పిల్లి బొమ్మ గౌను

  • 438 Views
  • 13Likes
  • Like
  • Article Share

    ముచ్చి ధనలక్ష్మి

  • పాలకొండ, శ్రీకాకుళం జిల్లా.
  • 8179965538
ముచ్చి ధనలక్ష్మి

ధ‌న్వికి ఆ గౌనంటే చాలా ఇష్టం. దానితో అదో అనుబంధం. ఎప్పుడూ దాన్నే వెయ్యాల‌ని అమ్మ‌తో పోరు. అనుకోకుండా ఆ గౌను ఓ రోజు దూర‌మైంది! అది మ‌ళ్లీ ధ‌న్వి ద‌గ్గ‌రికి వచ్చిందా? అయితే ఎలా...?
‘‘అమ్మా!
నా బిల్లిబొమ్మ గౌనివ్వవా!’’ బీరువాలో చీరలు తీస్తున్న ఉమ కాళ్లను చుట్టుకుంటూ అడిగింది ధన్వి.
      ‘‘కాసేపు మౌనంగా కూర్చో. నేను రెడీ అవ్వాలి’’ విసుక్కుంటూ కుర్చీలో కూర్చోబెట్టింది ఉమ.
      ‘‘గౌనివ్వు, ఏచుకోని నేనూ లెడీ అవుతా’’ అచ్చం ఉమలానే తల పట్టుకుంటూ చెప్పింది ధన్వి.
      ‘‘ఇప్పుడు నువ్వు వేసుకున్న గౌను ఇంకా బాగుంది. ఇదే ఉండనీ’’ అంది ఉమ.
      ‘‘అమ్మా! ఇవ్వవా!’’ అంటూ కుర్చీలోంచి గెంతి ఉమ చీర పట్టుకుంది ధన్వి.
      ‘‘పోనీ ఆ గౌనే వేయొచ్చుగా ఉమా!’’ టీవీ నుంచి కళ్లు తిప్పకుండానే సలహా ఇచ్చాడు శంకర్‌.
      ‘‘ఆ గౌను చాలా లూజవుతుంది. పొడవు కూడా ఎక్కువ. ముందు పాపను కాసేపు పట్టుకో’’ ధన్విని శంకర్‌కిచ్చేసి చీరకు మ్యాచింగ్‌ బ్లౌజ్‌ కోసం వెతకడం మొదలుపెట్టింది. ఈలోగా బీరువా అడుగున కనిపించింది పిల్లి బొమ్మ గౌను. ‘ఇదంటే ఎందుకంతిష్టం ధన్వికి? ఎప్పుడు బయటికెళ్లినా ఈ గౌనే వేయమని ఒకటే ఏడుపు. ఇప్పుడిది కనిపిస్తే మూడో ప్రపంచ యుద్ధమే’ నవ్వుకుంటూ ఇంకొంచెం లోపలికి పెట్టింది, ధన్వికి కనిపించకుండా.
      ‘‘అమ్మా! నా గౌనివ్వవా. ఏచుకుంటాను’’ దీనంగా మరోసారి అడిగేసరికి అప్రయత్నంగా ఉమ చెయ్యి బీరువా అడుగుకు వెళ్లింది.
      ‘ఏంటే? మీ నాన్న కొనక కొనక కొన్న గౌననా? ఎప్పుడూ అదే వేసుకుంటానంటావ్‌’ ఆడపడుచు వెటకారం గుర్తొచ్చి బలవంతంగా చేతిని వెనక్కి తీసుకుంది. మూడున్నరేళ్ల వయసులో ధన్వికి శంకర్‌ కొన్న గౌను అదొక్కటే. దానికి తనంతగా బాధపడట్లేదుగానీ, ఆడపడుచు మాటల్లో ‘కొనలేకపోతున్నారు’ అన్న చులకన భావనే బాధ కలిగిస్తోంది. ఆ మాటల్ని మర్చిపోలేకపోతోంది. ఎందుకు? తన మనసులో కూడా అదే ఉందా? ఆ మధ్యతరగతి జీవితంలో ఇమడలేక పోతోందా? మనసు ఆమెనలా వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయింది. చేతులు యాంత్రికంగా వాటి పని అవి చేసుకుంటున్నాయి.

*  *  *

      ‘‘అమ్మా....!’’ సాగదీసింది ధన్వి.
      ‘‘ఆ చెప్పు. నా ప్రాణం మీదకేం తెస్తున్నావ్‌?’’ గ్రైండర్‌లో పప్పు వేస్తూ బదులిచ్చింది ఉమ.
      ‘‘మరేమో రేపు సాటర్‌ డే కదా?’’
      ‘‘అయితే?’’ 
      ‘‘ప్రిన్సిపల్‌ బ్లాక్‌ డ్రెస్సే వేసుకోమన్నారు. అందుకే...’’
      ‘‘అబ్బా. అలా ఆగి ఆగి చెప్పకపోతే నీకేం కావాలో ఒక్క ముక్కలో చెప్పొచ్చుగా’’ చిరాకు పడింది ఉమ.
      ‘‘నేను నా పిల్లి బొమ్మ గౌను వేసుకుంటాను’’ ఠక్కున చెప్పేసి తల తిప్పుకుంది.
      ‘‘ఆ గౌనా? అది మరీ మోకాళ్ల వరకే వస్తుంది కదా?’’ 
      ‘‘ప్లీజ్‌.. ప్లీజ్‌’’ తల్లి బుగ్గలు పట్టుకుని బతిమాలింది.
      ‘‘సర్లే’’ వరమిచ్చేసింది ఉమ... కూతురి మొహంలో ఆనందం చూడటానికి మాత్రమే కాదు, వేరే బ్లాక్‌ డ్రెస్సేది లేనందుకు కూడా. ‘‘మా మంచి అమ్మ. థాంక్యూ’’ ఆనందంగా అరుస్తూ చెంగు చెంగున లేడిలా బీరువా దగ్గరికి పరిగెడుతున్న ధన్విని చూసి ‘దీనికీ గౌను పిచ్చెలా వదులుతుందో?’ నిట్టూరుస్తూ నవ్వుకుంది ఉమ.
      బడికి బయల్దేరుతూ నిలువుటద్దం దగ్గర ఆగి చూసుకుంది ధన్వి. గౌను మొత్తం ముదురు నలుపు రంగులో మెరిసిపోతుంటే, మెడ కింద అరచేతి పరిమాణంలో ఉన్న పిల్లి ముఖం మాత్రం ముకమలు బట్టతో మృదువుగా, ముద్దుగా వెండి వెన్నెలలా వెలిగిపోతోంది. అద్దంలో చూస్తూనే పిల్లి ముఖాన్ని పట్టుకుంది. మెత్తగా, ముద్దగా ఉన్న ఆ దారాలు చేతికి తగులుతుంటే ఏదో అనిర్వచనీయమైన ఆనందం, పట్టలేనంత తృప్తి. అంత మంచి గౌను ప్రపంచంలో ఇంకెక్కడా లేనట్లు, అది వేసుకుంటే ఎక్కడికో వెళ్లిపోయినట్లు... ఏవో ఊహలు. 
      సైకిల్‌ బెల్‌ వినిపించేసరికి ఉలిక్కిపడి చూసింది. ‘‘ధన్వీ....’’ బెల్‌ వెనుకనే తండ్రి గొంతు వినబడగానే పుస్తకాల సంచి అందుకుని బయటికి పరిగెత్తింది. సైకిల్‌ ఎక్కి సిద్ధంగా ఉన్నాడు తండ్రి. సంచిని వెనుక క్యారేజీకి తగిలించి ముందున్న బేబీ సీటు మీద కూర్చుని హ్యాండిల్‌ పట్టుకుంది. దారిలో ఎవరైనా గౌను వైపు చూస్తే ఏదో తెలియని గర్వం. ఆ సైకిల్‌ రథంలా, తను సిండ్రెల్లాలా ఊహించుకుని మురిసిపోతోంది తన సొంత ప్రపంచంలో.

*  *  *

      ‘‘ఓహో! నా మేనకోడలు ఇంత పెద్దదైందే’’ కొత్త గొంతుకి ఆశ్చర్యంగా తలెత్తి చూసింది ఇంట్లోకొస్తున్న ధన్వి.
      ‘‘కమలత్తా!’’ ఆనందంగా అరిచింది మరుక్షణం. ఆ వెనుక నుంచి వస్తున్న సరయుని చూసి ఇంకా ఆనందపడింది.
      ‘‘మా ధన్వి కోసమేం తెచ్చానో తెలుసా?’’ కళ్లెగరేసింది కమల. కుతూహలంతో ధన్వి కళ్లు పెద్దవయ్యాయి.
      ‘‘రోబో’’ అంటూనే ఆన్‌ చేసి కింద పెట్టింది. జుయ్‌ మంటూ కదిలిందా బొమ్మ. ఏదైనా అడ్డొస్తే దానికదే తప్పుకుంటోంది. సంబరంతో వెలిగిపోయింది ధన్వి మొహం అది చూస్తూనే.
      ‘‘బాగుందా?’’ మెల్లగా అడిగింది కమల.
      ‘‘చాలా చాలా బాగుంది. నిజంగా నాకేనా?’’ సంశయంగా అడిగింది. ఎందుకో ఆ బొమ్మ తనదే అంటే నమ్మలేకపోతోంది. వెళ్లిపోయేటప్పుడు తీసుకెళ్లిపోతారేమో? అన్న సందేహం లోపల.
      ‘‘నిజంగా నీకేరా?’’ తల నిమిరింది కమల. 
      ‘‘సరే మీ ఇద్దరూ ఆడుకోండి, వంటయ్యాక పిలుస్తాను’’ అంది కమల. 
      తలూపి ధన్వితో పాటు బయటికెళ్తున్న సరయు కాళ్లు అప్రయత్నంగా ఆగిపోయాయి. 
      క్యాట్‌ ఫ్రాక్‌. ఎంత బాగుందో! తదేకంగా చూస్తోంది, తీగ మీద ఆరేసి ఉన్న పిల్లి బొమ్మ గౌను వైపు.
      ‘‘మమ్మీ! ఆ ఫ్రాక్‌ బాగుంది కదా! తీసుకుంటాను’’ ముద్దుగా అడిగింది సరయు.
      ‘‘ఇదంటే నాకు చాలా ఇష్టం. ఎవరికీ ఇవ్వను’’ బాణంలా వెళ్లి గౌను పట్టుకుంది ధన్వి.
      అడిగినవన్నీ క్షణాల్లో తెచ్చిపెట్టే తల్లిదండ్రుల మధ్య పెరిగిన సరయు ఒక్కసారిగా ఏడుపందుకుంది ధన్వి మాటలు విని. ఏం చేద్దామన్నట్టు ఒకరి ముఖాలొకరు చూసుకుని తర్వాత ఇద్దరూ కమల వైపు చూశారు ఉమ, శంకర్‌.
      ‘‘సరయూ! నీకింకా మంచి ఫ్రాక్‌ కొంటాను’’ తల్లి బుజ్జగిస్తున్న కొద్దీ మంకుపట్టు పట్టి రాగం పెద్దది చేసింది.
      ధన్వి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. నిస్సహాయంగా ఉమవైపు చూశాడు శంకర్‌.
      ‘‘ధన్వీ...’’ తల్లి పిలుపునకు ఒళ్లు ఝల్లుమంది. సింహానికి దొరికిపోయిన లేడి పిల్లలా అమాయకంగా చూస్తున్న ధన్విని చూసినప్పుడు మొదటిసారి తమ పరిస్థితిని తిట్టుకుంది ఉమ. అదిచ్చేయమ్మా! నీకింకా మంచిది కొంటాలే అని అబద్ధం చెప్పదు, చెప్పలేదు. 
      ‘‘సరయు నీకన్నా చిన్నది కదా! అలా ఏడిపించకూడదు. ఇన్ని రోజులు నువ్వే వేసుకున్నావ్‌గా ఇచ్చెయ్‌’’ చెబుతున్న తల్లి వంక కోపంగా చూస్తూ గౌనుని ఇంకాస్త గట్టిగా పట్టుకుంది. ‘అమ్మకీ, నాన్నకీ, అత్తకీ అందరికీ సరయు అంటేనే ఇష్టం. అసలు అత్త రాకున్నా బాగుండేది...’ నీళ్లు జలజలా రాలాయి కళ్ల నుంచి.
      ‘‘కావాలంటే రోబో బొమ్మ దాన్నే తీసుకోమను’’ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ చెప్పింది. 
      చివరి ప్రయత్నంగా, ‘‘ఇచ్చెయ్‌మన్నానా?’’ ఉమ స్వరంలో మార్దవం తగ్గింది.
      ‘‘పోన్లే వదినా! ఏడ్చి ఏడ్చి ఇదే ఊరుకుంటుందిలే. పాపం దానికా గౌనంటే ఎంతిష్టమో?’’ కమల మాటలు మనస్ఫూర్తిగా అంటున్నట్టనిపించలేదు ఉమకి.
      ‘‘ఫర్వాలేదులే కమలా! అయినా అది ధన్వికి బాగా చిన్నదైపోయింది’’ బలవంతంగా గౌను లాక్కుని సరయు చేతిలో పెట్టింది ఉమ. స్విచ్‌ నొక్కినట్టు ఆగిపోయింది సరయు ఏడుపు. చకచకా కళ్లు తుడుచుకుని ధన్వి వైపు చూసి నవ్వింది వెక్కిరింపుగా.
      అయోమయంగా కాసేపలానే నిలబడిపోయింది ధన్వి. అప్పటిదాకా వస్తున్న ఏడుపు ఆగిపోయి దాని స్థానంలో విపరీతమైన కోపం వచ్చింది. గౌనివ్వమన్న అమ్మ మీదా, మౌనంగా ఊరుకున్న నాన్న మీదా, వద్దని చెప్పని కమలత్త మీదా, తనింటికే వచ్చి తన గౌనే తీసుకున్న సరయు మీదా. అందరి మీదా పట్టలేనంత కోపం వస్తోంది. సరయుని గట్టిగా కొట్టి, గౌను తీసుకుని, ‘మా ఇంటికెప్పుడూ రావొద్ద’ని అరవాలనిపిస్తోంది. ‘అమ్మో! అలా చేస్తే అమ్మ, నాన్నకి చాలా కోపమొస్తుందేమో’. పక్కనున్న గోడని గట్టిగా తన్నింది. కాలి గోరు విరిగి రక్తమొస్తున్నా నొప్పి వేయలేదు, ఏడుపు రాలేదు. అలిగి అన్నం తినకుండానే పడుకుంది.
      రెండు రోజుల తర్వాత కమల, సరయు బయల్దేరుతుంటే వంటింట్లో నిలబడి చూస్తున్న ధన్వికి నిమిష నిమిషానికి ఆందోళన పెరిగిపోతోంది. వాళ్లెప్పుడెప్పుడు ఆటో ఎక్కుతారా అని ఆత్రంగా చూస్తోంది. సమయం ఎంతకీ కదలడం లేదు. అసహనంగా ఉంది ధన్వికి.
      ‘‘అమ్మా! బ్యాగ్‌లో పిల్లి బొమ్మ గౌను లేదు’’ చేతులు తిప్పుతూ చెప్పింది సరయు.
      గతుక్కుమంది ధన్వి. కాళ్లూ చేతులూ వణికిపోతున్నాయి.
      ‘‘అవునా!’’ అంటూ బ్యాగ్‌లో చూసింది కమల. రెండు నిమిషాలకి అది నిజమే అని నిర్ధారణ అయింది. తలకొట్టుకుంది ఉమ. కోపంగా చూశాడు శంకర్‌. దొరికిపోయిన దొంగలా తలొంచుకుని రాత్రి స్కూల్‌ బ్యాగ్‌లో పెట్టిన గౌను తీసుకొచ్చి సరయు చేతిలో పెట్టింది, కళ్లలో నీళ్లు చిప్పిల్లుతుండగా.
      పేదరికం నేర్పిన ఒద్దికేమో అనిపించింది కమలకి. గౌను వద్దులే అంటే సరయు ఎంత రాద్ధాంతం చేస్తుందో? అని ఊరుకుండిపోయింది.
      సరయు ఎక్కిన ఆటో వెళ్లిపోతుంటే తన ప్రాణమే పోతున్నట్టనిపించింది. తనకెంతో ఇష్టమైన గౌను ఇక తనది కాదన్న నిజం ఒప్పుకోలేక నిస్సహాయంగా, నిస్తేజంగా ఉండిపోయిందలా.
      ఇక ఆ రోజు నుంచి కమల, సరయు పేరెత్తితేనే ఒళ్లు మండిపోయేది ధన్వికి. శనివారం వచ్చినా, బీరువాని చూసినా తన గౌనే గుర్తొచ్చేది. పండగలకీ, పుట్టినరోజులకీ షాపింగ్‌కి తీసుకెళ్లినప్పుడు కొట్టులోని వాళ్లు ఎలాంటి గౌను కావాలని అడిగితే ‘‘పిల్లి బొమ్మ గౌనుందా?’’ అనేది అమాయకంగా.
      అలా అనే ప్రతిసారీ ‘తప్పు చేశానా?’ అన్న భావన గుచ్చేది ఉమలో. ‘దానికంత ఇష్టమని తెలిసి కూడా దూరం చేశానుగా!’ అనిపించేది. కాలం కదిలేకొద్దీ చదువులో బిజీ అయిపోయిన ధన్వి, గౌను గురించి ఇంట్లో ప్రస్తావించక పోవడంతో ఉమ అపరాధ భావన కాస్త కాస్తగా తగ్గింది.

*  *  *

      ‘‘కమల ఫోన్‌ చేసింది. గురువారం గృహ ప్రవేశం అంట. రాకపోతే బాగుండదని బెదిరించింది’’ చెప్పి ఉమ వైపు చూశాడు శంకర్, ఏం చేద్దామన్నట్టు?
      ‘‘వెళ్దాం శంకర్‌. ఇన్నాళ్లు మన పరిస్థితి బాగలేక ఇంటి ఆడపిల్లలకేం పెట్టలేదు. ఇప్పుడు కాస్త మెరుగయ్యాక కూడా ఇలాగే ఊరుకోవడం సరికాదు’’
      ‘‘సరే, అయితే రిజర్వేషన్‌ చేస్తా’’ అన్నాడు శంకర్‌.

*  *  *

      ‘‘అత్తా!’’ కార్యక్రమం హడావుడంతా అయ్యాక తీరిగ్గా విశ్రాంతి తీసుకుంటున్న కమల దగ్గరికెళ్లి మెల్లగా పిలిచింది ధన్వి.
      ‘‘ఏంటే? అంత ముద్దుగా పిలుస్తున్నావ్‌? నాకు కొడుకులు లేరే. అలా పిలిచి ఏం లాభం?’’ హాస్యమాడింది కమల.
      ‘‘అది కాదత్తా! ఇప్పుడు సరయు పెద్దదయింది కదా?’’ 
      ‘‘అవును పెద్దదయింది. అయితే?’’
      ధన్వి ఏం చెప్పాలనుకుంటోందో అక్కడెవరికీ అర్థం కాలేదు.
      ‘‘ఇప్పుడు సరయుకి కూడా ఆ గౌను సరిపోదు కదా! నా గౌను నాకిచ్చేయవా?’’
      ఫక్కున నవ్వింది కమల. ‘‘నీకిప్పుడు పదకొండేళ్లు. ఇంకా ఆ గౌను వేసుకుంటావా ఏంటి... చిన్నపిల్లలా?’’
      ‘‘వేసుకుంటాననలేదు కదా! సరయుకెలాగో సరిపోదు కనుక ఇవ్వమన్నా’’ అలిగినట్టు పెట్టింది ముఖం.
      కమల నవ్వుతూ ధన్వి దగ్గరికొచ్చి ‘‘సారీరా! నీకా గౌనుతో అంత అటాచ్‌మెంటుందని ఇప్పుడే అర్థమైంది. నీతో అంత గొడవపడి తెచ్చినా, ఆ గౌను మూడు సార్లు కూడా వెయ్యలేదు’’ అంటూ బెడ్‌రూంలోకెళ్లిన కమలని రెప్ప వేయకుండా చూస్తుండిపోయింది అలాగే. తనకింకా నమ్మకం కలగడం లేదు, ఆ గౌను మళ్లీ తన చేతుల్లోకి వస్తుందంటే.
      ఆ నల్లని గౌను, తెల్లని పిల్లి బొమ్మ, నడుముకి తెల్లని పువ్వు... ఊహల్లో ఊగుతున్న ఊయల తెగి దబ్బున కింద పడినట్టయింది ఖాళీ చేతుల్తో వస్తున్న కమలని చూడగానే.
      ‘‘బీరువా, షెల్ఫ్‌లన్నీ వెతికానే, ఎక్కడ పెట్టానో తెలియటంలే’’ నిట్టూరుస్తూ ‘‘తర్వాతంతా వెతికి పంపిస్తాలే’’ చెప్పింది.
      ఉబుకుతున్న కన్నీళ్లను అతి కష్టంగా బయటికి రాకుండా ఆపింది ధన్వి. తనకి స్పష్టంగా అర్థమైపోయింది ఇక ఆ గౌను తన దగ్గరికి రాదని. ‘సరయు చింపేసిందో? అత్త ఎవరికైనా ఇచ్చేసిందో?’
      ‘అయినా ఆ పిచ్చి గౌను లేకుంటే వచ్చిన నష్టమేంటి? అంతకన్నా మంచి డ్రెస్సులు చాలా ఉన్నాయిగా!’ ఆ క్షణం అందరి మీదా ఉన్న కోపం గౌను మీదకి మళ్లించింది. ‘అవసరం లేదు. ఆ గౌను అస్సలు అవసరం లేదు. జీవితంలో దాని ముఖం చూడను’ 
      ‘‘ఫర్వాలేదత్తా! నాకా గౌనొద్దు’’ అనేసి బయటికెళ్లిపోయింది.
      ఠక్కున తలెత్తి శంకర్‌ వైపు చూసింది ఉమ. దోషిలా తలదించుకున్నాడు. ఏదో తప్పు చేసిన భావన శంకర్‌లో కూడా మొదలైంది. చెల్లెలేమనుకుంటుందోనని ఆలోచించాడేగానీ కూతురి వైపు నుంచి చూడాలన్న ఆలోచనే రాలేదు. అప్పటికదే సరనిపించింది. ఇప్పుడాలోచించి ఏం లాభం? తల విదిల్చాడు చిరాగ్గా.

*  *  *

      ‘‘ఏంటత్తా? నువ్వు కూడా అందరిలా వస్తే ఎలా? కాస్త ముందు రావచ్చు కదా?’’ చిరుకోపంగా అంది ధన్వి.
      ‘‘సరయు గురించి నీకు తెలుసుకదా? అది రెడీ అయ్యేసరికి అమెరికా వెళ్లొచ్చేయచ్చు. సరేగానీ ఇంతకూ నా మనవరాలేదీ?’’  
      ‘‘అదిగో ఇప్పటి వరకూ నాతో ఆడుకుని ఇప్పుడే ఆ బొమ్మల మీద పడింది. ఎంత అల్లరిదై పోయిందనుకున్నావ్‌?’’ 
      ‘‘అయితే నీ లక్షణాలు రాలేదన్నమాట’’ నవ్వింది కమల.
      ధన్వి కూడా నవ్వేసి ‘‘పద, కేక్‌ కట్ చెయ్యాలి’’ అంది.
      ‘‘నా బహుమతి మాత్రం ఇప్పుడే తెరచి చూడాలి’’ బతిమాలుతూ ఇచ్చింది సరయు, చిన్న సర్‌ప్రైజ్‌ అంటూ.
      ‘‘అవునా, చూడు చూడు ఏంటో’’ ఉత్సాహంగా చెప్పాడు శంకర్‌. 
      కుతూహలంగా పైన కవర్‌ తీసింది. నల్లని కారు మేఘాల మధ్యలో వెలుగుతున్న పున్నమి చందమామ. ఒళ్లంతా వణికింది పులకరింతతో.
      ‘‘నా డిజైనింగ్‌ కోర్సు పూర్తయ్యాక డిజైన్‌ చేసిన మొదటి గౌను’’ ధన్వి భుజాలు పట్టి కదిపింది.
      ఎన్నో ఏళ్ల తర్వాత కనబడ్డ ఆత్మీయ నేస్తం. అమ్మా నాన్నలతో తిట్టించుకుని, అత్తని, సరయుని ద్వేషించి, చాలా షాపుల్లో వెతికిన గౌను. చిన్న నాటి మధుర క్షణాలు గుర్తొస్తుంటే తన గౌను పిచ్చికి తనకే నవ్వొచ్చింది.
      ‘‘ఎలా ఉందో చెప్పవే, మొన్న నీ చిన్నప్పటి ఫొటో చూసి అమ్మ మొత్తం చెప్పింది గౌను గురించి. వెంటనే ఆ ఫొటోలో డిజైన్‌ దించేశా’’ భుజాలెగరేస్తూ చెప్పింది సరయు.
      ‘‘నా గౌను నాన్నా!’’ ఎదిగిన వయసునీ, చుట్టూ పరిసరాల్ని మరచిపోయి పరుగులు తీస్తూ వచ్చిన కూతురిలో అప్పటి చిన్నారి కనిపించింది శంకర్‌కి. ‘ఒకేసారి ఇంత పెద్దదెలా అయిందో?’ అనుకున్నాడు.
      తనకెంతో ఇష్టమైన గౌనుని అంతకన్నా ఇష్టమైన కూతురికి వేసి పాపలో తన చిన్ననాటి రూపాన్ని చూసుకుంటూ ఉండిపోయిందలాగే...
      ‘‘ఠక్కున తలెత్తి శంకర్‌ వైపు చూసింది ఉమ. దోషిలా తలదించుకున్నాడు. ఏదో తప్పు చేసిన భావన శంకర్‌లో కూడా మొదలైంది. చెల్లెలేమనుకుం టుందోనని ఆలోచించాడేగానీ కూతురి వైపు నుంచి చూడాలన్న ఆలోచనే రాలేదు. అప్పటికదే సరనిపించింది. ఇప్పుడాలోచించి ఏం లాభం? 
      తల విదిల్చాడు చిరాగ్గా’’

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


ముళ్ల గులాబీ

ముళ్ల గులాబీ

పులిగడ్డ విశ్వనాథరావు


కురూపి భార్య (కథాపారిజాతం)

కురూపి భార్య (కథాపారిజాతం)

కొడవటిగంటి కుటుంబరావు


కథ రాసి చూడు...

కథ రాసి చూడు...

పార్థసారథి చిరువోలు


అత్తమ్మ

అత్తమ్మ

కాటబత్తిని రాజేశ్వర్‌


వింగవాజు మామ్మ

వింగవాజు మామ్మ

మ‌న్నం సింధుమాధురిbal bharatam