అరుగు

  • 1518 Views
  • 7Likes

    డా.రంకిరెడ్డి రామ‌మోహ‌న‌రావు

  • పెనుగొండ‌, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా
  • 9908794689

అందమైన మా అరుగు నిర్మాణానికి
రాళ్లెత్తిన కూలీల్ని ఎరగనుగాని
మా అరుగును తలచుకుంటే
నా చిన్ననాటి స్మృతులు ఘనీభవించినట్టుగా
కళ్లముందు నా బాల్యం
అమ్మ అలుకులు
అక్కయ్య వెల్లచిలుకులు
అన్నయ్య బొంగరాలాట
చెల్లి కాళ్లారజాపి పాడే
‘‘కాళ్లాగజ్జ కంకాళమ్మా’’ పాట
లాంటి జ్ఞాపకాలనెన్నింటినో
మా అరుగు పదిలంగా దాచుకుంది
అందుకే మా అరుగంటే అంత ఇష్టం
మా అరుగును తాకితే చాలు
నా బాల్యం నన్ను చుట్టుముట్టేస్తుంది
పచ్చని పొలాలమధ్య
అచ్చమైన పల్లెటూళ్లో ఉన్న
మా అరుగును చూస్తే ఎంతో ఆనందం
స్మరిస్తే పులకింత; పలవరింత
పిండి ఆరబోసినట్లుగా ఉన్న వెన్నెల్లో
దాగుడుమూతలాడుకుంటున్న
మాకు తల్లి అవుతుంది
కూని రాగాలతో పాటలు పాడుతుంటే
కచేరి వేదికలా మారిపోతుంది
మా సంకల్పాలకు అనువైన
రూపాల్ని ధరిస్తుంది
పండగ వచ్చిందంటే
ఆవుపేడ అలుకు చీరె ధరించి
ముగ్గుల రైకతో సింగారించుకుంటుంది
ఆడపిల్లలు పెట్టిన గొబ్బెమ్మల్ని
చూసి మురిసిపోతుంది
సంక్రాంతికి వంటినిండా
ముగ్గుల ఆభరణాలతో ముస్తాబై
నవవధువులా దర్శనమిస్తుంది
అందంగా అలంకరించుకొన్న గంగిరెద్దు
గంగడోలు దువ్వడానికి
మమ్మల్ని భుజం ఎక్కించుకున్న
మేనమామ మా అరుగు
మమ్మల్నందర్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని
గంగిరెద్దుల ఆటల్ని, గరగ నృత్యాల్ని
దొమ్మరాటల్ని చూపించే
బామ్మ మా అరుగు
బుడబుక్కలవాళ్లు, జంగమదేవరలు
మా అరుగును చూస్తే
తల్లి ఒడిని తలచుకుంటారు
చిన్న చిన్న వ్యాపారాల కోసం
వచ్చినవాళ్లని చూడగానే
మా అరుగు దుకాణమైపోతుంది
మేము వేషాలు కట్టినప్పుడు
రమ్యమైన రంగస్థలి
మాలో మేము గొడవపడ్డప్పుడు
అగమ్యమైన రణస్థలి
మధ్యాహ్నంవేళ మహిళల
లోకాభిరామాయణం
గవ్వలాటలతో, జాడీ ఆటలతో
ఉక్కిరిబిక్కిరి అవుతుంటే
గద్దుల తొక్కుడుబిళ్లలాటలో
ఒంటి పాదంతో గెంతుతుంటే
పాలుతాగే పసికూనల
లేతపాదాల తన్నుల స్పర్శ సుఖాన్ని అనుభవిస్తుంది
దీపావళిరోజున వెలుగుతున్న దీపాల వరుసతో
మణుల కాంతితో వెలుగుతున్న
వేయిపడగల నాగరాజులా మా అరుగు
అమ్మమ్మ కార్తీక పున్నమి నోములకు
చంద్రుడికి పోటీగా అద్దాన్ని నిలబెడుతుంది
పంతులు రాగానే చుట్టుపక్కల పిల్లలందరూ
పలకలతో వచ్చిన క్షణాన మా అరుగు ఓ పాఠశాల
అలసిన బాటసారులు చేరిన క్షణాన
మా అరుగు ఓ పాంథశాల
తాతగారు తగువు తీరుస్తున్నప్పుడు
మా అరుగు ధర్మపీఠం
ఠీవిగా మానాన్న కూర్చున్నప్పుడు
మా అరుగు సింహాసనం.
తెలుగు పరువు అరుగు
తెలుగు వెలుగు అరుగు
తెలుగు సింహాసనం అరుగు
తెలుగు దరహాసం అరుగు.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ధన్యజీవి

ధన్యజీవి

ఎస్‌.ముర్తుజా


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


హేమంత ఋతుకాంతి

హేమంత ఋతుకాంతి

- నరసింహశర్మ మంత్రాల,


అమ్మ అక్షరాలు 

అమ్మ అక్షరాలు 

- డా।। ఎ.రవీంద్రబాబు


జీవన రుతువు

జీవన రుతువు

డా।। ఎన్‌.గోపి