మహానది

  • 1489 Views
  • 7Likes

    డా।। సి.భవానీ దేవి

  • హైదరాబాదు
  • 9866847000

నది ప్రవహిస్తోంది.. పాటలా
నిరంతర శ్రుతిలయాన్విత గీతంలా
జీవనయానం రూపుదిద్దుకుంటోంది
తరం తరం విస్తృత నవ్య సంస్కృతిలా..
ఏ కొండకొమ్మునో బుడగలెత్తినపాయ
నీరెండ తళతళల నిర్మల నాదంతో
మట్టి మొలకల లేనుదుళ్లపై
మహా సంతకాలు చేస్తుంది
చావు పుట్టుకల చింతనా తీరాల్లా
మోడుల వేళ్లనించి ఎన్ని చివుళ్లో!
ఉన్మత్త కర్తవ్య గమనగమకాలే
హరితాకాశాన్ని ఒళ్లోకి దింపి
ఏడువర్ణాల లాలిపాటయింది
రెండు ఉన్నత శిఖరాల కరచాలనం
ఈ జలాంకిత ఆధునిక దేవాలయం!
నీటి ద్వారాలు జార్చే అన్నం ధారలు
క్షుధార్తి కేదారాలకు అమృతసేచనాలు.
పదివేల బాహువుల ప్రాణధార
పరివ్యాప్త యౌవన మైదానంలో
మహానదిలా కదంతొక్కి
ప్రపంచ మానవ జెండా ఎగరేస్తుంది.
అస్తమిస్తున్న అరుణబింబం
అనంత పయోరాశిలో లయిస్తుంటే
సుదీర్ఘ సంక్లిష్ట ప్రస్థానం
సంగమ గమ్యంలో విలీన వేదం!
ఈ మట్టిలోనే పుట్టి.. ప్రవహించి
ఈ మట్టినే బంగారంగా మార్చి
నీటిగొంతుతో మట్టి పాటను పాడుతున్న
జలపూర్ణ విహారి ఆనవాళ్లకోసం
అనంత సాగరంలో అన్వేషిస్తున్నావా!
నిశ్శబ్ద మార్మిక వేదికపై
లోపలి స్వరాల జ్వలనంతో
గగనానికి ఎగిసిపడుతూ
నా ఎదుట నర్తించే కడలి హోరులో
అంతర్నిహిత నదీగీతం విన్పించటంలేదూ!
సంచలిత సుదూర ప్రయాణంలో
సరిగమలైన జల పదగమనంలో
ఆ పరంపర చేతనా చైత్రం
నిత్య వసంతంలా స్పర్శిస్తుంది చూడు!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


బుట్టదాఖలు

బుట్టదాఖలు

కళ్యాణదుర్గం స్వర్ణలత