దృక్పథం

  • 833 Views
  • 3Likes
  • Like
  • Article Share

    డాక్టర్‌ తాళ్లూరి లక్ష్మి

  • విశ్రాంత ప్రిన్సిపల్, వివేకవర్ధిని కళాశాల
  • హైదరాబాదు.
  • 9885051300
డాక్టర్‌ తాళ్లూరి లక్ష్మి

నిన్నటి దాకా అతను ఒక రకంగా అనుకున్నాడు. అకస్మాత్తుగా అదంతా నిజం కాదని తెలిసింది! పైకి కనిపించేదంతా యథార్థం కాదని అవగతమైంది! అతణ్ని అంతలా మార్చిన ఆ సంఘటనేంటి?
దాదాపు
పక్షం నుంచి రోజూ చూస్తున్నా, ఆ దృశ్యాలు నాకు ప్రతిసారీ కన్నులకింపుగా కనిపిస్తూనే ఉన్నాయి. పొద్దుటే లేస్తూనే బాల్కనీలోని ఉయ్యాలలో కాఫీ తాగుతూ కూర్చుని కళ్లార్పకుండా ఆ దృశ్యాలనే చూస్తూండటం పరిపాటి అయిపోయింది. పొద్దున లేవగానే పేపర్‌ చదవడం కూడా మానేశాను. అంతలా కట్టిపడేసే విశేషాలు ఏమున్నాయక్కడని శ్రీమతి ఎగతాళి చేస్తున్నా, నాకవేవీ పట్టడం లేదు. నాలోని భావుకుడు ఆ దృశ్యాలని చూస్తూ ఉండిపోసాగాడు. 
      సరిగ్గా నెల కిందట ఆఫీసు నుంచి ఇంటికి తిరిగొస్తుంటే స్కూటర్‌కి యాక్సిడెంట్‌ జరిగి నా కుడి కాలుకి చిన్న ఫ్రాక్చర్‌ అయింది. కాలుకి కట్టుకట్టి రెండు నెలలు కదలకుండా విశ్రాంతి తీసుకోమని డాక్టర్‌ చెప్పడంతో ఇంటిపట్టునే ఉండిపోవాల్సి వచ్చింది. మొదటి వారమంతా పడగ్గదికీ, డ్రాయింగ్‌ రూముకి అతుక్కుపోయిన నాకు విపరీతమైన విసుగొచ్చేసింది. అప్పటికీ శ్రీమతి రోజూ అపార్ట్‌మెంట్‌ కబుర్లు చెబుతున్నా, సహోద్యోగులు అప్పుడప్పుడొచ్చి బాతాఖానీ వేస్తున్నా కాలం గడవడం పెద్ద ఇబ్బందిగా మారింది.
      అదిగో, అలాంటి క్లిష్ట సమయంలో జరిగింది అదంతా. రోజూ ఏ ఎనిమిదికో తొమ్మిదికో లేవడం అలవాటైన నేను పొద్దున అయిదు గంటలకి అపార్ట్‌మెంట్‌ బయట ఏదో కలకలం వినిపిస్తే, ఏంటో చూడమని నా శ్రీమతిని పంపాను.
      పావు గంటలో తను పూర్తి సమాచారంతో వచ్చేసింది. మా అపార్ట్‌మెంట్‌ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఎవరో బిల్డర్‌ భవనం కట్టడానికని ఒక ట్రాక్టర్‌ నిండుగా పనివాళ్లను తెచ్చాడట. వాళ్లందరూ ఉండటానికని ఆ స్థలంలోనే ఒక మూల వసతులు కల్పిస్తున్నాడట. అదీ ఆ కోలాహలానికి కారణం. నాకు కావలసిన సమాచారమిచ్చేసి శ్రీమతి వంటింట్లోకి వెళ్లిపోయింది. నేను కాలకృత్యాలు తీర్చుకుని బాల్కనీలోకి చేరాను. శ్రీమతిచ్చిన కాఫీ తాగుతూ ఎదురుగా ఖాళీ స్థలంలో జరుగుతున్న హడావుడి గమనించసాగాను.
      అక్కడ ఏడెనిమిది మంది పనివాళ్ల కుటుంబాలు గుడారాలలాంటి ఇళ్లు కట్టుకుంటున్నారు. మగవాళ్లు గుడారాల పని చూస్తుంటే, ఆడవాళ్లు వంట కోసమని రాళ్లతో పొయ్యిలు అమర్చు కుంటున్నారు. ఒక మూల స్నానాలకని ఒక తడికల గది ఏర్పాటు చేసుకున్నారు. రెండు గంటల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని వండుకున్న అన్నం తిని, మిగిలిన ఆహారాన్ని డబ్బాల్లో సర్దుకుని ఆడా మగా అందరూ పనిలోకి దిగారు.
      రోజంతా పనిచేసి పొద్దుగూకేసరికి అందరూ తమ ఇళ్లకి చేరుకున్నారు. మగవాళ్లు స్నానాలు చేసి వంట సరంజామా తేవడానికి బయటికెళితే, ఆలోపు ఆడవాళ్లు వంటాగట్రా చేసేసి, తాము కూడా స్నానాలు ముగించి ముస్తాబయ్యారు. మగవాళ్లు తిరిగొచ్చాక గుడ్డి దీపాల వెలుగులో అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు కానిచ్చారు. తొమ్మిది గంటలకల్లా అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. మేము మూడో అంతస్తులో ఉండటం వల్ల వారి కదలికలన్నీ ఏదో మూకీ సినిమా చూస్తున్నట్టు చూడగలిగానే కానీ మాటలు మాత్రం వినపడలేదు.
      ఆ రోజు నుంచీ ఆ కుటుంబాల కార్యకలాపాలను వీక్షిస్తూ కూర్చోవడం ఒక మానుకోలేని అలవాటుగా మారిపోయింది. పొద్దున లేవడం ఆలస్యం, బాల్కనీలోని ఉయ్యాలలో తిష్ఠ వేయడం మొదలైంది. టిఫిను, కాఫీలు అన్నీ అక్కడికే. అప్పుడప్పుడు నా శ్రీమతి కూడా కొద్దిసేపు నాతో చేరి ప్రత్యక్ష వ్యాఖ్యానం వినిపించేది. మాలో మాకు ఆనవాలు తెలిసేందుకు వీలుగా ఒక్కొక్క జంటకి ఒకొక్క పేరు పెట్టింది.
      ఆ కుటుంబాలన్నిటిలోనూ నన్ను బాగా ఆకట్టుకుంది ఒక యువ జంట. దానికొక ముఖ్య కారణం లేకపోలేదు. ఆ అమ్మాయి మంచి రంగుతో, పొందికైన అంగ సౌష్టవంతో, ఆకర్షణీయమైన ముఖవర్చస్సుతో ఉండేది. మాసికల చీరలో ఉన్న ఆమెని చూస్తే ఏదో శాపవశాత్తు భూమ్మీద కష్టాలు అనుభవిస్తున్న గంధర్వ కన్యలా అనిపించేది. ఇక ఆ అబ్బాయి విషయానికొస్తే నల్లగా, తుమ్మ మొద్దులా, అవిటి కాలుతో కుంటుకుంటూ నడుస్తుంటే మనసుకి చికాకు కలిగేది. వాళ్లిద్దరినీ చూస్తుంటే కాకి ముక్కుకు దొండపండు సామెత గుర్తుకొచ్చేది. అతడిలో ఏం చూసి ఆమె మనువాడిందోనని తెగ గింజుకునేవాణ్ని, నా బాధంతా శ్రీమతితో వెళ్లబుచ్చు కుంటూ. వాళ్లిద్దరికీ రెండేళ్ల బాబు కూడాను. శ్రీమతి ఆ జంటకు కూడా పేరు పెట్టింది... అష్టావక్ర, అప్సర అని.
      అక్కడున్న ఆ కుటుంబాలన్నీ బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, ఈతి బాధలకతీతంగా, ఉన్న దాంతోనే సంతృప్తిగా, ఆనందంగా జీవించే తీరు నన్ను అమితంగా అబ్బురపరచేది. అసలు కష్టాలనేవే లేనట్లు అంత హాయిగా ఎలా బతకగలుగుతున్నారని ఆశ్చర్యపోయేవాణ్ని. 
సాయంత్రాలు అందరూ కబుర్లు చెప్పుకుంటూ, ఏ బన్ను ముక్కో తింటూ వేడి వేడి టీ తాగేవారు. ఆ తర్వాత మగవాళ్లు చిన్న పిల్లలకు స్నానాలు చేయించడం, బట్టలుతకడం లాంటి పనులు చేసి తాము కూడా స్నానాలు ముగించి నులక మంచాల మీద పడుకుని పిల్లలతో ఆడుకుంటుండేవాళ్లు. ఆలోగా ఆడవారు వంట పని, గిన్నెలు తోమడం లాంటివి ముగించి తాము కూడా స్నానాలు చేసి ముస్తాబయ్యేవారు. ఆ తర్వాత అందరూ వేడి వేడి అన్నంలో ఎర్రకారం, ఉల్లిగడ్డలు, పప్పుచారుతో భోజనాలు కానిచ్చేవారు, కబుర్లు చెప్పుకుంటూ. ఆ నిశ్శబ్ద ప్రకృతిలో వారి నవ్వులు పక్షుల కిలకిలారావాల్లా వీనులవిందుగా వినిపించేవి.
      అప్పుడప్పుడు వారిలో కొన్ని అప శ్రుతులు కూడా దొర్లేవి... ఏ మొగుడో తాగొచ్చి తన పెళ్లాన్ని బాదుతున్నప్పుడు ఆమె పెట్టే ఆక్రందనలు, ఆ మొగుడు తిట్టే బండ బూతులతో. అయితే వారిన వేవీ ఏమంత బాధించేవి కాదు. అవన్నీ వారి జీవితాల్లో ఒక భాగమైపోయినట్టు అందరూ తేలిగ్గా తీసుకునేవారు. మత్తు దిగాక మొగుడు పెళ్లాన్ని బతిమాలడం, ఈ సారి పెళ్లాం తిట్ల దండకం విప్పడం మామూలుగా జరిగిపోతుండేది.
      ఎప్పుడైనా ఆ అష్టావక్రుడు తాగొచ్చి పెళ్లాం మీద చెయ్యిజేసుకుంటే నాకు ఒళ్లు మండిపోయేది. ‘ఓరి దౌర్భాగ్యుడా! భగవంతుడు నీకు మాణిక్యాన్ని కానుకగా ఇస్తే దాన్ని మట్టిబెడ్డలా చూస్తావేమిట్రా? అంతటి సౌందర్యాన్ని నీకు తోడుగా కట్టబెట్టడమే ఒక దారుణం. ఏం చూసుకునిరా నీకింత మిడిసిపాటు? మహారాణిలా పట్టు పరుపుల మీద కూర్చోబెట్టాల్సిన దాన్ని ఇలా హింసించడానికి నీకు చేతులెలా వస్తున్నాయిరా నీచుడా?’ అని రెండు చెంపలూ ఎడాపెడా వాయించి తిట్టాలనిపించేది.
      నా బాధంతా శ్రీమతితో చెప్పుకుని గుండె బరువు దించుకునేవాణ్ని. ఆ నిర్భాగ్యురాలి నొసటి రాతను అలా రాసిన విధాతను నిందించేవాణ్ని. అయితే ఏ మాటకామాటే చెప్పుకోవాలి. తాగొచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో అష్టావక్రుడు పెళ్లాన్ని, కొడుకుని ప్రేమగానే చూసుకునేవాడు. భార్యకి అన్ని పనుల్లో చేదోడువాదోడుగా ఉంటూ, కొడుకు ఆలనాపాలనా కూడా తనే చూసుకునేవాడు.
      చూస్తుండగానే మూణ్నెల్లు గడచిపోయాయి. నేను పూర్తిగా కోలుకుని ఆఫీసుకెళ్లడం మొదలైంది. అయితే నా దినచర్యలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. పొద్దుటే ఆఫీసుకు వెళ్లేవరకు ఆ సంసారాల సరిగమలు చూస్తూ ఉండటం, తిరిగి సాయంత్రం ఇంటికొచ్చాక వారినే గమనించడం నాకొక వదులుకోలేని వ్యసనంలా మారింది.
      రోజులలా సాగిపోతున్న తరుణంలో ఓరోజు పొద్దునే ఆ పనివాళ్ల ఇళ్లలో ఏదో గొడవగా వినిపిస్తే బాల్కనీలోకి వెళ్లాను. అప్పటికే శ్రీమతి అక్కడికి చేరుకుని ఆసక్తిగా చూస్తోంది. పనివాళ్ల కుటుంబాలన్నీ అష్టావక్రుడి ఇంటి ముందు గుంపుగా చేరి మాట్లాడుకుంటున్నాయి. వాళ్ల మధ్యలో అష్టావక్రుడు నులక మంచం మీద కూర్చుని ఉన్నాడు, పిల్లాణ్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని. వారిలో అతని భార్య కనపడలేదు.
      అంతమంది అంతలా మాట్లాడు తున్నా అష్టావక్రుడు ఉలుకూ పలుకూ లేకుండా కూర్చుని ఉన్నాడు, వంచిన తల ఎత్తకుండా. నా మనసేదో కీడు శంకించింది. కొంపదీసి ఈ దుర్మా ర్గుడు రాత్రెప్పుడో తాగొచ్చి పెళ్లాన్ని చంపెయ్యలేదుకదా? అదే మాట శ్రీమతితో అంటే ‘‘ఛా ఊరుకోండి. అపశకునం మాటలూ మీరూను’’ అంది. దాంతో నోరు మూసుకుని ఆఫీసుకు వెళ్లిపోయాను.
      సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చీ రావడంతోనే శ్రీమతి కాఫీ ఇచ్చి నా పక్కనే కూర్చుంది. అంటే ఏదో పెద్ద విశేషమే చెప్పబోతోందన్నమాట.
      ‘‘చూశారా ఆ రత్తాలు ఎంత బరితెగించిందో?’’ అంది
      ‘‘ఎవరా రత్తాలు?’’ ప్రశ్నార్థకంగా చూశాను. 
      ‘‘అదేనండీ. ఆ వీరడి పెళ్లాం’’ 
      ‘‘ఎవరా వీరడు?’’ 
      ‘‘అబ్బా. అదేనండీ, మీరు రోజూ కళ్లార్పకుండా చూస్తుంటారే ఆ జంట’’
      ‘‘ఓహో! అప్సర, అష్టావక్రుల గురించా నువ్వు చెప్పేది?’’
      ‘‘ఔను వాళ్ల గురించే’’ 
      ‘‘ఏం చేసిందేంటి?’’ కుతూహలంగా అడిగాను. 
      ‘‘ఏం చేయాలా... దొంగ మొహంది. అది చేసిన పని తలచుకుంటేనే ఒళ్లు కంపరమెత్తిపోతోంది’’ నా కుతూహలాన్ని మరింత పెంచుతూ మాటల్ని పొడిగించింది శ్రీమతి.
      ‘‘సరేలే. నీ కంపరం గురించి తర్వాత. ముందు జరిగినదేంటో చెప్పు’’ కొంచెం అసహనంగా అడిగాను. 
      ‘‘అదేనండీ. ప్రేమగా చూసుకునే మొగుడు, ముద్దులొలికే చంటాడు ఉండగా దానికేం మాయ రోగమొచ్చిందో, వాళ్ల ఊరి వాడెవడో వస్తే వాడితో లేచిపోయిందట, నిక్షేపం లాంటి సంసారాన్ని వదిలేసుకుని’’ 
      శ్రీమతి ఇంకా ఏదో చెబుతూనే ఉంది. నాకవేవీ వినబడటం లేదు. ఆమె చెప్పింది, నేను విన్నది నిజమేనా అని నన్ను నేను గిల్లుకున్నాను. శ్రీమతి ఒకటికి రెండుసార్లు చెబితేగానీ నా మనసు ఆ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది.
      ‘‘అసలా రత్తాలు గుణమే మంచిది కాదటండీ. అది ఆ వీరడికి అక్క కూతురట. ఎవడితోనో కడుపు చేయించుకుని ఆ పిల్లాణ్ని కంటే, అక్క బాధ చూడలేక వీరడు దాన్ని మనువాడాడట, ఆ కడుపు చేసిన వాడు ముఖం చాటేస్తే. ఊళ్లో జనం రత్తాలుని కాకుల్లా పొడుచుకు తింటారని ఊరొదిలేసి ఇక్కడికొచ్చి పని చేస్తున్నాడంట. మధ్యాహ్నం కిందకెళ్లి వాకబు చేస్తే తెలిసింది’’ చెప్పుకుపోయింది శ్రీమతి.
      ‘‘అందరూ వీరడి మంచితనం గురించి చెప్పుకునేవారే. పిల్లాణ్ని సొంత కొడుకు కన్నా మిన్నగా ఎంత బాగా చూసుకుంటాడో అని అంతా చెబుతుంటే కళ్లు చెమర్చాయి. ఒకసారి జీవితంలో దెబ్బతిని ఉండి కూడా రత్తాలు మళ్లీ అలాంటి పాడుపని ఎలా చేయగలిగిందో? ఇంత జరిగినా వీరడు పెళ్లాం గురించి ఒక్క మాట కూడా చెడుగా అనలేదట. పోనీలే ఆమె సుఖంగా ఉంటే అంతేచాలన్నాడట. ఇలాంటి మంచివాళ్లు ఉండబట్టే రత్తాలు లాంటి వాళ్ల ఆగడాలు సాగిపోతున్నాయి’’ శ్రీమతి వాక్ప్రవాహం సాగుతూనే ఉంది. 
      అయితే నా మనసెప్పుడో ఆలోచించే శక్తిని పోగొట్టుకుంది. ఇంతకాలం వీరడి విషయంలో నా అసమంజసపు ఆలోచనలకి, అజ్ఞానానికి నన్ను నేనే నిందించుకున్నాను. మనిషిలోని అంతః సౌందర్యం చూడకుండా బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యతనిచ్చిన నా కుసంస్కారం మీద నాకే వెగటు కలిగింది.
      బాల్కనీలోంచి చూస్తే వీరడు పిల్లాడికి నీళ్లు పోస్తూ కనిపించాడు. ఇప్పుడతను అష్టావక్రుడిలా అనిపించలేదు. ఏదో శాపవశాత్తు ఈ భూమ్మీద కాలం గడుపుతున్న మునీశ్వరుడిలా, సర్వసంగ పరిత్యాగిలా గోచరించాడు. మనుషుల విలువలను అంచనా వెయ్యడానికి మనకున్న శక్తి ఏపాటిది. ఎవరి గురించైనా మన దృక్పథం మారడానికి ఒక్క క్షణం చాలుగదా అనిపించింది.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


ముళ్ల గులాబీ

ముళ్ల గులాబీ

పులిగడ్డ విశ్వనాథరావు


కురూపి భార్య (కథాపారిజాతం)

కురూపి భార్య (కథాపారిజాతం)

కొడవటిగంటి కుటుంబరావు


కథ రాసి చూడు...

కథ రాసి చూడు...

పార్థసారథి చిరువోలు


అత్తమ్మ

అత్తమ్మ

కాటబత్తిని రాజేశ్వర్‌


వింగవాజు మామ్మ

వింగవాజు మామ్మ

మ‌న్నం సింధుమాధురిbal bharatam