గేదె కట్టురాట!

  • 588 Views
  • 0Likes
  • Like
  • Article Share

    జొన్నలగడ్డ శేషమ్మ

  • అహ్మదాబాదు, గుజరాత్‌
  • 9978913051
జొన్నలగడ్డ శేషమ్మ

ఆమె జీవిత వైశాల్యం క్రమంగా తరిగిపోయింది.
మనవడూ, మనవరాలు ఆమెకి దూరమయ్యారు. 
కోడలు ప్రవర్తన నానాటికీ వింతగా మారిపోయింది. 
ఆ గేదెకట్టురాట జీవితం నుంచి ఆమె బయటపడిందా?
విజయ,
ఈ మధ్యనే జర్నలిజంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది. అంతకు ముందు ఎమ్మే ఇంగ్లిష్, తెలుగు కూడా చేసింది. అదివరలో కొన్ని కాలేజీల్లో లెక్చరరుగా పాఠాలు చెప్పింది. తనకు కథలు లాంటివి రాయడం ఆసక్తి ఉండటం వల్లా, మంచి భవిష్యత్తు ఉంటుందనీ జర్నలిజం వైపు మళ్లింది. కొద్ది రోజులు సరదాగా గడుపుదామని అమ్మమ్మ వాళ్ల ఊరు వచ్చి, ఓ సాయంత్రం అలా పార్కువైపు వెళ్లింది. కొందరు ఆడవాళ్లు ఏదో మాట్లాడుకుంటుంటే ఆ మాటలు వినడం మొదలుపెట్టింది.  
      ‘‘మిమ్మల్ని పది రోజుల బట్టి చూస్తున్నాను. ఈ ఊరికి కొత్తగా వచ్చారా?’’ ఒకామె ప్రశ్నించింది. 
      ‘‘అవునండి! నా పేరు వరలక్ష్మి. మాది ఈ ఊరే. నెల రోజుల కిందట ఈ పక్కవీధిలో ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాం, ఇక్కడ పరిసరాలు బాగున్నాయని’’ అంది.
      ‘‘రోజు వస్తూంటారా?’’ చొరవగా ప్రశ్నించారు కమల, నీరజ.
      ‘‘అవును. ఇల్లు అదీ సర్దుకున్నాం. రోజూ వస్తూంటాను. ఈ చెట్లు, స్వచ్ఛమైన గాలి చాలా హాయినిస్తాయి. సాయంత్రం అయిదున్నర నుంచి ఆరున్నర దాకా ఈ పార్కులో తిరుగుతాను. నేను, నా చెల్లెలు వనజ ఇక్కడుంటున్నాం’’ అంది వరలక్ష్మి. 
      ‘‘మీ భర్త ఏం చేస్తారు?’’ అడిగింది నీలిమ.
       ‘‘పదేళ్లయింది నా భర్త మరణించి. నాకు ఒకమ్మాయి, తర్వాత ఒకబ్బాయి. అమ్మాయి జర్మనీలో ఉంటోంది. తెలివైన పిల్ల. చదువులో ఎప్పుడూ ఫస్టే. ఆ రోజుల్లో ఆడపిల్లలు ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ చెయ్యడం అరుదైన విషయమే. లెక్చరర్లు, ఉన్నత విద్యకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో జర్మనీలోని విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకుని వెళ్లిపోయింది. గడువులోగా పరిశోధన పూర్తిచేసింది. గణితంలో పీహెచ్‌డీ చేసి అక్కడే పనిచేస్తున్న ఒకబ్బాయి సంబంధాన్ని బంధువులు తీసుకొచ్చారు. అంతా దైవ ఘటన. వివాహం జరిగింది. అబ్బో, 25 ఏళ్లు దాటిపోయాయి. వాళ్లక్కడే సెటిల్‌ అయిపోయారు. మ్యూనిచ్‌ నగరానికి దగ్గర్లో ఉంటారు. వాళ్లకి ఇద్దరు పిల్లలు. అప్పుడప్పుడూ ఇండియా వస్తూంటారు. నన్ను కూడా రమ్మంటారు. నేను రెండు మూడుసార్లు వెళ్లొచ్చాను’’ 
      ‘‘మరి మీ అబ్బాయి’’ విమల.
      ‘‘అబ్బాయి శేఖర్‌ గుజరాత్‌లో బరోడా బ్యాంకులో మేనేజరు. సిరితాండవించే నగరాలండీ అవన్నీ. పరిశ్రమలు, వ్యాపారాలు, డబ్బు - నిరంతరం హడావుడి’’
      ‘‘మీరు బరోడా వెళ్లారా? ఎన్నాళ్లున్నారు?’’ మళ్లీ విమల ప్రశ్న.
      ‘‘మావారు కాలం చేశాక ఇక్కడ ఒంటరిగా ఎందుకని, అబ్బాయి రమ్మంటే వెళ్లాను. అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చిపోతున్నా, పదేళ్లు సింహభాగం అక్కడే గడిచింది’’ చెప్పింది వరలక్ష్మి. 
      ‘‘అక్కడ జీవన విధానం ఎలా ఉంటుంది. ఎలా కాలక్షేపం చేసేవారు?’’ కమల, నీరజ ఇద్దరూ అడిగారు.
      ‘‘ఆ రోజుల్లో నేను ఎస్సెస్సెల్సీ పాసయ్యాను. మా నాన్నగారు లెక్కల మాష్టారు. లెక్కలు చురుగ్గా చేసేదాన్ని. తెలుగంటే కూడా బాగా ప్రేమ. పిల్లలతో కాలక్షేపం నాకు చాలా ఇష్టం. వాళ్లను ఆడించడం, షికారుకు తీసుకెళ్లడం, కథలు చెప్పడం చాలా ఆసక్తి. అబ్బాయికి ఒక కొడుకు, కూతురు. మొదట్లో నాతో కొంచెం బెరుగ్గా ఉండేవారు. క్రమంగా బాగా దగ్గరైపోయారు. ‘మామ్మా మామ్మా’ అంటూ నావెంటే తిరిగేవారు.
      ‘‘అబ్బాయి పొద్దునే బ్యాంకుకి వెళ్లిపోవాలి కదా. కోడలు ఇంటి పనులతో సతమతమవుతూ ఉండేది. నేను పిల్లల్ని లాలించి, మంచి మాటలతో పాలు తాగించి, టిఫిన్‌ తినిపించేదాన్ని. స్నానాలు చేయించి, స్కూలుకు సిద్ధం చేసేదాన్ని. సాయంత్రం దగ్గరలో ఉన్న పార్కుకి తీసుకెళ్లేదాన్ని. అంకెలు చెప్పించడం, ఎక్కాలు వల్లెవేయించడం, ఏబీసీడీలు గుర్తించేలా చెయ్యడం... ఇలా ఆడుతూ, పాడుతూ, శ్రమ లేకుండా చదువుకుంటూ పిల్లలు చలాకీగా ఉండేవారు. వార్తా పత్రికల్లో వార్తలు, కార్టూన్ల గురించి కూడా చెప్పేదాన్ని.
      ‘‘వారానికోసారి సినిమాకో, ఏదైనా ప్రదేశం చూడ్డానికో తీసుకెళ్లేవాడు అబ్బాయి కారులో. వెనక సీట్లో నేను, మనవరాలు కూర్చునేవాళ్లం. వీధులు, మాల్సు అన్నీ పిల్లలకి అర్థమైపోయేవి. కార్ల రంగులు చూస్తూ, వాటి నంబర్లు ఏ ఎక్కంతో పోతాయో చెబుతూ చప్పట్లు కొట్టి ఆనందపడిపోయేవారు. బాగానే గడిచిపోయేవి రోజులు. అప్పుడప్పుడూ సొంతూరు వస్తూండేదాన్ని. 
      ‘‘క్రమంగా కోడలు లతలో ఎదో మార్పు. చిరునవ్వుతో పలకరించడం తగ్గిపోయింది. ముఖంలో ప్రసన్నత లోపించింది. చిర్రుబుర్రులాడటం మొదలైంది. ఓ ఆదివారం కారులో వెళుతుంటే పిల్లలు కేరింతలు కొడుతున్నారు. ‘‘కారులో ఎక్కింది మొదలు ఏంటి రొద? ఒక పాట విననివ్వరు, పాడూలేదు. ఎప్పుడూ లెక్కలు, ఏబీసీడీలు, పదాలు, రోడ్లు - ఇదేనా గోల’’ అని పిల్లల మీద కేకలేసింది.
      ‘‘పోన్లే అమ్మా, అన్నీ నేర్చుకుంటు న్నారు. స్కూల్లో టీచర్లు కూడా మెచ్చుకుంటున్నారుగా, మంచి మార్కులు కూడా వస్తున్నాయి’’ అన్నాను. ‘‘మీరు కలగజేసుకోవద్దు అత్తయ్యా! నాకు బోర్‌ కొడుతోంది’’ అంది. పిల్లలు నవ్వారు. వాళ్లని కొట్టింది. రాగాలు తీశారు. మా అబ్బాయికి కోపం వచ్చింది. ‘అందరూ నోరు మూసుకోండి. ఒక్క మాట వినపడినా ఇక బాగుండదు’ అని కేకలుపెట్టాడు. ‘‘నేను అవాక్కయ్యాను. ముభావంగా సినిమా చూసి ఇల్లు చేరాం. నాకు ఆకలెయ్యలేదు. ‘‘మామ్మా! అన్నానికి రా’’ అన్నాడు మనవడు. వద్దంటే కోడలు ఏమనుకుంటుందో అని వెళ్లి, భోజనం అయిందనిపించి నా గదిలోకి వచ్చాను. రాత్రంతా నిద్రపట్టలేదు, అటూ ఇటూ కదలడమే.
      మర్నాడు సాయంత్రం శేఖర్‌ నా గదిలోకి వచ్చాడు. ‘‘సారీ అమ్మా! ఈ మధ్య లత ఎందుకోగానీ చిన్న పిల్లలా గొడవ చేస్తోంది’’ అన్నాడు. వాడి మాటల్లో స్పష్టత లేదు. నసుగుతూ మాట్లాడాడు. నా వైపు చూడలేదు. గోడలు, కిటికీలు, తలుపులు చూస్తూ మాట్లాడాడు.
      ‘‘పోనీలే నాన్నా. తన పిల్లలు, తనిష్టం అన్నాను. నెమ్మదిగా పిల్లలు నాకు దూరమవడం మొదలైంది. ‘పిల్లలు పక్కింట్లో ఆడుకుంటారులెండి అత్తయ్యా. వాళ్లకి అన్నీ తెలియాలి కదా’ అంది లత. ‘సరే’ అన్నాను.
      ‘‘పిల్లలు నా దగ్గరికి రావడం తగ్గిపోయింది. మొదట్లో నా వైపు బిక్కమొహాలు వేసి చూసేవారు. మార్పు మొదలైతే వేగం పెరిగిపోతుంది కదా. తర్వాత నేను కనపడినా వాళ్లు చూసీచూడనట్లు ప్రవర్తించేవారు. కళ్లు కలపడం కూడా తగ్గిపోయింది. భోజనాల దగ్గర గుజరాతీ, హిందీ భాషల్లో కబుర్లు చెప్పుకునేవారు. పూర్వంలా తెలుగు, ఇంగ్లీషు పోయాయి. 
      ‘‘ఇంట్లో నన్నెప్పుడూ వంట చెయ్యనివ్వలేదు కోడలు. ‘పాతకాలం వంటలు ఇప్పుడెవరికీ నచ్చవు. పిల్లలకు నూడిల్సు, బ్రెడ్, బటర్, పాస్తా, పరోటా - ఇవంటేనే ఇష్టం. నేను చేస్తాలెండి’ అనేది కోడలు.
      ‘‘అబ్బాయి సీనియర్‌ మేనేజర్‌ అయ్యాక సొంతిల్లు సంపాదించుకున్నాడు. మంచి పెరడు ఉండేది. మొదట గడ్డితో, పిచ్చి మొక్కలతో బీభత్సంగా ఉండేది. నేను మనిషిని పెట్టించి అంతా శుభ్రం చేయించాను. మనూరు నుంచి తెలిసిన రైతులను అడిగి మంచి విత్తనాలు తీసుకె ళ్లాను. వంగ, బెండ, టమాట, మిరప, గోంగూర, తోటకూర అన్నీ వేశాను. దగ్గర్లో ఉన్న నర్సరీకి వెళ్లి మంచి పూల మొక్కలు తెచ్చి నాటాను. పెరటితోట అందంగా ఉండేది. పొద్దుటే కాఫీ తాగి, పెరట్లోకి వెళ్లి, ఎదిగిన కాయలు కొయ్యడం, పూలన్నీ చక్కగా కోసిపెట్టడం, రెండు రోజులకోసారి కొంచెం తోటకూర, గోంగూర కోసి కడిగి, వంటకు సిద్ధం చేయడం నా దినచర్యగా మారింది. కోడలు వాటిని రకరకాలుగా వండేది.
      ‘‘కొన్ని రోజులు గడిచాయి. ‘ఇక నుంచి పూలు నేనే కోసుకుంటానులెండి అత్తయ్యా. మొన్న గుడికెళ్లినప్పుడు పూజారి అలా చేస్తే మంచిదని చెప్పారు’ అంది కోడలు. ‘సరే’ అన్నాను.
      ‘‘ఓరోజు ఆకుకూరలు కోస్తుంటే, ‘అత్తయ్యా! ఎందుకు కోస్తున్నారు? మీకు చెబితేగానీ ఇక మీదట కోయొద్దు. రోజూ అవే తినీ తినీ బోరు కొడుతోంది. పైగా నాకు చాలా మంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. వాళ్లు అవీ ఇవీ ఇస్తూంటారు. నేను కూడా వాళ్లకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా! ఆకుకూరలు అపురూపం. వాళ్లకిస్తాను’ అంది. ‘సరే!’ అన్నాను.
      ‘‘వాళ్లంతా పెరటి తోటలోకి వచ్చి ఇష్టారీతిగా కోసేవారు. లేత కొమ్మలు విరిగిపోయేవి. మొక్కలు వడలిపోయేవి. వేసవి కాలంలో మనూరు వచ్చి, మళ్లీ వెళ్లేటప్పుడు మంచి విత్తనాలన్నీ సేకరించి పట్టుకెళ్లాను. ‘ఎప్పుడూ       ఒకే రకమా? బోరు కదా! నేను మా పుట్టింటికి వెళ్లిన ప్పుడు మంచి విత్తనాలు కొన్నాను. అవి నాటతాన’ంది కోడలు. ‘సరే!’ అన్నాను. 
      ‘‘ఇలా నా జీవితం ‘గేదెకట్టురాట’ పద్ధతిలో కుంచించుకుపోయింది. చిన్నప్పుడు తొమ్మిది, పది తరగతుల్లో నాలుగు గోడల వైశాల్యం, వృత్త వైశాల్యం లెక్కలు చురుగ్గా చేసేదాన్ని. ఒక వృత్తం కేంద్రంలో ఒక రాట పాతి, గేదెను తాడుతో ఆ రాటకు కట్టారు. తాడు 10 అడుగుల పొడవైతే, ఆ గేదె ఎంత దూరం వెళ్లి మేత మేయగలదు? అని మాస్టారు అడిగితే, 2314 చదరపు అడుగులు అని క్షణంలో లెక్క చేసేదాన్ని. రైతు గేదెని తనింటి పంచలో కట్టేస్తే, తాడుని మూడు నాలుగు అడుగులకి తగ్గిస్తాడు కదా. అప్పుడు గేదె అటూ ఇటూ కదలడానికి కూడా వీలుండదు. నా పరిస్థితి కూడా క్రమంగా అలాగే అయిపోయింది. నా జీవితం గేదెకట్టురాటను గుర్తు చేసింది’’ అన్నారు వరలక్ష్మి. ఆమె గొంతు కొంచెం గద్గదికమైంది. కళ్లలో నీరు చిప్పిల్లింది.
      అక్కడ కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. కొంతసేపటికి కమల తేరుకుని ‘‘మరి మీ అబ్బాయి?’’ అంది.
      ‘‘ఏం చేస్తాడమ్మా! భార్య సహకారం లేకుండా ఒక్క రోజైనా ఇల్లు గడుస్తుందా’’ అంది వరలక్ష్మి.
      ‘‘మరిప్పుడు?’’ తడబడుతూ అడిగింది కమల. ‘‘నేను విశాల విశ్వంలోకి వచ్చేశాను. నేను గేదెను కాదుగా, వరలక్ష్మిని. నేనిప్పుడు స్వేచ్ఛా జీవిని. మా అబ్బాయికి నన్ను చూడాలని ఉన్నప్పుడు, ఇక్కడికొచ్చి ఒక పదిరోజులుండి వెళ్తాడు. ‘అత్తయ్యా, మీరు వస్తూండాలి మరి’ అంటుంది కోడలు. ఓ అలాగేనమ్మా అంటాను’’ అంది వరలక్ష్మి.
      అంతా విన్న విజయ, ‘జీవితాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో కదా. ఏది ఏమైనా మొదటి కథకు మంచి వస్తువు దొరికింది’ అనుకుంది.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


ముళ్ల గులాబీ

ముళ్ల గులాబీ

పులిగడ్డ విశ్వనాథరావు


కురూపి భార్య (కథాపారిజాతం)

కురూపి భార్య (కథాపారిజాతం)

కొడవటిగంటి కుటుంబరావు


కథ రాసి చూడు...

కథ రాసి చూడు...

పార్థసారథి చిరువోలు


అత్తమ్మ

అత్తమ్మ

కాటబత్తిని రాజేశ్వర్‌


వింగవాజు మామ్మ

వింగవాజు మామ్మ

మ‌న్నం సింధుమాధురిbal bharatam