వొక అనుబోగము!!

  • 320 Views
  • 2Likes
  • Like
  • Article Share

    సడ్లపల్లె చిదంబరరెడ్డి

  • విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు,
  • హిందూపురం, అనంతపురం
  • 9440073636
సడ్లపల్లె చిదంబరరెడ్డి

ఆ టెంకాయ మాన్లో దయ్యాలుండియని ఊర్లో కతలు కతలు. ఆ పిల్లోడు తప్పక అటు పోవాల్సొచ్చె. బయంబయంగా అడుగులు యేస్తావుంటే, సెట్టు మింద నుంచి ఏదో దబ్‌మని పడె! అంతలోనే ఒక ఆకారం అటువైపు రాబట్టె... తర్వాత ఏమాయె?
యిది
వాళ్లూ యీళ్లూ సెప్పిన కతగాదు. నేను సిన్న పిల్లోనిగా వున్నపుడు నా అనుబోగానికి వొచ్చిన వొగ కత.
      యనకటికి అంటే నలబై యాబై యేండ్లకి ముందు, మన్నులో పులగా పుట్రా మాదిరీ కష్టంసేసే వాళ్లకే మూడు పూట్లా యింత తిండి సిక్కుతా వుండె. మాది శానా పెద్ద కుటింబము. మా వూరి తట్టు వానలు సరిగా పడక వొగసారీ కరువు సుట్టుకోనె. అపుడు నాయిన మమ్మల్ని సన్న పిల్లల్ని తల్లికోడి యంటేసుకోని తిండిగింజలు యెదికేదానికి పొయ్యినట్ల దూరాబారము సోటుకు వలస తీసుకుపోయిండె.
      ఆడ యేటిగట్లో బూమిని కొనుక్కోని దానికి ఆనుకోనే సిన్నపాటి గుడిసి కట్టుకోని బతుకు సాగిస్తా వుంటిమి. పనులు శానా వుంటే మా యింటి జనము జతకి అంతదూరంలో వుండే వూర్లనుండి కొందరు కూలి జనాలు వొస్తా వుండ్రి.
      వొగనాడు యేడిదో పనుండి అయిదారు మంది కూలోళ్లొచ్చి సందపొద్దుదంకా కష్టం సేసి యింటికి యల్లబార్రి. మా యింటికి అపుడు కరెంటు వుండ్లేదు. అందుకే వొడ్లు దంచేదో, రాగులు యిసిరేదో పనుంటే నాగమ్మ అనే ఆడ మనిషిని మాయమ్మ యింటి దగ్గరే వుంచుకోనె.
      ఆయమ్మ ఆ పనీ, యీ పనీ సేసి యల్లబారే పొద్దుకి సీకటయిపాయ. అపుడు మా యమ్మ ‘‘యింత పొద్దులో పొయ్యి యేమి సెయ్యి కాల్సుకొంటావు, బిరిక్కున సంగిటి కెలుకుతాను వొగ ముద్ద తినిపో!’ అంటూనే ఆయమ్మ నిల్సిపాయ. ఆయమ్మ అక్కడ నుసిగి యిక్కడ నుసిగి యేటి కాలవలో కాళ్లూ ముకమూ కడుక్కోని ఆమిదాకులు పీక్కోనొచ్చి తినే పొద్దుకి శానా మబ్బయిపాయ.
      అపుడు మాయమ్మ ‘‘యీ సీకట్లో యేమి పోతావు, యీడే పండుకో, యట్లా రేప్పొద్దున పనికి రావల్ల కదా’’ అనె. 
      అపుడు ఆయమ్మ ‘‘పెద్దమ్మా, యింటితావ పిల్లోళ్లు యెదురు సూస్తా వుంటారు. పోనే పోవల్ల’’ అని యల్లబారి ‘‘యేటి గడ్డ దాటే దంకా యెవుర్నన్నా తోడు పంపు తల్లీ’’ అనె.
      ఆ మాట్లిన్న మా నాయిన అక్కడిక్కడ సూస్తే మా యిద్దరన్నగారుల్లో యెవురూ కనిపించలా. ఆడే వున్న నన్ని కేకేసి ‘‘వొరే, నాగమ్మని యేటిగట్లో మామిడి తోపు దాటే దంకా వొదిలి రాపోప్పా’’ అనె.
      యేటిగడ్డ, మామిడి తోపు అంటానే రవ్వంత బయం సుట్టుకోని నాయన దగ్గర నుసుగులాడ్తి. నా వాలక్ము సూసి ‘‘మగ పుట్టుక పుట్టి వొంటి మిందకు పదేండ్లు యేసుకోని బయ్యము అనేకి సిగ్గు లేదేమిరా’’ అని గదురుకోనె. యింకేమి సేస్తు, బయం బయంగానే ఆయమ్మని తోడుకోని యల్బార్తి.
      అంత దూరం పోతూనే పెద్ద మామిడి తోపు. దానికి వుత్తరం పక్క దావకి ఆనుకోనే ఆకాశానికి తాకేతట్ల యెత్తుగా టెంకాయ మాను. దాంట్లో దయ్యాలుండియని అందరూ కతలు సెప్పుతా వుండ్రి. ఆ కతలన్నీ నిజమే అనిపిస్తా వుండె. యాలంటే ఆ సుట్టూపక్కల శానా టెంకాయ తోపులు వున్నాగూడా అంత పొడుగ్గా వుండేది వాట్లో వొకటీ వుండ్లేదు. వానలు కురిసేకాలంలో మేగాలు సినుకులయ్యేకి కిందకి దిగినపుడు ఆ సెట్టు కొనలు కనిపిచ్చకుండా బురికీ మాదిరి సుట్టుకొంటా వుండె.
      ఆకాశములో నల్లగా వుండే మేగాల మింద కాపురాలుండే దయ్యాలు వాటి మీద నుంచి సెట్లో సేరి ఆ దావంటి వొచ్చి పొయ్యే అందర్నీ బయంపెట్టి సంపి, వాటి జతకి తీసుకుపోతావి అని కతలు సెప్పుతా వుండ్రి. అందుకే ఆ మానెక్కి యెవురూ టెంకాయలుగూడా పీకే యత్నం సేస్తావుండ్లేదు.
యివి అన్నీ గురుతుకొస్తూనే వాట్ని మర్సిపొయ్యేకి ఆ మాటా యీ మాటా నాగమ్మతో మాట్లాడేకి మొదలుపెడితి. ఆయమ్మకి గూడా దయ్యాల కతలు గురుతుకు వొచ్చెనేమో నాతో మాటలు కలిపె. అట్లే మాట్లాడ్తా దయ్యాల మాని కింద నుంచి ముందుకి సాగి, యేటి గడ్డ యెక్కుతూనే ఆయమ్మ ‘‘యింక సాలు పోన్నా. మా వూరు అందుకొన్నట్లుంది. వొగితే యెల్లిపోతాను’’ అనె. నేను యెనిక్కి తిరిగితి.
      ఇంతకు ముందు నాగమ్మ జతలో వుండిందానికి పెద్దగా బయం కాలేదు గానీ... యిపుడు నిజ్జంగా బయం సుట్టుకోనె.
      యనకటికి వొగ ఆడమనిషి మొగునితో కొట్లాడుకోని వొగితే ఈ దావంటి పుట్నింటికి పోతా వున్నంట. అది రాతిరి పొద్దు కాదంట. మట్ట మద్యాన్నమంట! సరిగ్గా యీ తావకి వొస్తూనే వొగ పిల్లి అర్సుకొంటా ఆయమ్మకి అడ్డమొచ్చినంట. అది యావిదో అడివి పిల్లి అనుకోని దాన్ని పట్టిచ్చుకోకుండా నడుస్తా వున్నంట. అది ఆయమ్మ యనకనే వొచ్చి రెండుకాళ్లకీ సుట్టుకొన్నంట. అపుడు ఆయమ్మ ‘అయ్యో పాపము యావిదో సాకుడు పిల్లి దావ తప్పి వొచ్చినట్లుంది’ అనుకోని యెత్తి సంకలో పెట్టుకొన్నంట.
      సంకలో పెట్కోని నాలుగడుగులు నడుస్తూనే ‘‘ఆకిలి! ఆకిలి!!’’ అని అది అర్సినంట. అపుడు ఆయమ్మ బువ్వ యపుడు తినిందో సంటిది అనుకోని ‘‘రవ్వంత వోపిక పట్టమ్మా యీడే మా యమ్మా వాళ్ల వూరొస్తుంది. ఆ యింట్లో దండిగా పాడుంది. కావల్సినంత పాలూ పెరుగూ సిక్కుతుంది.             కడుపునిండా తినిపిస్తాను’’ అని వోదార్సబట్నెంట. అయినా ఆ పిల్లి వూరకే కాలేదంట. ‘‘శానా అయితా వుంది. నాకి యిపుడే కడుపు నింపు’’ అని అర్సబట్నంట.
      దాని మాట్లకి ఆ ఆడమనిషి ‘‘వొసే నీకి బుద్ది వుందో లేదో, యీ అడవిలో నీకి యేమి తెచ్చిపెడుదు’’ అని కసురుకొన్నంట. అపుడు పిల్లి ‘‘యేమే! ఆడ కూతురా!! అట్ల అబద్దం సెప్పుతావు. నిజ్జంగా నాకి ఆకలి తీర్సల్లని అనుకొంటే నువ్వు యింటికే పోవాల్నా?? నీ రొమ్ముల్లో పాలే లేవేమే పాపిష్టిదానా!’’ అని నోటికి వొచ్చినట్ల తిట్టబట్ట్నంట.
      ఆ మాట్లింటూనే ఆయమ్మకి కాళ్లూ సేతులూ అదరబట్నంట. వొళ్లంతా సెమట్లు బట్టి సంకలోని పిల్లిని కంపసెట్లలోనికి యిసరి పారేసి పరిగెత్తబట్నంట. ‘‘పోతివి పో!! తిరగా యీ దారెంబడి రాకుండా యట్ల పోతావో నేనూ సూస్తాను’’ అని తిట్టుకొంటా టెంకాయ మాన్ని యెక్కినంట.
      యింగా వొగసారి కొత్తగా పెండ్లయిన ఆలూ మొగుడూ కతలు సెప్పుకోని, పాటలు పాడుకోని, సిలకా గోరింకల మాదిరీ కిలకిలా నగుకొంటా యీ దారెంబడీ పోతా వుండ్రంట. సరిగ్గా టెంకాయి మాను కిందకు వొస్తూనే మామిడి తోపు మోట్లో తెల్ల సీర కట్కోని, తల నిండా మల్లిపూలు ముడుసుకోని వొగ ఆడ మనిషి కూకోని వున్నంట.
      యీ కొత్త జంట ఆ తావకి వొస్తూనే ‘‘యా వూరండ్రా మీది. మట్ట మద్యాన్నం పొద్దులో దేవాను దేవతల మాదిరీ ఆకాశము నుంచి నా కోసరమే దిగొచ్చినట్లుండారు’’ అన్నెంట.
      ఆ మాటలకి వాళ్లు అంతదంకా సేస్తా వున్న సల్లాపాల మాట్లు ఆపుసేసి ‘‘అమ్మయ్యా! మేము దేవుళ్లమూ కాదు దెయ్యాలమూ కాదు. ఆ కొండెనక పల్లిలో కూలీనాలీ సేసి బతికేటోళ్లము. యంతకీ నీకి యేమి అవసరము వొచ్చింది?’’ అని అడిగిరంట.
      అపుడు ఆయమ్మ ‘‘మారాజా! నా కత యేమని సెప్పుకొందు. మా అమ్మానాయనికి బిడ్లు పుట్టకుంటే గుడయిన గుడీ తిరిగి మొక్కయిన మొక్కూ మొక్కి తీర్తయాత్రలు సేసినంక వొగే కానుపులో యేడు మంది ఆడబిడ్లు పుట్టితిమంట. అట్ల పుట్టిన మమ్మల్ని ‘యేడుగురు అక్కమ్మ గారు’ అని పిల్సుకొంటా అల్లారుముద్దుగా పెంచుతా వుండ్రంట. మేముగూడా సోంబేరులుగా వుండకుండా యింట్లోనా, పొలాల్లోనా వుండే పనుల్ని యేడు బాగాలు సేసుకోని యేడు మందీ పోటీలు పడి సేస్తా వుంటిమి. అంతలో మాకి పెండ్లీడొస్తూనే మా నాయిన మాకి మొగుళ్లని యెదికేది మొదలు సేశ.
      ‘‘అంతలో యీడ కాలువకింద పల్లి అని మీకి తెలిసే వుంటుంది. ఆ వూర్లో రెడ్డెప్ప, నాయుడమ్మ అనే వాళ్లకి పుట్టిన ఆడబిడ్డ పుట్నట్లే సచ్చిపోతా వున్నంట. అట్ల యెందుకు జరుగుతా వుందో తెలుసుకొందామని వాళ్లు వొగ పెద్ద స్వామితో శాస్త్రమడిగితే, ఆ స్వామి వాళ్ల జాతకాలు సూసి, అస్త రేకు పరీచ్చ సేసి ‘అమ్మా! నీ కడుపు ఆడబిడ్లు పుట్టేదానికి నోసుకోలేదు. పలానా యాగము సేసి బీదాసాదలకి దానదర్మాలు సేసి నూటొక్క గుళ్లలో నూటొక్క టెంకాయలు కొట్టండి మేలు జరుగుతుంది’ అని సెప్పినంట.
      ‘‘వాళ్లు అట్లే సేస్తూనే యేడుగురు మగబిడ్లు పుట్రంట. వాళ్లూ పెండ్లికి యెదిగిరంట. పెండ్లి కూతుర్లని యెదికేదానికి మొదలు పెడితే వొగరికి కుదిరితే వొగరికి కుదుర్తా వుండ్లేదంట. కడాకి ఆ యింటి యజమానప్పకి వాళ్ల యింటెలుపు దేవుడు కల్లోకొచ్చి ‘యిట్ల మానవ యత్నంతో పెండ్లిండ్లు కుదరవు. జనాలు పుట్టేకి ముందే యెవర్ని యెవర్తో జత కట్టల్లో నేను సొరగ లోకంలో నిర్దారణ సేసెపెట్టి వుంటాను. నీ కొడుకుల కోసరము వొగే తల్లి కడుపులో యేడుగురు అక్కమ్మగారు పుట్టిండారు. వాళ్లని యెదికి నీ కొడుకులకి పెండ్లిసేయి’ అని సెప్పినంట.
      ‘‘ఆ రకంగా మా అక్కాసెల్లెళ్లకి వొగే దినము, వొగే ముహూర్తము, వొగే గడియలో, వొగే సప్పరం కింద రంగ రంగ వయిబోగంగా పెండ్లి జరిగిపాయ. అట్ల శుబకారియం జరిగిన యేడు దినాలకి మేము అత్తింటికి కాపురానికి పోతిమి. ఆడ యేడు దినాలన్నా సుకుంగా కాపురము సేస్తిమో లేదో మా యత్త మమ్మల్ని రాసి రంపంతో కోసేది మొదలుపెట్టె. ఆయమ్మ యేమి పని సెప్పితే ఆ పని సూదిమొన మోపినంత యెచ్చూ తక్కువ కాకుండా సేయల్ల. అట్ల సేస్తేనే కడుపునకు కూడు పెడుతుంది. లేకుంటే తిండి పెట్టకుండా సంపేదే కాక లేనిపోని దూర్లు సెప్పి మొగుళ్లతో బాగ కొట్టిస్తుంది.
      ‘‘నా వొరుకూ నేను యింటికి కావల్సినన్ని కట్టెలు దిన్నమూ కొట్టుకుపోవల్ల. వాటి కోసరమే యీ తోపులోకొచ్చి యెండు కట్టెలేరి మోపు కట్టిండాను. నెత్తి మిందకి యెత్తుకొందా మంటే శాతగాలేదు. యెవురన్నా మాన్న బావులు యీ దారెంబడీ వొస్తారేమో అని శానా పొద్దునుంచి కండ్లు కాయలుగాసే రకంగా యెదురు సూస్తా వుంటే దేవ దూతల మాదిరీ మీరు వొస్తిరి. ఆ గుంపు సెట్ల అవతలకి వొచ్చి నా నెత్తిమీదకెత్తి పున్నెం కట్టుకో’’ అని అన్నంట.
      ఆ బాగ్గిశాలి మాట్లిన్న కొత్త జంట ‘‘అయ్యో! దాందేముంది తల్లీ. వొగరి కొగరు సాయము సేయకుంటే మనిషి జన్మకూ కుక్క బతుక్కూ తేడా వుండదు. పద పోదాము’’ అని కదిలిరంట.
      అపుడు ఆయమ్మ ‘‘అమ్మా కొత్త పెండ్లి కూతురా, పుట్టినింటోళ్లు యిచ్చిన సిలుకు సీర కట్కోని పడుసు పావురం మాదిరీ మెరుస్తా వుండావు. యీడ సూడు అడుగుతీసి అడుగు పెట్టేదానికి కాకుండా కుక్క ముండ్లూ, నక్క ముండ్లూ, రేణి ముండ్లూ అర్లుకోనుండివి. అవి నీ సీరకి సుట్టుకోని సిర్రా పర్రాలుగా సించి పారేస్తాయి. నువ్వు యీడే వుండు, నీ పెనిమిటి వొగుడు సాలు’’ అన్నంట.
      ఆయమ్మ ఆడే కూకొంటే ఆయప్ప మాత్రమే కట్టెల మోపు యెత్తేకి సెట్ల గుంపు మరుక్కి పాయనంట. ఆడ కట్టెల మోపు దగ్గిర యిద్దరు పిల్లోళ్లు కూడా ఆట్లాడుకొంటా వుండ్రంట. యీయప్ప ఆయమ్మకి మోపు నెత్తిమీదకి యెత్తుతూనే వాళ్లు నన్నీ యెత్తుకో అని యేడ్సబట్రంట.
      వాళ్ల యేడుపు సూసి ఆయప్ప ‘‘వొరే అంత పెద్ద మోపు జతకి మిమ్మల్ని యట్ల యెత్తుకొంటుందిరా ఆ తల్లి’’ అని అంటూనే... ‘‘అయ్యా ఆసామీ!! ఆ కాలిబాట దంకా వాళ్లని అట్ల యెత్తుకో ఆట్నుంచి నా అవస్త నేను పడతాను’’ అన్నంట. సేసేది లేక ఆయప్ప యిద్దర్నీ రెండు సంకల్లోకీ యెత్తుకొంటూనే వాళ్లు ఆకలి ఆకలి అని అర్సబట్రంట.
      ఆ పిల్లోళ్ల అరుపులకి జాలిపడి యేడిదో గుర్తుకొచ్చినట్ల జోబీలు తడుముకొన్నంట. వాట్లో లడ్డుంట్లు వుంటే తీసి యిద్దరికీ వొగొగిటి యిచ్చినంట. వాళ్లు యేడుపు ఆపి వాట్ని తినబట్రంట.
      అందరూ నడిసి కాలి దావ దంకా వొచ్చి పిల్లోళ్లని ఆయప్ప కిందకి దించేకి పోతే వాళ్లు కిబ్బిబ్బీ అంటే సంకల నుంచి దిగలేదంట. దాంజతకి ‘‘యాల నాయినా మమ్మల్ని యీడ దిగమంటావు? అమ్మతో పాటు యింటికి రావా!!’’ అని అడగబట్రంట. ఆ మాట్లిని ఆయప్పకి పయి పానాలు పైకే పాయినట్లాయనంట. రవ్వంత తమాయించుకోని... ‘‘వొరే! యెవ్వుర్రా మీరు! యాపొద్దు నాకి పుట్టింట్రి?? పాపము, పిల్లోళ్లని యెత్తుకోని తినేకిస్తే తప్పుడు కూతలు కూస్తా వుండారు’’ అని ముకాన్ని నల్లగా మాడ్సుకోని యిద్దర్నీ కిందకి యిసరి పారేసినంట.
      వాళ్లని కిందకి యేస్తూనే ఆయమ్మ కస్సు బుస్సు అనే నాగుపాము మాదిరీ బుసకొడతా పెడీల్మని మోపు కిందకి పారేసి ‘‘వొరే నువ్వు యట్ల మగమనిషయి పుట్టిండావు. సొంతం బిడ్డల్ని పిశాచోని మాదిరీ యిసరికొడితివి. అది యావిదో కొత్తగా సిక్కిన రంకులాడిని యంటేసుకోని మమ్మల్నే కాదంటావా...!! నిన్ను యేమి సేస్తానో సూడు’’ అని శాపనార్తాలు పెట్టేకి మొదలుపెట్నంట.
      ఆడ సెట్టు కింద కూకోని వున్న పడుసు పెండ్లాముకి యిది యేమీ అర్తంకాక కంపరం పట్టినట్ల అయిపాయనంట. యేమి సేయల్లో, యెవరికి సెప్పుకోవల్లో తెలీక దిక్కులు సూసుకొంటా యేడిదో అనుమానమొచ్చి పిల్లోళ్లని సుదారిస్తా వుండే ఆయమ్మ కాళ్ల దిక్క సూస్తే అవి మనుషులకున్నట్ల లేవంట. పాదాలు యనిక్కి తిరిగి వుండివంట. అపుడు ఇది మాయదారి దయ్యము అని నిర్దారణకొచ్చి, అమ్మ జాగర్తలు సెప్పి యిచ్చిన నిమ్మకాయి, మంత్రించిన కుంకుమ గుర్తుకొచ్చినంట.
      గడియ సేపుగూడా ఆలీసెం సేయకుండా సేతి సంచిలో వుండే నిమ్మకాయి తీసి శాకుతో నడిమద్యకి కోసి మంత్రాల కుంకుంతో దిగదీసి ఆయమ్మ మిందకి యేసినంట. అంతేనంట!! ఆట్నుంచి కాళ్లకి బుద్దిసెప్పి యనక్కెనక్కే పారిపోతా ‘‘వొసే వగలాడీ!! నువ్వు వాంతో యన్నాళ్లు కులుకుతావో నేనూ సూస్తాను. నీ కాపురంలో నిప్పులుపోయకుంటే నన్ని నీ పేరుతో పిలుద్దువుగాని’’ అని తిట్టుకొంటా టెంకాయ మాను మిందకి గుడ్లగూబ మాదిరీ సేరిపాయనంట.
      ఆ సీకటి పొద్దులో వొంటిగా నడుస్తా వుండే నాకి యివన్నీ గుర్తుకొస్తూనే మీరే సెప్పండి లోపల యట్లుంటుందో!? నాకయితే వొళ్లు బిగుసుకుపాయ. సీమ సిటుక్కుమన్నా యినుకొంటా బిక్కు బిక్కున దిక్కులు సూసుకొంటా నడుస్తా వుండాను. దడ దడా అని గుండికాయి కొట్టుకోనేది, బుసాబుసా అని లోపలికి తీసుకోని బయటికి యిడిసే నా వూపిరి శబ్బుదాలు నన్నే బయం పెడతా వుండివి. యట్లో దయిర్యం సేసి రెండడుగులు సాగితే దయ్యం మాను దాటొచ్చు అని అనుకొంటా వున్నట్లే సెట్టు మింద సర్ర్‌ అనే శబ్బుదమొచ్చి పెడీల్‌ అని నా కుడి పక్క కానుగ సెట్ల మిందకి యేడిదో పడె.
      యింకేడిది? అది దయ్యమే అయ్యుంటుంది!! అయిపాయ!! నా కత ముగిసిపాయ. యేమి రూపము యెత్తుకోని నా ముందరికొచ్చి యేడిపించి యేడు సెరువుల నీళ్లు తాపి కరుస్తుందో కదా!! దాన్ని సూస్తూనే యాడ గుండె పగిలి సస్తానో కదరా బగమంతుడా!! అని దిగులు సుట్టుకోని వొళ్లంతా సెమట్లు పట్టె. ఆట్నుంచి పరిగెత్తల్లో, ఆ దయ్యము వొచ్చేదంకా ఆడే నిలబడల్లో తెలీని తికమకలో నేనుంటే యడం పక్క నుంచి సెట్ల సందుల్లో దూరి వొగ మనిషి ఆకారము నా దగ్గరికొచ్చె.
      నా నోరు ఆరుకుపొయ్యింది. వొంటేలుకు పోసుకొనేది వొగటి మిగిలింది. యేడిదన్నా మాట్లాడినట్ల అరుస్తాము అనుకొంటా వుండాను కానీ నోరు పెకల్లేదు. అంతలో ఆ ఆకారము ‘‘వొరే అప్పయ్యా!! రాముడూ, కొత్త కాపుల పిలోడు కదరా నువ్వు! యాల యీ సీకటి పొద్దులో వొంటిగా పోతా వుండావు’’ అని మాట్లాడుతూనే నాకేడిదో కాసంత సుదారింపు అందినట్లాయ.
      ఆయప్ప యెవురో కాదు, ఆ మామిడి తోపు యజమాండు జయరామప్ప. కాళ్లూ సేతులు కదిలిచ్చకుండా బిగుసుకోని నిలబడ్న నన్ని పలకరిస్తా బుజం మిందకి సెయ్యేశ. రవంత బయం తగ్గి పెదవుల్ని నాలికతో తడుపుకోని ‘‘పెద్దయ్యా నువ్వేనా!! అందరూ యీ మాన్లో దయ్యాలుండివి అని సెప్పుకొంటా వుంటే అన్నీ గురుతుకొచ్చి మాను మింద నుంచీ యేడిదో పడితే అదేనేమో అని జడుసుకోని నిలబడి పోతి’’ అని తడబడతా సెప్పితి.
      ఆ మాట్లకి ఆయప్ప గట్టిగా నగి ‘‘దయ్యాలూ బూతాల కతల్ని అమాయిక జనాలు నమ్ముతారుగానీ, యిసుకూల్లో కొత్త సదువులు సదువుతా వుండే నువ్వుగూడా యట్ల నమ్ముతావు. యీ టెంకాయసెట్లో కావల్లని నేను కాయలు తెంపను. బాగా బలిసినంక గొనల్నుంచి అవే రాల్తా వుంటాయి. కాకతాళీయము అన్నట్ల కొందరు అది దయ్యము అని, దయ్యాల పని అని బయంపడతా వుంటారు.
      ‘‘యింగ కతలూ గట్రా అంటావా!? జనాలు మామిడి తోట్లో దూరి కాయలు కోసుకోకుండా కట్టడీ సేసేకి నేనే తయారు సేసి అందరి సెవుల్లోకీ బయాల రసం మాదిరీ నింపిండాను. ఆ దయ్యాల కతలే రాతిరీ పగలూ నా తోటని కాపలా కాసే కనిపించని వుక్కు కవశాలు’’ అనె.
      ఆ మాటల్తో యీ దయ్యాల కతల మర్మం తెలిసిందే కాక పెద్ద కొండని నా నెత్తిమింద నుంచి యెవురో టక్కన దించినట్లాయ. మనసులోనే జయరామప్పకి దండాలు పెట్టుకోని వొళ్లంతా వుషారు నింపుకోని ‘హిప్‌ హిప్‌ హురా’ అని పాటలు పాడుకొంటా యింటిదావ పట్టితి.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


వాళ్లు ఏడ్చారు!

వాళ్లు ఏడ్చారు!

పి.చంద్రశేఖర అజాద్‌


స్వ‌యంవ‌ధూ...!?

స్వ‌యంవ‌ధూ...!?

దోరవేటి, (వి.చెన్నయ్య)


సువర్ణ గన్నేరు పూలు

సువర్ణ గన్నేరు పూలు

ప్రసాదమూర్తి


స‌మిధ‌

స‌మిధ‌

సయ్యద్‌ సలీం


అతడూ మనిషే!

అతడూ మనిషే!

పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


దాసరి పాట (క‌థాపారిజాతం)

దాసరి పాట (క‌థాపారిజాతం)

చింతా దీక్షితులుbal bharatam