నేను తెలుగు భాషను కలగన్నాను

  • 1205 Views
  • 3Likes

    శైలజామిత్ర

  • హైదరాబాదు,
  • 9290900879

నేను స్వచ్ఛమైన తెలుగు భాషను కలగన్నాను
అమ్మ నాన్న, చెల్లెలు తమ్ముడు, అన్న అక్క అనే పదాల బంధాలన్నీ
ఒకే తాటిపై నడిచే తెలుగింటి గడపల్ని కలగన్నాను
వీధులన్నీ రాత్రి దుప్పట్లు తొలగించక ముందే తెలుగు లాంతరు వెలిగించుకున్నట్లు మరీ కలగన్నాను.
పౌర్ణమిరాత్రి నే చెరువు గట్టుమీద కూర్చున్నప్పుడు
కనిపించే చందమామలో తెలుగు హృదయాన్ని కలగన్నాను
వీచే గాలిలో, పలకరించే పక్షుల కిలకిలా రావాలలో
తెలుగు వీణలు ఒక్కసారిగా మీటినట్లు అనుభూతి చెందాను.
      నవయవ్వనం దాటి వెళుతున్న సమయంలో
రోజూ ఇంటిముందు నుంచి కదులుతున్న దేహాత్మల్లో
ఆక్సిజన్‌కు బదులు అచ్చమైన పట్టుపరికిణీల
కనుచూపుల్లో తెలుగు పద్యాన్ని కలగన్నాను.
కాలం హరిస్తున్నా,
పచ్చని హరిత విప్లవాన్ని చూపుతూ
గుండెల్లో మోస్తున్న గువ్వ పిట్టల కువకువల్లో
నులివెచ్చని గూడులాంటి తెలుగు కవిత్వాన్ని కలగన్నాను.
హృదయసాకార తేటదనాన్ని కలుషితం చేస్తున్న
ఆంగ్ల మహమ్మారి పూడిక తీస్తున్నట్లు
అధికారిక బావిలో మునిగిపోయిన తెలుగును
ప్రేమైక పాతాళభైరవి కొక్కాలతో వెలికి తీస్తున్నట్లు కలగన్నాను.
తల్లి గర్భంలో నుంచే వినిపిస్తున్న
తెలుగు మాటల ఆంతర్యాన్ని చేతుల్లోకి తీసుకున్నప్పుడు
అమ్మ నాలుక సాక్షీభూతంగా నిలిచినట్లు
తెల్లకాగితంపై ముత్యాల తెలుగును నక్షత్రాల్లా పరచినట్లు
అవ్యక్తమైన ఆనందానుభూతిని కలగన్నాను..!
నన్నయ్య ఆధునిక కవిత్వాన్ని సరిచేయడానికి జన్మించినట్లు
తిక్కన ఈ నేలపై మళ్లీ తిరుగాడినట్లు
వాల్మీకి అక్షర వసంతం మరోసారి పూసినట్లు
ప్రాచీన కవులంతా తెలుగు ప్రాకారాలపై నిలుచున్నట్లు
రాయలవారి దర్బారు మళ్లీ కొలువుదీరి
‘తెలుగు లెస్సంటూ’ నేటి తరానికి తెలిపినట్లు కలగన్నాను.
ఉలిక్కిపడి లేద్దును కదా...
రాత్రంతా గుండె అరల్లో దాచుకున్న తెలుగు ఆచ్ఛాదనలన్నీ
ఆంగ్ల సంకెళ్ల అరమరికల మధ్య నలిగిపోతుంటే
ఒకానొక తీయనైన తెలుగు పద్యం కోసం
అద్భుతమైన తెలుగు వాక్యం కోసం
ఆత్మీయంగా పలకరించే తెలుగు పలకరింపు కోసం
దీపం వెలుతురు తగ్గించి
తెలుగు కలను ఆసరా తీసుకుంటూ
మళ్లీ నిద్రకు ఉపక్రమించాను
మరణం ముందొచ్చే క్షణం వరకూ ఇకపై లేవకూడదని నిర్ణయించుకుని
యథాతథంగా మళ్లీ నా తెలుగు కలల లోకంలోకి ప్రయాణించాను..!!
 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తిలకం

తిలకం

ముకుందాపురం పెద్దన్న


ఆవల

ఆవల

యామినీదేవి కోడే


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


ఎన్నిక‌లైపోయాయి

ఎన్నిక‌లైపోయాయి

నడిమింటి నవీన


తను - నేను

తను - నేను

గరిగె రాజేశ్‌


అజ్ఞాతంలో నా పయనం

అజ్ఞాతంలో నా పయనం

ఎం.భానుప్రకాశ్