అమ్మ అలిగితే

  • 741 Views
  • 3Likes
  • Like
  • Article Share

    నామని సుజనాదేవి

  • పరిపాలనాధికారి, భారతీయ జీవిత బీమా సంస్థ,
  • హుస్నాబాద్, కరీంనగర్.
  • 7799305575
నామని సుజనాదేవి

అన్నపూర్ణ అకస్మాత్తుగా ఓ రోజు మాయమైంది! భర్త గుండెల్లో కంగారు మొదలైంది. పిల్లలు అంతా వెదికారు. ఎక్కడా ఆమె జాడలేదు!
అసలు ఆమె ఎక్కడికెళ్లింది? ఎందుకెళ్లింది?
సూర్య
కిరణాలు కళ్ల మీద పడటంతో లేచి కూర్చున్నాడు విశ్వనాథం. ఎదురుగా గడియారం ఎనిమిది చూపిస్తోంది. ‘భార్య మంగళహారతి ఇచ్చేప్పుడు మెలకువ రాలేదేంటి?’ అనుకుని, ‘‘ఉన్నావా? నిన్నే’’ గట్టిగా పిలిచాడు. సడి లేదు. 
      మళ్లీ పిలుస్తూ వంటింట్లోకెళ్లాడు. అక్కడ లేదు. పెరట్లోకెళ్లాడు. లేదు. ఇల్లంతా వెతికాడు. ఎక్కడా లేదు. దేవుడి గదిలో దీపాలు కొండెక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. మనసెందుకో కీడు శంకించింది. రాత్రి జరిగిన సంఘటన కళ్ల ముందు తిరిగింది.
      ‘‘ఇదిగో, మా క్లబ్‌ ఫ్రెండ్స్‌ వస్తున్నారు. చేపలు, మటన్‌ తెస్తాను. పది గంటలకి రెండు మూడు రకాలు చెయ్‌...’’ 
      ‘‘ఈ ఒక్కరోజు వద్దండీ. శివుడికి లక్షపూల పూజ రేపటితో పూర్తవుతుంది. లలితా సహస్రం చదువుతాను. శివపార్వ తులకు నిష్ఠగా నైవేద్యం పెట్టాలి. పసుపు కుంకుమ వాయనాలిస్తాను. ఇంట్లో మాంసాహారం వద్దు’’
      ‘‘అదంతా కుదరదు. వాళ్లు వస్తారంతే’’
      ‘‘ఈ ఒక్కరోజు వద్దని చెబుతున్నా కదా. కావాలంటే ఎక్కడికయినా వెళ్లి పార్టీ చేసుకోండి’’ అభ్యర్థనగా చెప్పింది.
      ‘‘ఏంటీ గొంతు లేస్తోంది. నాకే ఉచిత సలహాలిస్తావా. చెప్పింది చెయ్‌..’’ చెంప మీద ఒక్కటిచ్చాడు. వేళ్లు ఎర్రగా తేలాయి. ‘‘ఛిఛీ వెధవ కొంప’’ అని కోపంగా వెళ్లిపోయాడు. స్నేహితులతో తిరిగి, హోటల్లో సుష్టుగా భోంచేసి వచ్చేసరికి పన్నెండయ్యింది. అన్నపూర్ణ పడుకుని ఉంది. అతనికి తెలుసు ఆమె తినలేదని. అయినా అడగలేదు. గుర్రుపెట్టి నిద్రపోయాడు. అలా పడుకున్నది ఇప్పుడే లేవడం. 
      ‘కొట్టడం కొత్తేమీ కాదుగా. ఎక్కడికెళ్లుంటుంది? బజారుకెళ్లిందా? ఆమె ఒక్కటీ ఎక్కడికీ వెళ్లదు. కొడుకుల దగ్గరికేమైనా వెళ్లిందా?’ టేబుల్‌ మీదున్న సెల్‌ఫోను తీయబోయాడు. దాని కింద కనిపించింది కాగితం. ఆశ్చర్యపోయాడు.
      ‘‘పెళ్లయిన దగ్గర్నుంచి మీ దాసీలాగే బతికాను. పచ్చిగా చెప్పాలంటే, మీకు వండిపెట్టడానికి, మీకు సుఖాన్ని అందించ డానికి ఒక బానిసని కట్నం తీసుకుని మరీ తెచ్చుకున్నారు. పెళ్లయ్యి ముప్పై ఏళ్లవుతోంది. మీరు మారతారని చూసిన నా ఆశ అడియాశే అయ్యింది. అందుకే నేను వెళ్లిపోతున్నాను. నా కోసం వెతకొద్దు. మీ డబ్బు నేనేమీ తీసుకెళ్లడం లేదు. మీరు చేయించిన నగలు కూడా వదిలేస్తున్నాను. మా అన్నయ్య రాఖీ కట్టినప్పుడు ఇచ్చిన డబ్బులతో వెళ్లిపోతు న్నాను. నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదు. మిగిలిన నా జీవితం నాకిష్టమైనట్లుగా గడుపుతాను. సెలవ్‌- అన్నపూర్ణ’’
      హతాశుడయ్యాడు విశ్వనాథం. ఈ తిరుగుబాటు అతను కలలో కూడా ఊహించనిది. ‘నాకు భయపడుతూ ఒదిగి ఉండే పూర్నేనా ఇలా వెళ్లిపోయింది’ అతని మెదడంతా మొద్దుబారింది. ‘అటు బంధువులు, ఇటు చుట్టుపక్కల జనాలు ఏమంటారు? అసలింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికెళుతుంది?’ అనుకున్నాడు. ఎప్పుడూ ఆమె కాలి గజ్జెలు, చేతి గాజుల సవ్వడితో కళగా ఉండే ఇల్లు ఒక్కసారిగా దేవతలేని ఆలయంలా వెలవెలబోతోంది. కాగితాన్ని పట్టుకున్న చేతులు వణుకుతున్నాయి. 
      సెల్‌ మోగడంతో వణికే చేతులతో తీసుకున్నాడు. ‘‘నాన్నా ఒకసారి అమ్మకి వ్వండి. ఏదో వ్రతం గురించి మీ కోడలు అడుగుతుందిట’’ పెద్ద కొడుకంటున్నాడు.
      ‘‘అ...మ్మ..... అమ్మ.... మరే... లేదు.....’’ నంగిగా చెప్పాడు. 
      ‘‘స్నానం చేస్తోందా? సరే కాసేపాగి చేస్తాను’’
      ‘‘లేదురా... అమ్మ వెళ్లిపోయింది....’’ భారంగా చెప్పాడు. ‘‘ఎక్కడికి... ఎక్కడి కెళ్లింది నాన్నా’’ కొడుకు మాటల్లో కంగారు. ‘‘ఏమో... తెలియదు...’’
      ‘‘ఏం మాట్లాడుతున్నావు? మళ్లీ ఏమైనా గొడవపడ్డారా?’’
      ‘‘రాత్రి చిన్న గొడవ....’’
      ‘‘ఎప్పటి నుంచి కనబడటం లేదు. ఏమైనా చెప్పిందా?’’
      ‘‘లేదు. పొద్దున లేచేసరికి లేదు. దీపం వెలిగించి వెళ్లిపోయింది’’
      ‘‘తమ్ముడి దగ్గరికి వెళ్లిందేమో. ఫోన్‌ చేశావా?’’
      ‘‘చేయలేదు....’’
      ‘‘నేను చేస్తాలే. అక్కడికే వెళ్లుంటుంది. వాడంటే ప్రాణం కదా...’’ పెట్టేశాడు.
      అయిదు నిమిషాల్లో మళ్లీ ఫోన్‌. ఈసారి చిన్నోడి దగ్గర నుంచి. ‘‘నాన్నా! అమ్మని ఏమన్నావు మళ్లీ...’’ చిన్నోడు దాదాపు అరుస్తున్నాడు ఫోన్‌లో.
      అంటే, అక్కడికీ వెళ్లలేదు. చేతిలోంచి సెల్‌ జారిపోయింది. కింద కూలబడ్డాడు విశ్వనాథం. బ్రష్‌ అందించేవాళ్లు లేరు. కాఫీ ఇచ్చేవాళ్లు లేరు. స్నానానికి నీళ్లు కాగాయని తోడేవాళ్లు లేరు. టవల్, దుస్తులు అందించేవాళ్లు లేరు. బయట అరుగు మీద రోజూ అన్నపూర్ణ అన్నం పెట్టే రెండు కుక్కపిల్లలు లోపలికి చూస్తూ అరుస్తున్నాయి. రోజూ ఇంటి ముందుకొచ్చే పిట్టలు, తమకు గింజలు వేసే అన్నపూర్ణ కనబడక అటూ ఇటూ తిరుగుతున్నాయి. లోకంలో తాను ఒంటరి అయినట్లు అనిపించింది. 
      నగరం నుంచి ఇద్దరు కొడుకులు భార్గవ్, భాస్కర్‌లు, కోడళ్లు, వారి పిల్లలతో సహా వచ్చేశారు. ఏమయ్యిందని అడిగారు. వెదకడం మొదలుపెట్టారు. విషయం బయటికి రాకుండా ఉండాలని నాన్నను తమతో పాటు నగరానికి తీసుకొచ్చేశారు. వారం గడిచింది. ఎక్కడా ఆచూకీ లేదు. ఉత్తరంలో ఆత్మహత్య చేసుకోనని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. 
      అయితే ఎవరికీ మనసు మనసులో లేదు. విషయం తెలిస్తే చుట్టాల్లో, ఆఫీ సుల్లో ఎంత పరువు తక్కువ. ‘అయినా అమ్మ మేమంటే ఎంత ప్రాణమిచ్చేది. అలాంటిది మాతో మాట మాత్రం చెప్ప కుండా ఎలా వెళ్లింద’ని ఒకటే ఆలోచన. అంతా తననో దోషిలా చూడటం విశ్వనాథం మనసుని ఛిద్రం చేస్తోంది. 
      భార్గవ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగి. అతని భార్య కూడా మరో ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తుంది. ఇద్దరూ పొద్దునే టిఫిన్లు పెట్టుకుని, వాళ్లు తయారై పిల్లల్ని తయారు చేసి, వారికి తినిపించి ఒకర్ని స్కూల్లో, మరొకర్ని బేబీ కేర్‌ సెంటర్‌లో వదిలి వెళ్లిపోతారు. ఆ హడావుడి బతుకుల్లో విశ్వనాథాన్ని పట్టించుకునే తీరికలేదు. ఏదో ఫ్లాస్క్‌లో కాఫీ, టిఫిన్‌ ఇచ్చి వెళ్తున్నారు. వేళకు అన్నీ అమర్చే దిక్కులేదు. బిక్కుబిక్కు మంటూ ఒక్కడూ రోజంతా గడపాలి. అపార్ట్‌మెంట్‌ కావడంతో ఇరుగు పొరుగూ లేదు. దుర్భరం అనిపించింది. అక్కడ ఉండలేక చిన్న కొడుకు భాస్కర్‌ వచ్చి రమ్మంటే అక్కడికెళ్లాడు. 
      అక్కడా కొడుకు పొద్దున ఏడుకల్లా ఆఫీస్‌కి వెళ్లిపోతాడు. చిన్నపాపను బేబీ కేర్‌ సెంటర్‌లో వదిలి స్కూటీ మీద 9 గంటలకు కోడలు విశ్వవిద్యాలయానికి వెళ్లిపోతుంది. రోజంతా తలుపులు బిగిం చుకుని ఒక్కడూ టీ.వీ చూస్తూనో, పడు కునో గడపాలి. చిన్న పాపతో కోడలికి తీరిక ఉండదు. పైగా ఆమె కడుపుతో కూడా ఉంది. ఆమె ‘‘మామయ్యా. మీకేం కావాలన్నా చేసుకోండి. టిఫిన్‌ ఉంది. భోజనం సిద్ధంచేశాను. కాఫీ కావాలంటే పెట్టుకోండి...’’ అని చెప్పి వెళ్తుంది. 
      సొంత ఊళ్లో వచ్చేపోయే వాళ్లు పలకరిస్తుంటే, ఇంట్లో కిరాణా దుకాణంలో కూర్చుని ఉండే విశ్వనాథానికి నగర జీవి తం సహించడంలేదు. అలాంటి పరిస్థితి తెచ్చిన భార్య మీద కోపం వస్తోంది. ఒక్కోసారి తన ప్రవర్తనకు తనమీద తనకే అసహ్యం వేస్తోంది. అంతకు ముందు పిల్లల ఇళ్లకి భార్యతోనే కలిసి వచ్చేవాడు. ఇంట్లోలాగే అన్నీ ఆమె అమర్చిపెట్టేది. ఇక్కడ కూడా క్షణం ఖాళీ లేకుండా వడియాలు పెట్టడమో, జంతి కలు వండటమో, దుస్తులు మడతెయ్య డమో చేస్తుండేది. ఆమె లేని పది రోజుల్లో ఆమె తనకెంత అవసరమో విశ్వనాథానికి తెలిసింది. ఆమె లేకపోతే తను ఉండలేడని అర్థమైంది.
      ఆరోజు ఆదివారం. అంతా ఇంట్లోనే ఉన్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడమా, వెతకడమా ఇలా అన్ని రకాల ఆలోచనలు చేస్తున్నారు. వాళ్ల ఊళ్లోంచి వెళ్లాలంటే బస్సు లేదా రైలు ఎక్కాలి. చిన్న ఊరు కాబట్టి ఆ సమయానికి ఉన్న బస్సులు, రైళ్ల గురించి తెలుసుకోవడం కష్టం కాదు. ఊళ్లో ఒక వ్యక్తి ద్వారా ముఖ్య సమాచారం తెలిసింది. కొడుకులు ఆ ఊరు వచ్చినప్పుడు ‘‘అదేంటి అయ్య గారూ! మీ అబ్బాయిలు ఇక్కడికొస్తే అమ్మేమో రైల్వేస్టేషన్‌కి వెళ్లారు’’ అన్నాడు. దాన్నిబట్టి రైల్వేస్టేషన్‌లో వాకబుచేశారు. అప్పుడున్న రైలు నెల్లూరు వైపు వెళ్లేదని తెలిసింది. ‘‘అసలు అమ్మకి ఆటువైపే తెలీదు. అటెందుకెళుతుంది. అతను ఎవరిని చూసి ఎవరనుకున్నాడో. పైగా అతను వెర్రిబాగులవాడు’’ అనుకుని ఊరుకున్నారు.
      అయితే, ఇప్పుడు ఆలోచిస్తుంటే భాస్కర్‌కి ఒకసారి తన తల్లి, ‘అమ్మ’ అనాథాశ్రమం గురించి అడిగిన విషయం గుర్తొచ్చింది. రెండు నెలల కిందట ఆ ఆశ్రమంలో స్వచ్ఛందంగా సేవ చేయడా నికి ఎవరైనా ముందుకొస్తే సెల్‌ నంబర్‌లో సంప్రదించాలని పేపర్‌ ప్రకటన ఇస్తే, ‘‘అది ఎక్కడ ఉందిరా? ఎలా వెళ్తార?’’ని అడిగింది. ‘‘నీకెందుకమ్మా...’’ అంటే, ‘‘మనూళ్లో ఒకరు అడిగారు..’’ అంది. ఆ ఆశ్రమం గురించి నెట్‌లో వెదికాడు. ఫోన్‌ నంబర్‌ చూసి ఫోను చేశాడు. అతని అనుమానం నిజమైంది. పదకొండు రోజుల ముందర 50 ఏళ్ల ఆవిడ సేవచేయడానికి వచ్చి చేరిందని చెప్పారు. వారు చెప్పిన పోలికలు అమ్మ పోలికలు కలిశాయి. వెంటనే అందరూ బయల్దేరారు.

* * *

      ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అన్నపూర్ణ ఒక కుర్చీలో కూర్చుని ఉంది. చుట్టూ ఉన్న సోఫాలు, కుర్చీల్లో విశ్వనా థం, భార్గవ్, భాస్కర్‌ అంతా కూర్చు న్నారు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ భార్గవ్‌ అన్నాడు ‘‘అమ్మా! ఇదేమైనా బావుందా. ఎందుకలా చెప్పాపెట్టకుండా వచ్చేశావు? నాన్నతో గొడవైతే మేము లేమా. నాన్న కూడా చాలా బాధపడుతున్నాడు. ఆ రోజు నీ సలహాతో మట్టి వినాయకుణ్ని పెడితే కాలనీకి బహుమతి వచ్చింది. వరద బాధితులకు సాయం చేసినందుకు మన కాలనీ సెక్రటరీ రేపు బహుమతి అందుకోబోతున్నారు. అంతా నీకు సన్మానం చేయాలంటున్నారు’’ భాస్కర్‌ అన్నాడు. ‘‘నువ్వు కోరకుండానే చీరలు, నగలు కొనిపెట్టాను. అదంతా నీ మీద ప్రేమలేకే చేశానా..’’ విశ్వనాథం అన్నాడు.
      ఇంకా మౌనంగానే ఉన్న అన్నపూర్ణను చూస్తూ, ‘అమ్మా! నీ మనసులో ఏముందో చెప్పు. లేకపోతే నామీద ఒట్టే’’ భాస్కర్‌ కాళ్లు పట్టుకుంటూ అన్నాడు. కొడుకును లేపి పక్కన కూర్చోబెట్టుకుంది. ఆమె కళ్ల ముందు గత సంఘటనలు... 

* * *

      ‘‘ఏమండీ! కాఫీ తీసుకోండి...’’ పెళ్లయ్యి వారమైనా ఏమీ మాట్లాడకుండా, అసలు ఒక మనిషి ఉందనే గుర్తించనట్లు వ్యవహరిస్తున్న భర్తను తనకు తానై మొదటిసారి పలకరించింది. ‘‘మా అమ్మ నిన్ను చేసుకోకపోతే చస్తానని బెదిరిస్తే చేసుకున్నాను. మరోసారి నా దగ్గరికి రాకు’’ గ్లాసుని విసిరి కొట్టి వెళ్లిపో యాడు. చేతులు, మొహం మీద పడిన వేడి వేడి కాఫీ కన్నా అతని మాటలు, చేతలు మనసుని ఛిద్రం చేశాయి.
      తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, అతను అంతకు ముందే ఎవర్నో ప్రేమిం చాడు. ఇరువైపులా ఒప్పుకోలేదు. ఆమెకి వేరే వ్యక్తితో పెళ్లి జరిగిపోయింది. కలవారింట పడుతుంది, కూతురు జీవితం బాగుంటుందని శక్తికి మించి అప్పుచేసి భారీగా పెళ్లి జరిపించిన కన్నవారి ఆనందాన్ని పాడుచేయడం ఇష్టంలేక తన కష్టం గురించి పుట్టింట్లో చెప్పలేదు. అప్పటి నుంచి కేవలం దేవతలనే నమ్ముకుంది. అయినా ఆమె తప్పులేకున్నా తిట్లు, తన్నులు. మంచి సంబంధం అని తొమ్మిదో తరగతిలోనే పెళ్లిచేస్తూ, అత్తా రింట్లో చదువుకుందువులేమ్మా అన్నాడు తండ్రి. కానీ ఇక్కడ ఎప్పుడైనా న్యూస్‌ పేపర్‌ చదివినా కోపంతో రగిలిపోయే వాడు. అతనికి తెలియకుండా దాచుకుని అతను లేనప్పుడు పేపర్‌ చదివేది. ఎదురు గ్రంథాలయంలో పుస్తకాలు తెచ్చుకుని భర్త లేనప్పుడు, దుకాణంలో ఖాళీగా ఉన్నప్పుడు చదువుకునేది.
      రెండేళ్ల తర్వాత ఆమె చేసిన పూజల మహాత్మ్యమో, అందరి బోధల ఫలితమో, లేదంటే వయసు పెట్టే బాధల ఫలితమో భార్యని దగ్గరికి తీసుకోవడం మొదలెట్టాడు. ఒకసారి తిరుపతి వెళ్తే, క్యూలో జనాన్ని తోసుకురాలేక, చేతిలోని విష్ణు సహస్రనామాలు చదువుతూ కొంచెం వెనకబడిన ఆమెని అందరి ముందే కొడుతూ విసురుగా చేయిపట్టి బరబరా లాక్కెళ్లాడు.  
      ‘‘ఏయ్‌! ఇది కూరేనా. మొగుడు ఎందుకు తినాలిలే అని చారెడు ఉప్పేశావా?’’ అంటూ కంచం మొహం మీదకి విసరడాలు, ‘‘ఇదేమైనా మనుషులు తినే కూరేనా. ఇందులో అసలు ఉప్పూ కారం ఉన్నాయా. ఒళ్లు దగ్గర పెట్టుకునే చేస్తున్నావా?’’ అంటూ కస్సుమనడాలు... ఎన్నిసార్లో. అతను ముద్ద నోట్లో పెట్టు కునే వరకు ప్రాణాలరచేతిలో పెట్టుకుని చూడాల్సిందే. ‘‘పిలుస్తుంటే పలకవే. అప్పుడే కళ్లు నెత్తిమీద కెక్కాయా. ఎన్నిసార్లు అరవాలి. ఏడ చచ్చావు...’’ అంటూ ఎప్పుడూ హూంకరింపులే. 
      ఇంకోసారి, ‘‘మా ఫ్రెండ్స్‌ మందు పార్టీకొస్తున్నారు. చికెన్, ఫిష్‌ నాలుగు రకాలుగా చెయ్యమంటే, రెండే రకాలు చేశావేం. నువ్వసలు ఒక అమ్మకు, అయ్యకు పుట్టలేదే. దరిద్రపు కొంపలో పుట్టినదానివి, నీకు ఈ పద్ధతులన్నీ ఎలా తెలుస్తాయి. ఫ్రెండ్స్‌ ముందు నా పరువు తీస్తావా’’ అని జుట్టుపట్టి ఈడుస్తూ, కడుపులో కాలితో తంతూంటే, బాధతో లుంగచుట్టుకు పోయింది.
      మరోసారి ‘‘పూజ పూజ అని చంపుతున్నావు. నీకు పూజ లేకుండా చేస్తా చూడు..’’ అంటూ కోపంగా పూజ గదిలోని పటాలన్నీ చెరిపేశాడు. ఇంకోసారి ‘‘ఎంత సేపయ్యింది తలుపు కొట్టబట్టి. ఎవడితో కులుకుతున్నావు’’ అర్ధరాత్రి క్లబ్‌ నుంచి వచ్చి తలుపుకొట్టి, వాడ వాడంతా బయటికొచ్చి చూస్తుంటే, అందరిముందే జుట్టు పట్టి కొడుతూ వీరంగం చేశాడు, కడుపుతో ఉందని కూడా చూడకుండా. అలా చెప్పుకుంటూ పోతే అతను చేసిన రాక్షస కృత్యాలు కోకొల్లలు. అతను ఇంట్లో ఉన్నాడంటే భయం భయంగా బతకాల్సిందే. చిన్నప్పటి నుంచి తండ్రి చెప్పిన నీతి కథల ప్రభావమో, ఆయన ప్రతి ఏడాది చలివేంద్రం పెట్టడం, వారినికోసారి దగ్గరలో ఉన్న అనాథాశ్రమంలో తనకు వీలైనంత సేవ చేసి రావడం వల్లనో తనలోనూ సేవాభావం పాదుకుంది.  
      ‘‘నీకెప్పుడూ చిన్నకొడుకంటేనే ఇష్టం. ఎప్పుడూ వాడి దగ్గరికే వెళ్తావు. ఇక్కడ ఇద్దరు పిల్లలు, ఉద్యోగాలతో మేము సతమతమవుతుంటే వచ్చి నాలుగు రోజులు ఉండిపోదామనే ఉండదు’’ పెద్ద కొడుకు నిష్టూరమాడటంతో ఒకసారి భార్గవ్‌ ఇంటికెళ్లింది. అప్పుడు ఆ అపార్ట్‌మెంట్‌ వాళ్లంతా తిరుమలలో వారం రోజులు సేవ చేయడానికి వెళ్తున్నా మని రమ్మన్నారు. కోలలతో దేవుడి ముందు కోలాటం ఆడటం తనకు చాలా ఇష్టమే. భర్త అనే యముడు లేడు కదా అని కొడుకుని అడిగితే వెళ్లమన్నాడు. సంతోషంగా అన్నీ సర్దుకుంది. తీరా బయల్దేరే రోజు బార్గవ్‌ కూతురికి జ్వరం. కోడలు తనకు ఆఫీసులో సెలవు పెట్టే వీలు లేదంది. ‘‘అత్తయ్యా మరెప్పుడైనా వెళ్దురులే’’ అనడంతో ఆమె ఉత్సాహమంతా నీరుగారిపోయింది. 
      ‘అమ్మా! నీకెప్పుడూ అన్నయ్య అంటేనే ప్రేమ. చిన్నవాళ్లు, చిన్న పిల్ల ఉంది, పైగా కడుపుతో ఉంది అని ఆలోచించవు’’ చిన్న కొడుకు అలగడంతో పెద్ద కొడుకు ఇంటి నుంచి ఊరికొచ్చిన పదిరోజులకే అస్తవ్యస్తంగా ఉన్న ఇల్లు సర్దుకుని, అంతా దులుపుకుని, అన్నీ కడుక్కుని, కోడలు తినడానికి ఏమైనా చేసి రెండు బస్సులు ఎక్కి దిగి వెళ్లింది. వాంతులు అవుతున్న ఆమెని విశ్రాంతి తీసుకోవాలని చెప్పి పనంతా మీదేసుకుంది. ఇంట్లో ఒక పెద్దావిడను ఆయాగా పెట్టుకున్నారు. ఆవిడ పాపను చూసుకుంటుంది. ఆమె అక్కడ ఉండగా తుపాను వచ్చింది. పేపర్లు, టీవీల్లో వరద బాధితుల కష్టాలు చూసి ఆమెకి కన్నీరు ఆగలేదు. వాళ్ల కోసం ఏదైనా చెయ్యాలనుకుంది. కాలనీ వాళ్లందరూ వినాయక చవితి సందర్భంగా సమావేశం పెట్టుకు న్నప్పుడు, కొడుకుతో పాటు వెళ్లింది. కార్యక్రమాలన్నిటి గురించి చర్చించాక, ‘‘ఇంకా ఎవరైనా మాట్లాడతారా?’’ అని అడిగారు. ‘‘నేనొక రెండు నిమిషాలు మాట్లాడవచ్చా...’’ అడిగింది అన్నపూర్ణ. 
      ‘‘అమ్మా. నువ్వేం మాట్లాడతావు. అందరూ నవ్వుతారు కూర్చో...’’ కొడుకు చిన్నగా, కోపంగా ఆమెతో అంటున్నా విన కుండా ‘‘సభకు నమస్కారం. వినాయక చవితి ఘనంగా చెయ్యాలని నిర్ణయిం చారు. సంతోషం. అయితే మట్టి విగ్రహం అయితే పర్యావరణానికి మేలు. అలాగే ఈ సమావేశంతో సంబంధం లేని మరో విషయం మాట్లాడుతున్నందుకు క్షమించాలి. మానవ సేవే మాధవ సేవ అన్నారు. మొన్న తుపాను వల్ల సర్వం కోల్పోయిన వాళ్లకు మనకు చేతనైనంత సాయం చేస్తే మంచిదని నా అభిప్రా యం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అని కూర్చోగానే అందరూ చప్పట్లు కొట్టారు. ఆ బాధ్యతను ఆమెనే తీసుకోమన్నారు. కాలనీ అంతా తిరిగి చందాలు సేకరించి కొడుకు ద్వారా కలెక్టర్‌కు అందించింది. 
      భర్త కొడుతున్న విషయాన్ని పిల్లలతో చెప్పుకుని, ఇక ఆయన దగ్గరికి వెళ్లనని అంటే, ‘‘అమ్మా. మేం చిన్నప్పటి నుంచి చూస్తున్నదే కదా. నాన్న ఎప్పుడు మారతాడో?’’ అన్నారే తప్ప, ‘నీకు మేమున్నాం’ అన్న భరోనా ఒక్కరూ ఇవ్వలేదు. అప్పుడే ఆమె మనసు ముక్కలయ్యింది. ఇద్దరు పిల్లల్లో ఒక్కరైనా, ‘నాన్నా ఇది తప్పు. మరోసారి అమ్మను కొడితే ఊరుకోం’ అని అనలేదు. ‘ఛీ... ఏం బతుకు నాది’ అనుకుంది. ఇప్పుడవన్నీ వాళ్లకి చెబితే నేరం చేసినట్లు తలలు వంచుకున్నారు. 
      ‘‘ఒక్కసారి నా స్థానంలో ఉండి ఆలోచించండి. నేను చేసింది తప్పో, ఒప్పో మీకే తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి నా కలలేవీ నేరవేర్చుకోలేక పోయాను. కనీసం చరమాంకంలోనైనా నాకిష్టమైనట్టు బతకనివ్వండి. నన్నిలా వదిలెయ్యండి’’ చేతులు జోడించి అంది అన్నపూర్ణ. 
      ‘‘అలా అనకు పూర్ణా. నిన్ను బాధపెట్టిన మాట నిజమే. కానీ, నువ్వు లేకపోతే నేనుండలేను. నన్ను క్షమించు. ఇక నీ మనసు నొప్పించను. నువ్వు ఏమేం చేయాలనుకున్నావో అక్కడికొచ్చి అవన్నీ చేసుకో. రానని మాత్రం అనకు’’ కన్నీళ్ల పర్యంతమయ్యాడు విశ్వనాథం. 
      ‘‘అమ్మా! నాన్న తత్వం మొదటి నుంచి అంతే కదా అని నీ బాధని పట్టించుకోలేదు. మమ్మల్ని క్షమించమ్మా. నిన్ను వదిలి మేముండలేమమ్మా. ఇంటికి రామ్మా’’ కొడుకులిద్దరూ కన్నీళ్లతో తల్లి కాళ్లు కడిగారు.  
      వీచే గాలి కూడా ఆమె తీర్పు కోసం చెవులు రిక్కించింది. ఎంతైనా అమ్మ మనసు వెన్న కదా. ఆమె చిరునవ్వు నవ్వింది. ఆ ఆశ్రమ ఆవరణలో ఉన్న గుడి జేగంటలు ‘శుభం’ అన్నట్లు మోగాయి. 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


ముళ్ల గులాబీ

ముళ్ల గులాబీ

పులిగడ్డ విశ్వనాథరావు


కురూపి భార్య (కథాపారిజాతం)

కురూపి భార్య (కథాపారిజాతం)

కొడవటిగంటి కుటుంబరావు


కథ రాసి చూడు...

కథ రాసి చూడు...

పార్థసారథి చిరువోలు


అత్తమ్మ

అత్తమ్మ

కాటబత్తిని రాజేశ్వర్‌


వింగవాజు మామ్మ

వింగవాజు మామ్మ

మ‌న్నం సింధుమాధురిbal bharatam