తూర్పు వైపు ఆకాశమంతా మోదుగు పూలు విరబూసినట్టుగా ఉంది. కోట పెట్టినట్టున్న చెట్ల తలలపై నుంచి వెలుగు రేఖలు పసుపు నీళ్లు విరజిమ్ముతున్నట్టుగా ఉన్నాయి. బాలభానుడికి జన్మనిచ్చేందుకు నింగితల్లి ప్రసవ వేదన పడుతోంది. శీతా కాలపు మంచుపొగ బిగికౌగిళ్లను ఛేదించుకుని పుడమి నులివెచ్చని లేలేత కిరణాల స్పర్శ కోసం తహతహలాడుతోంది. చిలక పచ్చని పొలాల మధ్యనుంచి వంకరగీత గీసినట్టుగా పిల్లబాట. అది నది సముద్రంలో సంగమించినట్లుగా మేం ఆడుకునే మైదానాన్ని కలుపుతూ ఉంది. ఈ ప్రాంతం ఒకప్పుడు గుట్టలతో నిండి ఉండేది కాబోలు, ఇంకా కొన్ని రాళ్లు భూగర్భంలో కలిసిపోతూ జనం కూర్చోవడానికి అనుకూలంగా ఉన్నాయి.
సూర్యోదయం వైపు పల్లె ఆనవాళ్లు ఏమీ కనిపించకపోయినా జనం అటునుంచి వస్తూ ఉంటే వాళ్లంతా పొద్దుపొడుపులో నుంచే వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది.
కూరగాయలు, పాలు మొదలైనవి అమ్ముకునే వాళ్లు, కూలీలు, గంగిరెద్దుల వాళ్లు మొదలుకొని అందరూ పట్టణంలోకి ప్రవేశించాలంటే ముందుగా మా మైదానంలో అడుగు పెట్టాల్సిందే.
ఆ రోజు ఆదివారం కావడం వల్ల పిల్లలందరం నీరెండ వెచ్చదనంలోని హాయిని ఆస్వాదిస్తూ దుర్గతో ఆడుకుంటున్నాం. తను నలుపు రంగులో ఉండటం వల్ల శరీరంపై ‘‘దుర్గా! దుర్గా!’’ అని రాసి ముఖంపై పట్టెనామాలు దిద్దుతూ ఉంటే... ఏదో గుర్తొచ్చినట్టుగా పిల్లబాట వైపు పరుగెత్తింది. అటునుంచి సాయిబోల్ల తాత చేతికి గుండ్రటి వెదురుబుట్ట తగిలించుకొని మరో చేత్తో వంకర కర్ర పట్టుకొని మా దిక్కే వస్తున్నాడు. మేము కూడా తాతకు ఎదురుగా పరుగెత్తాం.
దుర్గ తాత పైపైకి ఎగురుతోంది. నడవకుండా అడ్డం తగులుతోంది. కింద పడుకొని పొట్టచూపిస్తూ తోక ఊపుతూ ‘‘కుయ్ కుయ్’’ శబ్దం చేస్తూ గారాలు పోతోంది. మళ్లీలేచి అతని పైజమా లాగింది. తాత భరించలేక వంకర కర్రతో సుతిమెత్తగా తాకీతాకనట్టుగా ఒక దెబ్బ వేశాడు. ‘‘కుయ్యో... కుయ్యో...’’ అంటూ తగిలిన దాని కంటే ఎక్కువగా అరుస్తోంది. ఆ ధ్వనిలో ఏదో గారాబం ధ్వనింపజేస్తూ ఏదో మూలిగింది తాతవైపు చూస్తూ
‘‘హర్రామ్కే... కాలు కదలనిస్తాలేదు’’ అన్నాడు తాత.
మైదానం దగ్గరకు రాగానే ‘‘టారటోయ్! మస్కాబిస్కేయ్!’’ అన్నాడు బుంగమూతి పెడుతూ. అతడు దొంతర రొట్టెలూ, బిస్కెట్లు అమ్ముతూ ఉంటాడు. చూస్తావుంటే చూడాలనిపించేలా కొనతేలిన ముక్కు, చిన్న పిల్లవాడిలా మూతి, పెద్దగడ్డం, ఉండీ లేనట్టుగా మీసాలు, చాక్లెట్ రంగు టోపీ, అదే రంగు ఆఫ్కోట్ అక్కడక్కడ చిరిగిపోయి ఉండేది. భుజంపై గులాబీ రంగు గీతల తువ్వాలు, లాల్చీ పైజమా. తెలుపుదే అయినా అది గోధుమ రంగులోకి మారి పోయింది. తాతను ఒక వైపునుంచి చూస్తే చేయి తిరిగిన చిత్రకారుడు గీసిన చిత్రంలా ఉంటాడు.
బుట్ట కింద పెట్టి తువ్వాలుతో బండపై దుమ్ము దులిపి నెమ్మదిగా కూర్చున్నాడు. మొస పోస్తున్నాడు. పిల్లలందరూ చుట్టూ మూగారు. ‘‘బిడ్డలాలా... జర జరుగుండ్రి! దమ్మొస్తాంది. సలి ఎగేసుకొస్తాంది. కొంచెం ఎండపొడ రానియ్యిండ్రి..’’ అన్నాడు తాత.
దుర్గ తాత వెనుకవైపు కూర్చొని అతనికి తోక తగిలేలా ఊపుతూ ఉంటే, వెనుక వైపు చూస్తూ చిన్నపిల్లవాడిలా వాత్సల్యపూరితంగా నవ్వాడు. దుర్గ కళ్లు మిటకరిస్తూ లేచి తన శరీరంతో తాతను నిమరసాగింది. టోపీకీ భుజానికీ మధ్యలో నాకింది.
‘‘బేటా... కుక్కంత ఇమాన్దారి జాన్వర్ ఇంకోటి ఉండదు. ఇంక పిల్లి బే-ఇమాన్ అంటరు’’
చేతులు తువ్వాలుతో తుడుచుకుంటూ ‘‘అందరు పైసలు దీసి షేతుల్ల పట్టుకోండ్రి’’ అన్నాడు. డబ్బులు తీసుకుంటూ ఒక్కొక్కరి చేతుల్లో బిస్కెట్లు, డబుల్ రొట్టెలు పెడుతున్నాడు. ‘‘మాపటేల సలి సలి పెట్టుకుంట జరమొచ్చింది. పెయ్యంత కొట్టి పండవెట్టినట్టుంది. ముసల్ది మస్తు(చాల) మొత్తుకున్నది. షాతగాంది (చేతకానప్పుడు) ఏంబోతవ్, ఆయింత అడ్డం బడేవు (పడిపోయేవు) అన్నది. బిడ్డలకు అలవాటైన పానమాయె ఎదురుసూత్తరు, మల్ల ఈ దుర్గ తల్లి గుండె పలుగుతది (బెంగపడుతది)’’ దుర్గ వైపు చూపిస్తూ అన్నాడు మూలుగుతూ...
‘‘మైదా పిరం (ప్రియం) అయ్యింది. మాల్గూడా పిరం బడ్తాంది. దామ్ (ధర) బడాయిస్తే (పెంచితే) పొల్లగాండ్లు (పిల్లలు) తఖిలీఫ్ (ఇబ్బంది) పడ్తరు. అల్లా దయ ఉన్నన్ని దినాలూ కాల్రెక్కలు ఆడినన్నొద్దులు (రోజులు) మెల్లమెల్లగా గిట్లనే తండ్లాడుత. అటెన్క (తర్వాత) అల్లానే దిక్కు... గొనుక్కుంటూ
‘‘బిడ్డలాలా ఇంకెవలైనా తీసుకుంటరా....’’ అడిగాడు.
మా వైపు నుంచి ప్రతిస్పందన రాకపోయేసరికి ఆవ్ బేటా... దుర్గను పిలిచి శరీరమంతా తడిమాడు. తలపై నుంచి తోక వరకూ దువ్వుతూ ఉంటే అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతా ఉంది దుర్గ.
నేను ఏ రాత్రో... ఏ పగలో అల్లా పిల్వంగనే పోతే నా కోసం నిచ్చె (నిత్యం) ఎదురుసూస్తనే ఉంటవ్. ఇగ నేను లేననీ ఎప్పుడూ రాననీ నీకెవలు చెప్తరు. నీకెట్ల సమజైతది (అర్థమైతది) బేటా... తాత కళ్లల్లో విషాదంతో పాటూ నీళ్లూ చెమర్చాయి.
ఒక డబుల్ రొట్టెను చిన్న చిన్న ముక్కలు చేసి తినిపిస్తూ ‘‘ఎత్మినాన్ సే ఖావ్ బేటా’’ (నెమ్మదిగా తిను). కొన్ని బిస్కట్లు కూడా తినిపించాడు.
‘‘బిడ్డా పొద్దుపోతా ఉంది ఇంకా అమ్ముకోవాలే’’ తాత లేచి వెళ్లిపోతా ఉంటే కొంత దూరం వరకు తాత వెంటే వెళ్తోంటే కర్రతో బెదిరించాడు. వెనక్కి వచ్చింది దుర్గ.
...దుర్గకు ఆ పేరు ఎవరు పెట్టారో తెలియదు కానీ ‘‘దుర్గా..’’ అని పిలిస్తే పరుగెత్తుకొచ్చేది. అదేమి చిత్రమో కానీ ప్రతీ బుధవారం ఏమీ తినేది కాదు. అందరూ ‘‘దుర్గ ఏ దేవుడికి ఒక్క పొద్దుంటుందో...’’ అనే వారు. ఇతర రోజుల్లో కూడా తన ముందు ఆహారం ఉన్నప్పటికీ తినేది కాదు. ‘‘దుర్గా... రా... తిను’’ అంటే తప్ప తినేది కాదు.
ఓ సారి దుర్గ కడుపులో పిల్లలున్నాయని, వీధిలోని మహిళలు సంక్రాంతి సందర్భంగా చేసుకున్న పిండివంటలు పెట్టారు. కొన్నాళ్లకు దుర్గ నాలుగు పిల్లలు పెట్టింది. ఒకటి అచ్చు తనలాగే నల్లగా ఉంది. ‘‘దుర్గ ఈనింది.
మునుపటిలా ఉండదు. తన పిల్లలను ముట్టుకుంటే కరుస్తది’’ అన్నారు పెద్దవాళ్లు. అయినా మేము పిల్లలతో ఆడుకున్నా ఏమీ అనలేదు దుర్గ. కానీ మునుపటిలా తను మాతో ఉండేది కాదు. పిల్లలకు పాలిస్తూ ఆలనా పాలనా చూస్తూ ఉండేది. దుర్గ శరీరంలో ఎన్నో మార్పులు... పొట్టకింద చనులు సాగి వేలాడుతూ ఉండేది. చాలా నీరసంగా కూడా అనిపించింది...
మైదానంలో గాలిపటాలు ఎగురవేస్తున్న మాకు ‘‘దుర్గకు మునిసిపాలిటీ వాళ్లు విషం పెట్టారు’’ అనే వార్త వినిపించింది. కళ్లు మిటకరిస్తూ తోక ఊపుతూ మా వద్దకే వస్తుంది. రోజూ తనకు ఎందరో భోజనం పెడతారు. కానీ ఈ రోజు అందులో విషం కలిపి పెట్టారని తెలియదు.
మనిషితో సహజీవనం చేస్తూ విశ్వాసం గల ప్రాణిగా పేరు తెచ్చుకున్న కుక్కకు ‘రేబిస్’ అనే వ్యాధిని ఎందుకు ప్రసాదించాడో ఆ భగవంతుడు. ఇది సృష్టి విచిత్రమేమో అనిపిస్తుంది.
దుర్గ విషం తిన్నదనే వార్త విష వాయువులా వ్యాపించింది. చాలామంది జనం మైదానంలోకి చేరుకున్నారు. విషం విరుగుడవుతుందని బలవంతంగా చింతపండు రసం తాగించారు. బాగా పరుగెత్తిస్తే విషం దుర్గ శరీరంపై పనిచేయదని చెబితే పందుల వెంట చాలాసేపు పరుగెత్తించాం. జన సమూహాన్ని చూసి ఆనందంతో మరీమరీ పరుగెత్తింది. మధ్యాహ్నం వరకూ దుర్గ, మేము బాగా అలసిపోయాం.
‘‘మందు విరుగుడయ్యుంటుంది. బిడ్డకు పెద్ద గండం గట్టెక్కింది. ఇగ ఏమీ కాదు’’ అన్నారు జనం.
‘‘హమ్మయ్య...’’ అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాం పిల్లలందరం. దుర్గ బండపై మాకు దగ్గర్లోనే పడుకుంది.
అర్ధగంట గడిచిందో లేదో దుర్గలేచి నిలబడింది. తన తోకను కాలును కొరుక్కుంటోంది. అటూ ఇటూ చూస్తూ తూలుతోంది. ముందుకూ వెనక్కూ నడుస్తోంది. తన చుట్టూ తాను తిరుగుతూ కిందపడిపోయింది. కాళ్లు కొట్టుకుంటూ మా వైపే చూస్తోంది. మా తోటి పిల్లలు పెద్ద వాళ్లను పిలుచుకొచ్చారు. ‘‘బిడ్డ ఇగ బత్కది. ఇసం ఇరుగుడు బడలేదు. వాని కండ్లు మండ బంగారమసొంటి కుక్కకు మందు పెట్టిండు. వాని షేతులకు జెట్టలు పుట్ట. వాని షేతులు ఇరిగి కుప్పబడ’’ అంటూ శాపనార్థాలు పెట్టింది ఓ ముసలావిడ.
దుర్గ కళ్లల్లోంచి నీళ్లు కారుతున్నాయి. అందర్నీ చూస్తూ తన చుట్టూ తాను తిరుగుతోంది. పిల్లలందరి కళ్లల్లోంచి నీళ్లు కారుతున్నాయి. ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం. పెద్దవాళ్లు కూడా దుఃఖం ఆపుకోలేకపోతున్నారు. దుర్గ నోరు తెరిచింది కాళ్లు బార్లా చాపి నేలను తన్నుకుంటోంది. కొన్ని నీళ్లు తీసుకొచ్చి దుర్గ నోటిపై పోశాడు ఒకతను. కొద్దిసేపట్లో కదలిక ఆగిపోయింది. కాలం స్తంభించి పోయినట్టు, ఏదో శూన్యం ఆవరించినట్టు అనిపించింది. కుక్కలను విషం పెట్టి చంపడం మినహా వాటిని బతకనిస్తూ ‘రేబిస్’ నుంచి మనల్ని మనం కాపాడుకునే విధానాలవైపు ఈ ప్రభుత్వాలు ఆలోచిస్తే బాగుండనిపించింది.
కేరింతలతో పరుగులతో దద్దరిల్లిన మైదానం విషాదంతో నిండిపోయింది. మౌనంతోనే మమ్మల్ని మేం ఓదార్చుకున్నాం.
‘‘పిల్లగాండ్ల రెక్కల్ల బొక్కల్ల తిరిగిన కుక్క... పొల్లగాండ్లు బెంగటీల్తరేమో..’’ అన్నారెవరో...
దుర్గను గౌరవంగా తీసుకెళ్లి పూడ్చి పెట్టారు. విషాద వదనాలతో ఇళ్లకు వెళ్లిపోయాం.
మా బాధంతా... రేపు ఉదయం సాయిబోల్ల తాత దుర్గ ఇకలేదనే బాధ భరించగలడా... పాపం తను తట్టుకుని నిలబడగలడా... తను పడే బాధను మేం చూడగలమా... అసలు కాలం ఆగిపోయి రేపు తెల్లవారకుంటే బాగుండనిపించింది.
ఎప్పటిలాగే తెల్లవారింది. పిల్లలందరం తాత వచ్చే తూర్పువైపే చూస్తున్నాం. తనకెదురుగా పరుగెత్తి ఈ వార్త చెప్పి తనను ఓదార్చాలనిపించింది.
ఉదయం తొమ్మిది గంటలైనా తాత రాలేదు. బడికి వెళ్లిపోయాం. రోజూ తాత కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం. తాత కూడా రావడం లేదు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. దుర్గ లేదనే బాధ రోజు రోజుకు తగ్గిపోతా ఉంది.
ఒకరోజు ఉదయం ఆటల్లో మునిగిపోయాం. ‘‘డబుల్ రొట్టేయ్... బిస్కేట్లోయ్...’’ అని వినబడగానే వెనక్కి తిరిగి చూశాం. ఒక ముసలావిడ కుంటుతూ ఆయాస పడుతూ తాత బుట్ట, వంకర కర్ర తాత వేసుకునే కోటు ధరించి వచ్చింది మైదానంలోకి.
అందరం పరుగెత్తి ‘‘తాత వస్తలేడు నువ్వెందుకు వచ్చినవ్’’ ఆత్రంగా అడిగాం.
‘‘ఇంకెక్కడి తాత కొడ్కులాలా... అల్లా దగ్గరకు పోయిండు’’ అంది. దుఃఖంతో ఆమె గొంతు పూడుకపోయింది. ‘‘అయ్యో!’’ అంటూ ముఖాలు చూసుకున్నాం... నిశ్శబ్దం ఆవరించింది.
‘‘బిడ్డలాలా... దుర్గ అని కుక్క ఉంటదట బిడ్డ. దాని కోసం తాత తండ్లాడిండు.. రోజూ డబుల్ రొట్టె, బిస్కెట్ తినిపియ్యిమన్నడు. ఈ బుట్టా, ఈ కట్టే ఈ కోటు చూస్తే దుర్గకు సమజైతది (అర్థమై తది) అన్నాడు. నోరు లేని జీవి...’’అన్నది.
‘‘దుర్గకు మందువెట్టి సంపిండ్రు కాదు’’ అన్నాడు మాలో ఒక పిల్లవాడు.
‘‘అయ్యో... బిడ్డా... ఆడ ముసలాయ్న, ఈడ కుక్క పానమిడ్సిండ్రా’’ అంటూ కూర్చుంది.
దుర్గ లేదు తాత లేడు. వీళ్లిద్దరి మధ్య ఏదో బంధం... ఒక విషాదానుభూతి ఆవరించింది మమ్మల్ని. ఏదో ఒక అధ్యాయం ముగిసినట్టనిపించింది.
తాత చనిపోయాడనే వార్త చాలా బాధించింది. తను రోజు కూర్చునే బండవైపు చూశాం. ఆ గత దృశ్యాలన్నీ కళ్లముందు తిరిగాయి. దుర్గ చనిపోయిన వార్త తాతకు తెలియకుండా, తాత ఇగరాడని తెలియక ఎదురు చూసే దుర్గలేకుండా పోయింది.
ఇద్దరూ లేనందుకు మా మనసుల్లో ఏదో తొక్కులాట... స్వర్గంలో ఇద్దరూ కలిసుంటారేమోనన్న తృప్తి.
కాలం సాగిపోతూనే ఉంది...