మోహనం

  • 3995 Views
  • 0Likes

    దాసరాజు రామారావు

  • మెదక్
  • 9618224503

రెప్పల మధ్య దాగుడు మూతల హిమవర్షం
కొలను నీటి అడుగున ప్రకంపనల గగన 
మనోఫలకం
మరణ గాలానికి చిక్కకుండా
నునుపుగా జారిపోయే చేపపిల్ల చాకచక్యం
రోజువారీ ఉదయాహ్వానానికి
తానున్నట్టు ప్రకటించే కోడిపుంజు
పరిమళమే ప్రేమగా
వర్ణమే సౌందర్యంగా
పుప్పొడే సజీవసారంగా పూలభాష
కవిత్వపు నురగల, తరగల, పరుగుల కావ్య కడలి
తారామణుల నాట్య సమ్మేళనానికి
హృదయాన్ని పరిచే ఆకాశం
పక్షి రెక్కల కింద పొదవుకొని
ప్రోది చేసుకునే ఆశల వెచ్చదనం
చేల తల నిమురుతూ తరలిపోయే సమీరం
ఒక్క ఆకు తుంచితే, నిలువెల్లా గాయపడే తరువోజ
కొండల చాటు నుంచి, గుండె
మరెన్ని ధైర్యాలు తెచ్చుకుంటదో
నల్లా నుంచి నీటిబొట్టు రాలకున్నా
కాకి ప్రయాణం అబ్బురమే
గూనపెంకుల వానధారలతో
అద్భుత విన్యాసాల నావిష్కరించే పసిప్రాయాలు
ఎందరెందరి పిలుపులనూ, చూపులనూ వడకట్టి,
తెరచుకుంటూ, మూసుకుంటూ నల్లగేటు
గోడకు వేలాడే పటంలోని పెద్దమనిషి
కావడిబద్దకు రెండరటి గెలలు వేసుకుని
కత్తుల పొద్దు అంచున నడుస్తుంటడు
సద్దిమూట సూర్యుడు తోడుగా-
లంబాడి ముదిత కట్టెమోపు నెత్తుకుని
అమ్మకానికి తిరుగుతుంటే
ఆమె జాకెట్‌ అద్దాల్లో లోకం
వింతరంగుల్లో మెరుస్తుంటది
అందమైన వాక్యంగా మారి, కొంగల గుంపు
ఆకాశాన్ని కవిత్వమయం చేయడానికి వెళ్తుంటయి
ఇంటి పెరటి కల్యామాకు చెట్టుతో
కరచాలనం చేసినప్పుడు
బాల్యపు ఊసుల బాతాఖానీ విన్పిస్తుంటది
గోటీలాటలో
బొద్దిలో పడని గోటీలమూట విప్పినపుడు
ఎర్రగా వాచిన మోచేయి కింద
విజయ రహస్యం ఉవ్విళ్లూరిస్తూ కన్పిస్తది
మట్టి జిగితో
ఆకాశపు చెమ్మతో
తలంపుల మరువపు అల్లికతో
ప్రేమిద్దాం...
బతుకుని,
అంతకు మించి కవిత్వాన్ని-
కవిత్వమే జీవితం
జీవితమే కవిత్వం
అనుకునేంతగా
పెనవేసుకునేంతగా
జీవిద్దాం...

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ఉగాది

ఉగాది

నారాయణమూర్తి తాతా


వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః

కంచనపల్లి ద్వారకనాథ్‌


సంభ్రమం

సంభ్రమం

కళ్యాణదుర్గం స్వర్ణలత


సిలువ పలుకులు

సిలువ పలుకులు

పచ్చా పెంచలయ్య


అమ్మ కట్టిన మొలతాడు

అమ్మ కట్టిన మొలతాడు

గాజుల పవన్‌కుమార్‌


వయసెరుగని మనసు!

వయసెరుగని మనసు!

డా॥ దిలావర్‌