వేయివసంతాల  వెల్లువై

  • 5629 Views
  • 13Likes

    శిఖా ఆకాష్‌

  • నూజివీడు, కృష్ణా జిల్లా
  • 7095874172

వాళ్లతోనే 
వాళ్లలోనే
అనంత ప్రేమల బుల్లిపాదాల ఆనవాళ్లు
ధ్యాన కేంద్రాల జ్ఞాపక సంద్రాలు
పావురాలు వికసించిన మక్కా మసీదులా
గంటై పరిమళించిన జెరూసలేమ్‌లా
గోపురమై పలకరించిన తిరుకొండలా వాళ్లు - 
ఒక వాన గంధంలా
పూలవెన్నెల్లా
ఇంత అనుబంధాన్ని
ఎక్కడైనా చవి చూశారా?
ఇంత కవిత్వాన్ని
మీరెప్పుడైనా
కళ్లతో తాగారా?
ప్రతినిత్యం చూస్తాం
ప్రతివాళ్లమూ తాకుతాం
మాటెంత పరవశం
అల్లరెంత అందమైన ఆకాశం
దరహాసమెంత మట్టి పరిమళం
జలపాతమేదో నిత్యం
మన మధ్యే నడయాడినట్టు
చందమామను చంకనేసుకుని
బుగ్గలూరిన ఆనందాన్ని
అందంగా కొరికినట్టు
లేలేత చర్మం మీద
ఎన్నెన్ని గులాబీ తోటలు
ప్రేమలేఖలు రాస్తాయో
అనురాగ సరస్సున
ముద్దుల కలువలై విచ్చుకుంటాయో
ఈ పసిముద్దుల అమృతమేదో రుచి చూసే
ప్రతి ఉదయమూ
సూర్యుడు అనంత తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు
ప్రపంచమంతా
వాళ్ల పాదాల కిందో...
అరచేతుల్లోనో...
లేలేత పెదవుల ప్రపంచంలోనో
కన్నుల కాంతుల వెన్నెలలోనో...
పిట్టల్లాంటి
చిగురాకు రెమ్మల్లాంటి
పువ్వుల్లాంటి
సెలయేటి నవ్వుల్లాంటి
పూలవానల వెన్నెల
లేలేత గాలుల్లాంటి మొక్కల్లాంటి
వసంతోత్సవ దీవెనలు వాళ్లు - 
ఇన్నిన్ని పూల జలతారుల్ని చూశాక
పాలపుంతల చిరుజల్లుల్ని తాకాక
మాతృభాషలో తొలిఅందాల్ని కన్నాక
ఏ కష్టాలూ కన్నీళ్లూ
ఏ స్వార్థాలు మోసాలు
అవినీతి రాజకీయాలు గుర్తుకొస్తాయి?
క్షణకాలం
అనంత సౌఖ్యమేదో
జీవన సౌందర్యతత్త్వమేదో
ప్రశాంత సంగీతమై
ప్రేమామృత పుష్ప పరిమళమై వాళ్లు - 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


 కరోనా విలయం

 కరోనా విలయం

సాహితీసుధ


ఉగాది

ఉగాది

నారాయణమూర్తి తాతా


వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః

కంచనపల్లి ద్వారకనాథ్‌


సంభ్రమం

సంభ్రమం

కళ్యాణదుర్గం స్వర్ణలత


సిలువ పలుకులు

సిలువ పలుకులు

పచ్చా పెంచలయ్య


అమ్మ కట్టిన మొలతాడు

అమ్మ కట్టిన మొలతాడు

గాజుల పవన్‌కుమార్‌