భావకేదారం

  • 623 Views
  • 4Likes

    సూరారం శంకర్‌

  • కామారెడ్డి, నిజామాబాదు జిల్లా.
  • 9948963141

మెత్తమెత్తగా మొగ్గ పువ్వై విచ్చుకున్నట్లు
మెల్లమెల్లగా కళ్లు రెప్పల్ని విచ్చుకుంటాయ్‌
అప్పటి వరకూ స్పష్టం కాని దృశ్యం
మనోహరమై ఎదుట నిలుస్తుంది
సెలయేళ్ల తాకిళ్లతో పరవశమవుతున్న పర్వతాలు
హరిత వర్ణంలో కాంతులీనుతాయ్‌
మబ్బులతో సరసాలాడే కొంగల బారు
ఒకింత పులకరింతల్ని ఒలకబోస్తాయ్‌
ఆకాశం నీలికన్నెతో
ఇంద్రధనుస్సు దోబూచులాడుతుంది
లేతపచ్చికపై కదలాడే తూనీగల్ని చూసి
గాలి తెమ్మెర స్నిగ్ధంగా కరచాలనం చేస్తుంది
గడ్డి పరకలపై సమూహమైన నీటి తుంపర
ముత్యపు వెల్లువతో పోటీకి సిద్ధపడుతుంది
సంద్రపు అలల స్పర్శతో
రాళ్లకి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది
మావిచివుళ్లు మెక్కిన గండుకోయిల
కొత్తరాగమై శబ్దిస్తుంది
భూమాత ఒడిలో
భవితను వెతుక్కుంటున్న ఓ సూర్యకిరణం
అప్పుడే మొలకెత్తడానికి సిద్ధపడుతున్న
బీజం గుండెల్లోకి ప్రాణమై ప్రవహిస్తుంది
అప్పుడవతరిస్తుంది-
ప్రకృతి నేపథ్యం ప్రఫుల్లం కాగానే
దిగ్దిగంతాలకి ఆవల
దృగ్గోచరం కాని భావకేదారం
మనసు ముంగిట్లో...

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


చిరునవ్వు

చిరునవ్వు

ఆచార్య కడారు వీరారెడ్డి


ఏమో

ఏమో

నందిరాజు శ్రీనివాస్‌


ప్రతిబింబం

ప్రతిబింబం

వారాల ఆనంద్


పాద ధూళి

పాద ధూళి

అందెశ్రీ


కన్నీటి ప్రశ్న

కన్నీటి ప్రశ్న

సుసర్ల శ్యామల