ఓటములు పలకరించినప్పుడల్లా
నాలోకి నేను అంతర్ముఖంగా ప్రయాణిస్తాను.
నా గుండె దిటవును పరీక్షించుకోటానికి కాదు
హృదయానికి సాంత్వన చెప్పుకోటానికి
అదొక అనుభవంగా దాచుకోటానికి
ఆ అనుభవాల మెట్లపై నుంచి
విజయ శిఖరాలను చేరుకోటానికి
ఓటముల్ని ఎదుర్కోవటమంటే
సమస్యల తోరణాన్ని
ఇంటి గుమ్మానికి వేలాడగట్టడం.
ఆలోచనలు పదునెక్కటం!
కొత్తకొత్త పాఠాలు నేర్చుకోవటం
బేలతనం లోంచి బయటపడి
నికార్సయిన నిప్పులా తేజరిల్లటం
గుండె మరింత గట్టిపడటం.
ఓటముల్ని ఆహ్వానించటమంటే
విశాల దృక్పథం అలవడటం!
సుఖదుఃఖాతీతమైన
స్థితప్రజ్ఞత అలవడటం!
కిందికి బలంగా కొట్టిన బంతి
అంతే వేగంగా లేచినట్లు లేవటం.
అసలు ఓటములే అనుభవంలోకి రాని
మనిషెవరైనా ఉంటారా?
పైకి నిరాశావాదం నటిస్తూ
లోపల ఆశావాదం ఆశించినట్టు,
పైకి ఓటముల్ని ఆహ్వానించాల్సి వచ్చినా
లోపల గెలుపు దారినే కోరుకుందాం!