ఆశ

  • 1291 Views
  • 4Likes

    ఎ.కిశోర్‌బాబు

  • విజయవాడ
  • 8754995544
ఎ.కిశోర్‌బాబు

ఎప్పుడో ఒకసారి
మళ్లీ నువ్వెదురొస్తావని ఆశ
ఇన్నాళ్లూ నన్ను
ఒంటరిగా వదిలెళ్లిన
నీ తెంపరితనపు 
చెంపలు పగలగొట్టాలని ఆశ
నా కనులు వర్షించిన కన్నీటిని
బొట్టు బొట్టు లెక్కగట్టి
నీ దోసిట నింపేయాలని ఆశ
ముక్కలైన గుండెల్లో
ముసురుకున్న మూగ బాధను
మూటగట్టి నీకు అప్పగించాలని ఆశ
నా ఎదురు చూపుల
ఎడారుల నడుమ
ఆవిరైన ఆశల ఒయాసిస్సులను
నీ ముందు
ఆవిష్కరించాలని ఆశ
      * * *
ఒక్కసారి నువ్వు ఎదురైతే
తీర్చకుండా మిగిలిపోయిన
నీ కోర్కెలన్నీ తీర్చేయాలని ఆశ
తలపున రాని తప్పులేవైనా ఉంటే
గుర్తులుగా అప్పజెప్పి
నువ్వు విధించే శిక్షలన్నీ
ఆనందంగా అనుభవించాలని ఆశ
నీకంటూ మిగలకుండా
నీ చిరు నవ్వులన్నీ
మూటగట్టుకుని దోచుకెళ్లాలని ఆశ
శూన్యమైన జీవితాన్ని
నిండుగా నీతో
నింపేసుకోవాలని ఆశ
ముసురుకున్న దిగులు చీకట్లను
నీ కంటి దీపాలతో తరిమేసి
నన్ను నేను వెలిగించుకోవాలని ఆశ
నా చెంపలపైన చెదిరిపోకుండా
వెచ్చటి తడి చారలుగా
ఇంకిపోయిన నిన్ను
నీ చల్లటి చేతులతో
తుడిచేసుకోవాలని ఆశ
      * * *
ఒక్కసారి
నువ్వంటూ ఎదురైతే
నీ కోసం
కొట్టుకులాడుతున్న ఈ 
నా కొన ఊపిరిని
నీ చేతుల్లో పెట్టేసి
నేను కనుమరుగవ్వాలని ఆశ
      * * *
చెలీ!
ఏం చెప్పమంటావు
ఆశ తీరడం లేదు
నా ఊపిరాగడం లేదు.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మా అమ్మ...

మా అమ్మ...

జి.భిక్షం


అరచేయి

అరచేయి

తగుళ్ల గోపాల్


క్రీస్తు జననం

క్రీస్తు జననం

పచ్చా పెంచలయ్య


మొగ్గలు

మొగ్గలు

డా।। భీంపల్లి శ్రీకాంత్


వంకర టింకర

వంకర టింకర

పర్కపెల్లి యాదగిరి


పొద్దు పొడుచు వేళనే...

పొద్దు పొడుచు వేళనే...

ఎర్రాప్రగడ రామమూర్తి