కల్తీ లేని ప్రేమ

  • 740 Views
  • 5Likes
  • Like
  • Article Share

    చిక్కాల స్వామికాపు

  • వెల్ల, తూర్పుగోదావరి జిల్లా.
  • 9290563870
చిక్కాల స్వామికాపు

గేదె విషయంలో అతను ఆశ వదిలేసుకున్నాడు. గుండె రాయి చేసుకున్నాడు. కానీ, యజమాని మీద దానిది నిస్వార్థ ప్రేమ! పెద్ద ఆపద నుంచి అతణ్ని కాపాడింది. అసలు ఆ గేదెకి ఏమైంది? అతను దాన్ని కాపాడుకున్నాడా? 
నాన్న
నాకిచ్చిన కొద్దిపాటి భూమితో పాటు గేదె ఒకటి ఉంది. ఆ గేదెకు ఒక చరిత్ర ఉంది. సుమారు నలభై ఏళ్ల కిందట అమ్మకు నేను పదమూడో సంతానంగా పుట్టిన మొదట్లో ‘ఎదుగుతున్న పిల్లలకు పాలు లేకపోతే ఎలా?’ అన్న అమ్మ ప్రశ్నకు జవాబుగా తొలకరి వరి పంట అమ్మి ద్రాక్షారామం సంతలో ఒక గేదెను కొనుక్కొచ్చాడట నాన్న. దాని సంతతికి చెందిన ఏడో తరం గేదె ఇది. కడుపు నిండా తిని మా కుటుంబానికి సరిపడా రెండు పూట్లా పాలివ్వడం, చూడి కట్టినప్పుడు కూడా పాలు పితుకుతుంటే తన్నకపోవడం దాని గొప్పదనం.
      మూడు నెలల నుంచి మా గేదెకు రోజూ జ్వరం వస్తోంది. తిండి కూడా సరిగా తినడంలేదు. బాగా తగ్గిపోయింది. కాస్తంత తింటే చాలు దానికి విరోచనాలు అవుతున్నాయి. ఎంత వైద్యం చేయించినా ఫలితం లేదు. పశువుల ఆసుపత్రికి కొత్త కుర్ర డాక్టర్‌ వచ్చాడంటే గంపెడాశతో గేదెను తీసుకెళ్లాను. వైద్యం కోసం తీసుకొచ్చిన పశువుల్ని కట్టురాళ్లకు కట్టేసి ఆ కొత్త డాక్టర్‌ చుట్టూ చేతులు కట్టుకుని నిల్చున్నారు రైతులంతా.
      ఆయన చెప్పుకుపోతున్నాడు ‘‘మీ పశువుల వైద్యం కోసమే మమ్మల్ని ప్రభుత్వం నియమించింది. వేలాది రూపాయలు జీతాలుగా వస్తున్నాయి. ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రయినా మీరు ఫోన్‌ చేస్తే చాలు వచ్చి వైద్యం చేస్తాం. చనిపోతూ డబ్బును కూడా పట్టుకెళ్లిపోతామనుకుంటారో ఏమో, కొంతమంది డాక్టర్లు మందుల కంపెనీ వాళ్లతో, మందుల కొట్ల వాళ్లతో కుమ్మక్కై ఇబ్బడి ముబ్బడిగా మందులు వాడిస్తారు. దానివల్ల పశువుల ఆరోగ్యం పాడవడంతో పాటు మీ జేబులూ గుల్లవుతాయి. మీరివన్నీ తెలుసుకుని తెలివిగా మసలుకోవాలి’’ అనడంతో రైతులంతా ‘‘అలాగేనండీ’’ అని ఆనందం వ్యక్తం చేశారు. వచ్చిన రైతులందరి పేర్లు నమోదు చేసుకుని అసిస్టెంట్‌ సహాయంతో వైద్యం మొదలుపెట్టాడు డాక్టర్‌. 
      నా వంతు వచ్చింది. ‘‘ఏమైంది?’’ అడిగాడాయన. విషయం చెప్పాను. అసిస్టెంట్‌ను జ్వరం చూడమన్నాడు. అతను గేదె చుట్టూ తిరిగి పరిశీలించాడు. అంతే టకటకా పెద్ద మందుల జాబితా రాసిచ్చేసి ‘‘కామేశ్వర మెడికల్స్‌లో ఈ మందులు తీసుకురండి’’ అన్నాడు. 
      ‘‘లేదండీ, మద్దూరి మెడికల్స్‌లో తీసుకొస్తాను. అక్కడైతే నాకు అరువు ఇస్తారు’’ అన్నాన్నేను. 
      ‘‘ఈ మందులు కామేశ్వరలోనే దొరుకుతాయి’’ కటువుగా చెప్పాడు. 
      ‘మీర్రాసినవే వారమ్ముతారా? వారమ్మేవే మీర్రాస్తారా?’’ నేను అసహనంగా అన్నాను. 
      డాక్టర్‌కి చిర్రెత్తుకొచ్చినట్టుంది. ‘‘అసలేంటయ్యా నీ సమస్య?’’ అన్నాడు. 
      ‘సమస్య నాక్కాదండీ, నా గేదెకు’ నోటిదాకా వచ్చినా నిభాయించుకుని ‘‘నా సమస్య డబ్బు సార్‌’’ అన్నాను. 
      ‘‘సరిసరే. అత్యవసర పరిస్థితుల్లో వాడటానికి ఉంటాయని నేను కొని తీసుకొచ్చిన మందులున్నాయి. వాటిని ఈ రోజు వాడి రేపు డబ్బులు తీసుకురా’’ అని గేదెకు రెండు సూదులు వేసి, దాణాలో కలిపి పెట్టమని కొన్ని మందులిచ్చాడు. తర్వాతి రోజు అయిదొందలు పట్టుకురమ్మన్నాడు. ఆయన మాటలకూ చేతలకూ పొంతన కనపడలేదు.
      మరుసటి రోజు ఉదయం మా పొలంలో ఉన్న గేదెల కొష్టం దగ్గరికి వెళ్లేసరికి గేదె జ్వరంతో ఊగిపోతోంది. రాత్రి వేసిన గడ్డి అలాగే ఉంది. ఒక్కసారిగా నీరసించిపోయాను. ఇప్పుడా డాక్టర్‌కి అయిదొందలు ఇవ్వాలి. మళ్లీ ఎన్ని వందల మందులు రాస్తాడో. అతను నాకు రక్తం పీల్చే జలగలా అనిపించాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. స్నేహితుడు అబ్బులు దగ్గర అయిదొందలు అప్పు చేసి గేదెను ఆసుపత్రికి తీసుకుపోయాను.
      నన్ను చూడటం తోనే డాక్టర్‌ ‘‘ఏమయ్యా ఎలా ఉంది గేదెకి’’ అన్నాడు. ముందుగా అయిదొందలు ఆయనకి సమర్పించి, ‘‘గేదెకు మళ్లీ జ్వరం వచ్చిందండీ. తెల్లవార్లు ఒక్క గడ్డిపరకైనా ముట్టలేదు’’ అన్నాను. 
      గేదె చుట్టూ తిరిగి పరిశీలించాడు. పాత మందుల చీటీ తీసుకుని పరిశీలించి, ‘‘చూడయ్యా, దీనికి మందేలేని వ్యాధి వచ్చింది’’ అని తేల్చేశాడు. 
      ‘‘ఏంటండీ మీరనేది’’ నేను ఆందోళనగా అడిగాను. 
      ‘‘అవునయ్యా, ఎన్ని మందులు వాడినా జ్వరం తగ్గట్లేదంటే అది కచ్చితంగా రేబిస్సే’’ అన్నాడు. 
      ‘అసలు నీకు రేబిస్‌ లక్షణాలేంటో తెలుసా? నీకు డాక్టర్‌ పట్టా నిజంగా చదువుకుంటే వచ్చిందా, డబ్బుతో కొనుక్కుంటే వచ్చిందా?’ అని అడగాలన్నంత కోపం వచ్చేసింది నాకు. కానీ, తమాయించుకుని ‘‘మరిప్పుడు ఏం చెయ్యమంటారు?’’ అన్నాను. 
      ‘‘చేసేదేముందీ. ఎలాగూ చనిపోయే గేదె. ఇప్పుడే బేరంపెడితే మాంసం కోసమైనా కొనుక్కుపోతారు. వచ్చిన డబ్బుకు కొంత కలుపుకుని వేరే గేదెను కొనుక్కో’’ అన్నాడు. 
      ఆ డాక్టర్‌తో నన్ను ఒక్కసారి బేరీజు వేసుకున్నాను. గిట్టుబాటుకాని వ్యవసాయం మీద ఆధారపడి నానాటికీ కునారిల్లుతూ నేను. నెలనెలా జీతం వచ్చే ఉద్యోగంలో ఆయన. అడవిలో దారితప్పిన పిల్లాడిలా నేను. ఆకలిగొన్న పులిలా అతను. పట్టణాలు, నగరాల్లో నీళ్ల పాలు అరవైలు, డెబ్బైలకి కొంటారు. ఇక్కడ తీసిన పాలు తీసినట్టు అమ్మితే రీడింగ్‌ లేదని, ఎల్‌ఆర్‌ లేదని ధర కోసేస్తారు. 
      ఏది ఏమైనా, మా అన్నయ్యలు అక్కయ్యలు, వారి సంతానం ఈ సంతతి గేదె పాలు తాగినవాళ్లే. అలాంటి దానికి ఇంత పెద్ద కష్టం వచ్చిందే అన్న బాధతో నిస్సత్తువగా ఇంటిదారి పట్టాను గేదెతో.
      మా గ్రామ ప్రధాన రహదారిని ఆనుకుని పెద్ద కాలువ ప్రవహిస్తుంటుంది. దానికి ఆనుకుని పిల్ల కాలువ వెళ్తుంటుంది. కూతవేటు దూరంలో లాకులు. ఆ రెండు కాల్వలకు మధ్యలో శివ, వేంకటేశ్వరస్వామి ఆలయాలు. భూమాత పచ్చటి చీర కట్టుకున్నట్టు కనుచూపుమేర వరి  చేలు. దిక్కుతోచక వేంకటేశ్వర స్వామి గుడి దగ్గరున్న చప్టా మీద కూలబడ్డాను. కాలువ మెట్ల మీద కూర్చుని సన్నాయి సాధన చేస్తున్న కృష్ణ, ఎన్ని బాధలున్నా ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈతా దుర్గారావు నా దగ్గరికొచ్చి ‘‘అదేరా అలా ఉన్నావు?’’ అనడిగారు. జరిగింది చెప్పాను. 
      ‘‘ఎద్దుల పరుగు పందేలుగానీ, బండ లాగుడు పోటీలుగానీ, పాల పోటీలుగానీ రాష్ట్ర స్థాయిలో బహుమతులు కొట్టుకొచ్చే పశువులకు పెట్టింది పేరు మన మండపేట, ఆ చుట్టుపక్కల గ్రామాలు. అందుకే ప్రభుత్వం జిల్లా ప్రధాన పట్టణం కాకినాడను కాదని మండపేటలో జిల్లాస్థాయి పశువుల ఆసుపత్రిని నిర్మించింది. పెద్ద పెద్ద డాక్టర్లు అక్కడ ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటారట. అక్కడికి తీసుకెళ్తే దెబ్బకు తగ్గిపోతుంది’’ అన్నాడు దుర్గారావు.
      ‘సలహా బానే ఉంది. ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మండపేటకు గేదెను తీసుకెళ్లడానికి ఓ బండి కావాలి. ఇక మందులు అవీ ఇవీ అని కనీసం మూడు నాలుగు వేలైనా అవసరమవుతుంది. ఇప్పటికే దీని కోసం చాలా ఖర్చు చేశాను. ఇంకా ఎక్కడి నుంచి తేవాలి’ మనసులో అనుకుని ‘‘సరే చూద్దాం’’ అని ముక్తసరిగా సమాధానమిచ్చి అక్కడి నుంచి కదిలాను. 
      ఆ నోటా ఈ నోటా విషయం తెలుసుకుని కబేళా వ్యాపారస్థుడు గోవిందు వచ్చి ‘గేదెకు బాలేదంటగా. పది వేలిచ్చి తోలుకుపోనా’’ అన్నాడు. ‘‘చూద్దాంలే’’ అని పంపించాను. 
      తర్వాతి రోజు కొష్టం దగ్గరికి వెళ్లేటప్పటికి మధ్యాహ్నం మూడవుతోంది. ఆకాశం మబ్బు పట్టి ఉంది. నీరసంగా ఉండాల్సిన మా గేదె కట్టరాడు చుట్టూ కలియతిరిగేస్తోంది. ఓపిక లేకపోయినా అరుస్తోంది. ‘డాక్టర్‌ చెప్పినట్టు గేదెకి రేబిస్‌ వ్యాధి రాలేదు కదా’ అని అనుమానపడు తుండగా గేదె తన ముట్టెతో అటువైపు చూడమన్నట్టుగా సంజ్ఞ చేస్తుంటే అటు చూశాను. నా గుండె ఝల్లుమంది. నాలుగు కొండముచ్చులు నేను కష్టపడి పెంచిన బీర, బొబ్బర, చిక్కుడు, బెండ పాదుల కాయలు కోసుకుని తింటూ, తీగలు పీకి పారేస్తున్నాయి. కోపంతో నేను రాళ్లు తీసుకుని వాటి మీదకి విసిరాను. ఒక్కసారిగా అవి నా వైపు దూసుకొ చ్చాయి. వణికిపోయాను. జన సంచారం లేదు. అరచినా ఎవరికీ వినిపించదు. 
      క్షణంలో ఒళ్లంతా చెమటలు పట్టాయి. వెర్రి కేకలు వేస్తూ గేదె దగ్గరికి పరిగెత్తాను. అది వాటికి ఎదురు తిరిగినట్టు నిలబడింది. కొమ్ములు ఊపుతూ, పెద్ద శబ్దంతో శ్వాస తీసుకుని వదులుతూ వాటిని బెదిరిస్తోంది. దాంతో మూడు కొండముచ్చులు ఆగిపోయాయి. ఒకటి మాత్రం అలాగే దూసుకొచ్చింది. మా గేదె కొమ్ములతో అమాంతం దాన్ని విసిరికొట్టింది. అది అల్లంత దూరం వెళ్లిపడింది. దెబ్బకి నాలుగూ అక్కడి నుంచి పారిపోయాయి. 
      మా గేదె లేకుంటే అవి నన్నేం చేసేవో. కృతజ్ఞతగా దాని ముట్టెను నా గుండెలకు హత్తుకున్నాను. అవసరమైతే కాస్త పొలం అమ్మైనా సరే దానికి వైద్యం చేయించాలని నిర్ణయించుకున్నాను. తర్వాతి రోజే దాన్ని మండపేటకు తీసుకెళ్లాలన్న నిశ్చయానికొచ్చాను. అయితే, నా ప్రాణం పోయే పరిస్థితి వస్తే తప్ప దాని విలువ తెలుసుకోలేక పోయినందుకు సిగ్గనిపించింది. ఆ స్థితిలో ఉండి కూడా అది నా మీద చూపించిన కల్తీలేని నిస్వార్థ ప్రేమకి నిలువెల్లా కదిలిపోయాను. 
      ‘‘పాడి పంటలు ఉన్న ఇల్లు సిరిసంపదలకు నెలవురా. మనం పండించిన పంటని అందరితో పాటే మనం తింటాం. కానీ, ధాన్యం తీసుకోగా మిగిలిన గడ్డిని పశువులు తిని మనకి పాలిస్తాయి. ఇంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి. కుటుంబ అభివృద్ధికి తోడ్పడతాయి. నాలుగు గడ్డిపరకలేస్తే నిజాయతీగా మన మీద ప్రేమ చూపిస్తాయిరా మూగజీవులు. ఇంట్లో ఎదుగుతున్న పిల్లలు కోట్ల రూపాయల విలువైతే, పెరుగుతున్న పశు సంతతి లక్షల రూపాయల సంతృప్తిరా’’ అనే నాన్న మాటలు అప్పుడు గుర్తొచ్చాయి. మండపేట ఆస్పత్రికి తీసుకెళ్లాక రెండోసారి పోవాల్సిన అవసరం లేకుండా మా గేదె ఆరోగ్యం కుదుటపడింది. మా ఇంటి క్షీరలక్ష్మి ముఖం మీదకి మళ్లీ పూర్వ కళ వచ్చింది. ఇంట్లో అందరి మోములు మళ్లీ కళకళలాడాయి.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


ముళ్ల గులాబీ

ముళ్ల గులాబీ

పులిగడ్డ విశ్వనాథరావు


కురూపి భార్య (కథాపారిజాతం)

కురూపి భార్య (కథాపారిజాతం)

కొడవటిగంటి కుటుంబరావు


కథ రాసి చూడు...

కథ రాసి చూడు...

పార్థసారథి చిరువోలు


అత్తమ్మ

అత్తమ్మ

కాటబత్తిని రాజేశ్వర్‌


వింగవాజు మామ్మ

వింగవాజు మామ్మ

మ‌న్నం సింధుమాధురిbal bharatam