సమర సందేశం

  • 1117 Views
  • 0Likes

    శారద ఆవాల

  • విజయవాడ,
  • 9295601447

అన్ని యుద్ధాలను ఒకేలా నిర్వచించలేం కదా!
సంగ్రామాలన్నీ సంక్షోభ జనితాలే కావచ్చు
అధికార ప్రకటన నుంచో అహంకార ప్రకోపానికో
పుట్టిన యుద్ధాల సంగతి సరే
కానీ కొన్ని సమరాలుంటాయి
అవి రాత్రికి రాత్రి పన్నిన వ్యూహ రచనలు కావు
అసంతృప్తి అనలెత్తి సెగరేగి
కనలి కనలి పెల్లుబికిన లావాలవి
అణచివేత అడుసునుంచి
అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు,
ధిక్కార స్వరంతో అత్యవసరంగా
ఎగరేసిన నిరసన బావుటాలవి!
తరతరాల తలరాతను తిరగరాసేందుకు
సమకూర్చుకున్న పోరాట వ్యాకరణాలవి
దోపిడీ మడత ముడులు విప్పడానికి
శ్రుతించిన విముక్త స్వరాలవి
మచ్చకట్టని పచ్చి గాయాలకు
ప్రాణలేపనం పూయడానికి
సందర్భాలను బట్టి యుద్ధం
తప్పనిసరి కాక తప్పెలా అవుతుంది? 
విప్లవం అంటారుగాని
అది విడుదల కోసం చేసే ఆర్తనాదం
అసహనం అంచునుంచి యోధుడు
అసంకల్పితంగా పోరుదారిన పడ్డాక
గెలిచాడా సమరయాత్రలో
ఒక సాహస సంతకమౌతాడు
లేదా పరాజయాన్ని పరిహసించి
ఆకురాలు కాలాన్ని అపహసించి
కొండమలుపు కోనలో రాజుకుంటున్న
తిరుగుబాటు వసంతపు చివురవుతాడు
ఉరి తీయబడ్డ ఉద్యమం ఊపిరద్దుకున్నప్పుడో
చెరబడ్డ స్వాతంత్య్రం స్వేచ్ఛాసమీరమై 
వీచినపుడో
రణభేరి మోగిన ప్రతిసారీ
అతడు స్మరణీయుడవుతాడు
ఆయుధమై పదునెక్కిన అతని 
ప్రస్తావనతో
చరిత్ర ఉదాత్తమౌతుంది
అసలు యుద్ధమంటేనే 
నిలువెత్తు జయధ్వజం కదా!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


అమ్మలున్నారు కానీ..

అమ్మలున్నారు కానీ..

శైలేష్‌ నిమ్మగడ్డ


వయసెరుగని మనసు!

వయసెరుగని మనసు!

డా॥ దిలావర్‌


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


ఓయ్‌... నిన్నే...

ఓయ్‌... నిన్నే...

కళ్యాణదుర్గం స్వర్ణలత