ఎంత పొడవు మఫ్లర్లు చుట్టుకొన్నా
తేలుకొండిలా చెవులచుట్టూ పాకి
దవడలు అదిరేలా కుట్టక మానదు
‘ఓస్వాల్’ స్వెట్టర్లు వేసుకొన్నా
‘కశ్మీరు’ శాలువాలు కప్పుకొన్నా
వెన్నులో పాములా దూరి
నిలువెల్లా కాటువేయక మానదు
చేతులకు గ్లౌజులు తొడుక్కున్నా
కాళ్లను సాక్సుల్లో దూర్చినా
చాకచక్యంగా చంకలో చేరి
కొంకర్లు పోయేదాకా కొరుకక మానదు
తలుపులు బిగించిపెట్టినా
కిటికీలు మూసి, తెరలన్నీ దించినా
నేలకు గజమెత్తు పరుపుల్లో ముడుచుకొన్నా
మంచుగడ్డల మీద దొర్లించినట్టు
నిద్ర పోనీయకుండా వెంటబడక మానదు
చిన్నప్పుడు చెడ్డీ విప్పేసి ఆడుకొన్నా
ఎప్పుడూ భయపెట్టేది కాదు
నూనూగు మీసాల వయసులోనైతే
పక్కపక్కన నడవడానికే జంకేది
యవ్వనం పొలిమేరా దాటీదాటగానే
దొరికావురా దొంగా అని
దాడిచేసి కోరల చలి
నా మీదపడి వణికిస్తోంది.