అమ్మ కడుపు చూస్తుంది

  • 771 Views
  • 4Likes
  • Like
  • Article Share

    జాస్తి రమాదేవి

  • పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
  • 9391555364
జాస్తి రమాదేవి

అమ్మ ఎప్పుడూ బిడ్డల కడుపు చూస్తుంది. అవసరమైతే సమాజం ఆకలినీ గమనిస్తుంది! కృష్ణ అమ్మ కూడా ఆ బాటలోనే నడుస్తోంది. కానీ కృష్ణలో ఆందోళన! దానికి కారణమేంటి?
కృష్ణ
బైక్‌ ఆపి, ‘‘ఎక్కడికి?’’ కోపంగా అడిగాడు పోలీసు. ‘‘మా అమ్మకోసం...’’ నీళ్లు నమిలాడు కృష్ణ. ‘‘చూస్తే చదువుకున్న వాడిలా ఉన్నావ్‌. లాక్‌డౌన్‌ అని, ఇల్లు కదలొద్దని తెలీదా!’’ గద్దించాడు పోలీసు.
      ‘‘మా అమ్మ ఆస్పత్రిలో పనిచేస్తోందండి! ఎలా ఉందోనని..’’
      ‘‘ఎక్కడి వాళ్లక్కడే. వెనక్కి తిరుగు’’ ముందుకు పోనివ్వలేదు పోలీసు.
      చేసేది లేక వెనుతిరిగాడు కృష్ణ.
      ముఖం వేలాడేసుకుని ఇంటికొచ్చిన భర్తని గుమ్మంలోనే ఆపేసింది అనసూయ. గబగబా లోపలికెళ్లి సబ్బు తెచ్చి అందించి, ‘‘స్నానం చేసి లోపలికి రండి. బయటతిరగొద్దని అంతా మొత్తుకుంటుంటే మీరేమో ‘అమ్మా అమ్మా’ అంటూ పరిగెత్తారు’’ అంటున్న భార్యని కోపంగా చూసి, ‘‘ఇదంతా నీవల్లే వచ్చింది. నీ గోల పడలేకే మా అమ్మ వేరేగా ఇల్లు తీసుకుని వెళ్లిపోయింది’’ అన్నాడు.
      ‘‘ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టు నా మీద విరుచుకు పడితే ఎలా. నేనేం కాని మాటలు అన్నానని. ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా! ఇంకా ఆ ఆస్పత్రిలో పనిచెయ్యడం అవసరమా! హాయిగా ఇంటిపట్టున ఉండొచ్చుగా! అన్నాను. అదే పెద్ద తప్పయిపోయిందా. వెళ్లారుగా. మీ అమ్మ రానందా?’’ అనసూయ వ్యంగ్యంగా అంది. భార్య మీద విపరీతమైన కోపం వచ్చినా దిగమింగుకున్నాడు కృష్ణ.
      ‘‘ఆ... నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లు, నువ్వు అన్నీ వ్యంగ్యంగా అంటుంటే, తేలిగ్గా చూస్తుంటే భరించలేకపోయింది’’
      ‘‘అనవసరంగా నన్ను ఆడిపోసుకుంటే ఊరుకోను. పిల్లలు ఆడుకుంటుంటే అల్లరనేది మీ అమ్మ. పిల్లలు అల్లరి చెయ్యరా! సర్లే ముందు స్నానం చేసి లోపలికి రండి!’’ అని లోపలికి వెళ్లిపోయింది.
      అమ్మ పనిచేసి అలసిపోయి ఇంటికొచ్చి పడుకుంటే అనసూయ కావాలని పిల్లల్ని రెచ్చగొట్టి అల్లరి చేయించడం చాలాసార్లు గమనించాడు కృష్ణ. తనేం చెప్పినా అనసూయ వినదు. అందుకే అమ్మనే బతిమాలుకునేవాడు. ‘‘నువ్వింకా కష్టపడ్డం ఎందుకమ్మా!’’ అంటే ఆమె నవ్వేది. ‘‘ఏరా! నీకూ నామోషీగా ఉందా నేను చేసే పని!’’ అనేది.
      ‘‘అదేం మాటమ్మా! ఆ పని చేసేగా నన్ను ఇంతవాణ్ని చేశావు. నువ్వు చేసే పని అందరూ చెయ్యగలరా! ఇప్పటికే నువ్వు చాలా అలసిపోయావు. విశ్రాంతి తీసుకోమ్మా!’’ అనంటే నవ్వేది. ‘‘విశ్రాంతి దేనికిరా! ఓపిక ఉన్నంతవరకూ చెయ్యనివ్వు. తర్వాత హాయిగా ఇంట్లో ఉంటాను. పని చెయ్యకపోతే నాకేమీ తోచదురా!’’ అనేది.
      ఎన్నో కష్టాలు భరించగలిగిన కృష్ణ అమ్మ, కోడలు కొంటెతనంతో చేసే పన్లూ, సూటిపోటి మాటలూ భరించలేక, ప్రాణంగా పెంచుకున్న కొడుకుని వదిలి ఆస్పత్రి దగ్గరలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటోంది. ఆ వయసులో ఒంటరిగా ఉంటూ ఏం తింటోందో, ఎలా ఉంటోందో అంటూ కృష్ణకు రోజూ ఒకటే ఆలోచన!
      రెండు రోజులకోసారి వెళ్లి అమ్మని చూసి ‘‘ఏమన్నా కావాలా అమ్మా!’’ అని అడిగితే, ఆమె కళ్లలో తెలియని వెలుగు కనిపించేది. ‘ఎన్ని జన్మలెత్తితే అమ్మ లాంటి అమ్మ దొరుకుతుంది’ అనుకుం టాడు కృష్ణ. ‘కొవిడ్‌-19’ రక్కసి ప్రపం చాన్ని చుట్టేస్తోందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పెద్దవాళ్లు బయటికి రాకూడదనీ, సాధ్యమైనంతవరకూ ఇంట్లో ఉండాలనీ ప్రచారం జరుగుతోంది. అతనూ వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్నాను. రాత్రికి రాత్రి ‘లాక్‌డౌన్‌’ ప్రకటించారు. అమ్మకి ఫోన్‌ చేసి ఎలాగో వీలు చేసుకుని ఇంటికి వచ్చెయ్యమన్నాడు. ఎప్పటిలాగే నవ్విందామె. ‘‘నువ్వూ, కోడలూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి’’ అంటూ తనకే జాగ్రత్తలు చెప్పింది.
      ‘అత్యవసర పనులకి తప్ప కాలు బయట పెట్టడానికి కుదరదు. అమ్మని చూసి వారం అయ్యింది. అమ్మ ఎలా ఉందో? ఆస్పత్రిలో పని. అమ్మకి ఏమైనా అయితే? అసలే వైరస్‌ లక్షణాలున్నా బయటపడటం లేదంటున్నారు. అలా ఎంతమంది ఆస్పత్రికి వస్తున్నారో? పనే దైవం అనుకునే అమ్మ తన పని తాను చేసుకుపోతుంది. ఎలాగైనా అమ్మని ఒప్పించి ఇంటికి తీసుకు రావాలనుకుని బయలుదేరితే మధ్యలోనే పోలీసు ఆపేశాడు’ 
      ‘‘స్నానం అయ్యిందా!’’ అనసూయ పిలుపుతో కృష్ణ ఆలోచనల్లోంచి బయటికొచ్చి, స్నానం ముగించి, లాప్‌టాప్‌ ముందు కూర్చున్నాడు.

***

      మర్నాడు బైక్‌ లేకుండా సందు గొందుల్లోంచి, పోలీసుల కంట పడకుండా తల్లి ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఇంటికి తాళం వేలాడుతోంది. ఆస్పత్రికి వెళ్లుంటుంది అనకుని వెనక్కి తిరిగాడు కృష్ణ.
      ‘‘అమ్మ మంచిగుందా అన్నా!’’ పక్క పోర్షనతను అడిగాడు. ‘‘అమ్మ ఇక్కడ లేదా!’’ ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణ.
      ‘‘లేదన్నా! ఇంటి ఓనరు ఇల్లు ఖాళీ చెయ్యమంది. సామాన్లు తీసుకుని అమ్మ వెళ్తుంటే, నీ దగ్గరికే అనుకున్నా’’
      ‘‘ఉన్నపళంగా ఖాళీ చెయ్యమనడం ఏమిటి?’’ కంగారుగా అడిగాడు కృష్ణ. 
      ‘‘అదే అన్నా! అమ్మ ఆస్పత్రిలో పనిచేస్తాది కదా! చుట్టూ ఉన్నోళ్లు ప్రమాదం అన్నారని ఇంటావిడ అమ్మతో అంది. అమ్మ ఇల్లు ఖాళీ చేసింది. నీ దగ్గరికి రాక ఎక్కడికెళ్లిందన్నా?’’ అతనూ కంగారుగా అడిగాడు.
      ‘అమ్మ అంతే! మాట పడదు. ఎవర్నీ ఏమీ అనదు. నాకు మాటమాత్రం చెప్పకుండా ఎక్కడికి వెళ్లుంటుంది’ అతను ఆస్పత్రి వైపు పరిగెత్తాడు. 
      తల్లితోపాటు పనిచేసే మరియమ్మ కనిపిస్తే అడిగాడు. ‘‘అదేంటి, నీకు చెప్పలేదా? వయసు పెద్దదయ్యిందని నన్ను, దేవమ్మనీ ఇంటికాడ ఉండమని చెప్పి పరీక్షలు చేసి పంపారు. ఇంటికి రాలేదా?’’ ఆశ్చర్యంగా అందామె.
      కృష్ణలో ఆందోళన ఎక్కువైంది. ‘అమ్మ ఇలా చేసిందేంటి?’ అనుకుంటూ ఫోన్‌ చేశాడు. స్విచాఫ్‌ వచ్చింది. ‘అమ్మని ఇప్పుడు ఎక్కడని వెతకాలి. ఎలా వెతకాలి. అసలు ఎక్కడికి వెళ్లింది. అడుగు తీసి అడుగు వేసే అవకాశం లేదు. ఒక్క మాటైనా నాతో ఎందుకు చెప్పలేదు. ఇంటికొస్తే కోడలి ముందు అవమానం అనుకుందా?’ ఒకటే ఆలోచనలు. భార్యకి ఫోన్‌ చేసి, విషయం అంతా చెప్పి, ‘‘అంతా నీవల్లే’’ అన్నాడు కోపంగా. 
      ‘‘మళ్లీ అదేమాట. మీ అమ్మకి ఆ మురికి జనం అంటే ప్రేమెక్కువగా. అక్కడికే వెళ్లుంటుందిలే. ఇప్పుడు మీరా కొంపలంట తిరక్కండి. ఇంట్లో పెళ్లాం పిల్లలున్నారని గుర్తుపెట్టుకుని తిన్నగా ఇంటికి రండి!’’ అంది కటువుగా. 
      ‘అనసూయ అన్నట్టు అమ్మ అక్కడికే వెళ్లుంటుందా!’ అనుకుని అటువైపు కదిలాడు. బీదా బిక్కీ ఉండే ప్రాంతం అది. ఒకప్పుడు ప్రభుత్వం కట్టించిన యాభై ఇళ్లు ఉండేవి. ఇప్పుడు చాలా ఇళ్లు వచ్చేశాయి. చాలా ఇరుగ్గా ఉన్నాయి ఇళ్లు. తను అక్కడే పుట్టాడు. అక్కడ తమకీ ఓ ఇల్లుండేది. అమ్మకి ఆ ఇల్లంటే ప్రాణం. చిన్నప్పుడే నాన్న చనిపోతే, తనని పెంచడానికి అమ్మ చాలా అవస్థలు పడింది. తను అక్కడే పెరిగి పెద్ద య్యాడు. తనకి మంచి ఉద్యోగం వచ్చాక కూడా అక్కడే ఉన్నారు. పెళ్లయ్యాక ఒక గది, వసారా సరిపోదని వేరే ఇల్లు తీసుకున్నాడు. తర్వాత సొంత ఇల్లు కొన్నాడు. తనకి ఆస్పత్రిలో పని ఇప్పించిన ధనమ్మత్త కొడుక్కి పెళ్లయితే ఉండమని ఆ ఇల్లు ఇచ్చేసింది అమ్మ. ఇంటి ముందు పెద్ద వేప చెట్టు ఎంద రికో నీడనిస్తూ అలాగే ఉంది. ఎన్నెన్నో జ్ఞాపకాలు అతణ్ని చుట్టుముట్టాయి.
      ‘‘ఏంటల్లుడూ! అమ్మకోసం వచ్చావా!’’ ధనమ్మత్త నవ్వుతూ అడిగింది.
      ‘‘అమ్మ ఇక్కడికి వచ్చిందా!’’ ఆత్రు తగా అడిగాడు కృష్ణ. ‘‘రా చూపిస్తా...’’ అని ధనమ్మ ముందుకు నడుస్తుంటే అనుసరించాడు. 
      పెద్ద చింత చెట్టు కింద అమ్మని చూడగానే కళ్లలో బెంగ కన్నీళ్ల రూపంలో బయటికొచ్చింది. పక్కనే పెద్ద దబరాగిన్నె నిండా అన్నం, పెద్ద గిన్నెలో పల్చని పప్పుచారు. ఇంకో గిన్నెలో పల్చని మజ్జిగ.. అందరూ ముక్కుకు మాస్క్‌ కట్టుకుని దూరం దూరంగా నిలుచుని ఉన్నారు. అందరి చేతుల్లోనూ కంచాలు, గ్లాసులున్నాయి. కొడుకుని చూడగానే దేవమ్మ లేచొచ్చి ‘‘ఏరా! బాగున్నావా!’’ అంది. ‘‘అమ్మా! ఇంటికి రాకుండా ఇక్కడికి వచ్చావేంటి?’’ అడిగాడు. ‘‘ఇదీ మనిల్లేకదా. బయ టంతా గోలగోలగా ఉందని జాగ్రత్తలు చెప్పి పంపారు. విశ్రాంతి తీసుకోవడం నాకు చేతకాదురా!’’ అంది నవ్వుతూ.
      ‘‘అద్దె ఇల్లు ఖాళీ చెయ్యమంటే ఇంటికి రావచ్చు కదమ్మా! కొడుకు లేడనుకున్నావా!’’ కృష్ణ గొంతు పూడుకుపోయింది. ‘‘అదేం కాదురా. ఇక్కడ అందర్నీ చూడాలనిపించింది. పాపం వీళ్లెలా ఉన్నారో అనిపించింది. శుభ్రత తక్కువ కదా! చెప్పాలని వచ్చాను. కానీ, ఇక్కడికి వచ్చాక అర్థమైంది. ‘పూట బత్తెం... పుల్లెలుగు’కదాని. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు. మీ ఆవిడ ఎప్పుడూ అనేది కదా! మీ అమ్మ సంపాదించింది ఏ గోతిలో పోస్తోందని. అదిలా అక్కరకొచ్చిందిరా. కంట్రోల్‌ బియ్యం, ఇచ్చే కాస్త డబ్బు వీళ్లకి ఏ మూలకి వస్తాయి! ఇంటిల్లిపాది ఇంట్లో కూర్చుంటే ఆకలెలా తీరుతుంది. నా కంటే నీకే బాగా తెలుసు, ఒకప్పుడు వీళ్లంతా వాళ్లు వండుకున్న గుప్పెడు మెతుకుల్లోంచి తలో ముద్ద తెచ్చి నీ నోట్లో పెట్టినవాళ్లే. ఇప్పుడు వాళ్లకి ఓ ముద్ద పెట్టాల్సిన అక్కర వచ్చింది. నా దగ్గరున్నదేదో, కొన్నాళ్లయినా వాళ్ల ఆకలి తీరాలని ఇలా వండి పెడుతున్నాను’’ అంటూ అన్నం గిన్నె వైపు చూపించింది దేవమ్మ. 
      ‘‘ఇదంతా నాకు చెబితే కాదంటాననుకున్నావా?’’ అడిగాడు. ‘‘చెబితే ఇక్కడి వరకూ రానివ్వవని చెప్పలేదు. నీకు అమ్మంటే ఎంతిష్టమో నాకంటే ఎవరికి తెల్సురా కృష్ణా!’’ కొడుకు తల నిమిరింది దేవమ్మ. ‘‘సర్లే. ఇదిగో ఈ డబ్బు నీ దగ్గరుంచుకో. అవునూ నీ ఫోను స్విచ్ఛాఫ్‌ వస్తోందేంటి’’ అడిగాడు కృష్ణ. ‘‘అదా, చార్జింగు అయిపోయింది. పెట్టడం మర్చిపోయాను’’ అంది దేవమ్మ.
      ‘‘సరే, ఫోను ఎప్పుడూ పనిచేసేలా చూసుకో. ఏదైనా కావాంటే నాకు ఫోన్‌ చెయ్యి. ఈ పరిస్థితులు ఇంకా ఎన్నాళ్లుంటాయో తెలీదు. నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదమ్మా! నేను ఫోన్‌ చేస్తూ ఉంటాను..’’ అంటున్న కొడుకుని చూసి మురిపెంగా నవ్వింది దేవమ్మ.
      కృష్ణ వెనక్కి తిరిగాడు. అన్నం కోసం ఆరాటపడుతున్న వాళ్ల దగ్గరికి నడిచింది దేవమ్మ.
      కరోనా కంటే దారుణమైన ఆకలిని తరిమికొట్టాలని ప్రయత్నిస్తున్న దేవమ్మ, పాయికాన దొడ్లు కడిగే దేవమ్మ.... ఆ కృష్ణ తల్లి. ఆ విషయం చెప్పుకోడానికి అతనెప్పుడూ సిగ్గుపడడు. దేవుడిచ్చిన దేవత... ఆ అమ్మ... దేవమ్మ.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


ముళ్ల గులాబీ

ముళ్ల గులాబీ

పులిగడ్డ విశ్వనాథరావు


కురూపి భార్య (కథాపారిజాతం)

కురూపి భార్య (కథాపారిజాతం)

కొడవటిగంటి కుటుంబరావు


కథ రాసి చూడు...

కథ రాసి చూడు...

పార్థసారథి చిరువోలు


అత్తమ్మ

అత్తమ్మ

కాటబత్తిని రాజేశ్వర్‌


వింగవాజు మామ్మ

వింగవాజు మామ్మ

మ‌న్నం సింధుమాధురిbal bharatam