బాల్యమా... ఓసారి నా పల్లెకు రా!
 

  • 991 Views
  • 4Likes

    వేదగిరి రాంబాబు

  • హైదరాబాదు
  • 9391343916

పసిపిల్లల్ని కోడిపిల్లల్ని చేసి
కాన్వెంట్‌ గద్దలు తన్నుకుపోతే...
తల్లికోడై నా బడిశాల తల్లడిల్లుతోంది!
చదువులతోటలో స్వేచ్ఛగా ఎగరాల్సిన సీతాకోక చిలుక
ఇపుడు కాన్వెంట్‌ జైల్లో ఖైదీ!
మూలాలు మరచిపోతున్న వ్యవస్థలో...
ట్వింకిల్‌ ట్వింకిల్‌ తళుకుల ముందు
నా తెలుగువాచకం తలదించుకుంటోంది!
బాబా బ్లాక్‌ షీప్‌ నిగనిగలముందు
నా నీతిశతకాలు నివ్వెరబోతున్నాయి!
చదువుల తల్లి, సంతలో అంగడిసరుకై నిలబడ్డప్పుడు
బాల్యం, కాసుల కొమ్మలకు చిక్కిన
గాలిపటమై కొట్లాడుతోంది!
భుజాల మీద భూగోళాన్ని మోస్తూ, వాడు
బస్సు కొమ్మన వేలాడే గబ్బిలమై
భారంగా ఇంటికి చేరినప్పుడు
చల్లని ఒడిలో చుక్కల ఆకాశాన్ని చూపించాల్సిన, అమ్మ
బబుల్‌గమ్‌లా సాగే సీరియల్స్‌ వెంట
బతుకంతా పరుగెడుతుంది!
వెచ్చని గుండెలమీంచి పొద్దును చూపించాల్సిన, నాన్న
పచ్చనోట్ల మధ్య బతుకును వెతుకులాడుతుంటాడు!
చుట్టూరా ముళ్లకంచెలా ఫెన్సింగ్‌
గేటుముందు యమకింకరుడు గూర్ఖా
ఏ బంధుత్వాలూ దరిచేరని ఖరీదైన కారాగారం ఇంటిలో...
ప్రాణంలేని బొమ్మల మధ్య
ప్రేమను పంచలేని కదిలే బొమ్మల మధ్య
కేవలం ప్రాణమున్న బొమ్మలా... వాడు!
మనుషులు, నడిచే మార్కెట్లయినప్పుడు
ఉట్టికెగరలేని ఊహలు
ఆశల ఆకాశానికెగబాకుతున్నప్పుడు
ఒత్తిడి నిండిన బాల్యం ఊదిన బెలూనై పేలిపోతుంది!
మొక్క నుంచి ఆకును తుంచేసినట్టు
బతుకు నుంచి బాల్యం తుంచేయబడుతుంది!
నాలుగు దిక్కుల్లో విస్తరించాల్సిన తరగతి గది
నాలుగు గోడలకు పరిమితమై
బతుకుతెరువుకు పనికిరాని సిలబస్‌ వెంట 
తరగతులై పరిగెత్తీ పరిగెత్తీ ఓసారి వెనక్కి తిరిగిచూస్తే...
శిథిలమైన బాల్యశకలాల కింద శూన్యమే వెక్కిరిస్తోంది!
కార్పొరేట్‌ కాన్వెంట్ల రెక్కల పహారాలో
కునారిల్లుతోన్న ఓ బాల్యమా...
కణకణమండే పరుగు పందెమిక చాలు!
నీ పట్నం ఇనుప చట్రాల్లోంచి
నీ ఆంగ్లవ్యామోహ కామినీ కౌగిళ్లలోంచి
ఓసారి నా పల్లెకు రా..!
అమ్మ ఒడిలాంటి ప్రకృతి బడిలో...
గడ్డిపరక మీద మెరిసే జలతలంబ్రాల్లోంచి
రంగురంగుల హరివిల్లు చూపిస్తాను!
వేగావతీ నదీ ఇసుకతిన్నెల మీద
పిచ్చుకగూళ్లు కడతాను!
చైత్రమాసపు పున్నమి రాత్రుల్లో
వీధి అరుగుల మీద పూసిన వెన్నెల గంధాన్ని నీ ఒంటికి పూస్తాను!
పెరటికొమ్మన దొంగిలించిన జామకాయ
కాకెంగిలి పెడతాను!
పచ్చని తోటల్లో పసిడిపూల కాంతుల్ని చూపిస్తూ
కోయిలమ్మల పాటలు వినిపిస్తాను!
వేపచెట్ల నీడల్లో ఉయ్యాలలూపుతూ
పారే సెలయేటిలో నీ ప్రతిబింబాల్ని చూపిస్తాను!
కాలువగట్ల వెంట పడుతూ లేస్తూ పరిగెడుతూ
పచ్చని జ్ఞాపకాల్ని నీ కనురెమ్మలకు వేలాడదీస్తాను!
నీ తాతా తండ్రుల పాదముద్రల మీదుగా
నిన్ను చిటికెన వేలుపట్టి నడిపిస్తాను!
బాల్యమా... ఓసారి నా పల్లెకు రా..!
 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


జ‌ల క‌ల‌

జ‌ల క‌ల‌

సాక హరీష్‌


తేట తెలుగు

తేట తెలుగు

విద్వాన్ గొల్లాపిన్ని నాగ‌రాజ‌శాస్త్రి


పునరపి గీతం!

పునరపి గీతం!

రాళ్లబండి శశిశ్రీ


కాలమవడమంటే

కాలమవడమంటే

జి.రామకృష్ణ


వసంతశోభ

వసంతశోభ

స్వర్ణలతానాయుడు


నీ నీడలో....

నీ నీడలో....

డా॥ దిలావర్‌,