తెలుగు వెలుగు

  • 1642 Views
  • 1Likes

    అలపర్తి వెంకట సుబ్బారావు

  • నందివెలుగు, గుంటూరు. 08644 241366

తెలుగుభాషలోన గల తమాషాలను
‘తెలుగు వెలుగు’ పేర తెలుపుచుంటి!
తెలుగు భాష తీరుతెన్నులు క్రమముగా
తెలుసుకొనుడు ఇదొక తెలుగువెలుగు!!

‘ఎడద’ అను పదమున ఎత్తివేసిన ‘డ’ను
‘ఎద’ అను సరికొత్త పదము మిగులు!
‘ఎద’యన,‘ఎడద’యన ‘హృదయం’ అనేగదా
తెలుసుకొనుడు ఇదొక తెలుగు వెలుగు!!

‘ప్రవితతి’ యనునట్టి పదమున వరుసగా
మొదటి అక్షరమును వదిలిపెట్టు!
ప్రవితతి,వితతి, తతి, ప్రతిదీ సమూహమే
తెలుసుకొనుడు ఇదొక తెలుగు వెలుగు!!

మధ్య అక్షరాలు మార్చిన అటునిటు
‘కీటకమ్ము’ అగును ‘కీకటమ్ము’!
‘కీటక’ మన పురుగు, కీకటం గుర్రము
తెలుసుకొనుడు ఇదొక తెలుగు వెలుగు!!

మధ్య అక్షరాలు మార్చినా అర్థమ్ము
మారని పదమొకటి ‘పాగడమ్ము’!
‘మరకతం’ మరొకటి, మారదు అదిగూడ
తెలుసుకొనుడు ఇదొక తెలుగు వెలుగు!!

మాట చివర చేర్చ మరియొక అక్షరం 
‘పైద’ యనెడి పదము ‘పైదలి’ యగు!
‘జడ’ ‘చరి’ పదములిక ‘జడక’ ‘చరిత’లగు
తెలుసుకొనుడు ఇదొక తెలుగు వెలుగు!!

‘పైద’ పిల్లకాయ, ‘పైదలి’ ఆడది
‘జడ’ యనంగ వేణి, ‘జడక’ బొంత!
‘చరి’ యనంగ ఖరము, ‘చరిత’యన చరిత్ర
తెలుసుకొనుడు ఇదొక తెలుగు వెలుగు!!

మాట ముందు చేర్చ మరియొక అక్షరం
కొత్త మాట పుట్టుకొచ్చుచుండు!
దధి, శని, నస, లగు ఉదధి, అశని, పనస
తెలుసుకొనుడు ఇదొక తెలుగు వెలుగు!!

‘దధి’యనిన పెరుగు, ‘ఉదధి’ యన సంద్రము
అగు ‘శని’యొక గ్రహము, ‘అశని’ పిడుగు!
‘పనస’యనిన వేదభాగము, ఒక పండు 
తెలుసుకొనుడు ఇదొక తెలుగు వెలుగు!!

మాట యొకటి రెండు మారులు పలికిన
వేరె అర్థమొచ్చు వింతగాను!
‘పులి’ని ‘పులిపులి’యన పులిపిరి అనిగదా!
తెలుసుకొనుడు ఇదొక తెలుగు వెలుగు!!

‘వెండి’ తెలియును ‘తడి వెండి’యన తెలుసా?
‘నీళ్లు’ తెలుసు. ‘తప్పు నీళ్లు’ ఎరికె?
‘పాదరసము’ ‘కల్లు’ వాటికి అర్థాలు
తెలుసుకొనుడు ఇదొక తెలుగు వెలుగు!!

ఈగ, పులి తెలియును ‘ఈగపులి’ తెలుసా?
చంపి ఈగను తిను సాలె పురుగు
ఈగ పాలిట పులి ‘ఈగపులి’ ఇదియే
తెలుసుకొనుడు ఇదొక తెలుగు వెలుగు!!

చీమ, పులి కలిసిన ‘చీమపులి’ యగును
ఎలుగుబంటి ‘చీమపులి’ యనంగ!
ఆకు, రాయి కలిసి ‘ఆకురాయి’ అగును
తెలుసుకొనుడు ఇదొక తెలుగు వెలుగు!!

‘ఎద్దునాలిక’యన ఏమిటి అర్థము?
‘బెండ’యనుచు తెలుసుకొండి మీరు!
‘కాక నాసిక’యన కలదు అర్థము ‘దొండ’
తెలుసుకొనుడు ఇదొక తెలుగు వెలుగు!!

‘పువ్వు’ అను పదమును ‘ప్రువ్వు’ అన్నామంటె
పువ్వు బదులు పురుగు పుట్టుకొచ్చు!
‘ప్రువ్వు’ అను పదముకు ‘పురుగు’ అర్థం వుంది
తెలుసుకొనుడు ఇదొక తెలుగు వెలుగు!!

‘కాటుక’ యను మాట ‘కాటిక’ యంటిమా
‘అడవి’ యనెడి కొత్త అర్థమొచ్చు!
మరి ‘పరిక్ష’ యనిన బురదయగు పరీక్ష
తెలుసుకొనుడు ఇదొక తెలుగు వెలుగు!!

చీమ నోటిలోన చిక్కిందిగా కోతి
చిత్రముగద, బహు విచిత్రముగద!
‘కపిశ’ యనిన చీమ, ‘కపి’ యన్నచో కోతి
తెలుసుకొనుడు ఇదొక తెలుగు వెలుగు!!

ముక్కులోన పిల్లి నక్కియున్నదదేమి?
‘నాసిక’యన ముక్కు, ‘నాసి’ పిల్లి!
‘నాసి’వున్నది గద ‘నాసిక’లోననే
తెలుసుకొనుడు ఇదొక తెలుగు వెలుగు!!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


పునర్నిర్మాణం

పునర్నిర్మాణం

దోర్నాదుల సిద్దార్థ


మనసుకు మనసుకు మధ్య రహదారి

మనసుకు మనసుకు మధ్య రహదారి

- ఈతకోట సుబ్బారావు


జయహూ జయహూ భారతధాత్రీ

జయహూ జయహూ భారతధాత్రీ

పులిగడ్డ శ్రీరామ చంద్రమూర్తి


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


చెరువు...!

చెరువు...!

ఎ.కిశోర్‌బాబు