నిజంగా నేను కవినేనా...!
నేను రాస్తున్నది కవనమేనా...!!
ముప్పయి నాలుగేళ్ల నా కల-
కలం... కవనం
పదిహేనేళ్ల నా కవిత రహిత జీవనం-
రెట్టింపున్న కవిజీవితం-
రెట్టించని ప్రాభవం
ఆల్చిప్పలో నత్తలాగా
బావిలో కప్పలాగా
తెలిసిందే జ్ఞానమని
రాసిందే వేదమని
అదే చట్రంలో తిరుగుతూ
గానుగెద్దులా ఒకే పంథాలో చరిస్తూ
గుడ్డి గద్దలా ఎంత దూరమిలా...
ఎంత కాలమిలా...
ముక్కుసూటిగా చెప్పడం తప్ప...
ముక్కున ముక్కెరలా మెరిసింది లేదు
సుభాషితాలను వల్లించడం మినహా...
భావుకత చక్కెరను పంచింది లేదు
మనలో లేనిది వేమనలో ఉన్నది
బుద్ధిలో లేనిది బద్దెనలో ఉన్నది
అంతేనా కవిత్వమంటే...
కాదంటావా అది తత్వమంటే...
ఎప్పుడైనా చందమామని
ఇంట్లో గుమ్మానికి తగిలించావా
ఎన్నడైనా వాన చినుకుని
నోట్లో నాలుకకి అందించావా
పూలు పాలూ మురిపాలూ
వాగులు వంకలూ జలపాతాలూ
కొండలు నదులూ సంద్రాలూ
ఎడారి సెగలూ ప్రియురాలి వగలూ
ప్రణయాలూ విరహాలూ విషాదాలూ
కవితా వస్తువే కరువైందా...
కాదేదీ కవితకనర్హమన్న
శ్రీశ్రీ మాటే చేదైందా...
అడపా దడపా అక్కడో ఇక్కడో
శబ్దాల చమక్కులు
అలంకారాల గిమ్మిక్కులు...
కవితకు ఊపిరైన భావుకత
భూతద్దంతోనైనా ద్యోతకమవుతుందా...?
కవితకి ప్రాణమైన వస్తు దార్శనికత
ఇన్నేళ్ల కవనంలో సంప్రాప్తమైందా...??
తోటి(?) కవులంతా
సహజ భావుకులంతా
అనుభూతులు మేళవించి
అనుభవాలు రంగరించి
పలవరించి కలవరించి
కంచంతో మంచంతో
పెన్నుతో గన్నుతో
మాటతో మౌనంతో
ఆకలితో చీకటితో
బాల్యంతో వైకల్యంతో
కాలంతో కన్నీళ్లతో
పూలతో జోలతో
చెట్టుతో మట్టితో
జవాన్‌తో కిసాన్తో
నిద్దురతో ముద్దులతో
దువ్వెనతో నవ్వులతో
అద్దంతో అబద్ధంతో
సంతోషంతో సందిగ్ధంతో
వాస్తవ సంఘటనలతో
సహజ సిద్ధ స్పందనలతో
స్నేహంతో సంసారంతో
ఎన్ని కవితలల్లారు...!
ఎంత కరుణ పంచారు...!!
ఎంత మమత పెంచారు...!!!
గీతాల్నీ సంగీతాల్నీ వేళ్ల నోళ్లతో
అద్భుత గానం చేశారు...
ప్రభాతానుభూతుల్నీ
నిశీధి విశేషాల్నీ విషాదాల్నీ
వర్ణాలలో ముంచి
కవితా చిత్రాల్ని ఆవిష్కరించారు...
ప్రౌఢ పదబంధాలు లేని సరళ సలలిత సరాగాల్ని కలాలతో పలికించారు...
చుట్టూ చూడలేని కబోదిని
కవినెలా అవుతాను...?
మిన్నువిరిగి మీద పడినా
చలించని బండోణ్ని
ఎలా స్పందించగలుగుతాను...?
ఆరు పేజీల సారాంశాన్ని
అర వాక్యంలో ముగించే నైజం...
ఒక్క ముక్కలో చెప్పేదాన్ని
లెక్కలేనంత పొడిగించే మనస్తత్వం...
పూవనాలెన్నో తిరిగి తిరిగి
అసమాన కుసుమాల
నేర్చి కూర్చి మాలలల్లాలి కవి-
మనిషి లోతుల్లోకి దూసుకెళ్లి
తరచి తరచి విశ్లేషించాలి కవి-
కవన ధనువునెక్కుపెట్టి
అక్షర శరాలు సంధించగలగాలి కవి-
పదపదమున సుధలూరగ
ఎద డోలలూపాలి కవి-
సత్య మెరిగినందుకే..
ఇది నా కవి పద విరమణ...!
వాస్తవ మొప్పుకున్నందుకే..
కవిగా నా నిష్క్రమణ...!!
సుకవీ నీకు జోహారు...!
సుకృత కృతి కవీ... నీకు నీరాజనాలు...!!