అమ్మ వెళ్లిన రాత్రి

  • 917 Views
  • 0Likes

    మానస చామర్తి

  • బెంగళూరు
  • 973189970

మళ్లీ నాలుగు రోజులకు సరిపడే దోసెల పిండీ
డబ్బాల నిండా కారప్పొడులూ
కొత్తిమీరా గోంగూరా పచ్చళ్లూ
అమ్మ ఊరెళ్తూ కూడా
కొంత కష్టం నుంచి తప్పించే వెళ్తోంది

పగిలిన తన పాదాల కోసం
నే కొన్నవన్నీ వదిలేసి
విరిగిపోతున్న గోళ్లకు అద్దుకోమని
నేనిచ్చిన రంగులన్నీ వదిలేసీ
కొంత దిగులునీ కొన్ని కన్నీళ్లనీ
నాకు వదిలేసి
అమ్మ వెళ్లిపోతోంది

మళ్లీ వస్తానుగా అన్న పాత మాటనీ
ఏమంత దూరం నువ్వైనా రావచ్చులెమ్మనీ..
తనను కరుచుకుపడుతున్న నా చెవిలో
ధైర్యంలా వదిలేస్తూ
నన్నిక్కడే వదిలేస్తూ
అమ్మ వెళ్లిపోతోంది

అమ్మ వెళ్లిన రాత్రి
నిద్ర పిలవని రాత్రి
బాల్కనీలో తీగలను పట్టుకు
ఒక్కదాన్నీ వేలాడుతుంటే
ఆరలేదని అమ్మ వదిలిన చీర
చెంపల మీద తడిని ముద్దాడిపోతోంది
మసకబారిన మొహాన్ని దాచుకోబోతే
అద్దం అంచు మీద అమ్మ బొట్టుబిళ్ల
తన కళ్లతో సహా కనపడి సర్దిచెబుతోంది

అలవాటైన అమ్మ పిలుపు వినపడక
ఖాళీతనమొకటి చెవులను హోరెత్తిస్తోంటే
తను పిలిస్తే మాత్రమే పలికే ఇళయరాజా పాట
రింగ్‌టోన్‌లా ఇల్లంతా మోగిపోతోంది

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


జ‌ల క‌ల‌

జ‌ల క‌ల‌

సాక హరీష్‌


తేట తెలుగు

తేట తెలుగు

విద్వాన్ గొల్లాపిన్ని నాగ‌రాజ‌శాస్త్రి


పునరపి గీతం!

పునరపి గీతం!

రాళ్లబండి శశిశ్రీ


కాలమవడమంటే

కాలమవడమంటే

జి.రామకృష్ణ


వసంతశోభ

వసంతశోభ

స్వర్ణలతానాయుడు


నీ నీడలో....

నీ నీడలో....

డా॥ దిలావర్‌,