే ‘‘నాన్నా!’’ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి, నన్ను పెనవేసుకొనే సరికి బడలికనంతా మర్చిపోయి పాపని ఎత్తుకొని మురిసిపోతుంటాను. షూస్‌ కూడా విప్పకుండా అలా సోఫాలో కూర్చుండిపోయి, పాప ఆ రోజు స్కూల్లో జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెబుతూంటే, కళ్లార్పకుండా వింటూ ఉండిపోతాను. అప్పుడు నా శ్రీమతి ప్రభావతి వచ్చి ‘సరిపోయారు.. దొందూ దొందే! రోజూ ఇదే తంతు’ అంటూ చిన్నగా మందలించి నన్ను స్నానానికి సాగనంపి, తను భోజనం ఏర్పాట్లలో పడుతుంది. వాళ్లమ్మకి సాయంగా నా చిట్టితల్లి తన బుల్లిబుల్లి చేతులతో గ్లాసులతో నీళ్లుపెడుతుంది. నేనీలోగా స్నానం ముగించి రాగానే అందరం హాయిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగిస్తాం. ఇంకప్పుడు టీవీ జోలికి వెళ్లకుండా భోజనాల గదిలోనే ఉన్న ఉయ్యాలబల్ల మీద నా అమ్మణ్ని కూర్చోపెట్టి, దానికి ఏదో ఒక పజిల్‌ చేయమని ఇచ్చి నేను ప్రభావతికి సహాయం చేస్తాను. టేబుల్‌ మీద ప్లేట్లు, గిన్నెలు, అన్నీ తీసేయటం నా పని. వంటింట్లో మిగిలిన పనులను ప్రభావతి చక్కబెట్టుకుంటుంది. నేను వచ్చేలోపే సరిత పజిల్‌ పూర్తి చేసేస్తుంది. మూడో తరగతి చదువుతున్న దాని చురుకుదనం, తెలివితేటలు చూసి ఒక్కొకప్పుడు నేనే ఆశ్చర్యపోతుంటాను. ప్రభావతి పనులన్నీ ముగించుకొని వచ్చే వరకూ సరితకి సరదాగా కబుర్లు, కథలు చెబుతూ దానితో ఆడుకుంటూ ఉంటాను. 
      ప్రభావతి పాప పుట్టటానికి ముందు వరకూ ఉద్యోగం చేసేది. పాప పుట్టాక తనే ఉద్యోగం మానేస్తానంది. డేకేర్‌ సెంటర్లలో పాపను ఉంచటం నాకూ ఇష్టం లేక తన మాటకే ఓటేశాను. ఎంత గడించినా, ఎంత చెట్టుకి అంత గాలి. శ్రద్ధగా చేసుకోగలిగితే ఒకరి జీతంతో అయినా సంసారం హాయిగా సాగుతుందన్నది నా సిద్ధాంతం. ఒకవేళ ప్రభావతి ఉద్యోగం చేస్తానన్నా కూడా నేను కాదనే వాడిని కాదు. మొత్తానికి నా భార్య త్యాగం వల్ల మా సంసార నౌక ఏ ఒడిదొడుకులూ లేకుండా సాఫీగా  సాగిపోతోంది. నేనూ ఎంత బిజీగా ఉన్నా నా ఇల్లాలికి, పాపకి రోజూ కొంతైనా సమయం కేటాయిస్తూనే ఉంటాను. ఎందుకంటే అందులోనే ఆనందం, ఆత్మసంతృప్తి.

***

ఎన్నడూలేనిది మొన్న శనివారం సరిత స్కూలుకెళ్లనని మారాం చేసింది. కడుపునొప్పి సాకుగా చెప్పింది. మర్నాడు ఆదివారం సెలవు. ఇవాళ సోమవారం కూడా స్కూలుకెళ్లనని ఏడ్చింది. ‘ఏమయ్యిందబ్బా దీనికి!?’ అని ఆలోచిస్తూ పాపకి స్కూలుకెళ్లమని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా వెళ్లనంది. ఆఫీస్‌కి వేళ అవుతుండటంతో ప్రభావతికి పాపని బుజ్జగించి, అసలు విషయం కనుక్కోమని చెప్పాను. ఇవాళ్టికి ఊరుకొని, పాపకి నచ్చజెప్పి రేపట్నుంచీ స్కూలుకి పంపిద్దామంది ప్రభావతి. నేను ఆఫీస్‌కి వచ్చేశాను. పని హడావుడిలో ఉండగా నా సెల్‌ మోగింది. సరితవాళ్ల క్లాస్‌ టీచర్‌ రమగారు మాట్లాడారు. రెండ్రోజులుగా సరిత స్కూల్‌కి రావట్లేదుగా ఒంట్లో బాగోలేదా అని కనుక్కుందామని ఫోన్‌ చేశానని, అంతేకాక ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని, వీలయితే ఒకసారి స్కూల్‌కి రాగలరా అని అడిగారు. 
      విషయం ఏంటా అని లంచ్‌ అవర్లో స్కూల్‌కి వెళ్లి రమా టీచర్‌ని కలిశాను. ఆవిడ నాతో ‘మిమ్మల్ని స్కూల్‌కి రమ్మని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. మిమ్మల్ని ఒకసారి స్కూల్‌కి తీసుకురమ్మని ఇదివరకు చాలాసార్లు సరితతో చెప్పాను. మీరు బిజీ అనో, లేకపోతే ఏదో టూర్‌కి వెళ్లారనో చెప్పేది. ఈ శనివారం మిమ్మల్ని ఎలాగైనా తీసుకురమ్మని చెప్పాను, మీతో చెప్పలేదా!?’ అని అడిగారు. నాకీ విషయం సరిత చెప్పలేదన్నట్లుగా తల ఊపాను. ‘అయ్యో! అలాగా. తను ఎందుకు చెప్పలేదో! ఒకవేళ మీరు ఒప్పుకోరనుకుందేమో. అన్నట్లు మీది అమలాపురం దగ్గర్లోని పల్లెటూరు కదా!’ అని ఆవిడ అడిగేసరికి ఆశ్చర్యపోవటం నా వంతయింది. నా భావన పసిగట్టిన ఆవిడ వెంటనే ‘మీ సరితే చెప్పింది. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ క్లాసులో పిల్లల్ని, ఏదైనా ఒక విషయం మీద మాట్లాడమన్నాం. సరిత పండుగ సెలవుల్లో మీరందరూ మీ ఊళ్లో జరుపుకున్న పండుగ రోజుల్ని, తన ఆటపాటల్ని, అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పింది. కనుచూపు మేర వరకూ పరచుకున్న పచ్చని ప్రకృతి, సెలయేటి నీటి గలగలలు, రామాలయంలో హరికథలు... అన్నీ పూసగుచ్చినట్లు వర్ణిస్తుంటే అందరం ఆశ్చర్యపోయాం. ఈ కాలం పిల్లలకి, ముఖ్యంగా పట్నం పిల్లలకి ఇవేవీ తెలియదు. అందుకే క్లాస్‌లో పిల్లలందరూ తను చెప్పిన విషయాలన్నీ విస్మయంగా విన్నారు. సరిత వాళ్ల తాతయ్య తనకి ఎన్నో కథలు చెప్పేవారని, వాళ్ల నానమ్మ పెరట్లో మంచం మీద తనను కూర్చోపెట్టి చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపించే వారని చెప్తూంటే పిల్లలందరూ మా వాళ్లు కూడా పల్లెల్లో ఉంటే మేము కూడా తనలాగే ఇవన్నీ ఎంజాయ్‌ చేసేవాళ్లమని అన్నారు. అప్పుడే నాకో ఆలోచన వచ్చింది. ప్రతియేడూ పిల్లల్ని విహారయాత్రకి ఏదో ఒక చోటుకి తీసుకెళ్లటం స్కూల్‌కి రివాజు కదా, మీకు అభ్యంతరం లేకపోతే ఈ యేడు సరిత క్లాస్‌ పిల్లల్ని మీ ఊరు తీసుకొచ్చి ఇవన్నీ చూపిస్తే వాళ్లకి కూడా ప్రకృతి గురించి, మన పల్లెలు, అక్కడి సంప్రదాయాలు, వారి జీవన విధానం తెలుసుకుంటారనిపించింది. 
      ఈ విహారయాత్ర వల్లయినా వాళ్లు కొంతసేపైనా ప్రకృతికి దగ్గరగా గడపగలిగితే అదే చాలు. అందుకే వచ్చే సంక్రాంతి సెలవుల్లో ఈ యాత్ర చేపట్టాలని నా ఉద్దేశం. మీరిప్పుడే మీ నిర్ణయం చెప్పక్కర్లేదు. అక్కడ అందరికీ వసతి సమకూర్చటం సులువైనపని కాదు. అందుకే మీరు అన్నీ ఆలోచించుకొని మీకే అభ్యంతరమూ లేకపోయినట్లయితే నేను కూడా మా ప్రిన్స్‌పల్‌గారితో మాట్లాడి, పిల్లల తల్లిదండ్రులతోనూ చర్చించి అన్నీ కుదిరితే ఈ విహారయాత్ర చేపడదాం’’ అన్నారు. అసలు ఏమనాలో పాలుపోక ‘‘నాక్కొంచెం సమయం ఇవ్వండి’’ అని రమా టీచర్‌కి చెప్పి, అక్కడ్నుంచి మళ్లీ ఆఫీస్‌కి వచ్చేశాను. సాయంత్రం రోజూ కన్నా ముందుగా ఆఫీస్‌ నుంచీ బయటపడి ఇంటికి చేరుకున్నాను. ఫోనైనా చేయకుండా ఇంటికి వచ్చిన నన్ను చూసి ఆశ్చర్యపోయింది ప్రభావతి.
      సరిత విషయం ఏమైందని ప్రభావతిని అడిగితే ‘ఎంతడిగినా చెప్పలేదు. రేపు స్కూల్‌కి వెళ్లాలని నచ్చజెపితే అయిష్టంగానే తలూపింది. ఇదిగో ఇప్పటి వరకూ అలా డీలాగా ఇంట్లోనే ఉంది. ఇప్పుడే పక్కింటి వాళ్లమ్మాయితో ఆడుకోమని బలవంతాన పంపించాను. అసలు ఉన్నట్టుండి దీనికి ఏమైందో అర్థం కావటం లేదు. రేపొకసారి స్కూల్‌కెళ్లి వాళ్ల టీచర్‌ని కలిసి మాట్లాడతాను అంది. ‘అక్కర్లేదు నేను ఇవాళ మధ్యాహ్నం స్కూల్‌కి వెళ్లి వాళ్ల టీచర్‌ని కలిశాను’ అని రమా టీచర్‌ ఫోన్‌ చేయటం దగ్గర్నించీ ఆవిడ నాతో చెప్పిన విషయమంతా చెప్పాను. మళ్లీ ఆశ్చర్యపోయింది ప్రభావతి. ‘అరే! అసలిదెప్పుడు ఆ ఊరికి వెళ్లింది? ఈ ఆటలన్నీ ఆడింది!? ఊరితో బంధం తెగిపోయి ఏళ్లు గడిచింది కదా! మరి ఇదంతా ఏంటీ? నాకేం అర్థం కావటం లేదు’ అంది. ‘నాకర్థమయ్యింది. నేను అన్ని విషయాలు తరువాత వివరంగా చెప్తాను. ఒక చిన్న పనుంది. ఇప్పుడే వస్తా’ అని చెప్పి బయటకి వెళ్లాను. గంట తర్వాత ఇంటికి వచ్చాను.
      సరిత తన స్టడీ రూమ్‌లో కూర్చుని బొమ్మలు గీస్తోంది. నేను వెనకనుంచి చప్పుడు చేయకుండా చూస్తే ఒక అందమైన పల్లె వాతారణంలో ఒక అమ్మాయి బొమ్మ గీస్తోంది. నన్ను ఒక్కసారిగా చూసే సరికి డ్రాయింగ్‌ పుస్తకాన్ని మూసేసింది. తన పక్కనే కూర్చొని ‘‘అమ్మడూ! నీకో మంచి వార్త. మనం ఈ పండుగ సెలవులకు మన ఊరు వెళ్తున్నాం’’ అనే సరికి ఆ పసిదాని ముఖంలో నాకు ఎన్నో భావనలు కన్పించాయి. ఇది కలా, నిజమా అన్నట్లు నన్ను చూసింది. ‘‘అక్కడ నీకు మామయ్య, అత్త, అమ్మమ్మ,. తాతయ్య అందరూ ఉన్నారమ్మా. మరి వెళ్దామా?’’ అని నేననే సరికి సరిత నన్ను గట్టిగా పట్టుకొని వెక్కివెక్కి ఏడ్వడం మొదలెట్టింది. ‘ఏమైందిరా తల్లీ, ఎందుకేడు స్తున్నావ్‌?’ ‘నాన్న! మరేమో... మరేమో క్లాస్‌లో టీచర్‌ మీరు చూసిన మంచి ప్రదేశం గురించి మాట్లాడమని మాతో చెప్పారు. అందరూ అన్నీ తెలిసిన వాటి గురించే చెబుతున్నారు. కొత్తగా ఉంటుందని నేను మన ఊరు గురించి చెప్పాను. టీచర్‌ అందరం కలిసి పిక్నిక్‌కి అక్కడికి వెళ్దామన్నారు. మిమ్మల్ని టీచర్‌ స్కూల్‌కి తీసుకురమ్మన్నారు. నేను కావాలని అబద్ధం చెప్పలేదు నాన్నా. ఇప్పుడు నేను చెప్పిందంతా ఒట్టిదే అని తెలిస్తే మా క్లాస్‌మేట్స్‌ అందరూ నన్ను ఏడిపిస్తారు. అందుకే నేను ఇంక స్కూల్‌కి వెళ్లను! అంటూ చెప్పలేక చెప్పింది. ‘‘చిట్టి తల్లీ! నువ్వు నా బంగారానివి కదా! మరేం పర్వాలేదు. మామయ్యతో చెప్పి అన్ని ఏర్పాట్లూ చేయిద్దాం. అందరం కలిసి వెళ్దాం. రేపే మీ స్కూల్‌కి వచ్చి మీ టీచర్‌తో మాట్లాడతాను. సరేనా!’’ అనే సరికి ఏదో పెద్ద బరువు తలమీంచి దింపేసినట్లుగా ఫీలయ్యి ‘‘థ్యాంక్స్‌ నాన్న. మా మంచి నాన్నా’’ అంటూ నన్ను ముద్దుల్లో ముంచింది. ఇదంతా చూస్తున్న ప్రభావతి ‘‘దొందూ దొందే! వీళ్లిద్దరూ ఉంటే మిగతావాళ్లు అక్కర్లేదు కదా!’’ అంటూ నవ్వుతూ వచ్చి సరితను దగ్గరకి తీసుకుంది. 

***

      మర్నాడు ఉదయాన్నే సరితను తీసుకొని స్కూల్‌కి వెళ్లాను. పాపను తన క్లాస్‌కి పంపించి నేను రమా టీచర్‌ని కలవటానికి స్టాఫ్‌ రూమ్‌కి వెళ్లాను. టీచర్‌ మీకో విషయం చెప్పాలి. మా సరిత మా ఊరునే కాదు కదా, ఇప్పటి వరకూ తను ఏ పల్లెటూరినీ చూడనే లేదు. మా అమ్మానాన్న నా దగ్గరకి వచ్చిన తరువాత ఊరితో రాకపోకలు చాలా వరకూ తగ్గిపోయాయి. వారిద్దరూ పోయాక ఇంక ఆ ఊరితో బంధం పూర్తిగా తెగిపోయింది. నేను పాపతో నా చిన్న నాటి సంగతులు, మా ఆటపాటలు, మేం జరుపుకున్న పండుగలు, మా ఊరి అందాలు అన్నీ కథలు కథలుగా అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను. వాటినే చెప్పింది. అన్నాను. ‘‘అరే! ఇదంతా సరిత కల్పనా! నేను నమ్మలేకపోతున్నాను. ఎంత బాగా చెప్పింది. నిజంగా తను వాటన్నింటినీ అనుభవించినట్టుగా ఎంత చక్కగా వర్ణించింది’’ అని అన్నారు రమా టీచర్‌. ‘‘తనని క్షమించండి టీచర్‌. ఇవన్నీ అబద్ధాలని తెలిస్తే క్లాస్‌లో అందరూ తనని ఎగతాళి చేస్తారని సరిత భయపడుతోంది’’. ‘‘భలేవారే! సరితను మనం తప్పుపట్టకూడదు. ఇంత చిన్న వయసులో అంత ఊహాశక్తి, వర్ణనా సామర్థ్యం ఉండటం నిజంగా ఒక వరం. మరేం ఫర్వాలేదు. ఈ విషయం మన మధ్యే ఉంటుంది. అయితే ఒక్కటే బాధ. పిల్లలని ఒక మంచి విహారయాత్రకి తీసుకెళ్లాలనుకున్నాను. అది కుదిరేట్లు లేదు’’ అని రమా టీచర్‌ అన్నారు. ‘‘కచ్చితంగా అవుతుంది. అన్ని ఏర్పాట్లూ నేను చేస్తాను. రవి అని నా స్నేహితుడు, మా ఊరివాడే... ఇక్కడే ఉంటున్నాడు. నిన్న నాకీ విషయం తెలియగానే నేను వాడింటికి వెళ్లి ఈ విషయం చెప్పాను. రవి వాళ్ల అన్నయ్య చంద్రశేఖరం ఊళ్లోనే ఉంటున్నాడు. ఆయన కూడా నాకు బాగా తెలుసు. ఆయనకి కూడా ఫోన్‌ చేసి  చెప్పాను. అందరికీ ఏర్పాట్లు ఆయన చేస్తారు. కాబట్టి మరేం చింతలేదు. ఆ ప్రాంతమంతా ఆయనకి మంచి పలుకుబడి ఉంది. వాళ్లకి తోటలూ, పొలాలూ ఉన్నాయి. ఆయనే దగ్గరుండి మరీ పిల్లలకి ఇవన్నీ చూపిస్తానన్నాడు. ఇంక మీరు కూడా మీ ఏర్పాట్లు మొదలు పెట్టుకోవచ్చు. మీకు సహాయంగా నా భార్య ప్రభావతి, మా రవి భార్య సుమ వాళ్ల బాబు రోషన్‌ని తీసుకొని వస్తారు. నేను, రవి పండుగ వేళకి చేరుకుంటాం అని చెప్పాను. రమ టీచర్‌ ఎంతో సంతోషించారు.

***

      అనుకున్నట్లుగానే పండుగ సెలవులు మొదలవ్వగానే పిల్లలందర్నీ తీసుకొని రమా టీచర్, ప్రభావతి, సుమ మా ఊరికి చేరుకున్నారు. చంద్రశేఖరం వాళ్లింటికి దగ్గరగానే అందరికీ బస ఏర్పాటు చేశాడు. అన్ని సదుపాయాలూ బాగున్నాయని ప్రభావతి ఫోన్‌ చేసి చెప్పింది. చంద్రశేఖరం భార్య లక్ష్మి కూడా కలుపుగోలుగా చక్కగా మాట్లాడుతోందని చెప్పింది. ప్రతి రాత్రీ చంద్రశేఖరం నాకు ఫోన్‌ చేసి మాట్లాడుతున్నాడు. ఆ రోజంతా పిల్లలకి ఏఏ చోట్లు చూపించిందీ, వాళ్లు ఎలా చిందులేస్తూ ఆనందిస్తున్నదీ పొల్లుపోకుండా వివరిస్తూనే ఉన్నాడు. పచ్చని పొలాలని ఏ సినిమాలోనో అరుదుగా చూడటం తప్ప ఎన్నడూ ప్రత్యక్షంగా చూడని పిల్లలు ఆ పొలం గట్ల మీద కేరింతలు కొడుతూ పరిగెడుతూ, పొలంలోని బోరుపంపుల దగ్గర స్నానాలు చేస్తూ, ఆడుకుంటూ సరదాగా ఆటపాటల్లో మునిగితేలుతున్నారు.
      ‘‘నాన్నా! ఇవాళ నేను ఆవు పాలు పితకటం నేర్చుకున్నాను. ఆవు పేరు గౌరి. లక్ష్మత్త రోజూ ఆవుకి పూజ చేస్తుంది. ఆవు తోక చివరన లక్ష్మీదేవి వుంటుందట. అందుకే ఆవుకి దణ్నం పెట్టి గోమాతా అని అనాలట! అత్త చెప్పింది. గౌరికి ఒక ఆవు పెయ్య ఉంది. దాని పేరు బుజ్జి. ఎంత ముద్దుగా ఉంటుందో. మొదట్లో అది నాకు అందకుండా పరుగెత్తేది. ఇప్పుడు మాత్రం నాతో ఆడుకుంటోంది తెలుసా!’’ అంటూ ఒకసారి...
      ‘‘నాన్నా! ఇవాళ భోగి మంటల్లో వేయటానికి పేడపిడకల దండలు తయారు చేశాం.’’ అంటూ మరోసారి... మొన్న రాత్రి అమ్మమ్మగారు నన్ను, రోషన్‌న్ని పెరట్లో ఉయ్యాల బల్ల మీద కూర్చోబెట్టి అన్నం తినిపిస్తూ మీరూ, రవి అంకులు చిన్నప్పుడు ఎలా అల్లరి చేసేవారో చెప్పారు తెలుసా! ఎంత బాగుందో ఇక్కడ. మన చుట్టాలెవ్వరూ పల్లెల్లో లేరు. అందరూ మనలాగే సిటీల్లోనే ఉంటున్నారు. అమ్మమ్మగారు నేను ఇక్కడికి ఎప్పుడు కావాలన్నా రావచ్చన్నారు. ఇంకా ఏమన్నారో చెప్పనా నేను, రోషన్‌ ఇద్దరం అమ్మమ్మకి ఎంతో ఇష్టమట, ఇంకా ఏదో అన్నారబ్బా... ఏంటీ... ఆఁ... మేమిద్దరం రెండు కళ్లు అని, నాక్కూడా అమ్మమ్మంటే చాలా చాలా ఇష్టం. తాతయ్య కూడా ఇష్టమే...’’ అంటూ ఇంకోసారి అలా గుక్కతిప్పకుండా చెప్పుకుపోయింది. ఎప్పుడెప్పుడా అని నేనూ పండుగ కోసం ఎదురుచూడసాగాను.

***

      భోగి పండుగ రానే వచ్చింది. నిన్న సాయంత్రమే రవి, నేను బస్సెక్కి తెల్లారేసరికల్లా మా ఊరికి చేరుకున్నాం. బస్సు దిగి ఇల్లు దగ్గరే కదా అని నడుచుకుంటూ వెళ్తున్నాం. చలి బాగానే ఉంది. తూరుపు దిక్కున సూర్యుడు ఇంకా ఉదయించకపోయినా ఆ ఉదయకాంతిని పోలిన వెలుగు ఊళ్లో ఎటు చూసినా భోగి మంటల రూపంలో కనిపిస్తున్నది. అల్లంత దూరాన చంద్రశేఖరం ఇల్లు. ఇంటి ముందు పెద్ద భోగిమంట. దాని చుట్టూరా పిల్లలందరూ బుద్ధిగా కూర్చొని చలి కాచుకుంటున్నారు. పెద్దలందరూ అక్కడే ఉన్నారు. మమ్మల్నిద్దర్నీ చూడగానే సరిత, రోషన్‌ పరిగెత్తుకుంటూ మా దగ్గరికి వచ్చేశారు. ప్రభావతి, సుమ కూడా వెనకాలే వచ్చారు. చంద్రశేఖరం నాతో ‘‘రావయ్యా రా! ఇన్నాళ్లకి నీ కూతురు నిన్నిక్కడికి రప్పించింది. లేకపోతే ఇటు చూసేవాడివైనా కాదు’’ అంటూ పరిహాసమాడాడు. భోగి మంట పూర్తయ్యాక ఇంకా వేడిగా వున్న ఆ కట్టెల మీద గుండిగతో స్నానాల కోసం నీళ్లు కాచారు. సరిత భోగి గురించి, సంక్రాంతి గురించి తను తెలుసుకున్న విషయాలన్నీ నాకు చెప్పసాగింది. ఇప్పుడు తనలో ఒక కొత్త హుషారు, ఉత్సాహం, ఉల్లాసం కన్పిస్తున్నాయి. ఇన్నాళ్లూ పంజరంలో బందీగా ఉన్న రామచిలుక ఒక్కసారిగా స్వేచ్ఛను పొంది వినీలాకాశంలో హాయిగా విహరిస్తున్నట్లుగా అన్పించింది సరితను చూస్తే. రాత్రిపూట ఆడవాళ్లు రంగురంగుల హరివిల్లులాంటి ముగ్గుల్ని ఇంటి ముందర అందంగా తీర్చిదిద్దారు. సరితతో పాటు కొందరు పిల్లలు కూడా ఆ ముగ్గులకి రంగులు అద్దారు.
      తెల్లవారి తొలివెలుగులతోటే రంగుల ముగ్గుల మధ్య చక్కనైన గొబ్బెమ్మలను సర్దుతూ సరిత, ప్రభావతి, చంద్రశేఖరం భార్య లక్ష్మి కన్పించారు. చంద్రశేఖరం అమ్మ గారిది పెద్ద చెయ్యి. ఆవిడ ఎంతో ముచ్చటపడి ఆడపిల్లలందరికీ పరికిణీ జాకెట్టు, అబ్బాయిలకి చిన్న పంచెలు, ఖద్దరు చొక్కాలు, కండువాలు కుట్టించారు. ఎంత ముద్దుగా ఉన్నారో పిల్లలందరూ! సరిత కాళ్లకి పట్టీలు పెట్టుకొని ఘల్లుఘల్లుమని ఇల్లంతా తిరుగుతుంటే చిన్న సరస్వతీదేవిని చూస్తున్నట్టు అన్పించింది.
      ఆ ఊరి విలేఖరిని పిలిపించి పిల్లలందరి ఉమ్మడి ఫొటో తీయించి మర్నాటి పేపర్లో వేయించే ఏర్పాటు చేశాడు. ఎలా తెలిసిందో ఏమోగానీ ఒక పేరున్న న్యూస్‌ ఛానల్‌ వాళ్లు వచ్చి ‘పట్నం నుంచి ఫలానా గొప్ప పేరుగల స్కూల్‌ వాళ్లు తమ విద్యార్థులకు పల్లెల గురించి తెలుసుకోవటానికి ఇక్కడ పండుగను జరుపుకునే విధానాన్ని, ఇక్కడి సంప్రదాయాలని తెలియజెప్పటానికి తీసుకువచ్చారు’ అంటూ ‘పట్నం పిల్లలు పల్లెకు వచ్చిన వేళ’ అని ఒక కార్యక్రమాన్ని చిత్రీకరించారు. పిల్లల్ని కూడా తమ అనుభవాలను గురించి మాట్లాడమన్నారు. అదంతా టీవీలో లైవ్‌లో చూపించారు. ఊళ్లో అందరూ నాతో ‘నేడు మీ అమ్మాయి వల్ల మన ఊరే టీవీలో వెలిగిపోతోంది’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. 
      ఈ కార్యక్రమంతో ఒక రకంగా నాకూ జ్ఞానోదయమైంది. ఏదైనా రెండు రోజులు సెలవొస్తే కుటుంబాన్ని తీసుకొని ఢిల్లీ వెళ్లాలా, ఊటీ వెళ్లాలా అనే ఆలోచించాను తప్ప పాపని తీసుకొచ్చి మన ఊరిని చూపిద్దాం అని ఎప్పుడైనా ఆలోచించానా? నేను తనతో చెప్పిన నా చిన్ననాటి సంగతులన్నీ విన్న సరిత పాపం ఎప్పుడైనా తనని ఇక్కడికి తీసుకురమ్మని ఎన్నిసార్లు అడిగినా అక్కడ మనవాళ్లు ఎవరూ లేరమ్మా అయినా అక్కడేముంది చూడటానికి? అని కొట్టిపారేశాను. మానవజాతి మనుగడకు తనవంతుగా నిశబ్దంగా సహకరిస్తున్న ప్రకృతిని,  మూగజీవాలని ప్రేమించటం, స్వచ్ఛమైన గాలి, నీరు విశిష్టతను తెలుసుకోవటం, అందర్నీ వరుసపెట్టి నోరారా పిలుచుకునే పల్లెజనాల మధ్య అనురాగాలు, ఆప్యాయతలు స్వయంగా చవిచూడటం.. ఇవన్నీ పల్లెల ప్రత్యేకతలే కదా! కంప్యూటర్లలో ఆటలకీ, టీవీలో కార్టూన్‌ షోలకీ అతుక్కుపోయే విధంగా కథల రూపంలో చెబుతూ, వాళ్లకి వాటి పట్ల ఉత్సుకతని పెంచారు. ‘ఇన్నాళ్లూ తెలియలేదురా’ బంగారం, నేను నీకు అన్నీ ఇచ్చాను అనే అనుకున్నాను కానీ, ఇక్కడ నీకు దొరికిన ఈ ఆనందం దేనికీ సరితూగదన్నది వాస్తవం. ఇది నీకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ తీపి జ్ఞాపకం. ఇక మీదట నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు నిన్ను ఇక్కడికి తీసుకొస్తూ ఉంటాను. నేను పుట్టిపెరిగిన నా సొంత ఊరితో బంధం తెంపేసుకున్నాను. కానీ నేడు మళ్లీ నా చిట్టితల్లి వల్ల నా ఊరితో బంధాన్ని కలుపుకోగలిగాను. అందుకే నేను నీకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను. ‘నాన్నా!’ అన్న పిలుపుతో నా ఆలోచనల దొంతర్లలో నుంచీ ఈ లోకంలోకి వచ్చాను. ‘నాన్నా!’ ఇవాళ సంక్రాంతి కదా! అమ్మమ్మగారు పాయసం, గారెలు చేస్తున్నారు. రేపు కనుమ కదా ‘కనుమ నాడు మినుము తినాలట’ అమ్మమ్మ చెప్పారు, అందుకే రేపు మినపట్లు వేస్తారుట. ఇంకా రేపు ఆవులు గౌరికి, బుజ్జికి పూజ కూడా చేస్తారట. ఎల్లుండేమో ముక్కనుము. రా, నాన్న! నేను నీకు ఇంకా బోలెడు సంగతులు చెప్పాలి. అలా వెళ్లి పెరట్లో ఉన్న ఆ ఉయ్యాల బల్ల మీద కూర్చొని మాట్లాడుకుందాం, రా!’ అంటూ నా చిన్నారి తల్లి చేయిపట్టి నన్ను ముందుకు నడిపించింది.

***

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


ముళ్ల గులాబీ

ముళ్ల గులాబీ

పులిగడ్డ విశ్వనాథరావు


కురూపి భార్య (కథాపారిజాతం)

కురూపి భార్య (కథాపారిజాతం)

కొడవటిగంటి కుటుంబరావు


కథ రాసి చూడు...

కథ రాసి చూడు...

పార్థసారథి చిరువోలు


అత్తమ్మ

అత్తమ్మ

కాటబత్తిని రాజేశ్వర్‌


వింగవాజు మామ్మ

వింగవాజు మామ్మ

మ‌న్నం సింధుమాధురిbal bharatam