ఆశలు ఫలించిన క్షణం ఆమెలో ఆనందం లేదు. తన చిరకాల కోరిక ప్రాణం పోసుకుని తన కళ్ల ముందుకు వచ్చినా ఆ తల్లికి ఆనందాశ్రువులకు బదులు కన్నీళ్లే వస్తున్నాయి. ఎందుకు? ఆ వేదనను ఆమె తట్టుకుందా?
ఒలిచిన బత్తాయిలా ఉన్న తన పక్కలోని పసికందుని మగత కళ్లతో చూసుకుంది గాయత్రి. బిడ్డని చేతులతో తడుముకుని అంతటి మగతలోనూ నిశ్చేష్టురాలైంది. బిడ్డ బరువు గురించి ఎవరో మాట్లాడుకోవడం చెవిలో పడీ పడనట్టుగా ఉంది. మగత ఆమె బాధని పైకి రానివ్వట్లేదు.
* * *
భార్గవ్ పుట్టిన నాలుగేళ్లకు మళ్లీ తల్లినవుతున్నానని తెలియగానే గాయత్రికి ఆనందం అవధులు దాటింది. ఈసారి ఆడపిల్ల కావాలని వేయి దేవుళ్లకు మొక్కింది. పుట్టేది ఆడపిల్లే అనుకుంది. పేరు సమీర అని కూడా పెట్టేసుకుంది. బుట్ట గౌను వేసుకుని, ఇంట్లో తప్పట డుగులు వేసే సమీరని ఊహించుకొని మురిసిపోసాగింది గాయత్రి. భర్త జగదీశ్ రైల్వేలో పనిచేస్తుండటంతో రైల్వే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ఎప్పటికప్పుడు బాగానే జరుగుతున్నాయి. డాక్టరు కూడా జగదీశ్ కుటుంబానికి బాగా పరిచయస్థుడే. అయిదో నెల వచ్చిన దగ్గర్నుంచీ గాయత్రి ఒకే ప్రశ్నతో డాక్టరును వేధించడం మొదలుపెట్టింది.. ‘‘ఆడపిల్లేనా.. డాక్టర్ ఆడపిల్లేనా’’ అంటూ! ‘‘చెప్పగూడదమ్మా నేరం’’ అనేవాడాయన. ‘‘ఆడపిల్ల అక్కర్లేదనుకుని.. తెలుసుకొని అఘాయిత్యం చేసే వాళ్లకి నేరం గానీ నాకుకాదు డాక్టర్. నేను మనస్ఫూర్తిగా కావాలనుకుంటున్నాను.. ఆడపిల్లేనా’’. ‘‘ఏది ఏమైనా చెప్పకూడదమ్మా ఇది నేరం’’ డాక్టర్ జవాబు. పక్కనే ఉన్న జగదీశ్ భార్యను మాట్లాడొద్దు అని సైగ చేస్తూండేవాడు. ప్రతీ చెకప్లోనూ ఇదే తంతు. ఎక్కడ నేర్చుకొన్నాడో భార్గవ్ కూడా ‘‘అమ్మా చెల్లి ఎప్పుడు వస్తుంది, వచ్చాక నాతో స్కూలుకి వస్తుందా.. నాతో ఆడుకుంటుందా?’’ ఇలాంటి ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు. వాటికి గాయత్రి తెగ మురిసిపోయేది. ఏడో నెల నిండగానే మళ్లీ చెకప్‌కి వచ్చింది గాయత్రి భర్తతో కలిసి. ‘‘ఏమ్మా ఎలా ఉన్నారు? ప్రశ్నలు అడక్కండి. సమాధానాలు చెప్పలేం మేం..’’ స్కానింగ్ పరికరాలను అమర్చుకుంటూ నవ్వుతూ పలకరించాడు డాక్టర్. ‘‘బాగున్నాను సర్, పర్లేదు చెప్పండి.. ఒక్క ప్రశ్నే కదా’’. ‘‘ఉహు..’’ చిరునవ్వు నవ్వాడు డాక్టర్.
స్కానింగ్ చేయడం మొదలుపెట్టారు. కొంతసేపటికి టెక్నీషియనూ డాక్టరూ ముఖాలు చూసుకుని, ఏం బోధపడిందో, స్కానింగ్ ఆపేసి రిపోర్ట్ తీయడానికి తయారయ్యారు. గాయత్రి దుస్తులు సరిచేసుకుని డాక్టర్ దగ్గరికి వచ్చింది. అప్పటికే జగదీశ్ ఆయన గదిలో ఉన్నాడు. డాక్టర్ సీరియస్‌గా ఉన్నాడు. చిరునవ్వు తెచ్చుకోడానికి కష్టంగా ప్రయత్నిస్తున్నాడు. ‘‘ఆడపిల్లేనా?’’ గాయత్రి ఆదుర్దాగా అడిగింది. డాక్టర్ స్కానింగ్ రిపోర్టునే చూస్తున్నాడు. ‘‘చెప్పండి.. సమీరేనా?’’ గాయత్రి రెట్టించింది. ‘’అవునమ్మా.. కానీ’’ భారంగా నసిగాడు డాక్టర్.
గాయత్రి ఆనందంతో ఉప్పొంగిపోయే లోపు డాక్టర్ గొంతు సరిచేసుకుని ‘‘చెప్పగూడదమ్మా కానీ కడుపులో పిల్లకి ఎదుగుదల లేదు’’ అన్నాడు. గాయత్రీ జగదీశ్‌ల ముఖాలను పరికిస్తూ చెబుతున్నాడు.. ‘‘పైగా అంగవైకల్యం కూడా ఉండే అవకాశం ఉంది.. అందువల్ల.. పాప’’.. ఆయన మాటలు చెవినపడట్లేదు గాయత్రి, జగదీశ్‌లకు. తన కలలపంట నట్టింట్లో నడయాడదా అని గాయత్రి సతమతమవుతుంటే, జగదీశ్ ఆలోచనలు తన చిన్నతనం వైపు తొంగిచూశాయి.
* * *
జగదీశ్ తండ్రి రాఘవకు తల్లీదండ్రీ చిన్నప్పుడే పోవడంతో ఒక తమ్ముడు, పోలియోతో రెండు కాళ్లు చచ్చుబడిపోయిన చెల్లెలు బాధ్యత తన మీదే పడింది. తమ్ముడు చదువుకుని, ఉద్యోగస్థుడై ఒకింటి వాడయ్యాక తన దారి తను చూసుకున్నాడు. ఇంట్లో ఉన్నంత సేపూ చెల్లెలికి చేయాల్సిన పన్లన్నీ చేసుకుని ఆఫీసుకు వెళ్లేవాడు రాఘవ. జగదీశ్ తల్లి సుగుణ మాత్రం ఆడపడుచు తన తల మీద మోయలేని భారమైందంటూ చుట్టుపక్కల వారితోనూ, చుట్టపుచూపునకు వచ్చిన వారితోనూ చెప్పుకుంటుండేది. జగదీశ్ పుట్టిన తర్వాత మరింతగా గొడవలు పెరిగాయి. తమ సరదాలకూ, షికార్లకూ ఆడపడుచు గుదిబండైందంటూ సుగుణ విరుచుకుపడేది రాఘవ మీద. వాళ్ల గొడవలకు కారణం అవిటి మేనత్త అని మాత్రం అర్థమయ్యేది అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న జగదీశ్‌కు. ఇంట్లో ఇలాంటి వాతావరణంలో చదువు మీద తనకు శ్రద్ధ ఉండేది కాదు జగదీశ్‌కు. దాంతో పట్నంలోని హాస్టల్లో చేరాడు రాఘవ. ఒక్కసారిగా రెక్కలు వచ్చినట్టయ్యింది జగదీశ్‌కు. ఎప్పుడు సెలవులు దొరుకుతాయా ఇంటికెళ్దామా అని తోటిపిల్లలు చూస్తుంటే, తను మాత్రం ఇంటి మొహం చూడటానికి కూడా ఇష్టపడేవాడు కాదు.
* * *
నెలలు నిండాక, ఆపరేషన్ చేశారు. మగత నుంచి కొంచెం తేరుకొని మళ్లీ పక్క తడుముకొంది గాయత్రి. పిల్ల కనబడలేదు. ‘‘పాపను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది నర్సు’’ అంటున్న భర్త మాటలకు కొంత ఊరట కలిగింది గాయత్రికి. పావుగంట తర్వాత పాపని తన దగ్గరికి తెచ్చాక ఆ ఆనందం నిలవలేదు. పాపని చూడగానే బెంబేలు పడిపోయింది. ‘నా కలల స్వరూపం’ అనుకుంటూ మ్రాన్పడి పోయింది. పాప ఒళ్లు పాలిపోయి తెల్లగా అరచేతిలో ఇమిడిపోయేంత చిన్నదిగా ఉంది. కార్డియాక్ లెసియన్స్ ఉండటంతో గుండె సరిగా రక్త ప్రసరణ చేయలేకపోతోందిట.
పాప ఎన్నో రోజులు బతకదని డాక్టర్లు చూచాయగా చెప్పడం గాయత్రి చెవినబడింది.
* * *
మంగ.. గాయత్రికి దూరపుబంధువు. చుట్టం చూపునకని ఆసుపత్రికి వచ్చింది. సమీరని చూసి ‘‘చాలా కష్టం. ఇలాంటి పిల్లల్ని సాకడం.. డాక్టర్లు చెప్పినట్లు ఎక్కువ రోజులు బతక్కపోయినా ఫర్వాలేదు’’ అనేసింది. గాయత్రి బాధగా చూసింది మంగ వైపు. ఆ చూపులో తొమ్మిది నెలల బరువు, అయిదేళ్ల కోరిక నిండి ఉన్నాయి. అప్పుడే నిర్ణయించుకుంది గాయత్రి, ఎలాగైనా సమీరని పెంచి పెద్దదాన్ని చేయాలని. ఇది సృష్టి కాదా, భగవంతుడి సృష్టిలో ఇది ఒక రంగు కాదా, నా కోరిక విన్న భగవంతుడు సగమే వింటాడా.. ప్రతీ ఆలోచనా తనలోని బాధని బలంగా మార్చడం మొదలు పెట్టింది. జగదీశ్‌కు పాపను చూస్తూంటే తన మేనత్త గుర్తుకొస్తోంది. తను కేవలం ఆమె అవిటితనం చూసి భరించలేకపోయే వాడా.. లేక తల్లి ఆమెకు చేయాల్సిన పనులు చేయకపోగా.. ఓర్పుగా అత్తకు అన్ని పనులూ చేస్తూండే తండ్రితో గొడవ పడుతుంటే వినలేక పోయేవాడా!! కారణం ఏమైతేనేం.. తను పెరిగి పెద్దయినా చదువు, ఉద్యోగం పేరుతో ఇంటికి దూరంగానే ఉండేవాడు. అప్పుడు ఆ సమస్య నుంచి రెక్కలు కట్టుకుని మరీ పారిపోయాడు. కాలక్రమంలో ముందు తల్లీ, తర్వాత నాలుగేళ్లకు నెలల తేడాలో అత్తా, నాన్న మరణాలూ.. కన్న ఊర్లో ఇంటినీ, ఆ వాతావరణాన్ని తను పూర్తిగా మరచిపోయేలా చేసిన కాలచక్రం గిర్రున తిరిగి తిరిగీ మళ్లీ తనను పాత కాలానికే తీసుకెళ్లిందా.. పాపలో మేనత్త పోలికలు అస్పష్టంగా కనపడుతున్నాయి.. గుండె కలిచినట్లయ్యింది జగదీశ్‌కు. మొదటిసారిగా పశ్చాత్తాపం మొదలైంది తనలో.
* * *
గుక్కెడు పాలు కూడా తాగలేని సమీరకి రెండు నెలలు నిండాయి. అలాగే పీలగా ఉన్న పాపకి ఏడవడం కూడా రాలేదు. చిన్ని పెదవుల కదలిక ఒకసారి నవ్వులా కనబడేది గాయత్రికి. కానీ, పాప మెదడు తగినంత పెరగలేదని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు.
పాపను ముట్టుకోనీయకుండా భార్గవ్‌ను దూరం ఉంచేది గాయత్రి. తల్లెందుకు దగ్గరికి రానీయడం లేదా అని ఎవరూ చూడనప్పుడు పాప బుల్లిబుల్లి చేతులూ, కాళ్లనూ పట్టుకునేవాడు భార్గవ్.
చెల్లిని డాక్టరు దగ్గరికి తీసుకెళ్లి వస్తున్న ప్రతిసారీ అమ్మానాన్నలు ఎందుకు బాధపడుతున్నారో- భార్గవ్‌కు ఏమర్థమైందో కానీ ఒకరోజు ఊయల్లో నిద్రపోతున్న పాప వైపు వెళ్లాడు. ఆపుదామని అదాటున వెనకే వచ్చిన జగదీశ్‌కు, చెల్లెలి రెండు చేతుల్నీ దగ్గరగా చేర్చి భగవంతుడికి నమస్కారం చేయిస్తున్న కొడుకులో తండ్రి కనిపించాడు.