అల్లరి

  • 365 Views
  • 5Likes
  • Like
  • Article Share

    సత్యవోలు కిరణ్‌కుమార్‌

  • హైదరాబాదు
  • 9703222329
సత్యవోలు కిరణ్‌కుమార్‌

రాజబాబంటే సుకుమారికి జాలితో కూడిన అభిమానం! అయ్యగారి 'కష్టానికి' వాట్సాప్ లోనే కన్నీరు కారుస్తుందామె! రమణికి మాత్రం భర్త మీద ఎక్కడాలేని అనుమానం! ఇది కాస్తా ఒకరోజు పెద్ద అల్లరికే దారితీసింది!
ఆదివారం కావడంతో కాస్త ఎక్కువసేపు నిద్రపోదామనుకునే రాజబాబు ఆశల మీద నీళ్లు జల్లింది సుకుమారి. వాట్సప్‌ మెసేజ్‌ వచ్చినట్టు ఫోన్‌ మోగడంతో నిద్ర కళ్లతోనే ఫోన్‌ తీసుకున్నాడు.
      ‘‘ఈరోజు పనికి రావడం లేదయ్యగారు’’ అని మెసేజ్‌ చేసింది సుకుమారి.
      ‘‘ఎందుకు రావట్లేదు?’’ రిప్లై ఇచ్చాడు.
      ‘‘మా ఊరికి పోతున్నాను.’’
      ‘‘హఠాత్తుగా చెప్తే ఎలా?’’
      ‘‘ఆదివారం మీకే సెలవు ఉండాలా? మేము తీసుకోకూడదా?’’
      ‘‘అలా కాదు సుకుమారి, ముందే చెబితే రాత్రి మేము బయట ఆర్డర్‌ పెట్టుకుని తినేసేవాళ్లం కదా, ఇప్పుడు అంట్లన్నీ ఎవరు తోముతారు?’’
      ‘‘నాకు తెలియదు. మీ ఆవిడను తోముకోమని చెప్పండి. బొత్తిగా కాఫీ పెట్టడం కూడా రాదు’’ అని బదులిచ్చింది.
      రాజబాబు సమాధానమిచ్చేలోపు భార్య రమణి కాఫీ పట్టుకుని గదిలోకి వచ్చి ‘‘పొద్దున్నే ఎవరితో చాట్‌ చేస్తున్నారు?’’ అనడిగింది.
      ‘‘సుకుమారి.. ఈరోజు పనికి రాదంట’’
      ‘‘దొంగ మొహంది. ఈ వారంలో ఇది మూడోసారి మానేయడం. అయినా దానితో చాటింగ్‌ ఏంటి?’’
      ‘‘అదే, ఎందుకు రావడం లేదో అడుగుతున్నాను. ఊరెళ్తోందట’’
      ‘‘అన్నీ అబద్ధాలే. బద్ధకం మనిషి.. ముందు కాఫీ తాగండి’’ అని కాఫీ గ్లాస్‌ అందించింది.
      గ్లాసు అందుకుని, ‘‘నువ్వెందుకు శ్రమ పడతావ్‌. నేను కాఫీ పెడతాను కదా!’’ అన్నాడు. ‘‘హౌ క్యూట్‌..’’ అంటూ నవ్వుతూ ఎదురుగా కూర్చుని ‘‘ఏది ఏం మెసేజ్‌ చేసిందో చూస్తానివ్వండి’’ అంది ఫోన్‌ అడుగుతూ.
      ‘‘నేను చెప్పాను కదా, అంతే.. ఇంకేమీ లేదు’’ అన్నాడు కషాయంలాంటి కాఫీని మింగుతూ.
      ‘‘ఏం దాస్తున్నారు?’’
      ‘‘అబ్బా.. ఏమీ లేదు’’
      ‘‘అదిగో... ఏదో దాస్తున్నారు. పనిమనిషిని పెట్టినప్పుడే అనుకున్నాను. డబ్బులు బేరం ఆడలేదు. పైగా ఫోన్‌ నెంబర్‌ ఉందా అని అడిగి మరీ తీసుకున్నారు’’
      ‘‘అయ్యో..! తీసుకోమని నువ్వేగా చెప్పావ్‌’’
      ’’చాట్‌ చేయమని చెప్పలేదు’’
      ‘‘తను రానని మెసేజ్‌ చేస్తే ఎందుకని అడుగుతున్నాను అంతే!’’
      ‘‘అలాంటప్పుడు ఫోన్‌ చూపించడానికేంటి నొప్పి?’’
      ’’నొప్పేమీ లేదు’’
      ‘‘మరి చూపించండి...’’ అని ఫోన్‌ లాక్కుంది.
      సుకుమారి పంపిన చివరి మెసేజ్‌ చదివి కళ్లు పెద్దవి చేసింది. ‘‘నాకు కాఫీ పెట్టడం కూడా రాదా?’’ అనడిగింది
      ‘‘లేదు. బాగా పెడతావ్‌. నేను తాగుతున్నాను కదా!’’ అన్నాడు.
      ‘‘ఓహో.. నా కాఫీ బాగోదు కనకే మీరు పెడతానన్నారా?’’ అడిగింది కోపంగా.
      ‘‘కాదు...’’
      ‘‘చూడండి.. నమ్మకంగా చెప్పలేకపోతున్నారు’’
      ‘‘లేదు రమణీ.. నన్ను నమ్ము. నీ కాఫీ సుకుమారికి నచ్చలేదేమో అంతే!’’
      ‘‘ఆవిడగారికి నచ్చకపోతే ఆ విషయం మీకెందుకు చెప్పాలి. మీ మీద ఎందుకు జాలి చూపించాలి?’’
      ‘‘ఏదేదో ఊహించుకోకు.’’
      ‘‘నేనేమీ ఊహించుకోవట్లేదు. అయినా సుకుమారిని ఎందుకు వెనకేసుకొస్తున్నారు?’’
      ‘‘నేనెక్కడ వెనకేసుకొచ్చా.. ఏదేదో ఊహించుకోకు’’ అన్నాను.
      ‘‘అయినా కాఫీ పెట్టడం కూడా రాని దాన్ని, ఇంక అంట్లు ఏమి తోముతాను? మీరే తోమండి’’
      ‘‘నేనా?’’
      ‘‘అవును. వెళ్లండి.. తోమండి. పొద్దున్నే నన్ను బాధపెట్టారు. మీరు అంట్లు తోముతున్న ఫొటో తీసి సుకుమారికి వాట్సప్‌ చేస్తాను’’
      ‘‘ఎందుకు?’’
      ‘‘నా ఇష్టం’’ .
      చెప్పినట్టుగానే గిన్నెలు తోముతున్న రాజబాబు ఫొటోని సుకుమారికి పంపింది రమణి. అలాగే రాజబాబు వాట్సప్‌ స్టేటస్‌లో కూడా ఫొటో పెట్టి, ‘‘మా ఆవిడకు సాయం చేస్తూ...’’ అని రాసింది.

* * *

      అంట్లు అన్నీ కడిగేసి సోఫాలో కూలబడ్డాడు రాజబాబు. ఫోన్‌ తీసుకుని చూసేసరికి కాంటాక్ట్స్‌లో సగం మంది మేసేజులు పెట్టారు. ఆఫీస్‌ మేనేజర్‌తో సహా అందరూ రాజబాబు స్టేటస్‌కి బదులు పలికారు. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు.
      ‘‘వెరీ క్యూట్‌ హస్బెండ్‌’’
      ‘‘నిజం చెప్పు.. మీ ఆవిడతో గొడవ పడ్డావ్‌ కదా’’
      ‘‘అప్పుడే మొదలైందా!’’
      ‘‘వెల్‌కమ్‌ టూ ది క్లబ్‌’’
      ‘‘ఫొటో తీసింది మీ ఆవిడే కదా’’
      ‘‘సో పిటీ ఆఫ్‌ యూ’’
      ‘‘మొదట్లో ఇబ్బందిగా ఉంటుంది. నెమ్మదిగా అలవాటైపోతుంది’’
      ‘‘నీ స్టేటస్‌ చూపించి మా ఆవిడ కూడా నాతో గిన్నెలు తోమించిందిరా దరిద్రుడా’’
      అన్నీ చూసి ‘‘నాకు ఎప్పుడు మెసేజ్‌ చేయని వెధవ కూడా ఈ స్టేటస్‌కి రిప్లై ఇచ్చాడు’’ అన్నాడు రాజబాబు రమణితో.
      ‘‘ఇంతకీ సుకుమారి ఏమందేంటి?’’ అనడిగింది.
      ‘‘నో రిప్లై.’’ అన్నాడు.
      సూటిగా చూసింది. ‘‘కావాలంటే చూసుకో..’’ ఫోన్‌ అందివ్వబోయాడు. ‘‘అక్కర్లేదు’’ అంది.
      నిజానికి సుకుమారి కూడా స్పందించింది. ‘‘అయ్యో, అయ్యగారు మీతో పని చేయిస్తున్నారా!? నేను రేపు వచ్చి తోముతాను. వదిలేయండి’’ అని కన్నీటి ఎమోజీలు పెట్టింది.
      ఏదో తెలియని మొండి ధైర్యంతో ఫోన్‌ చూసుకో అన్నాడు గాని, ఆ సమయంలో గుండె నిమిషానికి నూటెనిమిది సార్లు కొట్టుకుందని ఒక్క రాజబాబుకే తెలుసు. రమణి గాని ఆ రిప్లై చూసుంటే పనిమనిషిని పూర్తిగా మాన్పించేసి ఇంట్లో అన్ని పనులూ తనతోనే చేయించేది. ఇలా కాదని, చాట్‌ హిస్టరీ అంతా తీసేసి సుకుమారి నంబర్‌ బ్లాక్‌ చేసేసాడు. హమ్మయ్య, సమస్య తీరిపోయిందని ఆ రోజు హాయిగా పడుకున్నాడు.
      పొద్దున్నే అసలు సమస్య సుకుమారి రూపంలో వచ్చింది. ఇంటి పనులు చేసుకుంటూ మధ్య మధ్యలో చీర చెంగుతో కళ్లు ఒత్తుకుంటోందామె. హాల్లోకి వచ్చి కూర్చుని పేపర్‌ తిరగేస్తుండగా, సుకుమారి హాల్లో తుడుస్తూ రాజబాబుని చూసి ఒక్కసారిగా బేర్‌మంది. అంత గట్టిగా ఏడ్చేసరికి రాజబాబు బేజారైపోయాడు. వంటింట్లో ఉన్న రమణి పరిగెత్తుకుని వచ్చింది. ‘‘బాబోయ్‌.. నాకేం తెలియదు’’ అన్నాడు.
      ‘‘ఎందుకేడుస్తున్నావ్‌?’’ అడిగింది రమణి.
      ‘‘ఏంలేదు అమ్మగారు.’’ అంది సుకుమారి ముక్కు చీదుకుంటూ.
      ‘‘మరెందుకు ఆ ఏడుపు?’’
      ‘‘అయ్యగారు.. సారీ అయ్యగారు’’ అంది కాళ్ల మీద పడుతూ. రాజబాబు కుర్చీపైకి కాళ్లు లాక్కుని భార్యవైపు భయంగాను, సుకుమారివైపు అయోమయంగానూ చూశాడు.
      సుకుమారి అలా సాష్టంగంలోనే ఉండి, ‘‘నిన్న నేను మానేయడం వల్లే కదండీ, అమ్మగారు మీతో అంట్లు తోమించారు. ఇంకెప్పుడూ పని మానేయనండి. అమ్మగారి కోసం కాకపోయినా మీకోసం అయినా ఓ పూట వచ్చి పని చేసుకుపోతానండి. కాలనీలో అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారండి. మీ పరువు నేను మానేయడం వల్లే పోయిందనే బాధ ఉందండి. నేను మానేస్తాను అంటే కోప్పడనిది మీరొక్కరే అండి. పండగలకు చీర పెడతారు. దసరాకి మామూలు ఇస్తారు. మీరు నాకు దేవుడు బాబుగారు.. పని చేయకపోతే మందలించండి. పనికి రాకపోతే తిట్టండి. అంతేకాని వాట్సప్‌లో బ్లాక్‌ చేసి నన్ను దూరం పెట్టకండి బాబుగారూ’’ అంది.
      ‘ఇంత ప్రసంగం వాట్సప్‌లో బ్లాక్‌ చేశాననా!? అయ్యో, ఇది ఎక్కడివరకు పోతుందో...’ అనుకుని భార్యవైపు చూశాడు. రమణి గుడ్లు అప్పటికే బయటికి పొడుచుకుని వచ్చాయి. కాసేపుంటే ఊడి పడిపోయేలా ఉన్నాయి.
      సుకుమారి సాష్టాంగం లోంచి లేచి రమణి వైపు చూసి ‘‘చూడండి అమ్మగారూ. ఈయన లాంటోడు మీ ఇంటాయన అవడం మీ అదృష్టం. ఆయన్ని మీరిలా చిత్రహింసలకు గురి చేయడం ఏమీ బాలేదు. మీకు ఆయన విలువ తెలియట్లేదు. నాకు బోర్‌ కొట్టినప్పుడల్లా మెసేజ్‌ చేస్తే ఆయన రిప్లై ఇస్తారు. అమ్మలక్కల కబుర్లన్నీ చెప్తారు. అయ్యన్నల కబుర్లు కూడా...’’
      ‘‘ఇప్పుడవన్నీ ఎందుకు?’’ అన్నాడు భయపడిపోతూ.
      రాజబాబుని పట్టించుకోకుండా ‘‘మీరుండండి అయ్యగారూ, మీ మంచితనం చేతకానితనం అయిపోతోంది. అమ్మగారికి మీ విలువ చెప్పేవాళ్లు లేక ఇలా మీతో పనులు చేయిస్తున్నారు’’ అని రమణి వైపు తిరిగి, ‘‘అయ్యగారిని కష్టపెట్టకండమ్మా! పాపం అమాయకుడు’’ అంది సుకుమారి.
      ‘‘నా మొగుడికి నువ్వు సర్టిఫికెట్‌ ఇస్తున్నావేంటి?’’ అంది రమణి చాలా చిరాకుపడుతూ.
      ‘ఇదెక్కడి గోలరా బాబు’ అనుకున్నాడు రాజబాబు. ‘‘నా ముందు మిమ్మల్ని పొగుడుతోంది ఏంటి?’’ అంది రమణి భర్త వైపు గుర్రుగా చూస్తూ. ‘‘తనేదో పిచ్చిగా మాట్లాడుతోంది. పట్టించుకోకు’’ అన్నాడు.
      ‘‘నేనేమీ పిచ్చిగా మాట్లాడటం లేదు’’ అంది సుకుమారి.
      ‘‘సుక్కు.... ’’ అనరిచాడు కోపంగా. సుకుమారి నోరు మూసేసింది.
      ‘‘సుక్కా? ముద్దు పేర్లు పెట్టుకుని కూడా పిలుచుకుంటున్నారా?’’ అనడిగింది రమణి ఆవేశంగా.
      ‘‘అదేదో ఫ్లోలో వచ్చేసింది రమణీ’’
      ‘‘వస్తుంది.. వస్తుంది.. మీరు అరవడం. ఆవిడగారు మౌనం వహించడం. బానే కంట్రోల్‌లో పెట్టారు’’
      ‘‘చెత్తగా మాట్లాడకు’’ అన్నాడు రాజబాబు.
      ‘‘నన్ను అనండి పడతాను. అయ్యగారిని ఏమీ అనకండి’’ అంది సుకుమారి.
      ‘‘నువ్వెక్కడ దొరికావ్‌ తల్లీ నాకు!’’ సుకుమారిని చూస్తూ పళ్లు కొరికాడు.
      ‘‘లేకపోతే నా అన్నలాంటి మిమ్మల్ని అంటే నాకు కోపం రాదా అయ్యగారూ’’
      ఆ మాటకు రమణి మనసు శాంతపడింది. ‘‘ఈ డైలాగ్‌ ముందే చెప్పేసుంటే ఇంత గొడవయ్యేది కాదు కదా’’ అన్నాడు.
      అక్కడంతా శ్మశాన నిశ్శబ్దం !

* * *

      మర్నాడు లేచి చూసేసరికి మరో పనిమనిషి కనపడింది. ‘హమ్మయ్య రమణి మంచి నిర్ణయం తీసుకుంది’ అనుకుని కాస్త గాలి పీల్చుకుని, ‘దేవుడా ఇలాంటి అల్లరి మళ్లీ నా జీవితంలో జరగకుండా చూడు’ అని దండం పెట్టుకున్నాడు రాజబాబు.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


వాళ్లు ఏడ్చారు!

వాళ్లు ఏడ్చారు!

పి.చంద్రశేఖర అజాద్‌


స్వ‌యంవ‌ధూ...!?

స్వ‌యంవ‌ధూ...!?

దోరవేటి, (వి.చెన్నయ్య)


సువర్ణ గన్నేరు పూలు

సువర్ణ గన్నేరు పూలు

ప్రసాదమూర్తి


స‌మిధ‌

స‌మిధ‌

సయ్యద్‌ సలీం


అతడూ మనిషే!

అతడూ మనిషే!

పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


దాసరి పాట (క‌థాపారిజాతం)

దాసరి పాట (క‌థాపారిజాతం)

చింతా దీక్షితులుbal bharatam