మైదానం

  • 171 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కడిమిచర్ల రామమనోహర్‌

  • హైదరాబాదు.
  • 9652307140
కడిమిచర్ల రామమనోహర్‌

ఎన్నేళ్లు గడచినా బాల్య జ్ఞాపకాల పరిమళం జీవితాన్ని అంటిపెట్టుకునే ఉంటుంది. గౌతమ్‌ కూడా ఆ సుగంధాన్ని ఆస్వాదిస్తూనే ఊరికి బయల్దేరాడు. అక్కడ తను పొందిన అనుభూతులేంటి? 
అలారం..
అప్పుడే పలారం తిన్న పిల్లాడిలా గట్టిగా అరుస్తోంది! ఎప్పుడు మోగుతుందాని ఎదురు చూస్తున్న గౌతమ్‌ వెంటనే లేచి కూర్చున్నాడు. అయిదే అయిదు నిమిషాల్లో తయారైపోయాడు. తొందరగా వెళ్లాలి! అమ్మ పిలుస్తోంది.. ‘‘ఇంత పొద్దున్నే ఎక్కడికిరా’’ అని! ఎప్పటిలాగే... ‘‘ఇప్పుడే వస్తానమ్మా’’ అంటూ వాకిట్లోకి పరుగు తీసి సైకిల్‌ వైపు చూశాడు. రాత్రి కురిసిన చిన్నపాటి వర్షానికి స్నానం చేసి మెరిసిపోతోందది! ఎప్పుడెప్పుడు గౌతమ్‌ బయటికి తీసుకెళ్తాడా అని ఆశగా చూస్తోంది!
      సైకిల్‌ ఎక్కిన గౌతమ్‌.. ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కిన వాడిలా సంతోషంతో ఊగిపోతున్నాడు. రాకెట్‌ వేగంతో.. కాదు కాదు సైకిల్‌ వేగంతో తన ఇష్టమైన చోటుకి చేరుకున్నాడు. అంతా సందడి! తన వయసు వాళ్లు, తన కన్నా పెద్దవాళ్లు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ఎవరి హడావుడి వారిది! అంత మందిలో తన వాళ్లను వెతుక్కోవటానికే పది నిమిషాలు పట్టింది. వాళ్లు కనబడ్డాక కళ్లు తళుక్కున మెరిశాయి.. వజ్రాల్లా! ఒక్క ఉదుటున అక్కడ వాలిపోయాడు! ఇంత సంతోషమిచ్చిన ఆ ప్రదేశమంటే తనకు ప్రాణం.. అదే మైదానం!
      క్రికెట్, వాలీబాల్, కోకో, టెన్నిస్‌... ఇలా ఎన్నెన్ని ఆటలనీ! ఆకాశంలో సూర్యుడు వచ్చి నవ్వక ముందే.. ఇక్కడ సందడి మొదలు. ఆయన వెళ్లే వరకు అది కొనసాగుతూనే ఉంటుంది. అక్కడ ఆటలాడే వారందరికీ ఈ మైదానమే సర్వస్వం. అందరి మాట ఎలా ఉన్నా.. గౌతమ్‌కు మాత్రం ఓ పట్టాన ఆ మైదానాన్ని వదిలి రావటం నచ్చదు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మెట్టినింటికి వెళ్లే అమ్మాయిలా దిగులుగా అయిపోతాడు. రోజూ ఇంతే! గౌతమ్‌ అమ్మ గృహిణి. నాన్న ఉపాధ్యాయుడు. బదిలీల కారణంగా తరచుగా ఊళ్లు మారాల్సి వచ్చేది. ఎక్కడా ఇంత ఆనందం లేదు గౌతమ్‌కి!       ఇప్పుడున్న మహబూబాబాద్‌ చాలా నచ్చింది. కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలతో తీరిక లేకుండా గడుపుతున్నాడు గౌతమ్‌. ఈ మైదానంతో బంధం పెరగటానికి కారణం కూడా స్నేహితులే. ఆటలంటే ఇష్టమని చెబితే.. వాళ్లంతా అక్కడికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆ మైదానానికి వెళ్లటం, గంటల తరబడి ఆడుకోవటం అలవాటైంది. పదో తరగతి కావడం వల్ల అమ్మ, నాన్నా వారిస్తున్నా పట్టించుకోకుండా ఆదివారం వస్తే చాలు ఆటలకే అంకితమైపోయాడు.
ఇప్పుడు పరీక్షలు అయిపోయాయి. ఫలితాల కోసం చూస్తున్నారు. గౌతమ్‌ మాత్రం ధీమాగా మైదానంలోనే గడిపేస్తున్నాడు. ఆరోజు రానే వచ్చింది! మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు! వెంటనే ఇంటర్‌ కోసం హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో హాస్టల్‌లో చేర్పించాలని అమ్మ, నాన్న నిర్ణయించారు. తప్పని పరిస్థితుల్లో గౌతమ్‌ వెళ్లాల్సి వచ్చింది. వెళ్లాడన్న మాటే గానీ.. ధ్యాసంతా ఊరిపైనే! ముఖ్యంగా ఆ మైదానంపైనే! దానికి దగ్గర్లోనే ఉండే మిర్చి బజ్జీల కొట్టు.. తనకి గుర్తొస్తుండేది! ఏ ఆటైనా గెలిచినా, ఓడినా అందరూ అక్కడ చేరి.. ‘గణేశ్‌ బాబాయ్‌ గరంగరం మిర్చి బజ్జీలు వేసివ్వు’ అంటూ అరిచేవారు. రోజుకోసారైనా ఆ జ్ఞాపకాలను నెమరువేసుకునేవాడు గౌతమ్‌..!
      ఎప్పుడు గడిచాయో తెలియదు.. ఇంటర్‌ పూర్తి కావటం, తర్వాత బీటెక్‌ చేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సంపాదించటం జరిగిపోయాయి. నాన్న పదవీ విరమణతో సొంతిల్లు అద్దెకిచ్చి అందరూ హైదరాబాదు గూటికే చేరారు. సంవత్సరాలు  గడుస్తున్నా గౌతమ్‌ను ఆ జ్ఞాపకాలు వీడటం లేదు. ఇంటి దగ్గర ఓ చిన్న స్థలంలో పిల్లలు ఆడుకోవటం చూసినప్పుడల్లా మళ్లీ మళ్లీ గుర్తు చేసుకునేవాడు. అన్ని మధుర స్మృతులు ఇచ్చిన ఆ ఊళ్లో బంధువులు ఎవరూ లేరు. అయినా అక్కడికి వెళ్లాలని ఎన్నో సార్లు అనుకునేవాడు. ఈ హడావుడి జీవితానికి దూరంగా ఆ ఊరికి దగ్గరగా ఒక్కరోజైనా గడపాలని ఆరాటపడుతుండే వాడు. ప్రతిసారీ ఏదో ఆటంకం.
      చెబితే.. ఏదో వంకతో వెనక్కు లాగుతారని ఆలోచించాడు. అందుకే స్నేహితుడి పెళ్లి అని బయలుదేరాడు. మహబూబాబాద్‌ సమీపిస్తున్న కొద్దీ ఏదో ఉద్వేగం. స్టేషన్లో రైలు ఆగగానే.. మనసు మైదానం వైపు పరుగులు పెట్టాలని తొందరపెడుతోంది. కానీ ముందు సొంతింటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లగానే గుర్తొచ్చింది.. స్టోర్‌ రూమ్‌లో ఉన్న సైకిల్‌..! ఇప్పుడు అద్దెకు ఉంటున్న వాళ్ల పిల్లాడు కావాలని అడిగితే నాన్న ఇచ్చేశారట.. తనతో చెప్పకుండా!
      ఎన్నో ఏళ్ల తర్వాత ఆ సైకిల్ని చూడబోతున్నాడు గౌతమ్‌. తన కళ్లు మెరుస్తున్నాయ్‌. మెల్లగా సైకిల్‌ దగ్గరికి వెళ్లాడు. ఒక్కసారిగా సైకిల్‌తో ఉన్న జ్ఞాపకాలు మనసుని అల్లేశాయి. దాన్ని ముట్టుకోగానే ఏదో అనుభూతి. ఆ స్పర్శతో మైమరచిపోయాడు. ఇప్పుడు దాన్ని ఎక్కి తొక్కటం కుదరదు. అయినా సరే, దుమ్ముదులిపి, హ్యాండిల్‌ పట్టుకుని మైదానం వైపు నడవటం మొదలు పెట్టాడు. అప్పటికీ ఇప్పటికీ ఎంతో మారింది. దారిలో కాస్త గుర్తుపట్టిన వాళ్లు పలకరిస్తున్నారు.
      చిరునవ్వే సమాధానంగా ముందుకు సాగిపోయాడు. వచ్చేస్తోంది.. ఆ మైదానం! ఎన్నో సంవత్సరాలుగా చూడలేకపోయానని పడ్డ బాధ ఇప్పుడు తీరనుంది. కనిపించింది..! మెల్లగా సైకిల్ని నడిపించుకుంటూ లోపలికి వెళ్లాడు. కాసేపటి వరకూ తాదాత్మ్యత నుంచి బయటికి రాలేకపోయాడు. అప్పటిలా ఇప్పుడు పిల్లల సందడి లేదు. ఆదివారమే అయినా ఎవరూ ఇటువైపు రావటం లేదు. అంతా స్మార్ట్‌ఫోన్లలో ఆటలకు అతుక్కుపోయుంటారు. అది వెలితిగా అనిపించినా.. ఆ మైదానంతో ఉన్న సంబంధాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకున్నాడు గౌతమ్‌.
      చాలా రోజుల తరవాత పాత స్నేహితుణ్ని కలిసిన అనుభూతి కలిగింది. ఆ స్థలమంతా తిరిగాడు. ఖోఖో ఆడుతుండగా కిందపడి దెబ్బ తగిలింది ఇక్కడే.. డైవ్‌ చేసి మరీ సూరిగాడి బ్యాటింగ్‌లో క్యాచ్‌ పట్టింది ఇక్కడే.. వికెట్లు ఇక్కడే పెట్టేవాళ్లం.. ఇలా చిన్న పిల్లాడిలా అంతా తిరుగుతూ అన్నీ గుర్తుకు తెచ్చుకున్నాడు. అక్కడ ఎవరూ లేకపోయినా.. గంటల కొద్దీ గడిపాడు! జీవితానికి సరిపడా ఆనందం అక్కడే పొందినట్లు అనిపించింది. ఉండాలని అనిపించినా.. మర్నాడు ఆఫీస్‌ ఉందన్న విషయం గుర్తొచ్చి బయల్దేరక తప్పలేదు. మళ్లీ ఆ సైకిల్‌ని నడిపించుకుంటూ.. మాటిమాటికీ వెనక్కి తిరిగి మైదానాన్ని చూస్తూ వెళ్తున్నాడు. ఫొటోలు, వీడియోలు తీసుకుంటే గుర్తుగా ఉంటాయి కదా అనుకుని వెనక్కి తిరగబోయాడు. మళ్లీ అనిపించింది.. ఫోన్లో ఉంటే అవి చూసుకుని తృప్తి పడొచ్చు. కానీ.. ఇలా ఈ అనుభూతి చెందలేం కదా..! ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చి రెండు గంటలు గడిపి వెళ్లాలని అనుకున్నాడు! హైదరాబాద్‌ చేరుకుని, ఇంటికి రాగానే.. అమ్మ, నాన్న అడిగిన ప్రశ్న ‘‘పెళ్లి ఎలా జరిగిందిరా’’ అని! ‘‘వెళ్లింది పెళ్లికి కాదమ్మా..! మన ఊరికి!’’ అన్నాడు గౌతమ్‌. ‘‘అవునా... అక్కడెవరున్నార్రా..?’’ అనడిగాడు నాన్న..! 
      ‘‘నేనున్నాను నాన్నా! అక్కడే ఉన్నాను...’’ నవ్వుతూ సమాధానమిచ్చి... గట్టిగా హత్తుకున్నాడు గౌతమ్‌! 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


వాళ్లు ఏడ్చారు!

వాళ్లు ఏడ్చారు!

పి.చంద్రశేఖర అజాద్‌


స్వ‌యంవ‌ధూ...!?

స్వ‌యంవ‌ధూ...!?

దోరవేటి, (వి.చెన్నయ్య)


సువర్ణ గన్నేరు పూలు

సువర్ణ గన్నేరు పూలు

ప్రసాదమూర్తి


స‌మిధ‌

స‌మిధ‌

సయ్యద్‌ సలీం


అతడూ మనిషే!

అతడూ మనిషే!

పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


దాసరి పాట (క‌థాపారిజాతం)

దాసరి పాట (క‌థాపారిజాతం)

చింతా దీక్షితులుbal bharatam