వయసెరుగని మనసు!

  • 915 Views
  • 0Likes

    డా॥ దిలావర్‌

  • పాల్వంచ, ఖమ్మం.
  • 9866923294
డా॥ దిలావర్‌

ఒకప్పుడు...
ఆకాశం నిండా
వెన్నెల సోనలు వొలికించిన చందమామే
యౌవ్వన వనాలలోకి
దోసిళ్లతో పరిమళాల్ని గుప్పించిన
వసంత రుతువే
దేహ వాంఛా తంత్రులను శ్రుతి చేసి
మధుర సరాగాలను పలికించిన
వలపుల వీణే
ఉధృత కలల వరదల్ని
కనురెప్పల మాటున ఆపుకోలేక
తరగలెత్తిన జీవన లాలసే
ఎండలో నోరెండిపోయిన బాటసారులను
చల్లని ఆత్మీయతతో సేద దీర్చిన
చలివేంద్రమే
బీటలు వారిన గుండెలను
ఆర్తిగా హత్తుకొని
అమృత పలకరింపుల లేపనంతో
గాయాలు మాన్పిన
అపర ధన్వంతరే
ఆప్తంగా గుండె చేతులు చాచి
ఎందరినో చేరదీసి నీడనిచ్చిన
హరితవృక్షమే
గలగలా నవ్వుల కెరటాలతో
హృదయ క్షేత్రాలకు ప్రవహించి
అసమ సరిహద్దుల్ని చెరిపేసిన
చెలిమి ప్రతిరూపమే
ఇప్పుడు... అన్నీ ఆంక్షలే... నిషిద్ధాలే...
ఒకప్పటి తన విశాల ఆకాశమంతా
ఒక చిన్న గదిలోనే ముడుచుకోవాలి
వెన్నెల జిలుగుల్ని మింగేసిన
చీకటి భూతాన్నే కావులించుకోవాలి
ఒక చల్లని ఆత్మిక పలకరింపు కోసం
మొహం వాచిన తనకు
ఒంటరి తనమే తోడు కావాలి
కోరికల వనాల ఆకుపచ్చ ఆనందపు రేకుల్ని
కర్కశంగా కాలికింద వేసి నలిపే
గ్రీష్మరుతువే తనపాలిటి వసంతం కావాలి
దేహ ధర్మపు తంత్రుల మూర్ఛనలు విదిలించుకొని
తీగలు తెగిన విషాద వీణగా మిగిలిపోవాలి
దారి దొరకక తల్లడిల్లే కలలకు
అలసిసొలసిన కనుపాపల అగాధాలే
ఆశ్రయం కావాలి
ఎందరి దాహాన్నో తీర్చిన చలివేంద్రం
తానే ఒక తీరని దాహమై
అల్లల్లాడి పోవాలి
ఉరుకులూ పరుగులూ పెట్టిన
గోదారి గలగలల కెరటాలు
దుఃఖపు మరు భూముల్లోకి
యింకి పోవాలి
ఎందరిలోనో పచ్చదనాన్ని నింపిన చెట్టు
కొమ్మ కొమ్మనా దైన్యాన్ని నింపుకొని
మోడు వారాలి
ఆంక్షలు... ఆంక్షలు... ఆంక్షలు
తన చుట్టూ కనిపించని ముళ్ల కంచెలు...
వర్తమానం తన మీదికి విసురుతున్న అల్లకల్లోలాలను
కసిగా ఆవలి తీరానికి విసిరేసి
వజ్ర సంకల్పానికి పదునుపెట్టి
ఇనుప పంజరాలను బద్దలు కొట్టినప్పుడు
తనువునే గాని మనసుని తాకని
ముడతలు దేరిన అలలు,
అలలు అలలుగా వెనక్కి ప్రవహిస్తాయి
అంతరంగం, జ్ఞాపకాల పంచదార చిలుకల
రంగుల తిరుణాల అవుతుంది
మనసు, చైత్రమాసపు మధుపర్కాలు కట్టుకొని
నవనవలాడే వసంతాలను స్వప్నిస్తుంది
ఉడిగిపోని జీవనోత్సాహంతో, జీవనోత్తేజంతో
నిత్యనూతన విద్యుచ్చైతన్యమై
దేహం కోటి ప్రభలతో వెలిగిపోతుంది
అణువు అణువునా మొలిచిన భావోద్వేగపు రెక్కలతో
కవిత్వపుటాకాశంలోకి
తనను తాను ఎగరేసుకుంటుంది...

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మా ఊరి చెరువు

మా ఊరి చెరువు

మల్లవెల్లి శ్రీరామప్రసాద్


ఇంటికో బాలచంద్రుడు

ఇంటికో బాలచంద్రుడు

అడిగోపుల వెంకటరత్నమ్‌


సమర సందేశం

సమర సందేశం

శారద ఆవాల


తాజావార్త

తాజావార్త

సి ఎస్‌ రాంబాబు


గగన తరుణి

గగన తరుణి

కొత్త అనిల్ కుమార్‌