అస్తిత్వ పోరు

  • 653 Views
  • 4Likes

    డి.నాగజ్యోతి శేఖర్‌

  • మురమళ్ల, తూర్పుగోదావరి,
  • 9492164193

బతుకునింగి కనే కష్టాల చీకట్లు
మోసే భుజాలు
వేదన కిరణాన్ని మనసు అరచేతికి పూసుకోక తప్పదు!
గుప్పెడు శ్రమలకన్నీటితో బాధల రేఖల్ని కడిగేసుకోకా తప్పదు!
చారెడు గింజల్ని పోగేసుకోలేని చాకిరీ నరాల్లో 
సత్తువ నెత్తురుని 
చెమట చుక్కల సాయంతో
నింపుకోక తప్పదు!
మనుగడ నాళాలకు
పడ్డ వెతల రంధ్రాలను పూడ్చుకోకా తప్పదు!
వ్యక్తిత్వతనువు తూట్లు పడుతున్నా
ఉనికి ఊపిరి జీవిత తిత్తుల్లో కూరకతప్పదు!
అహం చూపుడువేళ్లెన్ని 
సూదులై గుచ్చుతున్నా
సర్దుబాటు దారంతో
ఆత్మాభిమాన వస్త్రాన్ని కుట్టకా తప్పదు!
ఆరుగాలం కష్టం 
ఆవిరి మేఘాలౌతున్నా
ఆశల విత్తులు
జీవన పొలంలో నాటక తప్పదు!
పొట్లు పోతున్న పేగు గింజలు
పస్తుల గట్లను వాటేసుకున్నా
బతుకు చాళ్లను దున్నకా తప్పదు!
వ్యధల తుపానుకి 
విరిగే భయంతో 
కొమ్మల రెక్కల్ని
తనలోకి ముడుచుకొనే 
తరువు విహంగం
కొన్ని శాఖల ఈకల్ని కోల్పోక తప్పదు!
తనపై ఒరిగిన భారపు
రెమ్మల్ని విదిల్చేందుకు
గడ్డిపోచ పిట్ట శ్రమించకా తప్పదు!

కరెన్సీ కట్లపాము తల్పంపై శయనించిన
అవినీతి గుండె భయం రక్తపోటు దుప్పటి కప్పుకోక తప్పదు!
ఆర్జన నవారు తెగిన దారిద్య్ర మంచం
నేలడొక్కల్లో కలల తనువును కుదించుకొని 
శ్రామిక డేరాల
కింద
తలదాచుకోకా తప్పదు!
పరిమాణం ఎంతైనా 
పరిణామం ఒక్కటే!
చింత చీమంతైనా
అంతు చూడాల్సిందే!
ఆపదఎత్తు ఏనుగంతైనా
ఆవలికి గెంతాల్సిందే!
జీవమేదైనా జీవన పోరాటమొకటే!
పీత రూపంలో ఉన్నా...
సీత అవతారంలో జనించినా
సమస్యల సంద్రాన్ని
ఈదాల్సిందే!
పరిష్కార వంతెనలు నిర్మించాల్సిందే!
ఇది ‘అస్తిత్వపోరు’

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


సుప్రభాతం

సుప్రభాతం

సాంబమూర్తి లండ


ఏమీ రాయని పలకలతో

ఏమీ రాయని పలకలతో

పాయల మురళీకృష్ణ


జీవ సంభాషణ చెయ్యాల్సిందే...!

జీవ సంభాషణ చెయ్యాల్సిందే...!

మానాపురం రాజా చంద్రశేఖర్‌


కన్నీరయిన స్వప్నం

కన్నీరయిన స్వప్నం

డా.వై.రామకృష్ణారావు


ఆటలాడు భాష మాటలాడు

ఆటలాడు భాష మాటలాడు

జాగాన సింహాచలం