తేనె చినుకులు

  • 969 Views
  • 5Likes

    పిళ్లా చింత‌ప్ప‌డు

  • చీపురుప‌ల్లి, విజ‌య‌న‌గ‌రం జిల్లా
  • 9493706309

అలతి అలతి పదములల్లారు ముద్దుగా
పేర్చి కూర్చినావు వేమనార్య!
ఆటవెలదు లందు ఆణిముత్తెపునుడుల్‌
గుప్పి నీతులెన్నొ చెప్పినావు!

పద్య పద్యమందు హృద్యమౌ తార్కాణ
మొసగి చెప్పినావు ఉక్తులెన్నొ
మాట మాటలోన మధురమౌ భావన
ఎచట నేర్చితయ్య ఇంతవిద్దె?

కుమతులైనగాని సుమతులుగా దీర్చు
వేదపంక్తులవ్వి! వేమనార్య!
గుండెలత్తుకొనెడి గుప్తార్థ సూత్రాలు
తేనెవాకలౌర! మాననీయ!

కుండచేకొని బద్దలు కొట్టినట్లు
గోడకును వేయు సున్నము కుదిరినట్లు
అప్పసానికి పెళ్లాలు అతికినట్లు
చేదు నిజములు తెల్పెడిచేవ నీకె!
ఎవరికగునోయి వేమన ఇట్లు చెప్ప!

బండ వంటి పెద్ద భావాలు సైతము
అలతి పదములందె అంటివేర!
ఆటవెలదిలోనె! ఆటవెలది నీకు
బుడుతలాడు కొనెడి బుల్లి ఆట!

కొమ్ములున్నట్టి కవి దిగ్గజమ్ములైన
చూచి ఆశ్చర్యపడిరి నీ సొగసుకైత
కుబ్బిపట్టిరి హారతులోకవీంద్ర!
ముద్దుకైత నీదగ్రతాంబూలమయ్య!

నన్నయ, తిక్కన, ఎఱ్ఱన
సన్నుత కవి పోతరాజు సంగతి పిదపన్‌
నిన్నే కద నుతియింతురు
పన్నీరొలికించినావు పద్దెములందున్‌

ముచ్చటింతురు నీ పద్యమొక్కటైన
సమయమును జూచి వక్తలు సభలయందు
వందకొక్కరా! యిద్దరో ఉందురేమొ!
అవని నెఱుగనివారు నీయాహ్వయంబు!!

తెలుగు పలుకుబడులు వెలుగులీనెను కదా
నీకరాన! ధరణి నిజము! నిజము!
అమ్మ ఊసు చంద మందాలు నీపద్య
మందె కాంచవలయు నయ్యవేమ!!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


అరచేయి

అరచేయి

తగుళ్ల గోపాల్


క్రీస్తు జననం

క్రీస్తు జననం

పచ్చా పెంచలయ్య


వంకర టింకర

వంకర టింకర

పర్కపెల్లి యాదగిరి


వాన

వాన

తానా మూర్తి


మామిండ్ల కాలం

మామిండ్ల కాలం

దాసరాజు రామారావు


కృష్ణం వందే!!

కృష్ణం వందే!!

పేరిశెట్ల శివకుమార్