ఇదో రకం దోపిడీ

  • 192 Views
  • 1Likes
  • Like
  • Article Share

    మీనాక్షీ శ్రీనివాస్‌

  • డిప్యూటీ బ్రాంచ్‌ మేనేజర్, ఆంధ్రాబ్యాంక్,
  • కాకినాడ.
  • 9492837332
మీనాక్షీ శ్రీనివాస్‌

ధనవంతులకు బడుగులెప్పుడూ దోపిడీ సాధనాలే. 
ముసలయ్య కుటుంబాన్నీ అలాగే స్వార్థానికి వాడుకున్నాడో బుగత. తర్వాత ఏమైంది

అది మధ్యాహ్నం వేళ. ఎండ చురచురమంటోంది. ముస లయ్య గుడిసె ముందు వేపచెట్టు నీడలో నులక మంచం మీద పడుకుని ఒకదాని వెంట ఒకటి బీడీలు కాలుస్తు న్నాడు. వాటి పొగ బొగ్గు రైలింజనులా గుప్పు గుప్పు మంటోంది. అతను తనలో తనే గొణుక్కుంటు న్నాడు. ఎవరినో తిట్టుకుంటున్నాడు. అవేవీ పెదవి దాటట్లేదు. 
      ముసలయ్య తల్లి మల్లమ్మ ఎండుకట్టెలు ఏరుకొచ్చి నోటికొ చ్చిన పదాలు పాడుతూ ఎప్పుడూ సందడి చేస్తుంటుంది. ఆరోజు అవేవీ లేవు. కారణం ఆ ఇంటి ఆడది, ముసలయ్య భార్యని పోలీ సులు తీసుకెళ్లారు. ఆమె దొంగ తనమో, హత్యో, మరేదో చెయ్య లేదు. నమ్మింది. అమాయకంగా తాము పనిచేసే బుగతని నమ్మింది. నమ్మినోళ్లదే కదా పాపం, దోషం. మరందుకే పోలీసోళ్లు నిన్న సాయంత్రం గోల, ఏడుపుల మధ్య ఆమెని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇప్పుడా ఇల్లు వల్లకాడులా ఉంది.
      ముసలయ్య బీడీ మీద బీడీ కాలుస్తూనే ఉన్నాడు. మల్లమ్మ వంగిపోయిన నడుంపై చెయ్యిపెట్టు కుని అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. ‘‘నా కోడల్ని అట్టుకెల్లి పోనారు. అదేం తప్పుజేసింద?’’ని అనుకుంటూనే ఉంది. 
      ఇంటిల్లిపాదీ ఆ పోలీపోళ్ల కాళ్లుమొక్కి, బుగత ఇంటికి వచ్చేలా ఒప్పిం చారు. భార్యని విడిపించా లని బుగత కాళ్లావేళ్లా పడితే బండరా యిలా నిలబ డ్డాడు. వాళ్లు నా మనుషులు. నమ్మ కమైనోళ్లు, అట్లాంటి పనులు చేసేటోళ్లు కాదు అనైనా అనలేదు. ‘తాతముత్తాతల్నుంచి ఆ బుగతకు ఊడిగం సేస్తున్నాం. ఆడా మగా అని నేకుండా రెక్కలు ముక్కలు సేసుకుని ఆడి పొలాల్ని పండిస్త న్నాం. అంతజేసినా ఇన్ని గంజి నీళ్లు తప్ప దక్కింది నేదు. బుగత కాళ్లాయేళ్లాబడి బతిమాలినా కనిక రించకపోగా ఎలాంటి మాటలన్నా డు... ‘‘వయసులో ఉంది, నల్ల గున్నా నిగనిగలాడతా, తాటిపండు లెక్క దిట్టంగుంది. అది ఏ పాడు పనిజేసి లచ్చలు సంపాదిస్తందో. ఆళ్లేదో చెప్పగానే ఎనకా ముందూ చూడక నా ఇంటికొచ్చి అడగ టానికి మీకెన్ని గుండెలు’’ అంటూ పోలీసోళ్ల మీద ఇరుసుకుపడ తాడా! ఆడి కాష్టం కాల. బంగార మంటి నా కోడల్ని అంత మాటం టాడా!’’ ఒంగిపోయిన మల్లమ్మ మరింత ఒంగి దోసిళ్లతో మట్టెత్తి గాల్లోకి పోసింది. ముసలయ్యవీ సుమారుగా అవే ఆలోచనలు. 
      కొడుకుతో మల్లమ్మ ‘‘యాది గాడు పొద్దున పోనాడు. ఎటు పోనాడో ఏటో. అసలే వాడిది ఉడుకు రగతం. ఆ బుగత పైకి పోయినా పోతాడేమో. అటు సూస్తే నీ పెండ్లాన్ని పోలీసులు అట్టుకు పోనారు. అట్టా పేట్రీ పొగగొట్టంలాగ పొగిడుస్తా ఉండక పోతే ఏంజెయ్యాల్నో ఆ పంతుల్ని అడిగిరారాదా’’ అంది తల్లి, కొడుకు చేతిలో బీడీ లాగేస్తూ. 
      ముసలయ్య కళ్లు నిప్పులు కురిపిస్తు న్నాయి. ఊపిరి బుసలు కొడుతోంది. కొడుకు అంతపనీ చెయ్యాలనే మనసు కోరుకుం టోంది. కానీ, వాడి భవిష్యత్తు గుర్తొచ్చింది. ‘‘ఒత్తాడులే. ఆడే టన్నా పాలుతాగే పసోడా? సావాసగాళ్లతో యాడ తిరుగు తున్నడో. మల్లమ్మను పోలీసులు ఎందుకు అట్టుకెల్లారో, మనమేంజెయ్యా ల్నో ఆ పంతుల్ని అడిగొస్తా’’నని లేచాడు.  
      ఆ ఎర్రటి ఎండలో నడుస్తూ పంతులు ఇల్లు చేరాడు ముసలయ్య. ‘‘పంతులూ..’’ అని పిలిచాడు. పంతులు భార్య బైటికొచ్చి ‘‘ఏం ముస లయ్యా ఇలా వచ్చావ్‌. నీ భార్యని పోలీ సులు తీసుకుపోయారటకదా. అంతగా ఏం చేసిందదీ. ఏదో రెక్కల కష్టం చేసు కుని బతుకుతున్నారు మీరు’’ జాలిగా అంది.
      ‘‘అదే తెలీట్లేదమ్మా. పోలీసులు ఏదో చెప్పినారుగానీ, సరిగా బోధపడలా. బుగ తని అడిగితే నోటికొచ్చినట్టు మాట్లాడి నాడు. పోలీసోళ్ల మీద అరిసినాడు. పంతుల్నడిగితే ఏదన్నా దారి తెలుస్తాదని ఇట్టా వచ్చినా. ఇంట్లో లేడా అమ్మా?’’ వినయంగా అడిగాడు ముసలయ్య. ‘‘ఉన్నార్రా. భోంచేస్తున్నారు. అలా అరుగు మీద కూర్చో’’ అని లోపలికెళ్లింది. 
      ‘‘ఏంట్రా ముసలీ. నీ భార్యని పోలీసులు తీసుకుపోయారా?’’ అడుగుతూ బయటికొచ్చాడు పంతులు. 
      ‘‘అవును పంతులూ. నువ్వే దిక్కు. ఎట్టయినా మా యాదిని ఇడిపించు. పోలీ సుల్ని అడిగితే ఈ కాయితం చేతిలో ఎట్టి నారు’’ అంటూ తీసిచ్చాడు. దాన్ని చూసిన పంతులు నిర్ఘాంతపోయాడు. ‘‘ఒరే ఒరే.. ఇదేటిరా, లెక్కకు మించిన ఆదాయానికి వడ్డీతో కలిపి నాలుగు లక్షల పన్ను కట్టాలని గతంలో ఇచ్చిన ఏ నోటీసుకీ జవాబుగాని ఇవ్వని కారణాన, ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన ఆఖరి నోటీసుగా భావించి ఆ వివరాలు తెలిపి, నీ భార్యను కోర్టులో హాజరు పరచాలని, వారం రోజుల్లో పన్ను కట్టాలని ఇచ్చిన అరెస్టు వారెంట్‌. అందుకే నీ భార్యని తీసుకెళ్లారు’’ అన్నాడు పంతులు.
      ‘‘మాకన్ని డబ్బులు యాడ నుంచి వస్తాయి పంతులూ’’ అయోమయంగా అడిగాడు ముసలయ్య. ‘‘మీ ఇంటికి ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చి ఉంటాయి. వాటికి బదులివ్వక పోవడం ఎంత నేరమో తెలుసా? ఇప్పుడేడ్చి ఏంటి లాభం? అసలు నీ భార్య ఖాతాలోకి అన్ని లక్షలు ఎలా వచ్చాయి?’’ అడిగాడు పంతులు. 
      ‘‘ఏయో చానా కాయితాలు వచ్చాయి పంతులూ. అయ్యన్నీ మా బుగతకి సూపెడితే ‘సించి పారేండి’ అన్నాడు. అసలు నా భార్య పేర్న బేంకి ఖాతా ఎట్టించిందీ మా బుగతే. ఆ బేంకి పుత్తకం కూడా ఆయనకాడే ఉన్నాది. మా యాదిని ఆళ్ల మడిసితో బేంకికి అంపే టోరు, ఏయో కాయితాల మీన ఒత్తించే టోరు. ఆడ ఎంత తీసుకుంటన్న వంటే గింత అని సెప్పమనేటోరు. ఆ డబ్బులు అక్కడే ఆళ్ల మడిసి తీసేసుకునే టోడు. అట్ట రెండు మూడు సార్లయినంక ఆ బేంకి అమ్మ గొడెవెట్టేదంట ‘నీకింత డబ్బులు ఎట్లా వస్తన్నాయి’ అని. అదేదో ఫేను కార్డో ఏటో నేకుండా అంతంత ఎయ్యరాదు, తియ్యరాదు అంట గదా. మా యాది గోలసేసి, ఎవురికో పానం మీదికొచ్చిందని బెల్లించి తీసుకునేదంట’’ అన్నాడు ముసలయ్య.
      వాళ్ల అజ్ఞానం, నిరక్ష్యరాస్యతని ఆ బుగత స్వార్థానికి వాడుకున్నాడని అర్థం చేసుకున్నాడు. ‘కచ్చితంగా ఆ సొమ్ము ఆయనదే. నల్లసొమ్ము తెలుపు చేసుకు న్నాడు. కానీ, రుజువుల్లేవు. మానవత్వం ఉంటే కనీసం ఆ పన్ను కట్టి యాదికి జైలు శిక్ష తప్పి ంచేవాడు. కానీ అవన్నీ జరిగేవి కాదు. శ్రమ దోపిడీలాగే ఇదో రకం దోపిడీ’ అనుకున్నాడు పంతులు. ఆయన ఏదైనా మార్గం చెబుతాడేమో అని ఆశగా చూస్తున్నాడు ముసలయ్య.
      ‘‘అసలు నీ భార్యకి పాన్‌కార్డ్‌ ఏంటిరా? ఏముందిలే? బ్యాంకులో ఒత్తిడి చేస్తే అదీ ఆయనే తీయించి ఉంటాడు. మీకు తెలిసిందల్లా ఎక్కడ ఒత్తమంటే అక్కడ ఒత్తడమేగా. ఆ బ్యాంక్‌ ఖాతా బ్లాక్‌ చేసి ఉంటారు. ముందా ఖాతా మూసెయ్యాలి. అయినా ఆదాయపు శాఖ అనుమతి లేకుండా కుదరదనుకుంటా. అడిగి చూద్దాం. రేపు పదింటికి రా’’ అన్నాడు పంతులు. ‘‘మరండయ్యా శిచ్చ తప్పదా?’’ బావురుమన్నాడు ముసలయ్య.
      ‘‘తెలియకుండా చేసినా నేరం నేరమే. ఒత్తడానికి బొటనవేలుందికదా అని అదేంటో తెలుసుకోకుండా ఒత్తెయ్య కండి. యాదిని రేపో మాపో కోర్టులో హాజరుపరుస్తారు. అక్కడ ఆ డబ్బు మీది కాదని, బుగతదే అని రుజువు చేసుకో వాలి. అదెలా చేస్తారు? అయినా అన్ని నోటీసులొస్తుంటే కనీసం ఒక్కసారైనా నన్నడగకపోతివి. గొర్రె కసాయివాడినే నమ్మినట్టు అన్నీ పట్టుకెళ్లి ఆ పెద్దమనిషికే చూపించారు’’ అన్నాడు పంతులు. 
      ముసలయ్య ఏడుస్తూ చుక్కమ్మ కల్లు పాకకి చేరుకున్నాడు. బొగతని అడ్డంగా నరికెయ్యాలన్నంత కసి ఆ గుండెల్లో. ‘‘మావా, మావా!’’ పరుగున రొప్పుకుంటా వచ్చాడు యాది సావాసగాడు చంద్ర. అతని చొక్కా, ఒంటిమీద రక్తం మరకలు. చొక్కా చెమట, రక్తంతో ముద్దైంది.
      వాడినలా చూస్తూనే ముసలయ్య  ‘‘ఏటిరా! ఏటైనాది? యాదిగాడేడి?’’ కంగారుగా అడిగాడు. ‘‘మన యాది.. యాదిని పోలీసులు అట్టుకుపోనారు’’ గొల్లుమన్నాడు చంద్ర. ‘‘ఏట్రా.. ఆణ్ని పోలీసులు అట్టుకుపోవడమేట్రా? ఏటైనదో సెప్పరా’’ వాడి భుజాలు కుదుపుతూ అడిగాడు. ‘‘బుగతని.. బుగతని... పెద్ద బండతో తలపగలేసి సంపినాడు యాది. ఆడు గిలగిలా తన్నుకులాడుతుండగానే ఆడి నుంచి పారిపోనాడు. పోలీసులొచ్చి యాదిగాడు యాడుంటాడో సెప్పమని నన్ను సితకబాదినారు’’ చెప్పాడు చంద్ర. ‘‘అంతా ఎతికి ఆణ్ని అట్టుకుపోనారు’’ మళ్లీ గొల్లుమన్నాడు. 
      ‘‘అయ్యో యాదీ! ఏట్రా ఇట్టా సేశావ్‌? పెండ్లాం, కొడుకూ ఇద్దరూ జైలు పాలయ్యి నేనేటి సెయ్యాల’’ పెద్దపెట్టున ఏడుపు అందుకున్నాడు ముసలయ్య. అంతలోనే పెద్దగా నవ్వుతూ ‘‘నేదు నేదు. నికార్సైన పనే సేశావ్‌. మనకింత అన్నేయం సేసిందేగాక మనింటి ఆడమ డిసిని అంత నీచపు కూత కూసినోడికి ఆ శిచ్చ పడాల్సిందే. శబాస్‌ రా కొడకా’’ పిచ్చిగా అరుస్తూ పరిగెడుతున్న ముసల య్యని చూస్తూ ఉండిపోయాడు చంద్ర.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


ముళ్ల గులాబీ

ముళ్ల గులాబీ

పులిగడ్డ విశ్వనాథరావు


కురూపి భార్య (కథాపారిజాతం)

కురూపి భార్య (కథాపారిజాతం)

కొడవటిగంటి కుటుంబరావు


కథ రాసి చూడు...

కథ రాసి చూడు...

పార్థసారథి చిరువోలు


అత్తమ్మ

అత్తమ్మ

కాటబత్తిని రాజేశ్వర్‌


వింగవాజు మామ్మ

వింగవాజు మామ్మ

మ‌న్నం సింధుమాధురిbal bharatam