మనిషి గురించి కొంచెం...

  • 882 Views
  • 1Likes

    సూరారం శంకర్‌

  • కామారెడ్డి, నిజామాబాదు జిల్లా.
  • 9948963141

మనం దేవుళ్లం కానక్కర్లేదు-
కనీసం, మనుషులుగానైనా మిగలాలికదా!
మనిషంటే ఏంటని ప్రశ్నించకు-
మనిషంటే మనిషే-
గుండెలనిండా దుఃఖమున్న మనిషి
చూపులనిండా అనురాగమున్న మనిషి
మనం నడుస్తున్నప్పుడు పడిపోకుండా
ఊతమిచ్చి రక్షించే మనిషి
మనల్ని జీవనదుల్ని చేసే మనిషి
మనలో చెట్లను నాటి నీడల్ని పొదిగే మనిషి
మనిషంటే మనిషే-
పండగలకూ పబ్బాలకూ మనతో కలిసి
ప్రేమను విస్తరించే మనిషి
తన నవ్వుల్తో మనల్ని పూలను చేసి
తన మాటల్తో మనల్ని శింజానం చేసే మనిషి
తను నడుస్తున్నంతమేరా
మనల్ని మలయమారుతమై చుట్టేసే మనిషి-
మనిషంటే ప్రవాహం కదా!
మేఘాల వొరిపిడిలోని మెరుపు కదా!
ఒక ఆకుపచ్చని కిరీటం కదా!
వేనవేల జ్యోత్స్నల ప్రకాశం కదా!
మనిషంటే హోరు గాలిలో తెరచాపనెత్తి
మనల్ని పదిలంగా ఒడ్డుకు చేర్చే స్నేహితుడు కదా!
నువ్వెప్పుడైనా తలిరాకుపైని, సూర్యకిరణాలు వాలిన
మంచుబిందువును చూశావా?
ఆ బిందువుగుండా సప్తవర్ణ విశ్లేషితమైన
సొగసును చూశావా?
ఆ సొగసు కదా మనిషంటే-
మనిషంటే ఉదయకళ-
మనిషంటే వరి మొలక-
మనిషంటే అమ్మ నుదుటి బొట్టులోని
అరుణారుణ దైవత్వం.
అయినా మనిషి గురించి చెప్పటం
నాకేం చేతనవును?
నేను కేవలం కవిని మాత్రమే-
మనిషో... సమస్త సృష్టిశక్తుల అద్భుత ప్రతీక!
నేనింకా చాలా తెలసుకోవాల్సిన వాడు -
ఇప్పుడున్న స్థితిలో, నా పరిధికి
ఏ మాత్రం అందనివాడు -
నేననుకోవటం, బహుశా మీక్కూడా...!!!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


చిరునవ్వు

చిరునవ్వు

ఆచార్య కడారు వీరారెడ్డి


ప్రతిబింబం

ప్రతిబింబం

వారాల ఆనంద్


కన్నీటి ప్రశ్న

కన్నీటి ప్రశ్న

సుసర్ల శ్యామల


చెరువు...!

చెరువు...!

ఎ.కిశోర్‌బాబు


పాద ధూళి

పాద ధూళి

అందెశ్రీ