ఇంటికో బాలచంద్రుడు

  • 1040 Views
  • 9Likes

    అడిగోపుల వెంకటరత్నమ్‌

  • తిరుపతి
  • 9848252946

దోగాడే పసిబిడ్డకు
స్వాగతం పలుకుతూ
ఇల్లు అడ్డంకులు తీసింది
మోకాళ్ళు అరచేతులు
కందుతాయని తెలియని బిడ్డ
ఇంధనం వున్నంత వరకు యంత్రంపరుగులా
తిరుగుతున్నాడు
అందిన వస్తువు గిరాటెయ్యటం
అందని దానికి ఆరాటపడటం
చిగురింత చూపులు
చిట్టిపొట్టి నవ్వులు
కనురెప్పలు దాటని కన్నీళ్ళు
ఆ... ఊ... శబ్దాలు!
అకస్మాత్తుగా ఆగిన దోగాడటం
పద్మాసనం వేసి
త్త... త్త... అంటూ శబ్దంలేని చప్పట్లు
ఎత్తుకున్న అత్తముఖాన్ని గీకుతూ
కళ్ళజోడుపై దాడులు-

చేతిలో వున్నది పెన్సిలో కలమో
తెలియని చిత్రకారుడై
ఇంటిగోడలపై గీతలు
నోరు లేని గోడ నోర్లేని
బోనినవ్వుల బిడ్డకు కాన్వాసు
మనుషులుగా వస్తువులుగా
జంతువులుగా ప్రకృతిగా
ఏది వూహిస్తే అదిగా
అన్వయించుకునే గీతలు
గీచిన సాధనాల్ని గిరవాటేసి
నలుదిక్కులు చూస్తూ ఎలనవ్వు
ఆప్యాయంగా చేతులు చాచి
అందుకున్న తండ్రి చేతుల్లో దూరి
ముఖంపై ముద్దులు!

అది ఏ రాగమో తెలియదు
అన్ని రంగులకు ఆదిమూలం తెలుపులా
ఒక రాగం ఎత్తుతాడు
ఆందోళి కాంభోజి కేదారగౌళ
బేగడ మలహరి రాగాల్ని
ఒక్కరాగంచేసి యింటి పైకప్పుకు
విసురుతాడు
అంతలోనే తడిసిన పక్కకు చికాకుపడి
శివరంజని రాగం ఎత్తుతాడు
తల్లిని చూసి గాల్లో తేలి
కళ్ళల్లో కళ్ళుపెట్టి కిసుక్కున నవ్వి
ఎముకల్లేని చేతులు
అమ్మ చెంపలపై అద్దుతాడు!

ఇంటికో బాలచంద్రుడు
ఇల్లంతా వెన్నెల పండుగ
బిడ్డ చేష్టలే భోజనమై
కడుపు నిండిన కుటుంబం!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


అమ్మలున్నారు కానీ..

అమ్మలున్నారు కానీ..

శైలేష్‌ నిమ్మగడ్డ


వయసెరుగని మనసు!

వయసెరుగని మనసు!

డా॥ దిలావర్‌


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


ఓయ్‌... నిన్నే...

ఓయ్‌... నిన్నే...

కళ్యాణదుర్గం స్వర్ణలత