ఉదయం 5 గంటలకు అలారం మోగింది.
‘‘అబ్బా లక్ష్మీ, నీకెన్నిసార్లు చెప్పాను, ఆదివారం అలారం పెట్టొద్దని’’ అన్న మావారి పిలుపుతో మెలకువ వచ్చింది.
ఆదివారమే కదా అని ఇంకాసేపు నిద్రపోదామని ప్రయత్నించానుగానీ, చేయాల్సిన పనులు గుర్తొచ్చి లేచి పనిలో పడ్డాను. చూస్తుండగానే సమయం ఉదయం 7.30 అయ్యింది. ‘‘అమ్మా! ఓసారి ఇలా రా’’ నా కూతురు పిలుపు పడగ్గదిలోంచి వినపడింది.
‘‘ఆ వస్తున్నా’’ అంటూ చేస్తున్న పని ఆపి నవ్వుకుంటూ వెళ్లాను.
నవ్వు ఎందుకంటే.... తను నన్ను నాలుగు రకాలుగా పిలుస్తుంది. ప్రతి పిలుపునకు ఒక అర్థం ఉంటుంది.
‘‘అమ్మా!’’ అని పిలిచిందంటే, వెళ్లి తనని ఎత్తుకుని హాల్లోకి తీసుకెళ్లమని అర్థం. ‘‘మమ్మీ!’’ అని పిలిచిందంటే, దానికి నాతో ఏదోపని ఉందని అర్థం. ‘‘అమ్మీ!’’ అని పిలిచిందంటే, ఏదో అల్లరి పని చేసిందని అర్థం. ‘‘మమ్మా!’’ అని పిలిచిందంటే, తను చెప్పే విషయం శ్రద్ధగా వినమని అర్థం.
నవ్వుకుంటూనే వెళ్లి తనని పడగ్గది నుంచి హాల్లోని దివాన్ దగ్గరికి తీసుకొచ్చాను.
ఆదివారం కావడంతో పిల్లలకు తలస్నానం చేయించి జుట్టు ఆరిన తర్వాత జడ వేద్దామని పిలిచి కూర్చోబెట్టాను. తనని అలా కూర్చోబెట్టానంటే ప్రశ్నలతో నా బుర్ర తినడానికి సిద్ధంగా ఉంటుందన్నమాటే!
‘‘మమ్మా! నీకో విషయం తెలుసా?’’ అని మొదలు పెట్టింది. ‘దీని చేతిలో నేను అయిపోయాను’ అనుకుంటూ ‘‘ఏంటమ్మా?’’ అని అడిగాను.
‘‘మరి మన జుట్టు చిక్కులు పడుతుంది కదా, ఎందుకో తెలుసా?’’ అంది. ఇప్పుడు నేను ఏం చెప్పినా తను కాదంటుంది. అందుకే ‘‘నాకు తెలియదమ్మా’’ అన్నాను.
‘‘మరేమో తలలో ఉన్న పేలు రాత్రంతా కష్టపడి జుట్టుతో ఇల్లు, పార్కు, ఆఫీసులు, స్కూళ్లు కట్టుకుంటాయి. నువ్వేమో పొద్దున్నే వాటినన్నింటినీ దువ్వెనతో పడగొట్టేస్తావు పాపం కదా’’ అంది బుంగమూతి పెడుతూ. మళ్లీ తనే చెప్పుకుపోయింది.. ‘‘నీకు ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు నువ్వు తలలో ఒక పేను తీశావు కదా... దాని పిల్లలు, చుట్టాలు అందరూ ఆటోలు, బస్సులు వేసుకుని వెతుకుతుంటారు. అందుకే తల దురద పుడుతుంది’’ అని చెప్పింది.
అది చాలదన్నట్టు ‘‘ఆ పేను కనిపించకపోతే అవన్నీ ఏడుస్తాయి’’ అంది. దాని మాటలు నిజమేనేమో అనిపించాయి ఒక్క క్షణం. అప్రయత్నం గానే తల మీద చెయ్యి తీసేశాను.
మాకు కొంచెం దూరంలో కూర్చున్న పెద్దపాప ‘‘అబ్బా చాల్లే ఊరుకోమ్మా, అది చెప్పడం నువ్వు వినడం’’ అనడంతో ముగ్గురం నవ్వుకున్నాం.